ఎన్నో భయాందోళనలు, ఉత్కంఠ పరిణామాల మధ్య పాక్‌ ఎన్నికలు ముగిశాయి.  మార్చి మొదటి వారంలో షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరనుంది. సైన్యం, ఇతర రాజకీయ పక్షాలు మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పిటిఐ)ని బలహీనపరిచేందుకు సర్వశక్తులు ఒడ్డినా, పీటీఐ మద్దతుదారులు స్వతంత్రులుగా నిలబడి తమ సత్తా చాటారు. మరోవైపు ఆర్థిక సంక్షోభం, ఇతర సామాజిక అంశాలు అభద్రతను పెంచుతున్న నేపథ్యంలో  కొత్త ప్రభుత్వం గట్టెక్కటం కష్టమే అని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.


పాకిస్తాన్‌లో తాజా రాజకీయ పరిణామాలను చూస్తున్న వారంతా ‘ఇల్లు అలకగానే పండగ కాదు’ అంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో నవాజ్‌ షరీఫ్‌ తదుపరి ప్రధాని అవుతారని భావించినా, షెహబాజ్‌ షరీఫ్‌ను కూటమి కొత్తగా నేతగా నియమించారు. నవాజ్‌ షరీఫ్‌, ఆయన పార్టీ పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) అత్యధిక స్థానాలను గెలుచు కోవచ్చని ఎన్నికలకు ముందు, రాజకీయ విశ్లేషకులు భావించారు. సర్వేలు కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాయి.

ఈ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులు 101 సీట్లను గెలుచుకోగా, వారిలో 93 మంది ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పీటీఐ మద్దతుదారులే. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌(నవాజ్‌) 75, పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ 54, ఎంక్యూఎం పాకిస్తాన్‌ 17 సీట్లు గెలుచుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ఏ పార్టీకి మెజార్టీ రాలేదు.షెహబాజ్‌ నేతృత్వంలో ఏర్పడే పై మూడుతో పాటు ఇతర చిన్న పార్టీలు ఉన్నాయి. అయితే ఇది బలహీనమైన సంకీర్ణం అని ఇమ్రాన్‌ పార్టీ వ్యాఖ్యానించింది.

తగినంత మెజార్టీ లేకపోవటంతో నవాబ్‌ పదవి చేపట్టడంలేదని ఆయన మద్దతుదారులు చెబుతుండగా, దాని వెనుక రాజకీయ వ్యూహం ఉందని రాజకీయనిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వంలో అస్థిరత ఏర్పడినప్పుడు వెనుక ఉండి చక్రం తిప్పే అవకాశం ఉందని అంటున్నారు.

కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు

షెహబాజ్‌ షరీఫ్‌ పదహారు నెలల పాటు (ఏప్రిల్‌ 2022-ఆగస్టు 2023 )వరకు ప్రధానమంత్రిగా పనిచేసిన కాలంలో పాక్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఐఎంఎఫ్‌ నుంచి, ఇతర దేశాల నుండి సహాయం ఉన్నప్పటికీ కోలుకునే సూచన కనిపించలేదు. ఎగుమతులు తగ్గుతూ దిగుమతులు పెరిగాయి. దేశ ఆర్థికవ్యవస్థ తొలిసారిగా కుంచించుకుపోయింది. ప్రభుత్వ వ్యయాలను అరికట్టడానికి, పన్ను నెట్‌ను విస్తరించడానికి, సబ్సిడీలను తొలగించడానికి ఐఎంఎఫ్‌ నుంచి పెరుగుతున్న ఒత్తిడి మధ్య ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం కఠినమైన సవాలుగా మారుతోంది. ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి అతనికి పెద్దగా అవకాశాలు ఉండకపోవచ్చు అనే అభిప్రాయం వినిపిస్తోంది. కూటమి భాగస్వాముల మధ్య బందీగా ఉండవలసి రావటం వల్ల బలమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇబ్బంది అవుతుందని అంటున్నారు.

 కొత్త ప్రభుత్వానికి భద్రతా సమస్యలు మరో సవాలు. గత రెండేళ్లలో ఉగ్రదాడులు అనేక రెట్లు పెరగడమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్‌తో సంబంధాలు క్షీణించాయి. 2023లో ఉగ్రవాద దాడులు 70 శాతం పెరిగాయి. రెండు ప్రావిన్స్‌లు కేపీలో 39.5 శాతం, బలూచిస్తాన్‌్‌లో 42.9 శాతం మాత్రయ ఓటింగ్‌ నమోదైంది. కేపీలోని ఒక జాతీయ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికలు ఒక అభ్యర్థి హత్య కారణంగా రద్దు చేయబడ్డాయి.

ప్రభుత్వం తన రాజకీయ మనుగడ కోసం సైన్యంతో కలిసి పనిచేయాలి. పీఎంఎల్‌,పీపీపీలు ఒకప్పుడు సైన్యాన్ని దూరంగా ఉంచాలనే ఒప్పందం చేసుకున్నాయి. .ఎన్నికల ఫలితాలను తిరస్కరించిన పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ), జమాత్‌ ఉలేమా ఇస్లాం`ఫజల్‌ (జేయూఐ-ఎఫ్‌) పాలనా వ్యవహారాలకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. అంతంత బలంగల ప్రభుత్వం ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి ఐక్య విధానాన్ని తీసుకురాలేకపోవచ్చు.

షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా అనే దానిపై చాలామంది రాజకీయ నాయకులు, వ్యాఖ్యాతలు, అంతర్జాతీయ పరిశీలకులు చివరి క్షణం వరకు సందేహంతోనే ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానం జోక్యం తర్వాతే తేదీ నిర్ణయమైంది. ఆగస్టు 2023లో ప్రభుత్వం రద్దు కాగా, దేశ రాజ్యాంగం ప్రకారం, మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. అయితే, తాజాగా జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల విభజనకు కొంత సమయం పట్టింది.

పోలింగ్‌కు ఒక్క రోజు ముందు బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో రెండు భీకర బాంబు దాడులు జగరగా, 22 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. పిషిన్‌ జిల్లాలోని ఖెనుజాయ్‌ ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థి కార్యాలయం ఎదురుగా జిరిగిన దాడిలో 14 మంది మృతి చెందారు. 35 మంది గాయాలపాలయ్యారు.అక్కడికి 50 కి.మీ. దూరంలో ఖిల్లా సైఫుల్లా జిల్లాలో జరిగిన దాడిలో ఎనిమిది మంది చనిపోయారు.

ఇమ్రాన్‌ ఎత్తులు.. షరీఫ్‌ వ్యూహాలు

రాజకీయాల్లో తిరిగి రావడానికి షరీఫ్‌ సైన్యంతో ఒప్పందం చేసుకున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. నవాజ్‌ షరీఫ్‌ విదేశాల్లో ఉన్నప్పుడు తరచుగా సాయుధ బలగాలకు వ్యతిరేకంగా గొంతెత్తేవారు. దేశంలోని రాజకీయ అస్థిరతకు ముఖ్యంగా ఐఎస్‌ఐ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ మాజీ హెడ్‌, మాజీ ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ను నిందించారు. న్యాయవ్యవస్థను కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. న్యాయమూర్తులు కుమ్మక్కయ్యారని, బోగస్‌ కేసులకు తాను బాధితుడిగా మారినట్లు వ్యాఖ్యానించారు. స్వదేశానికి తిరిగి వచ్చినప్పటి నుంచి ఆయనకు చట్టపరంగా చాలా ఉపశమనాలు దక్కాయి. దీన్నిబట్టే ఆయనకు మిలిటరీ మద్దతు ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ పాలనకాలం అల్లకల్లోలంగా సాగింది. మిలిటరీతో ఆయన సంబంధాలు చెడిపోయాయి. 2022లో పార్లమెంట్‌ అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఇమ్రాన్‌ ఖాన్‌ పదవీ నుంచి తప్పుకోవడంతో నవాజ్‌ షరీఫ్‌ తమ్ముడు షాబాజ్‌ షరీఫ్‌ బాధ్యతలు స్వీకరించారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ పతనం తర్వాత నుంచి షరీఫ్‌ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు రాజకీయ కార్యకలాపాలను వేగవంతం చేశారు. ఆయనను పదవీచ్యుతుడిని చేసిన మిలటరీ మళ్లీ స్వాగ తించడంతో ఆయనపై ఉన్న కేసులన్నీ కరిగిపోయాయి. ఆయన 1990లో ఆయన మొట్టమొదటగా ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి ప్రతిపక్ష నేత బెనజీర్‌ భుట్టో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా 1993లో ఆయనను తొలగించారు.

1997లో మళ్లీ ప్రధానమంత్రి అయ్యి రాజకీయాలను శాసించేలా కనిపించారు. రెండేళ్లకు (1999) ఆయన ప్రభుత్వాన్ని ఆర్మీ చీఫ్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ కూలగొట్టారు.హైజాకింగ్‌, తీవ్రవాదం ఆరోపణలపై అరెస్ట్‌ చేసి జీవితఖైదు విధించారు. అవినీతికి పాల్పడ్డారంటూ రాజకీయ కార్యకలాపాల నుంచి జీవితకాల నిషేధం విధించారు. షరీఫ్‌తో పాటు ఆయన 40 మంది కుటుంబ సభ్యులను పదేళ్ల పాటు సౌదీ అరేబియాకు బహిష్కరించారు. 2007లో పాకిస్తాన్‌కు తిరిగొచ్చేవరకు ఆయన రాజకీయ జీవితం నెమ్మదించింది. తర్వాత ప్రతిపక్షంలో ఓపికగా వ్యవహరించారు. 2008 ఎన్నికల్లో ఆయన ఆతని పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ పార్లమెంట్‌లో నాలుగింట ఒక వంతు సీట్లను గెలుచుకుంది.

2013 ఎన్నికల్లో విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ నుంచి ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నికల్లో షరీఫ్‌ రిగ్గింగ్‌ చేశారని ఆరోపిస్తూ ఇస్లామాబాద్‌లో పీటీఐ పార్టీ ఆరు నెలల పాటు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. 2016లో పనామా పేపర్ల లీకేజీ పైన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆయన అవినీతికి పాల్పడినట్లు నిర్ధారిస్తూ పాకిస్తాన్‌లోని ఒక కోర్టు జులై 6, 2018న పదేళ్ల జైలు శిక్ష విధించింది. భార్యకు లండన్‌ చికిత్స జరుగుతున్నందున ఆయన అప్పట్లో అక్కడే ఉన్నారు.

ఈ ఎన్నికల ఫలితాలు ఇమ్రాన్‌ ఖాన్‌ పీటీఐ పార్టీకి గల ప్రజాదరణ సోషల్‌ మీడియా బబుల్‌ కాదని, నిజమైనదేనని స్పష్టం చేశాయి. ఎన్ని అవరోధాలు సృష్టించినా ప్రజలు పెత్తఎత్తున ఓటు హక్కు వినియోగించుకుని ఇమ్రాన్‌ ఖాన్‌కు మద్దతు పలికారు. ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం లేకపోవటంతో పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. ఉమ్మడి బ్యాట్‌ గుర్తును ఎన్నికల కమిషన్‌ లేకుండా చేసింది. ఇన్ని అవరోధాల మధ్య వర్చువల్‌ ర్యాలీల ద్వారా ఇమ్రాన్‌ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇది అద్భుతమైన ప్రభావాన్ని చూపింది.పార్టీ అధికారిక ట్విటర్‌ (ఎక్స్‌), టిక్‌టాక్‌ ఖాతాలకు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. పాకిస్తాన్‌లోని మిగిలిన ప్రధాన రెండు పార్టీలైన పీపీపీ, పీఎంఎల్‌-ఎన్‌ల కన్నా కూడా ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇతర నాయకులతో పోలిస్తే ఇమ్రాన్‌ఖాన్‌ వ్యక్తిగత సోషల్‌ మీడియా అకౌంట్లకు ఫాలోవర్ల సంఖ్య భారీగా ఉంది. నేరుగా సందేశం ప్రజలకు చేరేందుకు ఇది అవకాశంగా మారింది.

 ఎన్నికల కమిషన్‌ బ్యాట్‌ గుర్తును కేటాయించకపోయినా, ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించి, ఆయా స్థానాల వారీగా అభ్యర్థులు, వారికి ఎన్నికల కమిషన్‌ కేటాయించిన గుర్తుల వివరాలను ఒకేచోట ఉంచారు. పాకిస్తాన్‌ జనాభాలో 30% మాత్రమే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.అందువల్ల పీటీఐ వారిని చేరుకోవడంలో పరిమితులు ఉన్నాయని అంతా అంచనా వేశారు. అందరి అంచనాలు తల్లకిందులయ్యాయి. సైన్యం చివర్లో రిగ్గింగును ప్రోత్సహించి ఫలితాలను తారుమారు చేసింది.

ఈ ఎన్నికల్లో గెలిచిన ఓ అభ్యర్థి తన గెలుపు రిగ్గింగ్‌ వల్లనే అని సంచలనాత్మక ప్రకటన చేశారు. ఇమ్రాన్‌ పార్టీపై నిషేధం విధించటంతో స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగిన వారిలో నయూమ్‌ ఉర్‌ రహ్మాన్‌ ఒకరు. తనకు 26 వేల ఓట్లు వచ్చాయని, తనతో పోటీ పడిన సైఫ్‌ భారీకి 31వేల ఓట్లు వచ్చాయని, కానీ తర్వాత సైఫ్‌కి 11వేల ఓట్లు వచ్చినట్టు ప్రకటించారని పేర్కొన్నారు. రెహ్మాన్‌ ఆరోపణలను ఎన్నికల కమిషన్‌ తోసిపుచ్చింది. రిగ్గింగ్‌ ఆరోపణలపై వచ్చిన పిటీషన్‌ 2018ను పాక్‌ సుప్రీంకోర్టు కొట్టేసింది. అంతేకాదు. ఈ పిటీషన్‌ దాఖలు చేసిన మాజీ ఆర్మీ ఆఫీసరుకు జరిమానా కూడా విధించింది. మరోవైపు పోల్‌ రిగ్గింగు ఆరోపణలపై విచారణ చేపట్టాలని యూఎస్‌, ఈయూ డిమాండ్‌ చేస్తున్నాయి.

72 ఏళ్ల షెహబాజ్‌ షరీఫ్‌ పాక్‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్నారు. మరోవైపు మార్చి 9వ తేదీలోగా కొత్త అధ్యక్షుని ఎంపికకు రంగం సిద్ధం చేస్తున్నారు. పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ కో- ఛైర్‌ పర్సన్‌గా ఉన్న అసీప్‌ ఆలీ జర్దారీ (68) అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు బిల్వాల్‌ పార్టీ, నవాబ్‌ పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దింపాలని నిర్ణయించాయి. అధికార ఒప్పందంలో షెహబాజ్‌ ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇచ్చినందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. 265 స్థానాలున్న పాక్‌ పార్లమెంటులో అధికారం చేపట్టటానికి 133 స్థానాలు సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఫిబ్రవరి 8వ తేదీన నిర్వహించిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాని పరిస్థితుల్లో సంకీర్ణం అనివార్యమైంది. వివిధ పార్టీల కలగూరగంపలా ఉన్న ప్రభుత్వం ఏ తీరులో ముందుకు సాగుతుంది, సవాళ్లను అధిగమిస్తుందని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగవలసిందే.

– డాక్టర్‌ పార్థసారథి చిరువోలు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
Instagram