అప్పు చేసి పప్పు కూడు.. ఇదేదో సినిమా టైటిల్ అనిపిస్తోంది కదూ! అప్పుడెప్పుడో ఈ సినిమా చాలా పాపులర్ అయ్యింది. దశాబ్దాల తర్వాత దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఇలాగే తయారయ్యింది. రాష్ట్రం ఏర్పడిన సమయంలో అత్యంత సంపన్న మైన తెలంగాణ.. ఇప్పుడు అప్పులు, వడ్డీలలో మునిగి తేలుతోంది. ఏం చేయాలన్నా అప్పు తప్పనిసరి పరిస్థితికి చేరుకుందట. పదేళ్ల పాటు పాలించిన కె.చంద్రశేఖరరావు బీఆర్‌ఎస్ పార్టీ.. దాదాపు యేడాదిన్నర కింద అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తప్పులను ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారు. మొత్తానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం ప్రజల నెత్తిన కుంపటిలా మారిపోతోంది.
పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమ, ఉపాధి పథకాలంటూ కొత్త కొత్తగా ప్రకటిస్తోంది. అందుకు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నా.. ఏ మాత్రం ఆలోచన లేకుండా పథకాలను ప్రకటింపజేస్తోంది. వాటి అమలుకు తేదీలు కూడా ఖరారు చేస్తోంది. వాటికి అవసరమైన నిధులు ఎలా సమీకరించాలన్న అంశాన్ని అధికారులకు వదిలేసినట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, నెరవేర్చాల్సిన భరోసాలు కలుపుకుంటే.. వచ్చే మూడు నెలల కాలంలో రూ. 35వేల కోట్లు అవసరం అవుతాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం ఇది. ఈ పథకాలతో పాటు.. ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లు వంటి వాటికి వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలను చూస్తే.. వాటిని వాయిదా వేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఖజానా చూస్తే.. వీటిని అమలు చేసే వీలుమేలు లేదు. అందుకే అప్పుల కోసం వేట మొదలు పెడుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు ఆర్థిక సంస్థలతో సర్కారు సంప్రదింపులు మొదలు పెట్టింది. ప్రభుత్వానికి ఇతర ఆదాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో వెతుకులాట ప్రారంభించింది. కీలక ప్రాజెక్టులకు, పథకాల అమలుకు నిధుల సర్దుబాటుపై రేవంత్ ప్రభుత్వం అనివార్యంగా దృష్టి పెట్టింది. వచ్చే మూడు నెలల కాలానికి అవసరమైన దాదాపు రూ. 35 వేల కోట్లను సేకరించే పనిలో పడిపోయింది.
ఖరీఫ్‌కు సంబంధించిన రైతు భరోసా డబ్బులు ఇంకా రైతులందరి ఖాతాల్లో జమ చేయలేదు. ఆ సొమ్మును వీలైనంత తొందరగా పూర్తిస్థాయిలో విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటిదాకా నాలుగు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు వారి ఖాతాల్లో జమ చేశారు. మిగతాది మే రెండో వారంలోపు చెల్లించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇదయ్యేలోపు రబీ సీజన్ కూడా మొదలవుతుంది. ఆ దఫాలో రైతు భరోసా డబ్బును కూడా పెట్టుబడి సాయం కింద అందించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే నిధులు సమకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇక, రైతు భరోసాతో పాటు.. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకాలకు కూడా ఆర్థిక శాఖ అధికారులు నిధుల సమీకరణ ఎలా అన్న అంశంపై నివేదికలు తయారు చేస్తున్నారు. ఇతర అభివృద్ధి పనులు చూసుకుంటే…రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లను కూడా సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తన వాటా సమకూర్చాల్సి ఉంది. ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం పలు ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. వీటికి తోడు. ఇంకేమైనా ఇతర ఆదాయ మార్గాలున్నాయా? అని కూడా సమాలోచనలు చేస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం.. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రెండవ దశ, రేడియల్ రోడ్ల నిర్మాణం కోసం వచ్చే మూడు నాలుగు నెలల్లోపే కనీసం రూ.3 వేల కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉంది. మరోవైపు.. ఈ ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తులు చేసినా స్పందన లేదు. దీంతో జైకా వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో పాటు దేశంలోని మిగతా ఆర్థిక సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. 340 కిలోమీటర్ల మేర ఉన్న రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలకు మొత్తం రూ.34,367.62 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే నార్త్ ఫేజ్, డీపీఆర్ తుది దశకు చేరుకుంది. ఈ ట్రిపుల్ ఆర్‌కు సౌత్ ఫేజ్ డీపీఆర్ కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చే పరిస్థితులు ఉన్నా.. ఈ రోడ్ల నిర్మాణం కోసం భూసేకరణకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం మేర భరించాల్సి ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా వచ్చే మూడు నెలల్లో దాదాపు రూ. 1,500 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, మెట్రో ఫేజ్-2 కు కూడా అంచనా వ్యయం రూ.24,269 కోట్లు గా నిర్ధారించారు. త్వరలోనే ఈ డీపీఆర్‌లు ఖరారు కాబోతున్నాయి. రేడియల్ రోడ్లకు కూడా దాదాపు రూ. 7 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు కోసం జైకా నుంచి రూ. 380 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మిగతా నిధుల కోసం ఇతర ఫైనాన్స్ సంస్థలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. రేడియల్ రోడ్లకు సంబంధించి వచ్చే జూలై నాటికి తక్షణ అవసరాల కోసం కనీసం రూ. వెయ్యి కోట్లు మేరకైనా ఖర్చు చేయాల్సి ఉంటుందంటున్నారు అధికారులు.
అయితే వాస్తవ పరిస్థితి చూసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం గతంతో పోలిస్తే.. బాగానే ఉన్నప్పటికీ.. వీటిలో ఎక్కువ శాతం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీలు, వడ్డీలు, పాత పెండిరగ్ బిల్లుల చెల్లింపులకు, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, నెలవారీ జీతాలు, ఆసరా పెన్షన్‌లకే సరిపోతుందంటున్నారు అధికారులు. దీంతో పలు ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇతర ఆదాయ మార్గాలను చూసుకుంటే.. పెండిరగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను క్లియర్ చేయడం ఇప్పటికే మొదలుపెట్టింది.మార్చితో ముగిసిన మొదటి విడత గడువులో ఆదాయం భారీగానే సమకూరింది. మరింత ఆదాయం రాబట్టుకోవాలనే లక్ష్యంతో ఎల్‌ఆర్‌ఎస్ పెండిరగ్ దరఖాస్తుల ప్రక్రియకు ఏప్రిల్ నెలాఖరు వరకు గడువు పొడిగించారు. రిజిస్ట్రేన్లు, మద్యం ఆదాయంపైనా రాష్ట్ర ప్రభుత్వం గురి పెట్టింది.
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినెలా సగటున పన్నులు, పన్నేతర ఆదాయం రూ. 18 వేల కోట్లు సమకూరుతోంది. అదే సమయంలో ఖర్చులు మాత్రం రూ. 23 వేల కోట్లు అవుతున్నాయి. చేయూత పెన్షన్లు, ఇతర గ్రీన్ ఛానెల్ పథకాలకు దాదాపు రూ. 2 వేల కోట్లు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు రూ. 5 వేల కోట్లు, అప్పుల కిస్తీలు, వడ్డీలకు కలిపి రూ. 6,500 కోట్లు ప్రతినెలా చెల్లిస్తోంది. ఇక, పెండిరగ్ బిల్లులకు, ఇతర అత్యవసరాలకు రూ. 4 వేల కోట్లు కేటాయిస్తున్నారు. దీంతో మిగిలిన పథకాలకు, ప్రాజెక్టులకు చూసుకుంటే ఖజానా నుంచి నిధుల కొరత ఏర్పడుతోంది.
సర్కారు చేపడుతున్న పథకాల్లో భాగంగా ముఖ్యమైన స్కీములు చూసుకుంటే.. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నిరుపేదలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు 12,571 కోట్ల రూపాయలు కేటాయించారు. వీటిలో కొంత మొత్త ం కేంద్రం నుంచి పీఎంఏవై పథకం కింద 4,600 కోట్ల రూపాయలు వస్తాయి. ఇక కొంత అప్పులను ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంది. మిగిలిన మొత్తం ఖజానా నుంచే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం చూసుకుంటే.. ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున 70,122 మంది లబ్ధిదారులను తొలివిడతలో గుర్తించారు. ఈ పథకంలో దాదాపు 14 వేల ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభమయ్యాయి. అయితే, వీటిలో 1,800 ఇళ్ల పునాదుల నిర్మాణం పూర్తయింది. వీరికి ఆర్థిక సాయం చెల్లింపులు మొదలుపెట్టారు. పైగా ఇవన్నీ గత ఆర్థిక సంవత్సరం కింద మంజూరైనవే కావడం.. ఈసారి మరిన్ని ఇళ్లు మంజూరు చేయాల్సి ఉండటంతో కనీసం 5 వేల కోట్ల రూపాయలు వచ్చే మూడు నెలల కోసం ప్రభుత్వం సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
మరో పథకం.. రాజీవ్ యువ వికాసం పథకం చూసుకుంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల నిరుద్యోగ యువతకు రూ. 2.40 లక్షల వరకు సబ్సిడీ కింద రుణాలు ఇవాల్సి ఉంది. వాటి మొత్తం చూసుకుంటే.. రూ. 6 వేల కోట్లు లెక్క తేలుతాయంటున్నారు. వచ్చే జూన్ 2వ తేదీ తర్వాత నుంచి ఈ మొత్తాన్ని పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక, ఖరీఫ్ పెట్టుబడి సాయం నిధులను రైతుల ఖాతాల్లో జమచేసే ప్రక్రయి రెండు నెలల నుంచి జరుగుతోంది. ఇప్పటి వరకు నాలుగు ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా అందించారు. త్వరలోనే 4 ఎకరాలు, ఆ పైన ఉన్న రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పథకం కోసం రూ. 4 వేల కోట్ల వరకు అవసరమని అధికారులు అంటున్నారు. ఇక, వచ్చే జూన్ నెలనుంచే మళ్లీ వానాకాలం పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పేరుతో ప్రభుత్వం అందించాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు రబీ రైతు సాయం కోసం దాదాపు రూ. 9 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు.
ఇలా.. వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నప్పటికీ, ఇతర సంస్థల నుంచి సమకూర్చు కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ కొత్త కొత్త పథకాలను ప్రభుత్వ పెద్దలు ప్రకటిస్తున్నారు. ఈ దిశగా మాత్రమే ముందుకెళ్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మాత్రం లెక్క చేయడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో ప్రభుత్వ పాలన ఓ కమర్షియల్ సంస్థలాగా సాగే ప్రమాదం పొంచి ఉందంటున్నారు విశ్లేషకులు.
- సుజాత గోపగోని, సీనియర్ జర్నలిస్ట్, 6302164068