జమ్మూలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న బైశాఖి మేళాను పురస్కరించుకొని సూర్యపుత్రి తావీ నదికి అత్యంత భక్తి, శ్రద్ధలతో హారతి ఇచ్చారు. జమ్మూలో తొలిసారి జరిగిన ఈ కార్యక్రమానికి ఆచార్యులు, అర్చకులు, ప్రభుత్వ అధికారులు, పౌర సమాజం సభ్యులు వందలాదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రోచ్ఛాటనతో తావీ నదికి ప్రత్యేక పూజలు చేశారు. భక్త జనం భజనలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్నవారంతా నదిని కాపాడుకుంటామని, జమ్మూ ఆధ్యాత్మిక వారసత్వాన్ని నిలబెడతామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా మనోజ్ సిన్హా ప్రసంగిస్తూ తావి నది పరివాహక ప్రాంతం ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక గమ్యస్థానంగా అవతరిస్తుందని అన్నారు. ‘‘అంతం కాదిది ఆరంభం. ఈ నదీ తీరం వద్ద హారతి ఇకపై ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. తావి నదీ తీరం సమష్టి భక్తి భావనకు కేంద్రంగా మారుతుంది. మన దృక్పథం కేవలం రహదారులు, భవనాలను నిర్మించడానికి పరిమితం కాకూడదు. అది విశ్వాసాన్ని నిర్మించాలి. సంస్కృతిని పునరుద్ధరించాలి. ఒక గుర్తింపును పెంచి పోషించాలి. మనం జమ్మూను కేవలం ఒక స్మార్ట్ సిటీగా మార్చడంతో సరిపుచ్చక ఒక పవిత్రమైన నగరంగా కూడా మార్చాలి’’ అని ఆయన అన్నారు.