రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా, ఆనంతరం, పల్నాడు, తిరుపతి, కడప, అనంతపురం జిల్లాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలు సంచలనంగా మారాయి. గత ప్రభుత్వాల కాలంలో కొన్ని చదురు ముదురు సంఘటనలు జరిగినా ఈసారి మాత్రం హింస తీవ్రంగా జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికల నుంచి నిన్నటి సార్వత్రిక ఎన్నికల వరకు హింసాత్మక సంఘటనలు జరగడం మనం చూశాం. అధికారం చేజారిపోకుండా చూసుకోవడం, ప్రతిపక్షాల అభ్యర్థులు పోటీ చేయకుండా బెదిరించడం, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, గూండాయిజం, రౌడీయిజం లాంటి చర్యలకు పోలీసుల సంపూర్ణ సహకారం లభించడం గమనార్హం. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో కూడా అధికారపార్టీ అరాచకం కొనసాగింది. ఎన్నికల కమిషన్‌ ఉన్నా ఆ సంస్థను నిందితులు ఖాతరు చేయడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లను రాష్ట్ర ఎన్నికలసంఘం అదుపు చేయకపోవడంతో ఇప్పుడు కూడా అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ఎన్నికల కమిషన్‌కు గల విశేష అధికారాలు కేవలం రెండు నెలలు మాత్రమేనని, ఫలితాల అనంతరం అందరూ తమచుట్టూ పరి భ్రమించాలని అధికార పార్టీ నుంచి పరోక్ష హెచ్చరికల నేపథ్యంలో, పోలీసు వైఖరిలో మార్పు రాలేదని భావించవచ్చు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హింసాకాండను అదుపు చేయలేక పోయారనే అపవాదు ఎన్నికల కమిషన్‌కు మిగిలింది.

భూములు, ఇసుక, ప్రకృతి వనరులు అధికంగా ఉండి దోపిడీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఎన్నికల్లో ఓడిపోతే ఇప్పటివరకు చేసిన దోపిడికి వీలుండదని భావించి వాటిని తిరిగి చేజిక్కించుకొనేందుకే దొంగ ఓట్లు లేదా రిగ్గింగ్‌కు ప్రయత్నించినట్లు అర్థ్ధమవుతోంది. అధికారం అండవుంటేనే వనరులను దోపిడీ చేయడం సులభం. అందుకే ప్రలోభాలకు గురైన యంత్రాంగం కూడా అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వచ్చారని ఆరోపణలు వచ్చాయి. సమస్యాత్మక నియోజకవర్గాలపై ప్రత్యేక నిఘా పెట్టినా, వెబ్‌కాస్టింగ్‌ ఎన్నికలు నిర్వహించినా హింసను నిరోధించలేక పోయారు. మాచర్లలో టీడీపీ అభ్యర్థి కారు ధ్వంసం చేశారు.

గురజాలలో గుడిసెల దహనం చేశారు. తాడిపత్రిలో ప్రతిపక్షాలకు చెందిన వాహనాలను తగుల పెట్టారు. పుంగనూరులో పోలింగ్‌ ఏజెంట్లను అపహరించారు. ధర్మవరంలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. కుప్పంలో పంటలకు నిప్పు పెట్టారు. కాకినాడలో ఎంఎల్‌ఎ ‌దురుసుగా ప్రవర్తించారు. చంద్రగిరిలో రాళ్లదాడులు జరిగాయి. తెనాలిలో స్థానిక ఎంఎల్‌ఎ ఓటరు సుధాకర్‌పై చేయిచేసుకున్నారు. దర్శిలో మీడియాపై తెగబడ్డారు. గుంటూరులో బెదిరింపులు, విజయనగరం, శ్రీకాకుళంలలో గుండాగిరి చేయడం వంటి సంఘటనలు భయాందోళన కల్గించాయి. దీంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లపై దౌర్జన్యం, వీటికి పోలీసులు వత్తాసు పలకడంతో అధికారపార్టీ ఆగడాలు శ్రుతిమించి పోయాయి.

ఎన్నికలు పూర్తయిన అనంతరం చంద్రగిరి టీడీపీ అభ్యర్థిపై హత్యాయత్నం, టీడీపీ నేత ఇంటిపై తాడిపత్రి ఎమ్మెల్యే మారణాయుధాలతో దాడి, పల్నాడు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం వంటి ఘటనలు చూస్తే వారిలో ఓటమి భయం ఆవహించి దాడులకు తెగబడుతున్నట్లు అనిపిస్తోంది. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని, ప్రత్యర్థులపై నిందారోపణలను, పోలీసుల పక్షపాత వైఖరిని కట్టడి చేయలేకపోయారనే విమర్శలు తలెత్తాయి.

అయిదేళ ్ల నుంచి ఇదే తంతు

ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరగడం అయిదేళ్ల నుంచి జరుగుతూనే ఉంది. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలు, బద్వేలు, కొవ్వూరు అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ఘర్షణలు జరిగాయి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లోనే దొంగ ఓట్లకోసం ఫేక్‌ ఐడీలు సృష్టిస్తే తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం ఏకగ్రీవం పేరుచెప్పి ప్రత్యర్థి పార్టీలు పోటీ చేయకుండా నిలువరించే ప్రయత్నం చేసింది. ప్రత్యర్ధి పార్టీల అభ్యర్థులతో నామినేషన్లు కూడా వేయనీయ లేదు. బెదిరించి, ప్రలోభపెట్టి, రౌడీయిజం, గుండాయిజం చేసి అణచివేసే ప్రయత్నం చేశారు. కొందరిని కిడ్నాప్‌ ‌కూడాచేశారు. అన్ని ఎన్నికల్లోనూ పోలీసులు, అధికార యంత్రాంగం వైసీపీ ప్రభుత్వానికి సహకారం అందించారు. ఎన్నికల రాష్ట్ర ఉన్నతాధి కారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదు మేరకు కొందుకు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఈసారి కూడా సార్వత్రిక ఎన్నికల్లో ఇలాంటి ఘర్షణలు జరగవచ్చని ఎన్‌డిఏ కూటమి భావించి కేంద్ర ఎన్నికల సంఘానికి ముందే పరిస్థితిని విన్నవించింది. దీంతో అధికారపార్టీకి దాసోహంగా పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులను, రిటర్నింగ్‌ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. డీజీపీని కూడా మార్చివేశారు. అయినా కింది స్థాయి పోలీసు అధికారులు, సిబ్బంది మాత్రం వైసీపీ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించారు. పోలింగ్‌ ‌రోజున రిగ్గింగ్‌కు పాల్పడుతున్న వారిని అడ్డుకున్న కూటమి ఏజెంట్లు, కార్యకర్తలపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేశారు. పోలింగ్‌ ‌జరిగిన నాటి నుంచి రెండు రోజుల పాటు పలు హింసాకాండ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 120 చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.

అప్రతిష్ట

గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధప్రదేశ్‌ ‌పోలీసు వ్యవస్థ అప్రతిష్ట పాలవుతోంది. నిజాయతీ, నైపుణ్యం గల సిబ్బందితో పిటిష్టమైన రక్షణ వ్యవస్థగా పేరుండేది. అలాంటిది పోలీసుల చర్యలు వివాదాస్పదమౌతున్నాయి. ప్రజల రక్షణ కోసం పనిచేయాల్సిన పోలీసులు అరాచకాలు చేస్తున్న రూలింగ్‌ ‌పార్టీ నేతలకు ఐదేళ్లుగా వంత పాడుతున్నారు. తమకు పోస్టింగ్‌ ఇచ్చిన అధికార పార్టీ రుణం తీర్చుకునేందుకు ఎన్నికల సమయంలో మరింత దారుణంగా, ఏకపక్షంగా ప్రవర్తించారు. ఫలితమే.. ఎస్‌ఐ ‌నుంచి డీజీపీ వరకు బదిలీలు, ఐపీఎస్‌ల సస్పెన్షన్లు, శాఖాపరమైన విచారణ, ఓ పోలీసు అధికారిపైనే మరో పోలీసు అధికారి విచారణ! ఇతర రాష్ట్రాల్లో లేనివిధంగా, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పోలీసు శాఖకే మాయనిమచ్చగా ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఫలితాల నాడు రోజున గొడవలు లేకుండా చూడాలి

రాష్ట్రంలో పోలింగ్‌ అనంతరం జరుగుతున్న గొడవలపై దృష్టిసారించి శాంతి, భద్రతలను పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి విదేశీ పర్యటనలకు వెళ్లడమేమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పోలింగ్‌ అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగితే వీటిని అదుపు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్‌పై ఉందని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లడం సమంజసం కాదు. సీఎం, మంత్రులే శాంతి, భద్రతలను కాపాడే బాధ్యతను తీసుకోవాలి. రోడ్లపై రాడ్లు పట్టుకుని దండయాత్రలు చేయడం లైవ్‌లో చూశాం. ఈ తరహా దాడులను ఆయా పార్టీల నేతలు నియంత్రించ• •పోవడం, దాడులకు తెగబడిన వారిని పార్టీల నుంచి సస్పెండ్‌ ‌చేయకపోవడం దారుణం. రాష్ట్రంలో పోలింగ్‌ ‌రోజున 144 సెక్షన్‌ ‌విధించినా ఎక్కడా అమలు కాలేదు. రాష్ట్రంలో డబ్బే ప్రధానంగా ఎన్నికలు జరిగాయి. జూన్‌ ‌నాలుగో తేదీ ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి గొడవలకూ ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలి.

-టిఎన్‌. ‌భూషణ్‌

‌వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE