వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

శాస్త్రిగారి కథనం: ‘‘శాస్త్రిగారూ! హార్థిక శుభాకాంక్షలండీ! మీరు నిన్న సభలో భగవద్గీత వ్యాఖ్యానం, పామరులకు సైతం అరటిపండు వలచి నోట్లో పెట్టినట్టు ఎంత అద్భుతంగా చేశారండి! అంత పెద్ద జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌మిమ్మల్ని మెచ్చుకొని, మీ ఆటోగ్రాఫ్‌ అడగడం మామూలు విషయం కాదు కదా!’’ గోపాల్‌, ‌సుబ్రహ్మణ్యం చేతులు పట్టి ఊపేస్తూ ఉద్వేగంగా అంటుంటే నా మొహం నిజంగానే వెయ్యి ఓట్ల బల్బులా వెలిగిపోయింది.
‘‘మిమ్మల్ని బ్రాంచ్‌ ‌మేనేజర్‌ ‌పిలుస్తున్నారండి!’’ ఎప్పుడూ నమస్తే కూడా పెట్టని గుమాస్తా వచ్చి, వినయంగా చేతులు జోడించి విషయం చెప్పడంతో ఆశ్చర్యపోయాను.
బ్రాంచ్‌ ‌మేనేజర్‌ ఎం‌దుకు పిలిచారు, మళ్లీ ఎందులో, ఏ తప్పు దొరికిందో, ఏ చీవాట్లు తినాల్సి వస్తుందో అని భయపడుతూ ఛాంబర్‌ ‌లోకి అడుగు పెట్టాను. అయితే నేను ఊహించిన దానికి భిన్నంగా అక్కడ జరుగుతుందని ఆ క్షణంలో కనీసం కలలో కూడా ఊహించలేదు. అక్కడ చేరిన నన్ను కూర్చోబెట్టి, ‘‘హార్థిక శుభాకాంక్షలయ్యా! నిన్న మీరు చేసిన వ్యాఖ్యానం చాలా అద్భుతంగా ఉంది. ఇంతటి మేధావి, మా మిత్రుడు అయినందుకు గర్వపడు తున్నాను. సాయంత్రం మీకు ఆఫీసులో సన్మానం ఉంది. కాదనకూడదు’’ అన్నారు.
‘‘అది మీకు ఎలా తెలిసింది సర్‌?’’ అన్నాను అయోమయంగా.
‘‘భలేవాడివోయ్‌! ‌వీడియో తీసి మన ఆఫీసు వాట్సప్‌ ‌గ్రూపులో ఎవరో పెట్టారయ్యా. మీరు చూడలేదా ఏంటి? అందులో వ్యాఖ్యానం, జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌గారు మెచ్చుకొని ఆటోగ్రాఫ్‌ అడిగి, శాలువా, మెమొంటోలతో చేసిన సత్కారం అన్నీ ఉన్నాయి’’
‘‘పొద్దటి నుండి ఫోన్లు రావడం వల్ల, నేను వాట్సాప్‌ ‌చూడలేదండి’’ అంటూ ఆయన పొగడ్తలకు తబ్బిబ్బవుతూ బయటపడ్డాను.
సాయంత్రం ఆఫీస్‌ అయిపోగానే, బలవంతాన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి, ‘‘సెలబ్రిటీల జాబితాలోకి చేరబోతున్నావు, అనేదానికి ఇదొక సంకేతమేమో, మీలాంటి వాడు మా ఆఫీసులో ఉన్నందుకు మేమెంతో గర్వ పడుతున్నాం. ఇది మన ఆఫీస్‌ ‌కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప జేస్తుంది కూడా’’ అంటూ నాకు పూలదండ వేసి, శాలువా కప్పి, అందరి కరతాళధ్వనుల మధ్య ఘనంగా సన్మానించ డంతో నా ఛాతీ రెండంగుళాలు పెరిగింది.
అందరూ నాతో ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఇన్ని రోజులు ఆఫీసులో ఒక అనామకుడిగా, మౌనమునిలా ఎవరేమన్నా పట్టించుకోకుండా ఒక జడ పదార్థంలా ఉన్న నన్ను అందరూ చులకనగానే చూసేవారు. కానీ సంగీత సాహిత్యాలలో ఉన్న నా విద్వత్తునంతా జోడించి, రేయనక పగలనకా చేసిన కృషి వల్ల ఈ భగవద్గీత విశ్లేషణ సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఆకట్టుకునే విధంగా చెప్పగలుగు తున్నాను. అలా నిన్న జరిగిన కార్యక్రమం మొత్తానికి ఆఫీసులో పెద్ద సంచలనమే రేపింది.
అయినా నేను వారికి కాఫీ కూడా ఆఫర్‌ ‌చేయలేకపోయాను. ఎందుకంటే నేను ఐదంకెల్లో సంపాదిస్తున్నా మా ఆవిడ పాకెట్‌ ‌మనీ కింద ఇచ్చేది కేవలం రెండు రోజులకి ఒక వంద రూపాయలు మాత్రమే కాబట్టి! బయటకు ఎక్కడికి వెళ్లినా, నేను ఖర్చు ఎవరికోసం పెట్టలేను.
రోజు కన్నా రెండు గంటలు ఆలస్యంగా చాలా సంతోషంతో, ఇంట్లోకి అడుగు పెట్టాను.
‘‘ఏంటి? కనీసం ఫోన్‌ ‌చేసినా పలకరా? రావడానికి ఇంత ఆలస్యమెందుకయింది? కూరగాయలు, సామాన్లు నిండుకున్నాయి. నాకొంట్లో బాలేదని ఈ రోజు సాయంత్రం వచ్చాక తెస్తానని చెప్పారు కదా!’’ అంటూ గుమ్మంలోనే సంచీ డబ్బులు చేతిలో పెట్టింది శ్రీమతి. తొలిసారి నేను చూసిన విశాలాక్ష్మికి ఈమెకు ఏమాత్రం పొంతన లేదని పించింది. నా కళ్ల ముందు గతం సినిమా రీలులా తిరిగింది.
*   *   *
అవి నేను ఉద్యోగం సంపాదించిన తొలి రోజులు. గుడి బయట ఎడమ చేతిలో పుస్తకంతో, కుడిచేతిలో పైకి తొంగి చూస్తున్న పుస్తకాల బ్యాగ్‌తో నిలబడ్డ ఆమె రూపం• నా మనసును దోచుకుంది.
అట్టే ఆలస్యం కాకుండా మరో రెండు రోజుల్లో నాకు పెళ్లి చూపులు జరిగాయి. ఆ పెళ్లి చూపుల్లో నా ఎదురుగుండా ఉన్న ఆమెను చూడగానే నేను నిజంగా ఆశ్చర్యచకితుణ్ణి అయిపోయాను.
మొదటి చూపులోనే నాకు నచ్చేసిందని ఇంట్లో చెప్పాను. ఆమె చూపుల్లోనే నేను కూడా నచ్చానని అర్థమైంది. వెంటనే నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టేసారు. నిశ్చితార్థం అయ్యాక మొదటిసారిగా ఎంతో కుతూహలంతో, వాళ్ల ఇంటికి వెళ్లాను. కొత్తగా అల్లుడు వచ్చాడని అందరూ ఆత్మీయంగా పలకరించారు.
నేను హాల్లోకి వెళ్లబోతుంటే అక్కడ ఆమె చేతిలో పుస్తకాల్ని చూసిన నాకు సంతోషంగా అనిపించింది. కానీ మరుక్షణం ఆమె అక్కడ త్రాసుతో కూర్చున్న అతని తక్కెడలో పుస్తకాలు పెట్టడం చూసి నా గుండె వేయి వక్కలయ్యింది. అతను అవన్నీ బయట ఉన్న తోపుడు బండిపై వేసుకొని, జేబులోనుండి చిల్లర డబ్బులు తీసి ఆమెకిచ్చి వెళ్లిపోయాడు. నాకేం అర్థం కాలేదు.
‘‘అదేనండి. డిగ్రీ అయిపోయిందిగా! ఇక పుస్తకాలతో నాకేం పని? ఇప్పుడు సిలబస్‌ ‌కూడా మారిపోయింది. అందుకే కూడా ఎవరూ కొనుక్కోవ డానికి రావడం లేదు. అందుకే కేజీల లెక్కన అమ్మేశాను’’ అంటూ లోపలికెళ్లింది. నాలో అగ్ని పర్వతం బద్దలైంది.
నాకింకా ఒక్క క్షణం కూడా అక్కడ నిలవా లనిపించలేదు. ఎక్కడెక్కడో తిరిగి ఇంటికొచ్చాక ‘‘అమ్మా! నాకీ సంబంధం వద్దమ్మా’’ అంటూ విషయం చెప్పాను.
‘‘ఇంతేనా? పెళ్లయితే ఆమే మారుతుంది. నిశ్చితార్థం అయితే సగం పెళ్లి జరిగిపోయినట్లే. ఆడపిల్ల జీవితమంటే ఆటలనుకున్నావా!’’ అంటూ మెడలు వంచి పెళ్లి చేశారు. అలాని ఆమె అంటే నాకేమీ వ్యతిరేకత లేదు. కానీ పుస్తకాల పట్ల ఆమె అభిప్రాయమే, నా గుండెల్ని ముక్కలు చేసింది.
పుస్తకాలతో ముచ్చట పెడుతూ, చదువుతూ, రాసుకుంటూ అలా వదిలేసిన వాటిని కోపంతో నాపైకి విసిరేసేది. ‘‘అసలే ఇల్లు చిన్నగా అంటే, అందులో దిక్కుమాలిన సంత ఇదొకటి’’ అంటూ నేను ఎంతో జాగ్రత్తగా ఎన్నో సంవత్సరాల నుండి సేకరించి, అతి కష్టం మీద దాచుకున్న, అద్భుతమైన, అరుదైన అక్షర సరస్వతులైన గ్రంథాలన్నీటిని కోపంగా అట్టపెట్టెలో పెట్టి అటకెక్కించేసింది. దానికి చెదలు పట్టిన రోజు నేను ఎవరో చనిపోయినంతగా, ఎంతగా ఏడ్చానో నాకే తెలుసు.
నేను ఇంక ఆమెతో కాదనుకొని, నేనే, మొత్తం ఒక డాక్టరు శస్త్ర చికిత్స చేసేప్పుడు ఎంత శ్రద్ధగా, భక్తిగా చేస్తాడో అంతలా పుస్తకాలన్నింటినీ తుడిచి వాటన్నింటికీ అట్టాలు వేసి జాగ్రత్తగా దాచుకున్నాను. ఎప్పుడు ట్రాన్స్ఫర్‌ అయినా ఇల్లు మారాల్సి వచ్చినా ఇక నాకు అది గండం అన్నట్లే! అప్పుడు ప్రపంచంలోని తిట్లన్నీ నా మీదనే ప్రయోగించేది. వినివిని అలా ఊరకుండిపోవడం అలవాటై పోయింది. పిల్లలైనా కనీసం నా మాట విని, నా బాధను గమనిస్తారా? అంటే అదీ లేదు.
‘‘ఎందుకు నాన్నా! అమ్మ ఒక్కతి ఇన్ని పనులు చేసుకుంటున్నా, నువ్వు గుర్తించవు. పైగా ఇంకా పుస్తకాలన్నీ ఇంటినిండా పేర్చి, తలనొప్పి చేస్తావు’’ అంటారు.
చిన్న ఇల్లు అయినా నాకంటూ వ్యక్తిగత స్థలం లేనందుకు బాధపడేవాడిని. ఈ బాధంతా తీరాలంటే నాకిష్టమైనట్లుగా ఒక స్థలం కొనుక్కుని, అందులో చాలా పెద్ద గదిని, నా పుస్తకాలకు కేటాయించుకుని అందులో, ‘నా సంగీత క్యాసెట్లు, నా సౌండ్‌ ‌సిస్టం, కేవలం నా పుస్తకాలు, నేనే ఉండాలి’ అనుకునేవాడిని. ఆ కోరిక నాతో పాటే అలా అలా ఎదిగి శాఖోపశాఖలై విస్తరించింది.
దానితో ఎలాగైనా ఇద్దరం కలిసి అతికష్టంపై అందరికీ ఇష్టమైన స్థలాన్ని తీసుకుని ప్లాన్‌ ‌గీయించాం. కానీ ఇక్కడ కూడా నాకు చుక్కెదురయ్యింది. అంత పెద్ద ఇంటిలో కేవలం నాకు, నా పుస్తకాలకు వాళ్లు ఇచ్చింది కేవలం ఆరడుగుల చిన్న గది మాత్రమే. నా జీతం, నా డబ్బులు, నా కష్టంతో కట్టుకునే ఇంట్లో కూడా నాకు స్వతంత్రం లేదని నా మనసు బాధగా మూలిగింది.
కొత్త ఇంటికి వచ్చాక నా సంగీత సాహిత్య ప్రపంచమంతా నా గదే అయిపోయింది. అక్కడ కూర్చుంటే ముళ్ళపూడి వెంకట రమణ వచ్చి పక్క కూర్చుని ముచ్చటిస్తున్నట్లు ఉంటుంది. ఆయన చమత్కారాలతో నవ్విస్తున్నట్లుం టుంది. ఆరుద్ర నా వీపు నిమిరినట్లుంటుంది. రాబిన్‌ ‌సన్‌ ‌వచ్చి నా తల మీద చేయివేసి అభయమిచ్చినట్లుగా, నా వీపు తట్టినట్లుగా, నా మాటలు ఆలకించి నట్లుగా, నాతో కలిసి నవ్వినట్లుగా ఉంటుంది. అలా అలా అందరూ ఆత్మీయుల్లా తమ మాటలతో, పాటలతో నన్ను సేదదీరుస్తున్నట్లనిపిస్తుంది. ఇలా ఆ పుస్తకాలతో నా అనుబంధం అనేది చాలా అపురూపమైనది. దాన్ని చెప్పడానికి మాటలు లేవు. వివరించడానికి భాష చాలదు. నోరు మూగబోతుంది. మౌనభాషకు మించిన భాష ఉండదని అర్థమవుతుంది. కానీ ఇన్ని మాటలాడే నా ప్రాణం అనుకున్న పుస్తకాలు, నా అనుకునే మనుషులు ఎవరికి కూడా ఏమీ కాకపోవడం చాలా చాలా విచారకరమైన, దురదృష్టకరమైన విషయం. అందుకే అక్కడే నా మనసు విరిగిపోయింది. అందుకే ఎప్పుడూ నా ప్రపంచంలో నేనుంటాను.
ఆఫీస్‌కు వెళ్లానా, వచ్చానా! కేవలం తినడానికి పిలిచినప్పుడు వెళ్లి మౌనంగా కంచం ఖాళీ చేసి వచ్చి నా ఊహల్లో, నా లోకంలో నేను మైమరిచి పోతూ ఉంటాను. అప్పుడు శాంత బెనగల్‌ ‌స్వరం నాకు వినపడుతుంది. ఘంటసాల రారమ్మని పిలుస్తున్నట్టు ఉంటుంది. బాలసుబ్రమణ్యం స్వరనీరాజనంతో చెవుల్లో అమృతధార వొలికినట్లు ఉంటుంది. వెన్నెల గోదారిలో స్నానం చేసినట్లు ఉంటుంది. అందని చందమామ అందినట్లు ఉంటుంది. నేల నింగి కలిసినట్లు ఉంటుంది. ఇలా నాలోని మధుర భావనలు, నేను, నా పుస్తకాలతో మాట్లాడు కుంటూ ఉండిపోతాను. ఇదంతా ఇంట్లో వారికి నా పిచ్చి పీక్స్‌కి వెళ్లినట్లు, నేనొక పిచ్చివాడిలాగా, మానసిక రోగిలాగా కనిపిస్తాను. అది నాకు వింతగా అనిపించదు. వారి దృష్టి దోషం కింద కనపడుతుంది.
అందుకే ఎవరినీ పట్టించుకోకుండా, నాకు ఎంతో నచ్చిన వారి పుస్తకాలని పూర్తిగా అనువాదం చేసి, ఈ తరానికి అందులోని మాధుర్యాన్ని పంచి పెట్టడానికి ఒక తపస్సులాగా రోజూ అనువాదం చేయడం మొదలు పెట్టాను.
అక్కడ కూర్చుంటే చాలు! ఆ పుస్తకాలు నన్ను పలకరిస్తాయి, ముచ్చట్లు పెడతాయి. సేద తీరుస్తాయి, నా గోడు వింటాయి, నన్ను సేదదీరుస్తాయి.
*   *   *

విశాలాక్షిగారి కథనం:
‘ఏంటో ఈ మనిషి? ఏ మాత్రం లౌక్యం తెలియదు. ఈ కాలంలో పుట్టాల్సిన వ్యక్తి కాదు. ఏదో ఇక్ష్వాకుల కాలంలోనో, కాకతీయ కాలంలోనో పుట్టాల్సిన వ్యక్తి. కేవలం నాలుగు కాసులు సంపాదించి రాగానే తన బాధ్యత తీరిపోయిందను కుంటాడు.
పెళ్లయి వచ్చిన కొత్తలో రెండు సంవత్సరాలు అలా వదిలేస్తే, మొత్తం ఇల్లంతా పుస్తకాల కొట్టు చేశాడు. చేతికి నెలాఖరు వచ్చేసరికి పైసా లేకుండా అడుక్కుతినేట్లు చేశాడు. అందుకే ఈ ఇంటి బాధ్యత అంతా నా నెత్తిన వేసు కున్నాను. కేవలం ఆఫీసుకు వెళ్లొచ్చి డబ్బులు నా చేతుల పోయడమే తెలుసు ఆయనకి. తర్వాత బావిలోని నీరులా ఊరుతున్న ఖర్చులకు, కుండలోని నీటిలా ఎదుగూ బొదుగూ లేని జీతాన్ని ఎంతకని సర్థగలను? ఆయనకి మరీ లేదనకుండా డబ్బులు ఇస్తూ, కడుపు కట్టుకుని అంతో ఇంతో వెనకేస్తూ, ఆఖరికి ఒక స్థలం అయితే కొనిపించగలిగాను.
పుస్తకాలు ముట్టుకున్నా, తీసేసినా పెద్ద భూకంపం వచ్చినట్లు, అగ్నిపర్వతం బద్దలైనట్లు, వీరభద్రుడి అవతారమెత్తుతాడు. మరి మేము చేసే దాంట్లో తప్పేంటో అడిగితే మాత్రం, అర్థం కానట్లు మమ్మల్ని వింత పురుగును చూసినట్లు చూస్తాడు.
ఆయనకంటూ ఆయన లోకానికి, కొత్త ఇంటిలో ఉన్నదే చిన్నస్థలం అంటే నాకు ఆరుగజాలేనా అంటాడు. అదే ఎక్కువ.
ఈ మనిషిని పట్టుకుని ఈ సంసారాన్ని ఈదడం, కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టే! పిల్లలకి ఫీజులకు డబ్బులు లేక, నా ఒంటిపై ఉన్న బంగార మంతా తాకట్టు పెట్టి, గుట్టుగా పరీక్షలకు కడితే, జీతమంతా తీసుకుని నాకు బిచ్చమేస్తావు అంటారు. నేనేమైనా తింటున్నానా? నా మొహం చూస్తే కదా, నేను ఆ బంగారం తాకట్టు పెట్టిన విషయం తెలిసేది! ఏదో ఈ మాత్రం మంగళసూత్రం కూడా ‘ఫలానా ఆయన భార్య మరీ బోసిమెడతో ఉంది’ అను కోకుండా, ఆయన పరువు కోసం ఉంచుకున్నదే తప్ప, నాకోసం కాదు కదా! ఇంత చేస్తున్నా, ఆయనకి ఎప్పుడు ఏమి చేయలేదని నా మీద కోపమే! ఎన్నటికీ నేను ఆయనకు అర్థం అవుతానో?
*   *   *
శాస్త్రిగారి కథనం:
ఆరోజు ప్రభుత్వం కేంద్రసాహిత్య అవార్డులను వెల్లడించింది. అందులో ఆ ఏడాది ఉత్తమ అనువాదగ్రంథం కింద నేను రాసిన, నా ‘రెప్పపాటు స్వప్నం’ ఎంపికైందని తెలియగానే, ఇలా తెలిసిందో లేదో విలేకరులంతా ఇంటిని చుట్టుముట్టారు. అందరూ ఇంటర్వ్యూ తీసుకోవడం, అన్ని పత్రికలు, టీవీ ఛానల్‌ ‌లు నాతో ముఖాముఖికి పోటీ పడడం జరిగిపోయాయి.
ఒకేసారి ఒక సెలబ్రిటీ ఇల్లులాగా ఇల్లంతా ప్రశంసల పరంపర! సరిగ్గా అదే సమయంలో పిల్లలకి కూడా నీట్‌లో రిజల్టస్ ‌వెల్లడించారు. అందులో కవల పిల్లలైన ఇద్దరూ ఒకరు మెడిసిన్‌లో మరొకరు ఇంజనీరింగ్‌లో ఆలిండియా ర్యాంక్‌ ‌సంపా దించారు. దానితో ఇల్లు మొత్తం ఆత్మీయుల ప్రశంసల, వర్షంలో తడిచి ముద్దయ్యింది.
తెల్లవారి పత్రికలో మా నలుగురి ఇంటర్వ్యూ వచ్చింది. అందులో నా ఇంటర్వ్యూలో ‘‘మీకు ఈ అవార్డు రావడానికి మీ వెన్నుతటి్ట ప్రోత్సహించింది ఎవరు?’’ అన్న ప్రశ్న. దానికి నా సమాధానం, ‘‘నా అర్ధాంగి! కేవలం ఆఫీసు, నా వ్యాపకం, వృత్తి, ప్రవృత్తి తప్ప మరో వ్యాపకం లేకుండా నా బాధ్యత, గృహిణి బాధ్యతలు అన్నీ తన భుజస్కంధాల మీద వేసుకొని పిల్లల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వారికి కావలసిన సదుపాయాలు, పుస్తకాలు సమకూరుస్తూ, తెలుసుకుంటూ వారికోసం తన విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, మొత్తం ఇంటి కోసం తాను కొవ్వొత్తిలా కరిగిపోయింది. పిల్లలు కూడా ఎప్పుడు నన్ను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టలేదు. నన్ను నన్నుగా గౌరవించారు కాబట్టే ఈ యజ్ఞాన్ని, నేను కలలుగన్న స్వప్నాన్ని నేను నెరవేర్చుకోగలిగాను. కాబట్టి ఈ అవార్డును నేను నా కుటుంబ సభ్యులకి అంకితం ఇస్తున్నాను’’ అని.
ఇక శ్రీమతికి వేసిన ప్రశ్న, ‘‘ఆయన భార్యగా, మేధావులైన పిల్లల తల్లిగా మీరు ఎలా ఫీలవుతున్నారు?’’ అని.
‘‘నిజానికి ఇది నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన భార్యగా ఉన్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. మొదటి నుండి ఆయన లోకం ఎప్పుడూ పుస్తకాలే! నేను కేవలం రెండవ భార్యను మాత్రమే! ఆయన మెదటి అర్ధాంగి ఆ పుస్తకాలే! అందులో మమేకమైపోతారు. ఇంతటి అవార్డు ఆయనను వరించడానికి నన్ను ఆయన కారణంగా చూపించినా, నిజానికి నేను ఆయనకు చేసింది ఏమీ లేదు. అయినా ఆయన నన్ను అందరి మధ్య ఇంత గౌరవంగా నిలబెట్టినందుకు సర్వదా కృతజ్ఞురాలిని’’ ఆమె సమాధానం.
ఇక పిల్లల సమాధానం, ‘‘అందరి ఇళ్లల్లోగా మాకు కేవలం చదువు మాత్రమే చదువుకోమని ఏనాడు అమ్మానాన్న చెప్పలేదు. మేము ఏది చేసినా అది చేసే వెసులుబాటు ఆ స్వేచ్ఛ మాకు ఇచ్చారు. నాన్న ఎన్నడు మమ్మల్ని ఇదే చదవమని ఇబ్బంది పెట్టలేదు. అమ్మ కూడా అంతే! మాకు ఎవరి రంగాల్లో ఎవరికి ఏది ఇష్టమైతే, అది మేము నచ్చిన అంశంగా ఎంచుకునే అవకాశం ఇచ్చారు. నచ్చిన అంశం కాబట్టి కష్టమైనా ఇష్టంగానే భరించాం. అందుకే అందులో మమేకం కాగలిగాము. అనుకున్నది సాధించగలిగాము’’ అని.
మొత్తానికి అన్నిపత్రికల్లో మాది‘‘ఆదర్శమైన కుటుంబం’’అని రావడం, బంధాల గొప్పతనాన్ని తెలియజేసి నన్ను సంతోషంలో ముంచెత్తడమే కాదు, ప్రపంచంలో ఎనిమిదవ వింతకి గురి చేసింది.

-నామని సుజనాదేవి

వచ్చేవారం కథ..

తాతయ్యగారి పొలం

-శరత్‌ ‌చంద

About Author

By editor

Twitter
YOUTUBE