అవినీతికి సంబంధించిన ఆరోపణలు, దర్యాప్తులు తమ మీద జరిగినప్పుడు రాజకీయ కక్షతో ప్రభుత్వం తమను వేధిస్తోందంటూ కేకలు వేసి, ఆరోపణలు చేసే ప్రతిపక్షాలకు సుప్రీం కోర్టు వాతపెట్టింది. అవినీతి విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆకాశంలోంచి ఊడిపడలేదని, వారు చట్టానికి అతీతులు కానే కాదనే విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సభలో ఓటు వేసేందుకు కానీ, ప్రశ్న లేదా ఉపన్యాసం ఇచ్చేందుకు కానీ లంచం తీసుకున్నట్టు నేరారోపణలు ఎంపీ లేదా ఎమ్మెల్యేపై వచ్చినప్పుడు వారు చట్టం నుంచి మినహా యింపు కోరలేరంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో తృణమూల్‌ ఎం‌పీ మహువా మొయిత్రా మొదలుకొని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇరుకున పడ్డారనే విషయం వేరే చెప్పనవసరం లేదు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌చంద్రచూడ్‌ ‌నేతృత్వంలోని ఏడుగురు జడ్జీల ధర్మాసనం తమ తీర్పును వెలువరిస్తూ శాసన సభ్యులకు గల చట్టపరమైన పరిరక్షణలు అవినీతి కేసులలో ఎలా వర్తింపు కావో వివరించి, ఎవరికీ ఎటువంటి సందేహం లేకుండా చేశారు.

తీర్పు వెలువడిన వెంటనే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, ‘స్వాగతం! గౌరవ సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ గొప్ప తీర్పు అవినీతిరహిత రాజకీయాలను ఖరారు చేయడమే కాక న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసాన్ని పెంపొందిస్తుంది’ అంటూ సోషల్‌ ‌మీడియా వేదిక ‘ఎక్స్’‌పై పోస్ట్ ‌చేశారు. ఇప్పటికే మోదీ నేతృత్వంలో ప్రభుత్వం, సంస్థలు అవినీతిపై చేస్తున్న యుద్ధానికి ఈ తీర్పు మద్దతునివ్వనుండగా, అవినీతికి పాల్పడిన, పడుతున్న ప్రతిపక్ష నేతల గుండె వేగాన్ని పెచుతోంది. ఈ తీర్పును కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా ఆహ్వానించింది. పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ ‌మనుసింఘ్వి, ఇది ఒక మంచి అడుగు అని, ఈ పని ఎప్పుడో చేయవలసినదంటూ పేర్కొన్నారు.

సదుద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్‌ 105-194‌ను అడ్డుపెట్టుకొని ఎంపీలు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతూ చట్టానికి చిక్కకుండా పెద్దమనుషులుగా చెలామణీ అయిపోతున్నారు. వాస్తవానికి, తమపై చట్టపరమైన చర్య తీసుకుంటారన్న భయం లేకుండా పని చేయడం, నిర్భయంగా అభిప్రా యాలను వ్యక్తం చేయడం కోసం ఈ ఆర్టికళ్లను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ నిబంధనలు వారికి వాక్‌స్వాతంత్య్రాన్ని ఇవ్వడమే కాకుండా, సభలో వారు చేసిన వ్యాఖ్యలకు లేదా పార్లమెంటులో లేదా తాను సభ్యుడిగా ఉన్న హౌజ్‌ ‌కమిటీలో తనకు నచ్చినట్టు స్వతంత్ర ఆలోచనతో ఓటు వేసిన సందర్భంలో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం నుంచి కాపాడతాయి.

ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్‌ ‌కేజ్రీవాల్‌ ఉపయోగించుకున్నంతగా ఈ వాక్‌స్వాతంత్య్రాన్ని మరెవరూ ఉపయోగించుకొని ఉండరు. తాను ప్రధాని నరేంద్ర మోదీపై నిరూపించలేని ఆరోపణలు, నేలబారు వ్యాఖ్యలు చేయాలనుకున్నప్పుడు అర్జెంటుగా శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి, నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి కారణం ఈ నిబంధనల దన్ను చూసుకునే అన్నది మనకు తెలిసిందే. సభలో చేసిన వ్యాఖ్యలపై ఎంపీ లేదా ఎమ్మెల్యే పరువు నష్టం దావాను ఎదుర్కోనవసరం లేదు. వారు ఏదైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు కోర్టులు కాకుండా శాసనసభా స్పీకర్‌ ‌చర్య తీసుకుంటారు.

శాసనసభ్యులు చెలరేగిపోవడానికి కారణమైన తీర్పు

దాదాపు మూడు దశాబ్దాల కింద, 1993లో నాటి ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పటి ఘటనకు సంబంధించిన కేసులో వచ్చిన తీర్పే రాజకీయ నాయకులు క్రమశిక్షణ లేకుండా వ్యవహరించడానికి కారణమైంది. నాడు ఆయనది మైనార్టీ ప్రభుత్వం. దానిని కూలగొట్టాలని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆయన ప్రభుత్వం అత్యంత స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది. కాగా, ఒక ఏడాది తిరగగానే ఝార్ఖండ్‌ ‌ముక్తి మోర్చా పార్లమెంటు సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసేందుకు నోట్లు తీసుకున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీనితో కేసు సుప్రీంకోర్టుకు వెళ్లడం, ఐదేళ్ల అనంతరం అంటే 1998లో సుప్రీం తీర్పును వెలువరించడం జరిగాయి. నాడు సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం, ఎంపీలు, ఎమ్మెల్యేలు తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఓటు వేస్తే ఆ సందర్భంగా వారు చేసిన అవినీతి నుంచి మినహాయింపు ఉంటుందని, వారు శిక్షార్హులు కారని, 3:2 మెజారిటీతో తీర్పును కోర్టు వెలువరించింది.

సరిగ్గా, ఈ తీర్పునే జస్టిస్‌ ‌చంద్రచూడ్‌ ‌నేతృత్వంలోని ధర్మాసనం పక్కకు పెట్టింది. తాము పివి నరసింహారావు కేసులో తీర్పుతో ఏకీభవించడం లేదని, ఓట్లు వేసేందుకు నోట్లు తీసుకున్న ఎంపీలకు మినహాయింపును ఇచ్చిన కేసును ఓవర్‌ ‌రూల్‌ ‌చేస్తున్నామని, ఏకగ్రీవంగా స్పష్టం చేసింది. పైగా, 1998లో ఇచ్చిన తీర్పు ఫలితంగా, లంచం తీసుకుని, ఇచ్చిన మాట ప్రకారం ఓటు వేసిన చట్టసభ సభ్యుడి సభ్యత్వాన్ని ఒకవైపు పరిరక్షిస్తూ, లంచం తీసుకున్నా స్వతంత్రంగా ఓటు వేసిన వ్యక్తిని శిక్షించడమన్నది సరికాదని, ఇది ‘వైరుధ్య పరిస్థితి’ సృష్టిస్తుందని తాము భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.

కొత్త తీర్పు ఏం చెబుతోంది

లంచం తీసుకోవడం అనేది స్వతంత్రంగా చేసే నేరమని పేర్కొంటూ, శాసనసభ్యుడు పార్లమెంటులోనో లేదా అసెంబ్లీలోనో చేసేదానితో దానికి సంబంధం ఉండదని కోర్టు స్పష్టం చేసింది. కనుక శాసనసభ్యులకు దీని నుంచి మినహాయింపు ఉండదని పేర్కొంది. ఆర్టికల్‌ 105 -194 ‌శాసనసభ్యులను లంచం కేసులలో కాపాడలేవని, ఎందుకంటే, అవినీతికి, శాసనసభ్యులుగా వారి విధులకు సంబంధం ఉండదని స్పష్టం చేసింది. అటువంటి వారికి రక్షణ కల్పించడమంటే చట్టం నుంచి అనియంత్రిత మినహాయింపును పొందే ఒక వర్గాన్ని సృష్టించినట్టవుతుందని కోర్టు హెచ్చరించింది.

శాసనసభ్యులు అవినీతికి, లంచాలకు పాల్పడడమన్నది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును ధ్వంసం చేస్తుందని ధర్మాసనం అప్రమత్తం చేసింది. ఆర్టికల్‌ 105‌ను చర్చకు తగిన వాతావరణాన్ని ఏర్పరచి, నిర్వహించే లక్ష్యంతో చేసిందని, కానీ ఒక సభ్యుడు సభలో ప్రశ్న వేసేందుకు లేదా ఉపన్యసించేందుకు లంచం తీసుకుంటే, ఈ వాతావరణం దెబ్బతింటుందని పేర్కొంది.

కాగా, 2008లో, 2015లో ఓటుకు నోటు కేసులు సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. యూపీఏ ప్రభుత్వ కాలంలో, భారత్‌ -‌యుఎస్‌ అణు ఒప్పందం విషయంలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ‌ఫ్రంట్‌ ‌ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నప్పుడు, సభలో తమ మెజారిటీని రుజువు చేసుకోవలసి ఉన్న సందర్భంలో జులై 22, 2008లో ఓటు వేయడానికి బీజేపీ ఎంపీలకు లంచం ఇచ్చారనే వదంతులు షికార్లు చేశాయి.

ఇటువంటి కేసే మరొకటి 2015లో తెలంగాణలో చోటు చేసుకుంది. ఈ అవినీతి వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీడీపీ నాయకుల జోక్యం ఉంది. తెలంగాణ శాసన మండలికి 2015లో జరిగిన ఎన్నికలలో తమకు ఓటువేయాలని కోరుతూ నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఎల్విస్‌ ‌స్టీఫెన్‌సన్‌కు డబ్బు ఇవ్వ జూపిన వీడియో బయటకు రావడం సంచలనమైంది. దీనితో నాడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న రేవంత రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. రూ. 50 లక్షలు స్టీఫెన్‌సన్‌కు ఇవ్వచూపాడన్న ఆరోపణతో ఈ అరెస్టు జరిగింది. ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన కుట్ర అంటూ తెలుగుదేశం అధినేత విరుచుకుపడ్డ విషయాన్నీ చూశాం. కాగా, తగిన ఆధారాలు లేకపోవడంతో రాష్ట్ర హైకోర్టు రేవంతరెడ్డికి, మరో ఇద్దరికీ బెయిల్‌ ఇచ్చింది.

-నీల

About Author

By editor

Twitter
YOUTUBE