వచ్చేస్తున్నాయి… 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కౌంట్‌ డౌన్‌ మొదలైంది. ఎన్నికలు అనగానే, కులాలు, మతాలు,  ప్రాంతాల వారీగా, ఓటింగ్‌ సరళి చర్చకు వస్తుంది. ఎవరి ఓటు ఎవరికి అనే చర్చ మొదలవుతుంది. ముఖ్యంగా, ముస్లిం మైనారిటీ ఓటు ఎవరికి అన్న ప్రశ్న చుట్టూ రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది, మీడియాలో చర్చ జరుగుతోంది. విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. విశ్లేషణలు వినిపిస్తాయి. ఇప్పడు అదే జరుగుతోంది. చివరకు, తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న పొత్తుల రచ్చలోనూ ముస్లిం ఓటు చర్చకు వస్తోంది. 

నిజమే, ఒకప్పుడు అయితే, ముస్లిం ఓటులో బీజేపీ వాటా, ఉంటే నామ మాత్రంగా, కాదంటే, అసలే ఉండేది కాదు. ఇందుకు, చరిత్రలో చాలానే కారణాలు కనిపిస్తాయి. ఇప్పటికీ, కొందరు మీడియా మేథావులు, అవే వాదనలు చేస్తున్నారనుకోండి అది వేరే విషయం.

అయితే, బీజేపీని ముస్లింలు అంతగా ఆదరించకపోవడానికి, ఇతర కారణాలు ఎన్నున్నా, ప్రధాన కారణం మాత్రం, కుహన లౌకికవాద పార్టీలు, ఆ ముసుగులో సాగించిన, ఓటు బ్యాంకు రాజకీయ కుట్రలు, కుతంత్రాలు. సృష్టించిన అపోహలు, అభద్రతా భావం. ఒక విధమైన భయం. అవును. కాంగ్రెస్‌, కమ్యూనిస్టు ఇతర కుహన లౌకికవాదులు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిం సమాజంలో సృష్టించిన, బీజేపీ భయం, (ఫోబియా) ముస్లిం సమాజానికీ, బీజేపీకీ మధ్య ఎత్తు గోడలు కట్టింది. అయితే, గత పదేళ్లలో వివక్షకు ఆస్కారం లేని విధంగా, ‘సబ్‌-కా-సాత్‌, సబ్‌-కా-వికాస్‌’ పథంలో సాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన చూసిన, ముస్లిం సమాజంలో క్రమ క్రమంగా మార్పు చోటుచేసుకుంటోంది. ఫలితంగా కాంగీ, కమ్మీ, ప్రాంతీయ, కుటుంబ పార్టీలు కట్టిన అడ్డుగోడలు కూలిపోతున్నాయి. కుహన లౌకికవాదుల కుయుక్తులను, కుటిల రాజకీ యాలను ముస్లిం ప్రజానీకం గుర్తిస్తోంది. ముస్లిం సమాజం బీజేపీకి దగ్గరవుతోంది. ప్రధానంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ‘సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌’ నినాదం, ఆ నినాదాన్ని ప్రామాణికంగా తీసుకుని, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, కుల మతాలకు అతీతంగా లబ్ధిదారులలో విశ్వాసాన్ని పెంచుతోంది. ముఖ్యంగా ముస్లిం సమాజం ఆలోచనల్లో మార్పునకు సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌.. మూలమంత్రంగా మారింది.

రేపటి ఎన్నికల్లో…

ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు ఎటు ఓటు చేస్తారు? అనే ప్రశ్న సహజంగానే ఆసక్తిని రేకేతిస్తోంది. కాంగ్రెస్‌ సారథ్యంలో ఏర్పడిన విపక్ష ఇండీ కూటమిలోని ఏ రెండు పార్టీల మధ్య ఏ ఒక్క విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. అయినా, చేతులు కలిపారు. సరే, ముహూర్తానికి ముందే ఒకటొకటిగా మూడు ముళ్లు పుటుక్కుమంటున్నాయి అనుకోండి, అది వేరే విషయం. అదలా ఉంచితే, అసలు కలవాలనే ఆలోచనకు మూలం మాత్రం, లౌకికవాదం ముసుగేసుకున్న అధికార దాహం, ఓటు బ్యాంకు రాజకీయాలు. దశాబ్దాలుగా కుహన లౌకికవాద రాజకీయ పార్టీలు, బీజేపీని బూచిగా చూపించి ముస్లిం మైనారిటీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నాయి. అలాగే, మెజారిటీ మతస్తులలోనూ లేని పోనీ అపోహలు సృష్టించి, పబ్బం గడుపుకుంటూ వచ్చారు. గడచిన పదేళ్ల మోదీ పాలనలో ముస్లిం సమాజం నిజాలను తెలుసుకుంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం, సబ్‌ కాసాత్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌, సబ్‌ కా ప్రవాస్‌ నినాదాన్ని, సంకల్పంగా చేసుకుని తీసుకుంటున్న నిర్ణయాలు, ముస్లిం ఓటర్లలో కుహనా లౌకికవాదులు సృష్టించిన బీజేపీ భయం స్థానంలో విశ్వాసాన్ని నింపుతోంది.

ముస్లిం సమాజంలో సామాజిక న్యాయం

అంతేకాదు, నరేంద్ర మోదీ ప్రభుత్వం ముస్లిం సమాజంలో సామాజిక న్యాయం పై దృష్టిని కేంద్రీకరించింది. ముస్లిం సమాజంలోని మరింత వెనుకబడిన పస్మందా తెగ ముస్లింల సమస్యలను బీజేపీ పదేపదే ప్రస్తావించడమే కాకుండా, పరిష్కారాలను కూడా చూపుతోంది. గత సంవత్సరం హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాల్లో నరేంద్ర మోదీ, ముస్లిం సమాజంలో వెనకబడిన వర్గాల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, పార్టీ నాయకులూ, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరోవంక ముస్లిం సమాజంలో ఉన్న సామాజిక, ఆర్థిక అంతరాలను ముస్లిం సమాజం వెనకబడిన వర్గాలు గుర్తించాయి. దీంతో, ఉన్నత తెగలకు చెందిన ముస్లిం నాయకత్వం తమకు చేస్తున్న అన్యాయాన్ని కొంచెం ఆలస్యంగానే అయినా వెనుకబడిన ముస్లిం సమాజం ప్రజలు గుర్తిస్తున్నారు. కేవలం 20శాతం ఉన్న ఉన్నత వర్గాలకు చెందిన ముస్లిం నాయకత్వం 80శాతం పైగా ఉన్న వెనకబడిన తెగలపై చెలాయిస్తున్న రాజకీయ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడమే కాదు, ముస్లింలు అందరినీ ఒకే గాటన కట్టి, లౌకికవాదం ముసుగులో ముస్లిం నాయకత్వం సాగిస్తున్న ఓటుబ్యాంకు రాజకీయాల నుంచి విముక్తి కోరుకుంటున్నారు. ముస్లిం సమాజంలో, ముఖ్యంగా ముస్లిం రాజకీయాల్లో తమకు జరుగుతున్న అన్యాయానికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ముందెన్నడూ లేని విధంగా ముస్లిం రాజకీయాల్లో మార్పు కనిపిస్తోంది. ముస్లిం సమాజం ప్రజాస్వామ్యయుతమైన, సమ్మిళిత రాజకీయాల వైపు మొగ్గుచూపుతోంది.

ఈ నేపథ్యంలో మెజారిటీ ముస్లిం సమాజంలో విశ్వాసం పెంచేందుకు, బీజేపీ ముందడుగు వేసింది. ముస్లిం సమాజానికి దగ్గరయ్యేందుకు, ముఖ్యంగా వెనుకబడిన ముస్లింలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే దిశగా, బీజేపీ నాయకత్వం సంసిద్దత వ్యక్తపరుస్తోంది. అంతేకాదు, బీజేపీ ముందడుగుతో పేదరికంలో మగ్గుతున్న ముస్లిం తెగల ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం కోరుకుంటు న్నారు. అంతేకాదు, సమస్యల పరిష్కారం కోసం కుహన లౌకికవాదులను, మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ వ్యాపారం సాగిస్తున్న ఒవైసీలను నమ్ముకుని మోస పోయిన పేద ముస్లింలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. భారతీయ జీవన స్రవంతిలో తమ మూలాలు వెతుక్కుంటున్నారు. జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్య మంత్రులు ఫరూఖ్‌ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్‌ వంటి అనేకమంది నాయకులు సైతం, తమ పూర్వీకులు హిందువులు, కశ్మీరీ బ్రాహ్మణులని ప్రకటించుకుంటున్నారు. అంటే, ముస్లిం సమాజం మేల్కొంటోంది. కుహనా లౌకికవాదులు ముసుగులు తొలిగిపోతున్నాయి.

తలాక్‌.. తలాక్‌… తలాక్‌

అలాగే, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు తర్వాత ముస్లిం మహిళలు బీజేపీ వైపు చూడడమే కాదు, బీజేపీని బహిరంగంగా సమర్ధిస్తున్నారు. సొంతం చేసుకుంటు న్నారు. నిజానికి, చాలావరకు ఇస్లామిక్‌ దేశాలలో సైతం లేని తలాక్‌ దురాచారం నుంచి విముక్తి లభించినందుకు, ముస్లిం మహిళలే కాదు, ‘ఎర్ర’ తెగులు సోకని మతాతీత అభ్యుదయవాదులు ట్రిపుల్‌ తలాక్‌ రద్దు నిర్ణయాన్ని స్వాగతించారు. ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముస్లిం మహిళలలోనే కాదు, ముస్లిం సమాజంలోనే కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది.

కొత్త ఆలోచనలకు బీజం నాటింది. కుహన లౌకికవాద పార్టీలు, ముస్లిం సమాజంలో పెంచి పోషించుకుంటూ వచ్చిన బీజేపీ వ్యతిరేకత, నిజంకాదనే నిజాన్ని, ముస్లిం సమాజం గుర్తించింది. అందుకే, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు నుంచి ముస్లిం సమాజం దృక్పధంలో మార్పు మొదలైంది. ఇప్పడు ముస్లిం సమాజం బీజేపీని కొత్త కోణంలో చూస్తోంది. అవును, ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్య ప్రదేశ్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో ఈ ప్రభావం కొంతమేర కనిపించింది. కాగా, మరో రెండు మాసాల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రభావం మరింత స్పష్టమవుతుందని, పరిశీలకులు భావిస్తున్నారు.

మోదీ అంటే..

మరోవంక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం, సంక్షేమం నిర్వచనాన్ని మార్చి వేసింది. సంక్షేమానికి కులం, మతం కాదు, ఆర్థిక స్థోమత (పేదరికం) మాత్రమే ప్రాతిపదిక అనే అర్థాన్ని ఇచ్చింది. సామాజిక అవసరాల విషయంలో వివక్షకు తావు లేని విధంగా, పథకాలను రూపొందించి అమలుచేస్తోంది.అంతే కాదు,మోదీ ప్రభుత్వం, ఆహారం, ఆవాసం, పారిశుధ్యం, వివిధ మానవ అవసరాలను తీర్చడం రాజకీయ బాధ్యతగా స్వీకరించింది. ప్రధానమంత్రి మోదీ సంక్షేమానికి నిర్వచనాన్ని మార్చివేస్తే, ముస్లిం సమాజం, మోదీ అంటే, మాస్టర్‌ (M) అఫ్‌ (O) డెవలపింగ్‌(D) ఇండియా (I) అంటున్నారు.

ఇంతకాలం కుహనా లౌకికవాదులు, రాజకీయ ఇస్లామిస్టుల మాటలు నమ్మిన ముస్లిం సమాజం, ఇప్పడు తమ అనుభవంలోకి వచ్చిన వాస్తవాలను గుర్తించి, నిజాలను చూస్తోంది. ‘సీయింగ్‌ ఈజ్‌ బిలీవింగ్‌’ అంటోంది. అవును, మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎక్కడా వివక్ష చూపడం లేదు. కరోనా మహమ్మారి విపత్తు నుంచి పేదలను ఆదుకునేందుకు, ప్రారంభించిన గరీబ్‌ కల్యాణ్‌ యోజన ద్వారా, దేశ వ్యాప్తంగా ఇప్పటికీ, 81 కోట్లమంది ప్రయోజనం పొందుతున్నారు. ఇందులో, అన్ని మతాల వారు న్నారు. అన్ని కులాలు, అన్ని ప్రాంతాలవారు ఉన్నారు. ఒక్క గరీబ్‌ కల్యాణ్‌ యోజన విషయంలోనే కాదు, మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారులలో అన్ని మతాల వారున్నారు, అన్ని కులాల వారున్నారు. అన్ని ప్రాంతాల వారున్నారు. అందిరికీ సమానంగా ప్రయోజనాలు అందుతున్నాయి. నిజానికి కొన్ని కొన్ని సందర్భాలలో, ముస్లింలు తమ జనాభాకంటే ఎక్కువగా సంక్షేమ పథకాల ప్రయోజనం పొందు తున్నారు. ఉత్తర ప్రదేశ్‌ విషయాన్నే తీసు కుంటే, ఆ రాష్ట్ర జనాభాలో ముస్లింలు 19 శాతం మంది మాత్రమే ఉన్నారు. అయినా, ప్రధానమంత్రి ఆవాస యోజన, ఉజ్వల యోజన, ముద్రా యోజన  లబ్దిదారులలో 24 నుంచి 30 శాతం మంది ముస్లిం మైనార్టీలున్నారు. ఒక్క ఉత్తర ప్రదేశ్‌లో మాత్రమే కాదు, చాలావరకు రాష్ట్రాలలో ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. బీజేపీ యేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో మాత్రం కేంద్ర ప్రభుత్వ పథకాలకు సొంత పేర్లు తగిలించుకుని, ప్రజలను మోసం చేస్తు న్నారు. అయితే, ముస్లిం మైనారిటీ ప్రజలే వాస్తవాలను గుర్తించి మోదీ మిత్రులుగా మారి, ప్రచారం చేస్తు న్నారు. విశ్వకర్మ యోజనలో 18 రకాల చేతివృత్తుల వారు ప్రయోజనం పొందుతున్నారు, అందులోనూ వెనుకబడిన ముస్లింలు లబ్ధిదారులుగా ఉన్నారు. అందుకే రేపటి ఎన్నికల్లో ముస్లిం మైనారిటీల ఓటులో బీజేపీ వాటా గణనీయంగా పెరుగుతుందని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. అలాగే, 2024 సార్వత్రిక ఎన్నికలు కుహన లౌకికవాదుల ఓటు బ్యాంక్‌ రాజకీ యాలకు ముగింపు పలుకుతాయని అంటున్నారు.

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE