‌కల్యాణ ప్రదాత, కల్యాణ స్వరూపుడు,జ్ఞాననేత్రుడు, సత్వగుణేపేతుడు, ఆదిదేవుడు, అమృతమయుడు, ఆనందమయుడు అని వేదాలు సదాశివుడిని శ్లాఘించాయి. ఆయన భక్తసులభుడు. భక్తులంటే ప్రీతి. బ్రహ్మవిష్ణువు సహా సురాసురులు, రు షులు మహాదేవుని ఉపాసించినవారే. క్షీరసాగర మథనవేళ లోకసంరక్షణార్థం హాలాహల స్వీకరణతో గరళకంఠుడిగా ప్రశస్థి పొందిన పరమశివుడిని వేదాలు మహాదేవుడిగా కీర్తించాయి. ‘సర్వం శివమయం జగత్‌’…అం‌తా శివస్వరూపమే అన్నాయి. నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి అని మూడు పర్వదినాలు ఉన్నా మహాశివరాత్రికి మరింత విశిష్టత ఉందని శాస్త్రాలు, శివారాధనకు ఉత్కృష్టమైన రాత్రే శివరాత్రి అని స్కాంద పురాణం పేర్కొంది. భక్తకోటికి అత్యంత ప్రీతిపాత్రమైనది.

శివలింగం మూలం బ్రహ్మ స్వరూపమని, శివుడిని ప్రతిరోజు ఆరాధించడం నిత్య శివరాత్రి కాగా, ప్రతి పక్షంలోని చతుర్దశినాటి రాత్రి శివారాధనను పక్ష శివరాత్రి అని అంటారు. శివుడికి చతుర్దశి ప్రియమైనదే అయినా, కృష్ణపక్షంలోని చతుర్దశి మరింత ఇష్టమైనది కనుక దానికి మాస శివరాత్రి అని పేరు. మాఘ మాసంలోని కృష్టపక్ష చతుర్దశి మహాశివరాత్రి. ఆనాడే లింగోద్భవం జరిగినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి అంటే ముఖ్యంగా మూడు వ్రతాలతో కూడినది. అవి. అభిషేకం, ఉపవాసం, జాగరణ.

విష్ణువు అలంకారప్రియడు కాగా శివుడు అభిషేకప్రియుడు. అభిషేకం అంటే సర్వ సమర్పణ అని అర్థం. ‘నీ దయతో సిద్ధించిన ఈ జన్మను చరితార్థం చేసుకునేందుకు యత్నించే దాసాను దాసుడ•’నని తనను తాను అంకితం చేసుకోవడం, శరణగతి కోరడం, చెంబుడు శుద్ధోదాకాన్ని లింగాకృతిపై పోసి, చిడికెడు భస్మాన్ని చల్లే సామాన్యులను, మహన్యాసపూర్వక నమకచమ కాదులతో ఏకాదశ రుద్రాభిషేకాలు, పంచామృతా భిషేకాలు చేసే అసామాన్యులను సమాన దృష్టితో ఏకరీతిన కరుణిస్తాడు. శివరాత్రి నాటి రాత్రి నాలుగు జాములలో వరుసగా పాలు, పెరుగు, నెయ్యి, తేనెతో అభిషేకించడం వల్ల శివానుగ్రహానికి పాత్రులవు తారని, పంచాక్షరీ జపంతో పునీతులవుతారని శాస్త్ర వచనం.

‘ఉపవాసం’ (ఉప+వసము) అంటే పస్తు ఉండడం అని లౌకిక అర్థంలో స్థిరపడిపోయింది. కానీ ‘ఉప’ అంటే సమీపం, ‘వస’ అంటే ఉండడం అని నిఘంటు అర్థం. ఎవరి సమీపాన అంటే…! భగవంతుని సమీపంలో అని అర్ధం చెప్పుకోవాలి. ఆయనకు సమీపంలో ఉండడం అంటే భక్తి కలిగి ఉండడమే. మంగళకరమైన శివనామ స్మరణతో మోక్షం దొరుకుతుందని చెబుతారు.శక్తి,యుక్తి, బలం, విద్య, ధనం తదితరాలను దేవగణాలు ప్రసాదించ గలుగుతాయని, మోక్షం మాత్రం పరమేశ్వరుడే అనుగ్రహిస్తాడని అందుకే శిరరాత్రి నాడు జాగరణతో శివనామస్మరణ చేస్తారు. మరో కథనం ప్రకారం, క్షీరసాగర మథనంతో పుట్టిన గరళాన్ని లోక సంరక్షణార్థం గళంలో దాచిన శివుడు దాని ప్రభావంతో కొంతసేపు (మాఘ బహుళ చతుర్దశి నాడు) స్పృహకోల్పోయాడు. పతి తలను ఒడిలో చేర్చుకున్న పార్వతీ విలపిస్తుండగా, విచారంలో మునిగిపోయిన దేవదానవులు ఆయనకు తిరిగి స్పృహలోకి వచ్చేంతవరకు జాగరణ చేశారు. నాటి నుంచి నీలకంఠుని భక్తిశ్రద్ధలతో అర్చించి, జాగరణ చేయడం ఆనవాయితీ అనని పురాణాలు చెబుతున్నాయి.

రావణా సంహారం తరువాత బ్రహ్మ హత్యాపాతక దోష నివారణకు శ్రీరామచంద్రుడు సాగరతీరంలో సైకత లింగాన్ని ప్రతిష్ఠించి అర్చించాడు. మార్కండేయుడు శివయ్యను శరణువేడి చిరంజీవి అయ్యాడు. శ్రీ (పాలెపురుగు) కాళం (పాము), హస్తి (ఏనుగు) మూగజీవాలు, వనవాసి తిన్నడు తమ అమామకభక్తితో ముక్తులయ్యారు.

 శివరాత్రి జాగరణ మొక్కుబడో, కాలక్షాపానికో కాకూడదు. అందుకు సంబంధించి పెద్దలు కొన్ని పద్ధతులు చెప్పారు. మహాశివరాత్రి నాడు వేకువ జామున నిద్రలేచి సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు పూర్తి చేసి, గృహంలో నిత్య ఆరాధన తరువాత దేవాలయం దర్శనం చేయాలి. ఉపవాస దీక్ష చేసేవారు పండ్లు లాంటి అల్పాహారం మాత్రమే స్వీకరించాలని, లౌకిక అంశాలను పక్కన పెట్టి, పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ, వీలైనంతగా భగవధ్యానంలో గడపాలని శాస్త్రం చెబుతోంది.

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు

పరమశివుడు మూర్తిరూపంలో, లింగరూపంలో పూజాదికాలు అందుకుంటున్న దైవం. అయితే వాటిలో శివుడు జ్యోతిరూపంలో  వెలుగుతుంటారని నాయనార్లు విశ్వసిస్తారు. వాటిలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు అత్యంత ప్రధానమైనవి. ఏడాది పొడువున భక్తులతో సందడిగా ఉండే దేశంలోని ఈ క్షేత్రాలు శివరాత్రి పర్వదినంనాడు భక్తులతో కిటకిట లాడతాయి. వారణాశి (ఉత్తరప్రదేశ్‌),  ‌కేదార్‌నాథ్‌ (ఉత్తరాఖండ్‌), శ్రీ‌శైలం (ఆంధప్రదేశ్‌), ‌రామేశ్వరం (తమిళనాడు), దేవ్‌ఘర్‌ ‌వైద్యనాథం (జార్ఖంఢ్‌), ‌ఘృష్ణేశ్వరం (ఎల్లోరా, మహారాష్ట్ర), భీమశంకర్‌ ‌క్షేత్రం (మహారాష్ట్ర),  త్య్రయంబకేశ్వరం (మహరాష్ట్ర),  ఓంకార్‌ ‌క్షేత్రం (ఇండోర్‌/‌బీహార్‌), ‌మహాకాలేశ్వర (ఉజ్జయిని/మధ్యప్రదేశ్‌), ‌సోమనాథ్‌ (‌గుజరాత్‌), ‌నాగేశ్వర్‌ ‌క్షేత్రం (జామ్‌నగర్‌/‌గురాత్‌) ‌క్షేత్రాలలో దేనినైనా ఆనాడు దర్శించుకోవాలని భక్తులు తహతహలాడతారు. వీటిలో కొన్నిటినైనా, ఏకకాలంలో, తక్కువ వ్యవధిలో దర్శించడం కష్టతరం కనుక మానసిక తృప్తి కలిగేలా శాస్త్రం ప్రాధాన్యత ప్రాతిపదికను చూపింది. వారి వారి జన్మరాశులను బట్టి దర్శించుకోవడం శుభప్రదమని పేర్కొంది. మేషరాశికి చెందినవారు రామేశ్వరం, సోమనాథ్‌ (‌వృషభం), నాగేశ్వరం (మిథునం), ఓంకారేశ్వరం (కర్కాటకం), దేవ్‌ఘర్‌ ‌వైద్యనాథం (సింహం), శ్రీశైలం (కన్య), మహాకాలేశ్వరం (తుల), ఘృష్ణేశ్వరం (వృశ్చికం), వారణాసి (ధనుస్సు), దాక్షారం (మకరం), కేదారేశ్వరం (కుంభం), త్య్రయంబకేశ్వరం (మీనం)ను దర్శించుకోవాలని తెలిపింది.

పంచభూతాత్మకమైన విశ్వమంతటా శివుడు వ్యాపించి ఉన్నాడు అనేందుకు నిదర్శనంగా కంచిలో పృధ్విలింగం, జంబుకేశ్వరం ఓజలలింగం, అరుణాచలం అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగమై దర్శనమిస్తున్నాడు.

పంచారామాలు

పంచముఖుడు పరమేష్టి నాలుగు ముఖాలతో నలుదిక్కులు, ఐదవ ముఖంతో ఊర్ధ్వదిశలో చూస్తూ ఉంటాడు. ఆ ముఖాలు అయిదు పేర్లతో ఆంధప్రదేశ్‌లో పూజలు అందుకుంటున్నాయి. తారకాసురుడు నేల కూలడంతో అతనిలోని ఆత్మలింగం అయిదు ముక్కలు కాగా, వాటిని దేవతలు ఆయా  క్షేత్రాలలో ప్రతిష్ఠించారని చెబుతారు. అవే అమరలింగేశ్వరాలయం (అమరావతి), భీమేశ్వరాలయం (దాక్షారామం), కుమార భీమేశ్వరాలయం (సామర్లకోట), సోమేశ్వరాలయం (భీమవరం), క్షీర రామలింగే శ్వరాలయం (పాలకొల్లు). వీటికే అఘోరం (అమరావతి), తత్పురుష (ద్రాక్షారామ), వామదేవ

వారణాసి పుణ్య క్షేత్రాల దివ్యరాశి. భారతీయుల ఆత్మ. సనాతన విద్యలకు కేంద్రం. వరుణ,అసి నదుల మధ్య ప్రవహించే గంగానది తీరాన వెలసిన పుణ్యక్షేత్రం. ప్రళయకాలంలోనూ వినాశనం లేదా ప్రకాశించేది గనుక ‘కాశి’అయిందంటారు ఆధ్యాత్మికవేత్తలు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. సతీదేవి కుడి కుండలం అక్కడ పడిందని శాస్త్రవచనం. శివుడికి శాశ్వత నివాసం. ‘కాశీలో గృహస్థుడిగా జీవిస్తాన’ని స్వయంగా చెప్నినట్లు పురాణం. ఆయన ఈ క్షేత్రాన్ని విడువడు కాబట్టి ‘అవిముక్తం’అని, శాశ్వతానందానికి విహార వనం కనుక ‘ఆనందకాననం’, రుద్రుడి నివాసం కనుక ‘రుద్రవాసం’,భస్మావశేషాలైన మహాభూతాలు నివసించే ప్రాతం కనుక ‘మహా శ్మశానం’ అని చెబుతారు. ఇక్కడ విశ్వనాథ జ్యోతిర్లింగంతో పాటు పద్నాలుగు సుప్రసిద్ధ లింగాలు, అనేక ‘నిగూఢ’లింగాలు ఉన్నాయి. అష్టదిక్పాలకులు, గౌతమ, దుర్వాస, దధీచి, జౌగీషవ్య తదితర మహర్షులు ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠించారని ఐతిహ్యం. శంకరభగవత్పాదులు తమ ధార్మిక దిగ్విజయ యాత్రను ఇక్కడే నుంచే ప్రారంభించారని చెబుతారు. మనీషా పంచ వెలిసిందిక్కడే. రామాయణ, మహాభారతం,, శతపథ బ్రాహ్మణం, నాదర, స్కాంద పురాణాలు, జైన, బౌద్ధ గ్రంథాలు కాశీక్షేత్ర మహిమను వర్ణించాయి.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల శిఖర దర్శనంతో పునర్జన ఉండదని పురాణవాక్కు. అర్చామూర్తి మాత్రమే కాక ఆలయం కూడా స్వామి వారి విరాట్‌ ‌రూపమని శాస్త్రాలు చెబుతున్నాయి. అష్టాదశ పీఠాలలో ఒకటైన శ్రీశైలంలోనే శంకరభగవత్పాదులు శివానందలహరి వెల్లడించారని ప్రతీతి. ఇతర జ్యోతిర్లింగాలలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మల్లికార్జున భ్రమరాంబ కల్యాణం వేళ స్వామి వారికి బదులుగా ఆలయానికి తలపాగా చుడతారు. 365 మూరల పొడవు గల తల పాగాను రోజుకొక మూర తయారు చేయడం మరో విశేషం. శివరాత్రి నాటి రాత్రి రుద్రాభిషేకం సమయంలో దీనిని అలంకరిస్తారు. గర్భాలయం శిఖర నుంచి ముఖ మండపం పైన గల నందులను కలుపుతూ ఈ వస్త్రాన్ని అలంకరిస్తారు. గజచర్మధారుడు పట్టువస్త్రాలు, మెడలో రుద్రాక్షలు,తలపై ఒకవైపు నెలవంక,మరోవంక గంగమ్మతో; అమ్మవారు పట్టుచీర,స్వర్ణాభరణాలతో నయనానందకరంగా తయారవుతారు.

-డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram