కళాకారులలో ఎక్కువ తక్కువలు ఉండవు. ఎవరి ప్రత్యేకత వారిది. కాకపోతే ఒక్కొక్క విభాగంలో కొందరు విశిష్ట సేవలు అందించినవారు ఉంటారు. వారిని సముచిత రీతిన గౌరవించుకోవడం, స్మరించుకోవడం కనీస ధర్మం. అలాంటిదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ‘నంది/సింహ’పురస్కార అంశం. గత ప్రభుత్వం అప్పటి వరకు ఉన్న ‘నంది’ని ‘సింహం’గా మార్చి, దానినీ పక్కన పెడితే, ప్రస్తుత ప్రభుత్వం ‘గద్దర్‌’ ‌పేరును తెరపైకి తెచ్చింది.

సినీ, టివీ రంగస్థల కళాకారుల అత్యున్నత ప్రతిభను గౌరవిస్తూ ఉమ్మడి ఆంధప్రదేశ్‌ 1964‌లో నంది పురస్కారాలను ప్రవేశపెట్టింది. తెలుగులో ఉత్తమ చిత్రాలను, నటులు, ఇతర కళాకారులును గుర్తించి ఈ పురస్కారంతో సత్కరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. తెలుగు భాషలో ఉన్నత సాంకేతిక నైపుణ్యం, సాంస్కృతిక, విద్యా, సామాజిక ఔచిత్యంతో కూడిన కళా సౌందర్య విలువలతో (వ•ష్ట్రవ•ఱమీ ఙ•శ్రీబవ) కూడిన చిత్రాల నిర్మాణాన్ని, దేశ సమైక్యత ప్రోత్సహించడం ఈ పురస్కారం ఉద్దేశం. ఉగాదినాడు ప్రజా సమక్షంలో నిర్వహించే కార్యక్రమంలో వీటిని అందచేసేవారు.
ఉత్తమ చిత్రాలు, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, పిల్లల సినిమాలు, ఫీచర్‌ ‌ఫిల్మ్‌లు, జాతీయ సమగ్రతపై ఫీచర్‌ ‌ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీ ఫిల్మ్‌లు, విద్యా సంబంధిత చిత్రాలు, బాలల చిత్రాలు తెలుగు సినిమాపై పుస్తకాలు/కథనాల విభాగాల్లో ఈ పురస్కారాలను బహూకరించేవారు. ఇవి సాధారణంగా బంగారు, వెండి, కాంస్య నందుల రూపంలో ఉండేమి.
రాష్ట్ర విభజనతో ఏర్పడిన తెలంగాణలో నంది పురస్కారం బదులు ‘సింహ’ పేరుతో పురస్కారాలు అందచేస్తామని బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది కానీ కార్యరూపం దాల్చలేదు.
తెలుగు సినీ, రంగస్థల, టీవీ రంగాలకు సంబం ధించి ఫ్రభుత్వ పురస్కారాలు గగనకుసుమాల య్యాయి. మినీస్టార్లు మొదలు మెగాస్టార్లు, స్టూడియోలు, సాంకేతిక నిపుణులతో భాగ్యనగరం కళకళలాడుతున్నా పురస్కారాల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం కళాకారు లకు కలత కలిగిస్తోంది. తెలుగు సినిమా అంచెలంచె లుగా ఎదుగుతున్నప్పటికి తెలంగాణ ప్రభుత్వం మాత్రం అవార్డులకు ఆమడదూరం ఉండడం శోచ నీయం. సినిమా రంగం అనగానే ‘‘తెలంగా ణేతరులు’’ అనే సంకుచిత మనస్తత్వం ఉండటం ఆశ్చర్యం!! కళామతల్లికి అందరూ ఒక్కటే.. కదా!!
ఇకపోతే పురస్కార చిహ్నం గురించి ఆలోచిస్తే… ‘నంది’ని కళకు ప్రతీకగా భావించాలి. వేల సంవత్సరాల క్రితమే వెలువడిన భరతముని ‘నాట్యశాస్త్రం’లో నంది ప్రస్తావన ఉంది. ‘నంది’ అందరివాడు అన్న స్పృహ కలిగి ఉంటే మంచిది. ఆయన (నంది) ఆంధప్రదేశ్‌ శ్రీ‌కాళహస్తి, ద్రాక్షారామం, శ్రీశైలం తదితర క్షేత్రాల్లోనే కాదు.. చారిత్రాత్మకమైన వేయి స్తంభాల గుడిలో, రామప్ప గుడిలోనూ ఉన్నాడు. చివరికి మేడారంలో కూడా ఉన్నాడు. అవతలి వారు ‘ఎద్దు అంటే మనం మొద్దు’ అనే వాదాన్ని ‘గబ్బిలంలా పట్టుకొనేవారు తెలుగు సంస్కృతికి దూరమై సంకుచితత్వానికి దగ్గరవు తున్నారు. అదే హిందీ భాషా రాష్ట్రాలెన్ని ఉన్నా వారంతా ఒకే సంస్కృతికి కట్టుబడి ఉంటారు.
ఇదిలాఉంటే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి ఇటీవల ఎమోషనలై ‘నంది’కి సమాంతరంగా ‘గద్దర్‌’ ‌పేరిట అవార్డును ప్రకటించారు. సాహిత్యం జానపద కళల పరంగా ఆయన పేరిట పురస్కారం ఎంతో సముచితమైనదే. కానీ సినిమా రంగానికి సంబంధించి ఆయన పేరు నంది అవార్డుకు ప్రత్యా మ్నాయం ఎలా అవుతుంది? సినీ, టి.వీ రంగాలకు గద్దర్‌ అం‌దించిన సేవ ఎంత? అని ప్రశ్నించినపుడు ఒక్క ‘మాభూమి’ వంటి అభ్యుదయ చిత్రాలలో పాటలు రాయడం లేదా పాడడం మినహా ఆయన చేసిందేమి లేదు. తనకు తొలిసారి వచ్చిన నంది పురస్కారాన్నే తిరస్కరించారు.తరువాత రెండవసారి (1996) మాత్రం సమ్మతించి స్వీకరించారు. అసలు గద్దర్‌ ‘ఐడియాలజీ’యే వేరు.
తెలంగాణా ప్రాంతం నుంచి తెలుగు సినిమాకు కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన మహనీయులున్నారు. నటులు, నిర్మాతలు డాక్టర్‌ ఎం.‌ప్రభాకరరెడ్డి, టి.ఎల్‌. ‌కాంతా రావు, త్యాగరాజు మొదలైన వారు తెలంగాణీయులే. కరీంనగర్‌ ‌జిల్లా కొత్తపల్లికి చెందిన ప్రముఖ నిర్మాత, దర్శకులు బి.ఎస్‌.‌నారాయణ తెలుగు సినీ రంగానికి జాతీయ స్థాయిలో తొలిసారి ఉత్తమ నటి, రెండు జాతీయ పురస్కారాలను అందించిన గొప్ప దర్శకుడు. ఆయన దర్శకత్వం వహించిన ‘నిమజ్జనం’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక కావడమే కాక నటి శారదకు జాతీయ స్థాయిలో ఉత్తమనటి పురస్కారంతో పాటు ‘ఊర్వశి’ అవార్డును తెచ్చిపెట్టింది. ఇది జాతీయస్థాయిలో తెలుగు సినీరంగానికి మొట్టమొదటి సారి వచ్చిన ఉత్తమ నటి అవార్డు. మధుమేహ వ్యాధితో కంటిచూపు కోల్పోయిన బీఎస్‌ ‌నారాయణ, కరీంనగర్‌లోని రేకుర్తి లయన్స్ ‌కాంతి ఆసుపత్రిపై ‘తమసోమా జ్యోతిర్గమయ’ (1090) డాక్యుమెంటరీ చిత్రం తీశారు. కరీంనగర్‌లోని కొందరు యువకులతో ‘మార్గదర్శి’ (1991) అనే చిత్రాన్ని రూపొందించాడు. అంధుడై సినిమా నిర్మించినందుకు నారాయణకు ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ ‌వరల్డ్ ‌రికార్డస్’ ‌వచ్చింది. ఆ చిత్రం ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా నంది అవార్డును అందుకుంది. దక్షిణ భారత సినీ దర్శకుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశాడు. రాజారామ్‌ ‌డైరెక్టర్స్ ‌కాలనీ ఏర్పాటు చేశాడు. అంత సమున్నతుడి పేరున ఒక పురస్కార మైనా ఉన్నదా? అసలు వీరెవరో ఈనాటి రాజకీయ నేతలకు, తరానికి తెలుసా?
తెలుగు సినిమా హైదరాబాద్‌కు తరలి రావడానికి అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావుతో సమాన కృషి చేసిన వారు డా.ఎం.ప్రభాకరరెడ్డి. ఆ ఇద్దరు మహానటులు హైదరాబాద్‌లో స్టూడియోలు, సినిమా హాళ్లు నిర్మించడమే చేశారు. కానీ ప్రభాకర రెడ్డి పేద సినీ కళాకారుల కోసం తన 10 ఎకరాల పొలాన్ని ఉచితంగా ఇచ్చేశారు.
అలా ఏర్పడిన కాలనీయే ఇప్పుడు చెప్పుకుంటున్న ‘చిత్రపురి’ కాలనీ. అందుకే దానిని ‘ప్రభాకరరెడ్డ్డ్డి చిత్రపురి కాలనీ అంటారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అన్ని ఎకరాలను దానం చేసిన ఆయన సేవలను ప్రభుత్వం కనీసం అవార్డుల రూపంలోనైనా స్మరించుకోవద్దా? ‘చిల్లర దేవుళ్లు’ చిత్రానికి దర్శకత్వం వహించిన టి.మాధవరావు, గద్దర్‌ ‌పాటలు రాసిన ‘మా భూమి’ చిత్ర దర్శకుడు బి.నరసింగరావు తదితరుల సేవలను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. 1958 నుండి నేటి వరకు సితార్‌పై సంగీతం అందించిన 86 ఏళ్ల పండిట్‌ ‌మిట్ట జనార్దన్‌ ‌మన హైదరాబాద్‌ ‌వారే కదా?
మనకు సినిమాటోగ్రఫీ సమాచార ప్రసార శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి, సంగీత,సాహిత్య అకాడ మీలు, వాటికి చైర్మన్లూ ఉన్నారు. కానీ ప్రకటించాల్సిన పురస్కారాలే లేవు. మధ్యప్రదేశ్‌ ‌ప్రభుత్వం ‘కాళిదాస్‌ ‌సమ్మాన్‌’, ‌కేంద్ర ప్రభుత్వ ‘సరస్వతీ సమ్మాన్‌ ‌తాన్‌సేన్‌’ అవార్డులు అందిస్తున్న పద్ధతిని మార్గదర్శకంగా భావించవచ్చు. సంగీత, నాటక రంగాలకు చెందిన వారికి తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే ‘కలై మా మణి’ని పద్మశ్రీ కంటే గొప్పగా భావిస్తారు. మరి మన తెలంగాణకు అలాంటేదైనా, మానుషశక్తికి అతీతమైన దైవీయమై కళాత్మకమైన పేరుతో గల పురస్కారం ఇంతవరకు లేకపోవడం శోచనీయం.
సభలలో జనాలను చూడగానే ఆవేశంతో ప్రకటనలు చేయడం కంటే, నిపుణులు, మేథావులతో కమిటీ వేసి టైటిల్‌ ‌మొదలు అన్ని అంశాలను రూపొందించి ప్రకటిస్తే హుందాగా ఉంటుంది. ప్రభు త్వాలు మారినా అవార్డు పేరు చిరకీర్తితో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః పరిశీలించు కొని, సర్వ జనామోదక టైటిల్‌తోనే అవార్డులను ప్రకటించాలి.
గద్దర్‌ ‌పేరిట మరో సర్వోన్నత సాహిత్య, సామాజిక పురస్కారాన్ని ప్రకటించి గౌరవించండి. ఆయన పేరిట జానపద, అభ్యుదయ గేయ సాహిత్యంలో హిమశిఖరం వంటి పురస్కారం ఇచ్చినా ఎవరికీ అభ్యంతరం లేదు. విశ్వవిద్యాలయాలలో ఆయనపై బోర్డ్ ఆఫ్‌ ‌స్టడీస్‌ ‌పెట్టించి అధ్యయనం, పరిశోధన, చేయించండి.
ఏదిఏమైనా సినీ టివీ రంగాలవారికి పురస్కారా లను ఇవ్వడంలో జాప్యాన్ని నివారించి, సర్వోన్న తమైన, అందరికీ ఆమోదయోగ్యమై, సంస్కృతిని ప్రతి బింబించే పేరుతో ఇస్తే బాగుంటుంది..

డాక్టర్‌ ‌వి.వి.రామారావు
వ్యాఖ్యాత, సినీ విమర్శకుడు, గాయకుడు

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram