– సంబరాజు లీల (లట్టుపల్లి)

కొత్త ధారావాహిక నవల

‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన


‘అమ్మ’ అన్న పదం నుంచి ‘అద్దెకో అమ్మ’, ‘అమ్మకానికో అమ్మ’ వంటి సరికొత్త మాటలు అక్కడ పుట్టలేదు.

అమ్మ స్థానం ఎంత గొప్పదో చెప్పేందుకు మాత్రం  పెరిగిన విజ్ఞానశాస్త్రం స్థాయిలోనే అది పరిణతి చెందింది. అదో అజ్ఞాతపురి. నాగరికతలకు, నగరాలకు సుదూరంగా ఉన్న చిన్న తాండా. దాని పేరే ‘రేకాని తాండా.’

ఆ తాండాలో ఓ చిన్న ఇంటి ముందు నులకమంచం మీద పడుకున్నది` గీరా. ఇరవైjైుదేండ్లు నిండిన అమ్మాయి. విఫలమయిన వివాహపు కలతలతో, మాతృత్వం గురించి ఆలోచిస్తున్నది. వయసు చిన్నదే! కానీ, గ్రామగ్రామానికి, మారుమూల తెగల్లోకి కూడా చొచ్చుకుపోయిన టీవీల సినిమాలు, సెల్‌ఫోన్ల పుణ్యమా అని లోకాన్ని తెలుసుకున్న వయసది.

పైన, వెన్నెలకురుస్తూ, తోడుగా వస్తున్న మంచుతెరల మధ్య దోగాడే చందమామ. మలినాలు అంటని పసిపాపలా  వాటికతీతంగా తెలిమబ్బుల్ని తప్పించుకుంటూ, ఆకాశంలో తేెలిపోతున్న చందబింబం.

 చూడముచ్చటగా ఉంది.

శ్రీశైల క్షేత్రానికి వంద కిలోమీటర్ల దూరంలో నెలవంకేశ్వరం అనే గ్రామాన్ని ఆనుకుని పెరిగిన అడవుల్లో ఉంది ‘రేకాని తాండా’. పేరుకే అడవి కానీ, దళారులు, కాంట్రాక్టర్ల పుణ్యమా అని కొట్టేసిన చెట్లతో పలచబడిపోయింది.  అటవీ సంపదలు హరించి పోయి, అక్కడిప్పుడు కరవు తాండవిస్తున్నది. ఎక్కువగా చెంచులు, లంబాడీలు నివసించే ప్రాంతమది.

గీరా ఆకాశాన్ని చూస్తూ ఒత్తిగిల్లింది. గీరా తండ్రి భీమ్లా నాయక్‌. తల్లి తక్యా. వారికి ఏడుగురు కొడుకులు! గీరా ఒక్కతే ఆడపిల్ల. ఆ తాండాలోనేె ఎక్కువగా మగపిల్లలున్నారు. గీరా అమ్మమ్మది ముందుతరం నుంచి కూడ ‘మాతృస్వామ్య వ్యవస్థే!’ గీరా అమ్మమ్మ చుక్య. ఆ సమాజానికి మహారాణి లాంటిదే. ఆమె మాటంటే నాడు తాండా మొత్తానికి శిలాశాసనం. ఆమె ముందు తరాల్లో కూడా  స్త్రీయే నాయకురాలిగా, అధినాయకురాలిగా ఆ సమాజాలు కొనసాగాయి. ఆ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడి నుంచో వచ్చిన  నాగరికత నీలినీడలు తాండాల జనాలని పట్టణాలకు తరలించాయి. ఆ పట్టణాలు పల్లెల్ని ముంచుతున్నాయి. అక్కడితో ఆగకుండా నాగరిక సమాజాలకు దూరంగా ఉన్న మారుమూల గిరిజన సమాజాల్లోకి పాకి, వారి జీవన విధానాన్ని ఛిద్రం చేస్తూ వచ్చాయి.

ఇప్పుడక్కడ కూడా కలర్‌ టీవీలు, మోటారు బైకులు, ఆటోలు, కాస్త ధనవంతులయిన వారికి కార్లు కూడ వచ్చాయి. వాటితోపాటు నేడు అంతటా కనిపించే అవినీతి వ్యవహారాలు, అక్రమాలు కూడా అక్కడికి చేరుకున్నాయి.

ఆడపిల్లల్ని ‘కొండదేవర’గా ‘అమ్మ’గా పూజించేవారు. ఇప్పుడు మాత్రం  అప్పుడప్పుడూ, అక్కడక్కడా మైనర్‌ బాలికల మీద అత్యాచారాలు చేయటం మొదలయింది. అయితే, ఆ తెగల్లో స్త్రీలపై బలప్రయోగం చేయటం ఆచారం, అతి సహజమన్నట్లు చలామణి అయిపోతూ, అవేమీ వెలుగు చూడలేకపోయాయి.

చాలామంది పట్టణాలకు ‘వలస’వచ్చి, అక్కడి జీవితాలకు అలవాటుపడ్డారు. అంతటితో ఆగలేదు. కేవలం ‘ఓలి’తో జరిగిపోయే పెళ్లిళ్లకు, వరకట్నాల పేరిట లక్షలు వసూళ్లు చేయడం వంటివి కూడా జరుగుతున్నాయి.

నాగరీక సమాజాన్ని చూడడం వల్ల ఆడపిల్లల చదువులు, ప్రేమ వివాహాలు కూడా వచ్చాయి. చిట్టచివరికి, అతిదారుణమైన ఆడశిశువుల్ని గర్భాల్లోనే చిదిమి వేయటం వచ్చేసింది. అయితే, అది దురాచారమని, రాక్షస కృత్యమని, మానవీయ విలువలకు మాయనిమచ్చలని తెలియకుండానే అవన్నీ గిరిజన సమాజాల్లోకి చొరబడ్డాయి.

అందుకు ఫలితమే అక్కడా ఆడపిల్లలకు కరవేర్పడిరది. మగపిల్ల లెక్కువయ్యి ఒకే స్త్రీ పై అత్యాచారాలు చేసేందుకు ఇద్దరు ముగ్గురు యువకులు బయలు దేరుతున్నారు. అయితే, వారివి వ్యవసాయిక కుటుంబాలు. లేదా అటవీ సంపదను సేకరించుకునే కుటుంబాలు. దాంతో అలాంటి తేడాలు అంతగా పట్టవు. అసలు వాటి గురించి వాళ్లు ఆలోచించరు.

ఆ కారణమే ఆ కుటుంబాల్లో గీరాను చదువుకున్న యువతిగా నిలబెట్టింది.

అయితే, గీరాకు ఆరాత్రి నిద్రను దూరంచేసింది అది కాదు.

* * * * *

అది ‘పృథ్వీ ప్రతిసృష్టి’ సూపర్‌ స్పెషాలిటి హాస్పిటల్‌.

ఎత్తయిన బిల్డింగ్‌పైన మిలమిలా మెరుస్తూ కనిపిస్తున్నాయి అక్షరాలు. దాని పార్కింగ్‌ నిండా ఖరీదయిన కార్లు.

ఉష, అనిరుద్‌లు దానిముందు కారు దిగారు.

అనిరుద్‌ కారుని ‘వాలెట్‌ పార్కింగ్‌’ కిచ్చి వచ్చాడు. ముప్పయి సంవత్సరాల ఉష ఖరీదయిన సిల్క్‌ చీరలో, దానికి మ్యాచయిన నగలతో, తన వయసును దాచుకుంటున్నట్లుగా ఉంది.

అనిరుద్‌ భార్య భుజం మీద చేయి వేసి నడిపిస్తూ, ఆమెకు ధైర్యాన్నిస్తున్నట్లుగా, హాల్లోకి తీసుకొచ్చి రిసెప్షన్‌లో తన విజిటింగ్‌ కార్డిచ్చాడు.

రిసెప్షనిస్టు మౌనిక దాన్ని చూసింది.

‘‘ఆరకిల్‌ కంపెనీ మేనేజర్‌ ఆఫ్‌ ఇండియా!’ చకచకా కంప్యూటర్‌లో కొట్టి ‘‘ఓ ఉషా అనిరుద్‌. మీ అపాయింట్‌మెంట్‌ ఇప్పుడే ఉంది. రెండు నిమిషాల్లో పంపిస్తాను’’ అంది.

ఇద్దరూ అక్కడున్న ఖరీదయిన సోఫాల్లో కూర్చున్నారు నమ్రతగా. యూనిఫాం వేసుకున్న ఓ అమ్మాయి, మినరల్‌వాటర్‌, కాఫీ, బిస్కట్స్‌ అందించింది.

మౌనిక, డాక్టర్‌ వరదతో మాట్లాడిరది. వెంటనే వారివద్దకొచ్చి ‘‘రండి!’’ అంటూ తీసుకువెళ్లి, లిప్ట్‌ వద్ద నిలబెట్టింది. అక్కడ అంతకన్నా ఎక్కువ మర్యాదగా రిసీవ్‌ చేసుకున్న అతను, వారిని మూడో అంతస్తులో దించితే, అక్కడ తెల్లటి సిల్క్‌ చీర కట్టుకున్న అమ్మాయి వారిని తీసుకుని, డాక్టర్‌ వరద ముందుకు నిలబెట్టింది.

‘పృథ్వీ’ ప్రతిసృష్టి’` అదొక సంతాన సాఫల్య కేంద్రం. అక్కడ డాక్టర్‌ వరద, పని చేస్తుంటుంది అనడం కన్నా, ఆ హాస్పిటల్‌లో  ఆమె తన కలలని సాకారం చేసుకుంటున్నదని అనాలి. ఆమె చదువు, వ్యక్తిత్వం, ఆమె శాస్త్రీయ దృక్పథాన్ని, రెండు చేతుల్లో ఎత్తి పట్టుకున్నట్లు, ‘పృథ్వీ ప్రతిసృష్టి’ కేంద్రాన్ని నడిపిస్తుంటుంది.

‘‘చెప్పండి!’’ వెన్నెలలాగ నవ్వుతూ ప్రశ్నించింది డాక్టర్‌ వరద.

అనిరుద్‌ తమ సమస్య వివరాలు చెప్పే ప్రింటవుట్‌ ఆమె చేతికందించాడు. అతని డెజిగ్నేషన్‌తో అది ప్రారంభమయింది.

అనిరుద్‌ ఓ గొప్ప కంపెని మేనేజర్‌. ఆ మల్టీనేషన్‌ కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉన్నాడు. నెల తిరిగేసరికి లక్షల రూపాయలు బ్యాంకులో పడతాయి.

చూడముచ్చటయిన జంట ఉషా, అనిరుద్‌. మంచి ఆరోగ్యవంతమయిన దేహాలు.

 ముందు మూడేండ్ల వరకు పిల్లలు వద్దనుకున్నారు. జీవితంలో స్థిరపడాలనీ, సోషల్‌ స్టేటస్‌ సాధించాలనీ, ముఖ్యంగా జీవితాన్ని అనుభవించాలనీ.

అవన్నీ తీరాయి. ఇప్పుడు పిల్లలు కావాలని మూడు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు. కాని సక్సెస్‌ కావటంలేదు. ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు. ఇప్పుడు డాక్టర్‌ వరద అపాయింట్‌మెంట్‌ కోరారు.

 అదీ విషయం.

విషయం చదివి ‘‘ఓకే. నేను కొన్ని టెస్టులు రాస్తున్నాను. అవి చేయాలి. ఆ తరువాత మీ సమస్యకు సమాధానం వస్తుంది’’ చెప్పింది.

‘‘ముందు, మీలో ‘అండం’ సరిగా విడుదలవు తున్నదా? రెండు, మీ భర్త వీర్యంలో ఆరోగ్యవంత మైన శుక్రకణాల శాతం ఎంత? ఈ విషయాలు అవసరం!’’ చెప్పింది మళ్లీ డాక్టర్‌ వరద.

‘‘ఆ టెస్టుల రిపోర్టులున్నాయి!’’ అంటూ  చూపించాడు అనిరుద్‌. వాటి ప్రకారం అనిరుద్‌ వీర్యంలో డెబ్బయి శాతం శుక్రకణాలున్నాయి. ఆరోగ్యంగా చైతన్యంతో ఉన్నాయి. అయితే, ఉషలోనే లోపం. ఆమె తల్లి కావటానికి అనర్హురాలని చెబుతున్నాయి.

‘‘ఉషగారూ!  కారణం తెలియదు కానీ, ఇన్‌ఫెక్షన్‌ వల్ల కావచ్చు. మీలో విడుదలయిన అండాల్ని, అండవాహికలు మోసుకుని శుక్రకణంతో కలిసి, ఫలదీకరణకు సిద్ధంగా లేవు. మీ భర్తలో లోపం లేదు. మీలో అండాలు సరిగానేె విడుదలవుతున్నాయి కానీ, ఆ అండాల్లో, పిండానికి, పిండం సరిగా ఎదగటానికి పనికి వచ్చే పార (టిష్యు) నిలబడటం లేదు.

‘‘వీర్యకణంతో కలిసినపుడు అది గట్టిపడి గర్భాశయంలో పెరగాలి. దానికనువుగా గర్భాశయ గోడలు గట్టిపడి, శిశువు ఎదగటానికి అనుగుణంగా పెరగాలి. కాని, అది జరగటంలేదు!’’ చెప్పింది, రిపోర్టులు తీక్షణంగా చూస్తూ.

ఉష ఒక్కసారిగా ఏడ్చేసింది.

‘‘బి రిలాక్స్‌ ఉషా! సాధారణంగా మనిషిని దేవుడు అద్భుతశక్తితో సృష్టించాడు. ఒక్కసారి మీ శరీర నిర్మాణం గురించి ఆలోచించండి! నవరంధ్రాలతో, రక్త మాంసాలతో, మలమూత్రాలతో నిండిన దేహానికి, అందమైన నాసిక, చెవులు, పెదవులు, తలవెంట్రుకలు, చేతులు, కాళ్లు వీటితో చర్మపు పొరను కప్పి ఉంచకపోతే, మనమెలా ఉండేవాళ్లం?  ఇన్ని ఇచ్చిన ఆ భగవంతుడికి కృతజ్ఞత చూపకుండా, అంతా నా సామర్థ్యం, నా మేధయేన విర్రవీగుతున్నాం. ఈనాడు సృష్టికి ప్రతిసృష్టి చేయగల విజ్ఞానం మనకున్నా కూడా, కంటికి కనిపించని శక్తి ఏదో ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందంటే మాత్రం ఒప్పుకోలేకపోతున్నాం. భగవంతుడు మనకందించిన ఈ సృష్టి మూలకాన్ని, మనమెందుకు చేతుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది?

‘‘దానికి కారణం, విజ్ఞానాన్ని పెంచుకుంటూ, ప్రకృతిని అలక్ష్యం చేయటంతో రేడియేషన్‌, గాలి, శబ్దకాలుష్యం లాంటి సమస్యలతో మానవ జాతి ఆరోగ్యంలోనే  అసమతౌల్యం ఏర్పడిరది. ఫలితమే ఈ సమస్యలు ఉషా! బాధపడకండి, ప్రతి సమస్యకి ఒక ముగింపు ఉంటుంది!’’ ఓదార్చింది డాక్టర్‌ వరద.

ఇద్దరూ ఇంటికి బయలుదేరారు.

* * * * *

పృథ్వి ప్రతిసృష్టి – సూపర్‌స్పెషాలిట్‌ ఆసుపత్రి.

ఆ అందమైన, అనుకూలమైన లేబర్‌ రూమ్‌ (పురిటిగది)లో కుంతల పురిటి నొప్పులు పడుతున్నది. నొప్పులతో ఆమె గొంతు ఎంత పెగిలినా అది లేబర్‌రూమ్‌ దాటడం లేదు. రక్తసిక్తమైంది మంచం. ఆమె నీలాలకళ్లు ధారాపాతంగా కన్నీళ్లు రాలుస్తున్నాయి.

మూసుకున్న ఆ రెప్పల కింద కళ్లు మూగ వేదనను అనుభవిస్తున్నాయి. ఆ నొప్పులు తొమ్మిది నెలల తరువాత నవశిశోదయానికైతే ఆమె ఎంత ఆనందపడేదో! కానీ…

కోరికల ఉప్పెన ముంచెత్తి కన్యాత్వాన్ని అర్పించినపుడు పొందిన సంతోషం గుర్తులేదు కానీ… ఆ ఆనందం ఫలితంగా రూపుదిద్దుకున్న పసిప్రాణి, బలవంతంగా, నొప్పి తెలియని మందులతో విచ్ఛిన్నమవుతుంటే పడే వేదన మానవత్వాన్ని బద్దలు చేస్తున్నది. పూర్తిగా ఎదగని ఆ నవశిశువు, ఆ చిన్న గర్భసంచిలో ఉమ్మనీటి ఉయ్యాలలూగుతున్న తరుణంలో, తనవైపు దూసుకొస్తున్న, మారణాయుధాన్ని తప్పించుకుంటూ పరుగుదీస్తున్నది.

పెరిగిపోయిన శాస్త్ర విజ్ఞానం, విశృంఖల మౌతున్న రాక్షసత్వానికి ఊపిరి పోస్తూ ఆ పసిప్రాణాన్ని మూలమూలలకు తరిమికొడుతూ, చివరికి తన కొక్కెంతో పట్టుకుంది.

(సశేషం)

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram