జూన్‌ 21 అం‌తర్జాతీయ యోగా దినోత్సవం

యోగా మనసుకు-దేహానికి, మనిషికి-ప్రకృతికి నడమ వారధి నిర్మిస్తుంది. మనిషి తనను తాను తెలుసుకోవడమే దీని ఉద్దేశంగా చెబుతారు. పతంజలి మహర్షి ఏనాడో ప్రసాదించిన, స్వామి వివేకానంద ప్రబోధించిన యోగాను వర్తమానంలో విశ్వానికి పునః ప్రదానం చేసింది మాత్రం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనడంలో సందేహంలేదు. దీనిని ప్రపంచ దేశాలే ఆమోదించాయి. సరిగ్గా పదేళ్ల క్రితం తొలిసారిగా ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా సెప్టెంబర్‌ 27, 2014న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పిలుపునిచ్చారు. అదే ఏడాది డిసెంబర్‌ 11న ఐరాస 193 సభ్య దేశాలలో 177 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ప్రపంచ మానవాళి పరిపూర్ణ ఆరోగ్యానికి యోగాభ్యాసం ఉపయోగపడుతుందని కూడా తీర్మానించింది.

భారతీయ సనాతన సంస్కృతిలో, మానవ జీవన ప్రస్థానంలో సాధన అనేది నావ ఆయితే, దానికి చుక్కాని ‘యోగ’ అనే యోగమూర్తులు అభివర్ణించారు. యోగం అంటే ఇంద్రియాలను వశపరచుకొని చిత్తాన్ని ఈశ్వరునిలో లయం చేయడమేనని, నిరాశా నిస్పృహలను పెకలించి సకారాత్మక జీవన పంథాను చూపుతుందని యోగాచార్యులు చెబుతారు. ప్రఖ్యాతిగాంచిన ఆరు ఆస్తిక దర్శనలలో యోగ దర్శనం ఒకటి. దాని సూత్రకారుడు మహర్షి పతంజలి. హిరణ్యగర్భుడు, యాజ్ఞవల్క్యుడు వంటి ఎందరో యోగశాస్త్ర ప్రవర్తకులు ప్రవచించిన అంశాలను క్రమపద్ధతిలో సూత్రబద్ధం చేయటం వలన దీనికి ‘పతంజలి యోగదర్శనం’ అనే పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది.యమ, నియమాలను యోగాకు పునాదిగా చెప్పారు మహర్షి పతంజలి. అవి మనిషి నడవడి, ప్రవర్తన గురించి చెబుతాయంటారు. వీటితో జీవనశైలిని మార్చుకుంటే రోగ నిరోధకశక్తి పెరుగు తుంది. అందుకే ప్రత్యాహారం.. అంటే బహిర్‌, అం‌తరంగాలను ఏకం చేసే వారధిగా ఆయన అభివర్ణించారు.

పురాణాల ప్రకారం, యెగా అతి పురాతన విద్య. బౌద్ధం, జైనం, సిక్కు మతాలలోనూ యోగ సాధన ఉంది. టిబెట్‌ ‌ప్రాంత బౌద్ధం యోగాతో కేంద్రీకృత మైంది. బౌద్ధం, జైనుల సన్యాశ్రమ శిక్షణలో యోగ ప్రధాన భూమిక వహించినట్లు తెలుస్తుంది. సింధు నాగరికత కుడ్యాలను బట్టి నాటి సమాజంలో యోగ ఒక భాగమని తెలుస్తుంది. బౌద్ధ సంప్రదాయక పాఠశాలల్లో 4, 5 శతాబ్దాలలో యోగాచార తత్త్వం బోధించారని చరిత్ర. జెన్‌ (‌చెన్‌) ‌మహాయాన బౌద్ధంలో ‘చెన్‌’ అనేది సంస్కృత పదం ‘ధ్యాన’కు రూపాంతరమని చెబుతారు.

 మనిషిలోని మంచితనమే దైవాంశ. అలా ప్రక్షిప్తంగా ఉన్న దైవత్వాన్ని అభివ్యక్తం చేయగలగడమే యోగ సాధన. మానవదేహానికీ, పంచభూతాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. మనిషి ప్రకృతికి దూరమైన క్షణంలో శరీరం ఇబ్బందుల పాలవు తుందని యోగా గుర్తుచేస్తూ, ఆరోగ్య పరిరక్షణపై అప్రమత్తం చేస్తుంది. పంచభూతాలకు దూరంగా జరిగినా, ప్రకృతి విధ్వంసానికి పాల్పడిన భారీ మూల్యం చెల్లించక తప్పదని యోగా నిష్కర్షగా చెప్పింది. నాలుగేళ్ల క్రితం ప్రవంచాన్ని వణికించిన కంటికి కనిపించని సూక్ష్మజీవే ఇందుకు సాక్ష్యమని యోగా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

వ్యాధితో పోరాడడం కంటే, దానిని దరి చేరనివ్వని శక్తిని శరీరానికి అందించడమే యోగా లక్షణం. ఇంద్రియాలను అదుపు చేయడం ద్వారా వ్యాధులను నియంత్రించవచ్చని, రోగ భయాన్ని నివారించగలిగితే సగం వ్యాధి నయమైనట్లేనని బోధిస్తోంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి కీలకమైన జీవనశైలిని ధ్వంసం చేసుకుంటున్న తరుణంలో ప్రాణాయామం పెద్ద భరోసా అని యోగవిద్య నిర్ద్వంద్వంగా రుజువు చేసింది. విశ్వమంతా గుర్తిస్తున్న ఈ పక్రియను భారతీయులు మాత్రం జీవితంలో భాగం చేసుకోలేక పోతున్నారని శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్యులు శ్రీ హంపి విరుపాక్ష విద్యారణ్య సంస్థానాధీశులు శ్రీ శ్రీ విద్యారణ్యభారతి స్వామీజీ తదితర మహ నీయులు అనేక సందర్భాలలో ప్రవచించారు.

సుఖజీవనానికి, ప్రతికూల పరిస్థితులను తట్టు కుంటూ, భయం, ఆత్రుత, ఆందోళనలను దూరం చేసుకుని ధైర్యం పెంచుకునేందుకు సరళమైన సాధనం యోగా అని, ఖర్చు లేనిది, ఇతరులకు ఇబ్బంది కలిగించనిది అందరూ అంగీకరిస్తారు. అలాంటి యోగసాధనలో ఆసనాలు ఒక భాగమని, కొన్ని నెలల పాటు చేసిన వ్యాయామం ద్వారా పొందే ప్రయోజనా లను యోగాసనాల ద్వారా అతి తక్కువ సమయంలో పొందవచ్చని యోగాభ్యాసకులు చెబుతారు. అయితే వాటిని గురుముఖంగా అభ్యసించవలసి ఉంటుంది. ఎవరి వయసుకి సరిపోయే ఆసనాలను వారు నేర్చుకోవాలి. యోగాభ్యాసం చేయడానికి అనువైన పద్ధతులు నేర్చుకుని వాటిని జీవితంలో భాగం చేసుకోవాలి. అదే మనల్ని, నేటి భయంకరమైన సమస్యల నుంచి బయటపడేసే మార్గం.

యోగ అంటేనే భారతదేశం. యోగాను విశ్వ వ్యాప్తం చేయడం ద్వారా భారత్‌ ‌మరొకసారి తన జగద్గురు స్థానాన్ని నిరూపించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో ‘యోగా’ విశ్వానికి శ్వాస అయింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆరోగ్యం మీద కొత్త దృష్టికి నాంది పలికింది. ఇస్లాం, క్రైస్తవ దేశాలలో సైతం భారతీయ యోగా ఖ్యాతి పొందింది. కమ్యూనిస్టులు సైతం ఆచరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ యోగాకు పట్టం కట్టింది. స్వామి వివేకానందుని సందేశాన్ని, నరేంద్ర మోదీ మార్గదర్శకత్వాన్ని అనుసరించి ప్రపంచ యోగా దినోత్సవం (జూన్‌ 21) ‌సందర్భంగా ఆరోగ్య పరిరక్షణకు పునరంకిత మవుదాం.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE