(మే 7, 2025 రామరాజు వర్ధంతి శతాబ్ది ముగింపు. ఈ శతాబ్ది కార్యక్రమాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు)
అడవి నుంచీ, పూర్వికుల నుంచీ వచ్చిన స్వేచ్ఛా జీవనానికి సంకెళ్లు వేయాలని చూసిన చట్టాలక• ఎదురైన ప్రతిఘటనలే గిరిజనోద్యమాలు. దేశం నలుమూలలా జరిగిన గిరిజనోద్యమాలలో 1922-24 నడుమ విశాఖ మన్యంలో అల్లూరి సీతారామరాజు అనే శ్రీరామరాజు నిర్వహించిన పోరాటం పలు ప్రత్యేకతలు కలిగి ఉంది. ఆంగ్లేయుల అణచివేత మీద గిరిజనం సాగించిన దాదాపు ఆఖరిది అనదగిన విశాఖ మన్య పోరాటంలో మైదాన ప్రాంత రాజకీయ స్పృహ, సైద్ధాంతిక ఛాయ ఉన్నాయి. రామరాజు నడిపిన ఆ ఉద్యమంలోని ఈ కోణాలను ఆ మహోన్నత చారిత్రక ఘట్టాన్ని శ్రీరామరాజు నూరో వర్ధంతి (ఈ మే 7) సందర్భంగా మననం చేసుకుందాం.
విశాఖ మన్యానికీ, రంపలోయకూ తిరుగుబాట్లు కొత్త కాదు. 18వ శతాబ్దం నుంచి అక్కడ అలజడులు కనిపిస్తాయి. శాంతభూపతి, ద్వారబంధాల చంద్రయ్య, రేకపల్లి అంబురెడ్డి, కారం తమ్మనదొర, కారుకొండ సుబ్బారెడ్డి, సలాబి బోడడు, పోతుకూరి మాలడు (శివసారులు, అంటే పూజారులు) వంటి ఎందరో అక్కడ తిరుగుబాట్లు చేశారు. పైకి పోలీసు అత్యాచారాల మీద తిరుగుబాట్లు మాదిరిగా కనిపించే వాటన్నిటి ధ్యేయం స్వయం పాలన. ఈ లక్షణాన్ని పరిపూర్ణంగా ప్రతిబింబించిదే 1922-24 నాటి మన్య పోరాటం. దీని నాయకుడు అల్లూరి శ్రీరామరాజు.
శ్రీరామరాజు (జూలై 4,1897-మే 7,1924) స్వరాజ్య సమర యోధుడిగా అవతరించడం వెనుక బలమైన చారిత్రక నేపథ్యం ఉంది. 1915లో ఉద్యోగాన్వేషణ పేరుతో ఉత్తర భారతదేశం వెళ్లారాయన. మొదటి ప్రపంచ యుద్ధంలో చావో రేవో అన్నట్టు పోరుతున్న ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టాలన్న యోచనలో గదర్ పార్టీ సన్నాహాలు చేసిన కాలమది. ఈ ప్రయత్నాల వెనుక జర్మనీ ఉంది. దీనినే హిందూ-జర్మన్ కుట్ర అంటారు.
రామరాజు యుద్ధపు రోజులలో యుద్ధం నేర్చుకున్నాడని ‘మెయిల్’ పత్రిక రాసిందని ‘శ్రీ అల్లూరి సీతారామరాజు ప్రశంస’ పుస్తకంలో (రామరాజు తొలి జీవితచరిత్ర, 1925) భమిటిపాటి సత్య నారాయణ). కృష్ణదేవిపేటలో ఉండగా రామరాజు వద్ద తెలుగు కావ్యాలు, హిందీ నేర్చుకున్న చిటికెల దాలినాయుడు రాసిన ‘శ్రీ ఆంధ్రవీర అల్లూరి శ్రీరామరాజుగారి జీవిత చరిత్ర: మంప పితూరీ’ పుస్తకంలో, ఆ యాత్రలోనే రామరాజు కలకత్తా వెళ్లి సురేంద్రనాథ్ బెనర్జీని కలుసుకున్నట్టు చెప్పారు. ఆ తరువాతే అల్లూరి తూర్పు కనుమలలోని కృష్ణదేవిపేట చేరుకున్నారు.
ఉద్యమ జీవితానికి ఊయల
అల్లూరి ఉద్యమ జీవితానికి ఊయల వంటిది కృష్ణదేవిపేట. జూలై 24, 1917న ఆ ఊరు చేరుకున్నారు. ఊరి పెద్ద చిటికెల భాస్కరనాయుడు ఆశ్రయం ఇచ్చాడు. ఆధ్యాత్మిక జీవితం గడిపారు రామరాజు. తాను తిలక్ మహరాజ్‌ను అభిమానిస్తా నని ఒక సందర్భంలో రామరాజు చెప్పినట్టు చిటికెల దాలినాయుడు రచనలో కనిపిస్తుంది. 1920లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. 1921లో రామరాజు కాలినడకన నాసికా త్య్రంబకం వెళ్లారు. అక్కడ సావర్కర్ సోదరుల అభినవ్ భారత్ విప్లవ సంస్థ ప్రభావం ఉంది. కృష్ణదేవిపేట రాగానే అధికారులు ఆయనపై దృష్టి పెట్టారు. అప్పటికే రామరాజు మన్యవాసులలో కొన్ని సంస్కరణలు తెచ్చారు. ‘గాంధీజీ కార్యక్రమమంతటి లోను మద్యపాన నిషేధం, కోర్టుల బహిష్కారము-ఈ రెండూ ఆయనకు నచ్చినాయి. ఆయన గోదావరి, విశాఖపట్టణము ఏజెన్సీ ప్రాంతాలలో తీవ్రమైన ప్రచారం ప్రారంభించాడు’ అంటాడు, రామరాజు బాల్య స్నేహితుడు, ‘కాంగ్రెసు’ పత్రిక సంపాదకుడు మద్దూరి అన్నపూర్ణయ్య. దీనితో రామరాజును నాన్ కో ఆపరేటర్ అని పోలీసులు తీర్మానించారు. 1922 జనవరిలో రామరాజును మరింతగా అనుమానించ డానికి అవకాశం ఉన్న ఘటన జరిగింది.
మన్యం పెద్దల మొర
మొదటి ప్రపంచ యుద్ధం ఆగింది. కరవు విజృంభించింది. ఆకలి దాడులు జరిగాయి. అందుకే ప్రభుత్వం ఉపాధి కల్పన పనులు ఆరంభించింది. మన్యంలో రోడ్ల నిర్మాణం అందులో ఒకటి. గూడెం డిప్యూటీ తహసీల్దార్ అల్ఫ్ బాస్టియన్ బినామీ పేర్లతో కాంట్రాక్టు తీసుకుని, మన్యంలో మునసబులు, ముఠాదారులను బెదిరించి గిరిజనులను పనికి రప్పించి కూలి ఇవ్వక వేధించేవాడు. ఆసియా చరిత్రలోనే ఆ రోడ్ల నిర్మాణం ఓ అమానుష ఘట్టం. ఆ చరిత్ర ఎంత విషాదమో నాటి మన్యం వైద్యాధికారి డాక్టర్ తేతలి సత్యనారాయణమూర్తి డైరీ చెబుతుందని యర్రమిల్లి నరసింహారావు తన పుస్తకం ‘శ్రీ అల్లూరి సీతారామరాజు చరిత్ర (1922-24 విప్లవం)’లో గుర్తు చేశారు. నిజానికి 1882 చట్టంతో అడవిలో ప్రవేశం కోల్పోయిన ఆదివాసీలు కూలీలుగా మారిపోయారు. ఇలాంటి సమయంలో పెద్దవలస మాజీ ముఠాదారు కంకిపాటి బాలయ్యపడాలు (ఎండు పడాలు), బట్టిపనుకుల మునసబు గాం గంతన్న దొర, అతని తమ్ముడు గాం మల్లు దొర, కొండసంతలలో కూలి చేసుకుని బతుకుతున్న గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు, సంకోజు ముక్కడు, కర్రి కణ్ణిగాడు వంటివారు 1922 జనవరిలో రామరాజు దగ్గరకు వచ్చి గోడు వినిపించుకున్నారు. దానితో శ్రీరామరాజు బాస్టియన్ మీద పై అధికారులకు ఫిర్యాదు రాశారు. ఫలితం- రామరాజు మన్యంలో సహాయ నిరాకరణ ఆరంభించాడన్న ఆరోపణతో ఆ జనవరి 29న ఏజెన్సీ కమిషనర్ స్వెయిన్ విచారణ జరిపాడు.
ఫిబ్రవరి 1-5 మధ్య పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. ఆ ఒకటో తేదీన సహాయ నిరాకరణను తీవ్రం చేస్తున్నట్టు గాంధీజీ ప్రకటించారు. మూడో తేదీన ఇక్కడ రామరాజును పొలిటికల్ సస్పెక్ట్‌గా భావించి నర్సీపట్నం జైలులో ఉంచారు. 5వ తేదీన జరిగిన చౌరీచౌరా ఉదంతంతో గాంధీజీ సహాయ నిరాకరణ పిలుపును ఉపసంహ రించుకున్నారు. ఈ ఆకస్మిక, ఏకపక్ష నిర్ణయం ఎంతో ఆవేశంతో, ఆశతో ఉన్న యువతను ఇతర పంథాల వైపు అడుగులు వేయించింది. అలాంటి వారిలో రామరాజు ఒకరు. నర్సీపట్నం జైలులో పదహారు రోజులు ఉంచిన తరువాత పోలవరం డిప్యూటీ తహసీల్దార్ ఫజులుల్లా ఖాన్ (రాజు పినతండ్రి రామచంద్రరాజు స్నేహితుడు) రామరాజుకు పైడిపుట్ట వద్ద యాభయ్ ఎకరాల పొలం ఇచ్చి, దుచ్చెర్తి ముఠాదారు చెక్కా లింగన్న దొర అజమాయిషీలో ఉంచారు. అక్కడ నుంచే నేపాల్ యాత్ర కోసం అనుమతి తీసుకుని మన్యంలో ఉద్యమ నిర్మాణం చేపట్టాడాయన.
మన్యవాసుల ఆగ్రహాన్ని, ఉద్యమ దృష్టిని విస్తృతం చేసి, ఏకం చేసి ఉద్యమించాలని రామరాజు భావించారు. గెరిల్లా యుద్ధ రీతిని ఎంచుకున్నారు. గెరిల్లా పోరుకు కావలసిన ఆయుధాల కోసం మన్యంలోని పోలీస్ స్టేషన్లను దోచుకోవాలని ఆయన నిర్ణయించారు. ఎండు పడాలు, గంతన్న, రామరాజు-మల్లు నాయకత్వాలలో మూడు దళాలను నిర్మించారు. ఆ ఆగస్ట్ 22 పట్టపగలు చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు- దాదాపు మూడు వందల మంది. 11 తుపాకులు దొరికాయి. ఈ ఆయుధాలు తీసుకు వెళుతున్నానని ఒక లేఖ రాసి వెళ్లారు రామరాజు. చింతపల్లి స్టేషన్ మీద దాడితోనే రామరాజు ఉద్యమ తత్త్వం తెలుస్తుంది. ఉద్యమకారుల చేత ‘వందేమాతరం-మనదే రాజ్యం’ అంటూ, ‘గాంధీజీకి జై’ అంటూ రామరాజు నినాదాలు చేయించారు. ఆగస్ట్ 23న కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. అంటే రామరాజును మన్య విప్లవానికి దరిచేర్చిన చోటు. కొన్ని నాటకీయ సన్నివేశాల మధ్య ఊరివారు రామరాజును స్వాగతించారు. పోలీసు సిబ్బంది పారిపోయింది. 7 తుపాకులు దొరికాయి. ఆగస్ట్ 24న రాజవొమ్మంగి స్టేషన్ (తూర్పు గోదావరి)ను ఎంచుకుని దాడి చేశారు. 8 తుపాకులు దొరికాయి. లాగరాయి ఫితూరీని సమర్ధించిన నేరానికి అరెస్టయిన మొట్టడం వీరయ్యదొర అప్పుడు ఆ స్టేషన్‌లోనే ఉన్నారు (ఈయన తండ్రి సొబిలను దొర. 1879 నాటి ఫితూరీలో ఉన్నాడు). వీరయ్యదొరను విడిపించడం కూడా ఈ దాడి ఆశయాలలో ఒకటి.
‘ఆంధ్రపత్రిక’,‘కృష్ణాపత్రిక’, రాజమండ్రి నుంచి వెలువడే ‘కాంగ్రెస్’ (మద్దూరి అన్నపూర్ణయ్య సంపాదకుడు) ఆ వార్తలను ప్రచురించాయి. మన్యవాసులు వరసగా రెండు పోలీసు స్టేషన్ల మీద దాడి చేయడంతోనే మద్రాస్ ప్రెసెడెన్సీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎ గ్రాహమ్‌కు టెలిగ్రామ్‌లు వెళ్లాయి. నిజమే, 26 తుపాకులు, కొంత మందుగుండు కొండదళం చేతికి చిక్కాయి. ఈ మూడు దాడులతోనే రామరాజు పేరు మొదటిసారి తెలుగునేలంతా వినిపించింది.
స్టేషన్ల లూటీ సంగతిని ఏజెన్సీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సాండర్స్‌కూ, కలెక్టర్‌కు స్థానిక పోలీసులు తెలియచేశారు.ఆ ఇద్దరు ఆగమేఘాల మీద నర్సీపట్నం చేరుకున్నారు.క్షణాలలో చింతపల్లి, అడ్డతీగల, కోటనందూరు, మల్కనగిరి వంటి ప్రాంతాలకు పోలీసు బలగాలు చేరిపోయాయి. నర్సీపట్నం, ఏలేశ్వరం, అడ్డతీగెల పోలీసు శిబిరా లయ్యాయి. స్కాట్ కవర్ట్, నెవెల్లి హైటర్, ట్రేమన్‌హేర్, చాడ్‌విక్, హ్యూమ్, షర్బీస్, డాసన్ వంటి యూరోపి యన్ అధికారులంతా మన్యంలో వాలిపోయారు. ఆ వాతావరణంలోనే జైపూర్ మహారాజు ఐదు ఏనుగుల మీద పోలీసుల కోసం పంపిన సామగ్రిని సెప్టెంబర్ 3న ఒంజేరి ఘాట్‌లో రాజుదళం వశం చేసుకుంది.
మూడు పోలీస్ స్టేషన్ల మీద, ఒంజేరి ఘాట్ మీద దక్కిన విజయాల కంటే దామనపల్లి అనే కొండమార్గంలో సెప్టెంబర్ 24,1922న దక్కిన విజయం చరిత్రాత్మకమైనది. అక్కడికి రాజు దళం వస్తున్నదన్న సమాచారం తెలిసి స్కాట్ కవర్ట్, నెవెల్లి హైటర్ అనే ఒరిస్సా పోలీసు అధికారుల నాయకత్వంలో రెండు పటాలాలు వెళ్లాయి. ఇందులో హైటర్ మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాడు. ఆ ఇద్దరినీ కొండదళం మట్టుపెట్టింది. అక్టోబర్ 15న అడ్డతీగల మీద రాజు దాడి చేశారు. కానీ ఆయుధాలు దొరకలేదు.అక్టోబర్ 19న చోడవరం స్టేషన్‌లోను ఇదే అనుభవం. అప్పటికే ఆయుధాలను ట్రెజరీలకి తరలించడం మొదలయింది.
రామరాజు ఉద్యమం, కారణాలు, పరిణామాల గురించి బాస్టియన్, ఏజే హెపెల్ (ఏజెన్సీ కమిషనర్),టీజీ రూధర్‌ఫర్డ్ రాసిన నివేదికలు చాలా విషయాలు చెబుతున్నాయి. ‘తానే గూడెంకు రాజు కావలెనని రాజు తలచియుండవలెను’ అని హెపెల్ నిందమోపాడు. స్థానిక సాధారణ పోలీసులతో ఫలితం రావడం లేదని రూఢి చేసుకున్న తరువాత సెప్టెంబర్ 23, 1922న సాండర్స్ మలబార్ పోలీసు దళాలను రప్పించాడు. ఇవి కొండలలో పోరాడ గలవు. మోప్లా అల్లర్లను అణచిన ఘనత వీటిది. కానీ రామవరం అనే చోట మన్యం దళంతో తలపడినప్పుడు మలబార్ దళం వీగిపోయింది.
ఇది రామరాజు పోరులో రెండవ దశ. మలబారు దళాలు వచ్చిన తరువాత డిసెంబర్ 6, 1922న పెద్దగడ్డపాలెం, లింగాపురం అనేచోట్ల రాజుదళం వారితో తలపడవలసి వచ్చింది. వాళ్ల దగ్గర లూయీ ఫిరంగులు ఉన్నాయి. భీకర పోరే సాగింది. రెండుచోట్ల కలిపి ఎనిమిది మంది రాజు అనుచరులు వీరమరణం చెందారు. ఈ మృతదేహా లను మన్యంలో ఊరేగించి, గిరిజనంలో పోయిందనుకున్న భయాన్ని మళ్లీ సృష్టించారు. డిసెంబర్ 23న ఉద్యమకారులను పట్టిస్తే నగదు బహుమానాలు ఇస్తామంటూ ప్రకటన వచ్చింది. నాలుగు మాసాలు మన్యం దళం విరామం ఇచ్చింది. కానీ ఈ విరామాన్ని ఉద్యమ విరమణగా ఆంగ్లేయులు భావించారు.
ఏప్రిల్ 17, 1923న రామరాజు దళం ఆకస్మాత్తుగా అన్నవరం పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమై మొత్తం యంత్రాంగాన్ని కలవర పరిచింది. పైగా ప్రజలు ఆయన్ను స్వాగతించడం కాదు, పూజించారు. ఆ సందర్భంలోనే చెరుకూరి నరసింహమూర్తికి (ఈయన నాన్ కో ఆపరేటర్) రామరాజు ఇంటర్వ్యూ ఇచ్చారు. అదే ఏప్రిల్ 24న ఆంధ్రపత్రికలో వెలువడింది. అన్నవరం సంఘటన తరువాత మన్యవాసుల ఉద్యమంలోకి వేగిరాజు సత్యనారాయణ రాజు(అగ్గిరాజు) వచ్చారు. ఆ ఏడాది సెప్టెంబర్ 17 రాత్రి మల్లుదొర దొరికి పోవడం ఉద్యమానికి కీడు చేసింది. ఆ సంవత్సరం డిసెంబర్‌లో కాకి నాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశా లకు రామరాజు మారువేషంలో హాజరయ్యారు.
కాలం గడుస్తున్న కొద్దీ అణచివేత తీవ్రమైంది. అప్పటికే మన్యంలో ఉన్న బలగాలకు 1924 జనవరికి అస్సాం రైఫిల్స్ తోడుగా వచ్చింది. వీరికి కూడా మొదటి ప్రపంచయుద్ధంలో అనుభవం ఉంది. అప్పటికి మన్యం మీద ప్రయోగించిన బలగాల సంఖ్య దాదాపు వేయి. రాజుదళం సంఖ్య వంద. అస్సాం రైఫిల్స్ అధిపతే మేజర్ గుడాల్. ఆ సంవత్సరం ఏప్రిల్‌లో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్ జార్జ్ రూథర్‌ఫర్డ్‌ను విశాఖ మన్యంలో పోలీసు చర్యకు స్పెషల్ కమిషనర్‌గా నియమించారు.ఏప్రిల్ నుంచి జూన్ 24 వరకే అతడి అధికారం. అంతలోనే ఉద్యమం అణగిపోవాలి. మరికొంత అస్సాం రైఫిల్స్ బలగం వచ్చింది. మన్యం పోలీసు హింసతో, అత్యాచారాలతో తల్లడిల్లిపోయింది. ఆ సమయంలోనే మే ఆరంభంలో రేవుల కంతారం అనేచోట రాజు దళం సమావేశమైంది. బ్రిటిష్ పంచన చేరినా భారతీయులను చంపరాదన్న నియమంతో నష్టం జరుగుతున్నదని ఒక వర్గం విన్నవించింది. అదే అంశం మీద చీలిక వచ్చింది. ఆ సమావేశం జరుగుతూ ఉండగానే పోలీసులు దాడి చేశారు. రామరాజు ఒక్కడు రాత్రివేళ మంప చేరుకుని, ఒక చేనులోని మంచె మీద పరున్నారు. తెల్లవారితే మే 7వ తేదీ. రాజు వేకువనే మంచె దిగి అక్కడి కుంటలో స్నానం చేస్తుండగా ఈస్ట్‌కోస్ట్ దళానికి చెందిన కంచుమేనన్, ఇంటెలిజెన్స్ పెట్రోలింగ్ సబిన్స్‌పెక్టర్ ఆళ్వార్‌నాయుడు బలగంతో చుట్టుముట్టి అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన రాజును ఒక నులక మంచానికి కట్టి, గిరిజనుల చేతనే మోయిస్తూ కృష్ణదేవిపేటకు పయనమయ్యారు. రామరాజును ఎక్కడైతే జనం ఒక దైవంగా ఆరాధించారో అక్కడే ఆయనను బంధించి తెచ్చిన బందిపోటుగా చూపించదలిచారు. ఆ దారిలోనే ఉంది కొయ్యూరు. అక్కడే రామరాజును గుడాల్ ఒక చెట్టుకు కట్టి కాల్చి చంపాడు. రాజు ఎక్కడైతే ఉద్యమకారునిగా రూపొందాడో ఆ కృష్ణదేవిపేటలోనే తాండవ ఒడ్డున అంత్యక్రియలు జరిపారు.
మే 6, 1924న అగ్గిరాజు దొరికిపోయాడు. మే 26న ఎండు పడాలును స్థానికులే హత్య చేశారు. జూన్ 7న గాం గంతన్నను పోలీసులు కాల్చి చంపారు. ఈ మధ్యలో ఎందరో ఉద్యమకారులను గ్రామస్థులు, బంధువులు పోలీసులకు అప్పగించారు. మల్లుదొరకి, బోనంగి పండుపడాలుకి మొదట ఉరిశిక్ష పడింది. తరువాత ద్వీపాంతర శిక్షగా మారింది.
నిజానికి ఉద్యమకారుల ‘యుద్ధ నేరాలు’ విచారించడానికి 1922లోనే విశాఖపట్నంలో స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటయింది. ఎల్‌హెచ్ అరంట్ అడిషనల్ సెషన్స్ జడ్జి. 270 మంది వరకు ఉద్యమకారులను ట్రిబ్యునల్ విచారించి రకరకాల శిక్షలు విధించింది. 12 మందిని అండమాన్ కాలాపానీకి పంపారు. ఏ విధంగా చూసినా రామరాజు ఉద్యమంతో మద్రాస్ ప్రెసిడెన్సీ పాలనా కేంద్రం సెయింట్ జార్జి కోట భయపడిందన్న మాట నిజం. ఈ ఉద్యమం అణచివేయడానికి రూ.25 లక్షలు అని కొందరు, 40 లక్షల రూపాయలు వెచ్చించవలసి వచ్చిందని కొందరు రాశారు. రాజు ఉద్యమంతో అటవీ చట్టాల కాఠిన్యం తగ్గింది. ఆ త్యాగం వృథా కాలేదు. కొమురం భీం వంటివారికి స్ఫూర్తిగా నిలిచాడు. ఉద్యమం ఏ సమాజ శ్రేయస్సు కోసం ఉద్దేశించినదో అదే సమాజాన్ని బాధించరాదన్నది ఆయన నమ్మకం. హింస, విధ్వంసమే ఉద్యమం కాదని ఆయన విశ్వసించారు. అలా రామరాజు భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో అమేయమైన స్థానం సాధించుకున్నారు. అట్టడుగు వర్గాలలోను దేశభక్తి, స్వేచ్ఛాకాంక్ష ఉంటాయని రామరాజు నిరూపించారు. ఏ వర్గం త్యాగమైనా గౌరవించదగినదే, అందరి త్యాగ చరితలు నమోదైతేనే స్వరాజ్య సమర• చరిత్ర రచనకు పరిపూర్ణత సిద్ధిస్తుంది.
-డా. గోపరాజు నారాయణరావు