ఏప్రిల్ 4,5 తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఒక కీలకమైన ఘట్టంగా మిగిలిపోతుంది. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో పడిన తర్వాత, అనుర కుమార దిస్సనాయకె సెప్టెంబరు, 2024లో దేశాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీలంకలో పర్యటించిన తొలి విదేశీ నేతగా మోదీ నిలిచారు. దిస్సనాయకే దేశాధ్యక్షుడి హోదాలో డిసెంబర్, 2024లో భారత్‌లో పర్యటించారు. శ్రీలంక పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఆ దేశానికి కీలకమైన చమురు, ఔషధాలు, ఆహారం లాంటి కీలకమైన దిగుమతులను కలుపుకొని 4 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని భారత్ సమకూర్చింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి శ్రీలంకకు ఆర్థిక ఎయిడ్ లభించడంలో భారత్ ఒక కీలకమైన భూమిక పోషించింది. ప్రధాని మోదీని మిత్రభూషణ పురస్కారంతో సత్కరించు కోవడం ద్వారా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలోనూ, ఉభయులకు చెందిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటంలోనూ ఆయన చేసిన అనిర్వచనీయమైన సేవలను శ్రీలంక గుర్తు చేసుకుంది. భారత్ శ్రీలంకకు ప్రధానమైన వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతూనే ఉంది. 2024లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 5.5 బిలియన్ డాలర్లను దాటింది. భారత ప్రధాని పర్యటన సందర్భంగా మోదీ, దిస్సనాయకే సమక్షంలో పలు పరస్పర అవగాహన ఒప్పందాలు- ఎంవోయూలు కుదిరాయి. వాటిలో విద్యుచ్ఛక్తి ఎగుమతి, దిగుమతి కోసమని అంతర్గత అనుసంధానానికి హై వోల్టేజీ డైరెక్ట్ కరెంట్-హెచ్‌వీడీసీ అమలు, డిజిటల్ పరివర్తనం, ఆరోగ్యం, వైద్యంలో సహకారం, ఎనర్జీ హబ్‌గా ట్రింకోమలీ అభివృద్ధి లాంటివి ఉన్నాయి. భారత్ గ్రాంట్ రూపేణా చేస్తున్న సాయం ట్రింకోమలీలో త్రికోణేశ్వర దేవాలయం, నువారా ఎలియాలో సీతా ఎలియా దేవస్థానం, అనురాధపురాలో పవిత్రమైన సిటీ కాంప్లెక్స్ ప్రాజెక్టు అభివృద్ధికి, మహో-ఓమన్‌తాయి రైల్వే లైను ప్రాజెక్టు ఉన్నతీకరణకు ఉపయోగపడుతుంది.