1947 ‌నాటి భారత్‌-‌పాకిస్తాన్‌ ‌విభజన చూసిన వారికి ఈ దేశ స్వాతంత్య్రోద్యమ చరిత్ర అక్కడకే వచ్చి ఎందుకు ఆగిందో లోతుగా అర్ధమై ఉంటుంది. ఆనాటి నెత్తుటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరపునకు రావు. అలాంటి వారు గుండెలలో మాతృభూమి మీద భక్తిని, ప్రేమను అజరామరం చేసుకున్నారు. అలాంటి వారిలో ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు మనోజ్‌కుమార్‌ ఒకరు. ఆయన నిర్మించిన దేశభక్తి ప్రపూరిత చిత్రాలు భారతీయుల హృదయాల మీద చెరగని ముద్ర వేశాయి. ఆయన పేరు ‘భరత్‌కుమార్‌’ అని స్థిరపడింది.

మనోజ్‌కుమార్‌ (‌జూలై 24,1937-ఏప్రిల్‌ 4,2025) అసలు పేరు హరికిషన్‌ ‌గిరి గోస్వామి. బ్రిటిష్‌ ఇం‌డియాలోని వాయవ్య ప్రాంతంలోని అబోట్టాబాద్‌లో పుట్టారు (ఇది ప్రస్తుతం పాక్‌లోని ఖైబర్‌ ‌ఫక్తుంఖ్వాలో ఉంది). వారి కుటుంబం విభజన సమయంలో ఢిల్లీ చేరుకుని కింగ్స్‌వే క్యాంప్‌, ‌హడ్సన్‌ ‌లైన్‌ ‌శరణార్థి శిబిరాలలో గడిపింది. ఈ విషయంలో ప్రఖ్యాత గేయ రచయిత గుల్జార్‌కీ మనోజ్‌కీ పోలికలు ఉన్నాయి. ఈ ఇద్దరు పాకిస్తాన్‌ ‌నుంచి వచ్చి ఢిల్లీ శరణార్థుల శిబిరాలలో ఉండి, తరువాత హిందీ చలనచిత్ర సీమలో ప్రవేశించారు. మనోజ్‌కుమార్‌ ‌సోదరుడు కుకు ఆ సమయంలోనే కన్నుమూశారు కూడా. అందుకే తనది చాలా విషాదకరమైన బాల్యమనే ఆయన చెప్పుకున్నారు. విభజన తన జీవితానికి ఇచ్చిన అత్యంత చేదు అనుభవాన్ని కూడా ఆయన చెప్పేవారు. తీస్‌ ‌హజారీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ప్రమాదాన్ని సూచించే సైరన్‌ ‌మోగింది. డాక్టర్లు, నర్సులు రోగులను విడిచిపెట్టి నేల మాళిగలలోకి నిష్క్రమించారు. మనోజ్‌ ‌తల్లి గట్టిగా అరిచింది. ఎందుకంటే అప్పుడు మనోజ్‌ ‌చిన్న తమ్ముడు కుకు చనిపోయాడు. మనోజ్‌ ‌కర్ర పుచ్చుకుని డాక్టర్లను కొట్టడానికి వెళ్లారు. తరువాత యమునలో ఆ బిడ్డ మృతదేహాన్ని విడిచిపెట్టి వచ్చారు. ఇకపై ఎవరి మీద దెబ్బలాటకు దిగవద్దని ఆ రాత్రే మనోజ్‌ ‌తండ్రి గట్టిగా చెప్పి ఒట్టు వేయించారు. ఆయనే ఖ్రి (‌కలం పేరు. జ్ఞానవంతుడు అని అర్థం). ఆయన కవి. 1956లో ఢిల్లీలోని హిందూ కళాశాలలో పట్టభద్రుడైన మరుసటి సంవత్సరం బాలీవుడ్‌కు పయనమయ్యారు మనోజ్‌. ఆయన నటించిన తొలిచిత్రం ఫ్యాషన్‌. అదైనా ఆయనకు సులభంగా రాలేదు. రైల్వే ప్లాట్‌ఫారాల మీద నిద్ర, పోలీస్‌ ‌లాఠీ దెబ్బలు వంటివన్నీ అప్పటికే బొంబాయిలో అనుభవమయ్యాయి. మనోజ్‌కుమార్‌ ‌నటుడిగా, దర్శకుడిగా, చిత్రానువాదకునిగా, గేయ రచయితగా, ఎడిటర్‌గా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పనిచేశారు. 53 చిత్రాలలో నటించారు. దిలీప్‌ ‌కుమార్‌, అశోక్‌కుమార్‌ ‌బాటలోనే గిరి గోస్వామి కూడా తన పేరును భరత్‌కుమార్‌ అని మార్చు కున్నారు. 1992లో పద్మశ్రీ పురస్కారం, 2015లో చలనచిత్ర రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్‌ ‌ఫాల్కే ఆయనకు వచ్చాయి.

ఆయన చిత్రాలు రోటీ కపడా ఔర్‌ ‌మకాన్‌, ‌క్రాంతి వంటి చిత్రాలు చూస్తే ఆయనలో సామాజిక స్పృహ స్పష్టంగా తెలుస్తుంది. క్రాంతి చిత్రం 1857 నాటి కొన్ని ఘటనల ఆధారంగా నిర్మించారని చెబుతారు. 1965లో ‘షహీద్‌’ ‌చిత్రాన్ని భగత్‌సింగ్‌ ‌జీవితం ఆధారంగా ఆయన నిర్మించారు. ఇందులో కొవ్వొత్తి మీద అరచేయి పెట్టి ప్రమాణం చేసే సన్నివేశం జనాన్ని కదిలించింది. భగత్‌సింగ్‌ ‌పాత్రను మనోజ్‌ ‌పోషించారు. దేశభక్తి తత్త్వంతో ఆయన తీసిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి ప్రశంసలు కూడా ఆయన పొందారు. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. రోటీ కపడా ఔర్‌ ‌మకాన్‌లో ఒక దృశ్యం ప్రేక్షకులను కదిలిస్తుంది. ఒక బక్కచిక్కిన మనిషి దుప్పట్లో ఏదో దాచి పెట్టుకుని పారిపోతూ ఉంటాడు. ఒక పోలీస్‌ అధికారి అతడిని చాలా దూరం వెంటాడి ఆపుతాడు. రివాల్వర్‌ ‌గురిపెట్టి లోపల ఉన్నదేమిటో చూపమంటాడు. అతడు గొంగడి నుంచి చేయి బయట పెడతాడు. అందులో రెండు చపాతీలు ఉంటాయి. అతడు దొంగిలించినవి అవే. ఆయన దేశభక్తి అవసరాన్ని ఎంత గుర్తించారో దేశంలో పెరుగుతున్న అవినీతి, నిరుద్యోగం వంటి తీవ్ర సామాజిక సమస్యలను కూడా వెండితెరకు ఎక్కించారు. ఈ సమస్యలను ఎలుగెత్తిన చాటిన చిత్రమే రోటీ కపడా ఔర్‌ ‌మకాన్‌. అం‌దుకే ఆయన చిత్రాలు 1960, 1970లలో హిందీ చలనచిత్ర సీమను ఏలాయి. 1967లో విడుదలయిన ఉపకార్‌ ఆయన దర్శకత్వంలోనే వచ్చింది. దీనికి నాటి దేశ సామాజిక నేపథ్యమే మూలం. నాటి ప్రధాని లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి జైజవాన్‌ ‌జై కిసాన్‌ ‌నినాదం ఇచ్చారు. ఆ నినాదాన్ని గౌరవిస్తూ నిర్మించినదే ఉపకార్‌ ‌చిత్రం. పొలం దున్నే కర్షకునిగా, యుద్ధ భూమిలో సైనికునిగాను ఆయన నటించారు. పూరబ్‌ ఔర్‌ ‌పశ్చిమ్‌ ‌భారతీయ సంస్కృతిని కాటేస్తున్న పాశ్చాత్య సంస్కృతి మీద నిరసనతో నిర్మించిన చిత్రం. ఆయన ఓ కౌన్తీ, గుమ్‌నామ్‌ ‌వంటి సస్పెన్స్ ‌చిత్రాలలోను నటించి మెప్పించారు. ఆయనకు సంగీతమంటే ఎంతో అభిమానం. అందులో మంచి అభిరుచి కూడా ఉంది. అందుకే ఆయన చిత్రాలలోని ఎన్నో పాటలు చిరస్థాయిగా నిలిచిపోయాయి.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE