ఇటీవల కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న సంఘటనలు మాతృదేశాభిమానుల్ని కలవరపాటుకు గురిచేశాయి. కర్ణాటకనుంచి రాజ్యసభకు పోటీచేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు సాధించడంతో ఆయన అనుయాయులు ‘పాక్‌’ అనుకూల నినాదాలు చేయడం మొదటిది కాగా, తమిళనాడులో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’కు చెందిన మరో లాంచింగ్‌ ప్యాడ్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ‘చైనా’ పతాకం దర్శనమివ్వడం రెండోది.

కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలను బుజ్జగించే రీతిలో తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు మెజారిటీ వర్గం హిందువుల్లో ఆందోళన, అభద్రతాభావం ఒకపక్క పెరుగుతున్న తరుణంలో ఈ ‘పాక్‌ అనుకూల నినాదాలు’ పెనుదుమారం సృష్టించాయి. ఇక తమిళనాడు విషయానికి వస్తే, ప్రభుత్వం ‘పొరపాటు’ జరిగిందని చెప్పి, తప్పుకోవడానికి యత్నించినా, పొరపాటనేది క్షణకాలంలో జరిగే ఒక తప్పిదమన్న సంగతి ఎవరికి తెలియనిది? ప్రకటన తయారుచేసి దాన్ని డిజైన్‌ చేసే ప్రక్రియ కేవలం క్షణకాలంలో జరిగేది కాదు. ఎంతో సమయం పడుతుంది. దీన్ని ‘పొరపాటు’గా ఎట్లా పరిగణించ గలం? ప్రజాస్వామ్యం పేరుతో మితిమీరిన స్వేచ్ఛ తెస్తున్న విపరిణామాలివి! ప్రతి దేశానికి బయటి శత్రువులుంటారు. మన దౌర్భాగ్యమేమంటే బయటి శత్రువులకంటే అంతర్గత శత్రువులే అధికం. ఈ రెండు రకాల శక్తులతో పోరాటం చేయాల్సిన దుస్థితిని ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్నది. తాము ఎంత పెద్ద తప్పు చేసినా దాన్ని చిన్న ‘పొరపాటు’గా చిత్రీకరించడం లేదా దానికి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేయడం పరిపాటిగా మారింది. ‘సెక్యులరిజం’ను అడ్డంపెట్టుకొని ‘ఉదారవాదం’ పేరుతో చేస్తున్న సంకుచిత రాజకీయాలే నేడు దేశంలో జాతీయవాదాన్ని విస్తృతం కావడానికి దోహదం చేస్తున్నాయి. పై రెండు సంఘటనలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎంతో కొంత మేలు చేస్తాయనడంలో ఎంతమాత్రం సందేహంలేదు.

కర్ణాటక రగడ

కర్ణాటకనుంచి కాంగ్రెస్‌ నాయకుడు నాజిర్‌ హుస్సేన్‌ రాజ్యసభకు ఎన్నికయ్యారన్న ప్రకటన వెలువడగానే, కొందరు ఆయన మద్దతుదార్లు పెద్దగా చప్పట్లు చేస్తూ ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ నినాదాలిస్తున్న దృశ్యాలు న్యూస్‌ ఛానళ్లలో ప్రసారం కావడంతో వివాదం చెలరేగింది. దీనికి ముఖ్యమంత్రి సిద్దరా మయ్య స్పందిస్తూ ఈ అంశంపై విచారణకు ఆదేశించామని, నినాదాల విషయం నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అంతేకాదు ‘‘దేశభక్తి గురించి మాకు చెప్పనవసరం లేదు. ఇప్పటికే పోలీసులు సూ మోటో కేసు నమోదు చేసి ఏడుగురిని ప్రశ్నిస్తున్నారు. నేరానికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలుంటాయని’’ స్పష్టం చేశారు. విచిత్రమేమంటే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సయ్యద్‌ నాజిర్‌ హుస్సేన్‌ ఎన్నికైన సందర్భంగా ఆ పార్టీ సభ్యులు కర్ణాటక అసెంబ్లీలో పాక్‌ అనుకూల నినాదాలు చేశారని ఫోరెన్సిక్‌ నిపుణులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన నివేదికతో పాటు, నినాదాలు చేస్తున్న సందర్భంగా నమోదైన వీడియో, ఆడియోలను సమర్పించడమే కాకుండా, ఇవి నిజమైనవేనని స్పష్టం చేశారు. నిందితుడిని మహమ్మద్‌ షఫీక్‌ నాషిపుడిగా గుర్తించినట్టు హవేరి ఎస్‌.పి. అన్షుకుమార్‌ తెలపడం తాజా పరిణామం. ‘‘ఫిబ్రవరి 27న బెంగళూరు విధానసౌధ పోలీస్‌స్టేషన్‌లో కర్ణాటక అసెంబ్లీలో పాకిస్తాన్‌ అనుకూల నినాదాలపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి నిందితుడు మహమ్మద్‌ షఫీక్‌ నాషిపుడిని అందుపులోకి తీసుకున్నారని’’ ఆయన తెలిపారు. నిందితుడు హవేరీ జిల్లా బ్యాదగీ పట్టణానికి చెందిన ఎండు మిర్చి వ్యాపారి. కాంగ్రెస్‌ నాయకుడు సయ్యద్‌ నాజిర్‌ హుస్సేన్‌ మద్దతుదారు. ఫిబ్రవరి 28న అతను విధానసౌధలోకి ప్రవేశించి, రాజ్యసభకు కాంగ్రెస్‌ నేత సయ్యద్‌ నాజిర్‌ హుస్సేన్‌ ఎన్నికైన సందర్భంగా పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు చేసిన సంఘటనపై విధానసౌధ పోలీసులు సూ మోటో కేసు నమోదు చేసి ఏడుగురు వ్యక్తులను విచారించినట్లు, ప్రస్తుతం ఇతడిని ప్రశ్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి 29న రాష్ట్ర మంత్రివర్గం ఈ ఫోరెన్సిక్‌ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి విధానసౌధ సెక్యూరిటీ డి.సి.పి.పై అసంతృప్తిని వ్యక్తం చేసింది. మరిప్పుడు ఇది నిజం కావడంతో ఆయన ఏం చర్యలు తీసుకోబోతున్నారని వేచిచూసిన వారికి కేవలం ఈ ‘అసంతృప్తి వ్యక్తం చేయడంతో’ సిద్దరామయ్య ప్రభుత్వం సరిపెట్టింది. సెక్యులరిజం మాటున బుజ్జగింపు రాజకీయాలు చేసే ప్రభుత్వాలు దేశవ్యతిరేకులపై ఇంతకుమించి కఠినచర్యను మనం ఆశించలేం! ఇక సయ్యద్‌ నాజిర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ, తాను ‘నాజిర్‌ హుస్సేన్‌ జిందాబాద్‌’, ‘నాజిర్‌ సాహెబ్‌ జిందాబాద్‌’, ‘కాంగ్రెస్‌ పార్టీ జిందా బాద్‌’ నినాదాలను విన్నాను కానీ ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ నినాదాలు వినలేదని చెప్పడం కేవలం తన అనుచరుడిని వెనుకేసుకురావడానికి తప్ప మరోటికాదు.

వైరలైన వీడియో

ప్రభుత్వం ఎంతగా కప్పిపుచ్చాలని ప్రయత్నించినా మహ్మద్‌ షఫీక్‌ చేసిన నినాదాలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరలైంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ విపక్ష భారతీయ జనతాపార్టీకి ప్రభుత్వంపై విరుచుకుపడటానికి ఈ సంఘటన ఒక బలమైన అస్త్రంగా మారింది. నజీరుద్దీన్‌ మద్దతుదార్లు ఈవిధంగా జాతివ్యతిరేక నినాదాల సంఘటనపై ఎన్‌ఐఏ/ఐబీల చేత విచారణ జరపాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. దీనిపై అసెంబ్లీలో పెద్ద దుమారమే చెలరేగింది. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు జై శ్రీరామ్‌ అన్న నినాదాలు చేయగా, ముఖ్యమంత్రి సిద్దరామయ్య ‘జై సీతారామ్‌’ అంటూ ప్రతి నినాదాలు చేయడం విశేషం. ఫిబ్రవరి 29వ తేదీన విపక్ష నేత ఎ. అశోక్‌ నేతృత్వంలో ‘రాజ్‌భవన్‌ చలో’ ర్యాలీని నిర్వహించి రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు చేయడంలో విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ డి.ఎన్‌.ఎలోనే పాకిస్తాన్‌ వున్నదంటూ, పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్‌ చేసింది. కారకాల ఎమ్మెల్యే సునీల్‌ జాతీయ పతాకం చేతబూని ర్యాలీ నిర్వహించడమే కాకుండా, నాజిర్‌ హుస్సేన్‌ను కాంగ్రెస్‌నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

ఇదేం తప్పిదం?

ట్యుటికోర్న్‌ జిల్లా కులశేఖరపట్టణంలో కొత్తగా నిర్మించబోయే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకి చెందిన స్పేస్‌ రాకెట్‌ లాంచ్‌ కాంప్లెక్స్‌కు ప్రధాని నరేంద్రమోదీ ఫిబ్రవరి 28న శంకుస్థాపన చేశారు. ఇది రాష్ట్రంలో రెండో లాంచ్‌ ప్యాడ్‌. లాంచ్‌ కాంప్లెక్స్‌నుంచి ఏటా 24 రాకెట్‌ ప్రయోగాలు చేపట్టవచ్చు. ఇక్కడ మొబైల్‌ లాంచ్‌ నిర్మాణాలు కూడా ఉండటం విశేషం. ఈ లాంచ్‌ కాంప్లెక్స్‌ తమిళనాడు మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుచ్చందూర్‌ నియోజక వర్గంలో ఉండటంలో, ఆమె స్థానిక పత్రికల్లో ఒక ప్రకటన ఇచ్చారు. ఇందులో ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి స్టాలిన్‌ల చిత్రాలు రెండువైపులా మధ్యలో రాకెట్‌ కొనకు చైనా జాతీయపతాకం చిత్రం ఉండటంలో వివాదం చెలరేగింది. ఇస్రో కార్యకలాపాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోవి కనుక, ఈ లాంచ్‌ప్యాడ్‌ ఏర్పాటు ఘనత స్టాలిన్‌కి కట్ట బెట్టాలన్న ఉద్దేశంతో అత్యుత్సాహంతో విడుదల చేసిన ప్రకటనలో ‘చైనా పతాకం’ ఉండటం తమిళనాడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఎన్నికల వేళ పరిస్థితి చేయిదాటి పోనీయకూడదన్న ఉద్దేశంతో మంత్రి అనితా రాధాకృష్ణన్‌ స్పందిస్తూ చిన్న పొరపాటు జరిగిందని అంగీకరించారు. తమ పార్టీ అధినేత కరుణానిధి కులశేఖరపట్టణంలో ఇస్రో తొలి లాంచ్‌ ప్యాడ్‌ను ప్రారంభించిన సంగతి గుర్తుచేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌, తూత్తుకూడి లోక్‌సభ ఎంపి కనుమొజీలు లాంచ్‌ప్యాడ్‌ ఏర్పాటుకు ప్రధానికి గతంలో ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిన సంగతి గుర్తుచేశారు. డీఎంకే ఎంపీ కనుమొళి ఈ విషయంలో ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడానికి ప్రయత్నించిన తీరు హాస్యాస్పదంగా ఉంది. ‘చైనాను శత్రుదేశంగా భారత్‌ ప్రకటించలేదు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను మామలాపురంకు ప్రధాని ఆహ్వా నించారు కూడా. అటువంటప్పుడు వాస్తవాలను గ్రహించకుండా విషయాన్ని తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సబబంటూ’ ఆమె చేసిన వ్యాఖ్యల్లో ఎంతమాత్రం పసలేదు. కానీ బీజేపీ రాష్ట్ర నాయకుడు అన్నామలై మాత్రం డీఎంకే ప్రభుత్వానికి దేశభక్తి లేదని, తన చైనా ప్రేమను ఈ విధంగా వ్యక్తం చేసిందంటూ విరుచుకుపడ్డారు. అంతేకాదు సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లడానికి కూడా డీఎంకేనే కారణమంటూ అన్నామలై విమర్శించారు. ‘‘ఇస్రో మొట్టమొదటి లాంచ్‌ప్యాడ్‌ను తమిళనాడులోనే ఏర్పాటు చేయాలనుకుంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన సమావేశానికి అప్పటి డీఎంకే ముఖ్యమంత్రి అన్నాదురై తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతూ తాను హాజరుకాలేక మంత్రి మథియజగన్‌ను పంపారు. సమావేశంలో ఆయన తనకేం సంబంధంలేనట్టు గానే వ్యవహరించడం చరిత్ర. కేవలం ఈ అలసత్వం, నిర్లక్ష్యం కారణంగానే స్పేస్‌ లాంచింగ్‌ ప్యాడ్‌ ఆంధ్రప్రదేశ్‌కు తరలి పోయింది. నిజానికి అప్పటికే ఎంతోకాలగా ఇస్రో వేచివుంది. కానీ డీఎంకే వ్యవహార శైలి కారణంగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ పార్టీ పద్ధతి అప్పుడు ఇప్పుడు ఒకేమాదిరిగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మరింత దిగజారిందంటూ’’ విమర్శిం చారు. తర్వాత తిరునల్వేలి సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రకటన విషయంలో డీఎంకే ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. అంతరిక్ష రంగంలో భారత్‌ ప్రగతిని డీఎంకే ఆమోదిస్తున్నట్టు లేదంటూ ఆయన చురకలంటించారు. ఇదిలా వుండగా స్టాలిన్‌ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ మ్యాండరిన్‌ భాషలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఆయనకిష్టమైన చైనా భాషలోనే ఈ శుభాకాంక్షలు చెబుతున్నట్టు దెప్పి పొడిచింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి ఎల్‌. మురుగన్‌ జరిగిన పొరపాటుకు డీఎంకే ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ చేతికి కొత్త అస్త్రం?

ఈ చైనా పతాకం వివాదం భారతీయ జనతా పార్టీకి ప్రధాన అస్త్రాన్నిచ్చినట్లయింది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఏఐఏడీఎంకే క్రమంగా బలహీన పడుతున్న తరుణంలో ఆ స్థానాన్ని భర్తీచేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఏఐఏ డీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ ఎంపీలు ఇప్పటికే బీజేపీలో చేరారు. తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలుండగా, పుదుచ్చేరిలో ఒక స్థానం ఉంది. అంటే ఈ రెండు ప్రాంతాలు కలిపి మొత్తం 40 ఎంపీ స్థానాలున్నాయి. 2014 ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో ఏఐఏడీఎంకే 15 శాతం ఓట్లవాటాను కోల్పోయి, 36 లోక్‌సభ స్థానాల్లో ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో కేవలం 12 అసెంబ్లీ సెగ్మెంట్లలోనే లీడ్‌లో ఉండటం ఆపార్టీ దుస్థితిని తెలుపుతోంది.

కర్ణాటకలో బీజేపీకి ప్రస్తుతం 48% ఓట్లుండగా, జేడీఎస్‌తో కలవడం వల్ల 55% వరకు ఓట్లు సంపాదించవచ్చునని అంచనా వేస్తోంది. తమిళ నాడులో ప్రస్తుతం 12%గా ఉన్న ఓట్లు వచ్చే ఎన్నికల్లో 15%కు పెరగవచ్చని పార్టీ అంచనా వేస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో 20%కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని భావిస్తోంది. ఇక మొత్తం దక్షిణ భారత్‌ విషయానికి వస్తే దక్షిణ భారత్‌లో మొత్తం 130 లోక్‌సభ స్థానాలుండగా, బీజేపీకి 29 సీట్లున్నాయి. వీటిల్లో 25 కర్ణాటకలో, 4 తెలంగాణకు చెందినవి. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నం. ఇక్కడ ప్రాథమిక విద్య, ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక సమస్యలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే 2014 నుంచి ఈ రాష్ట్రాల్లో పార్టీ వేగంగా పుంజుకుంటోంది. దక్షిణాదిలో దేశం మొత్తంమీద జనాభాలో 18% మాత్రమే ఉన్నప్పటికీ, దేశ జీడీపీలో 35% వాటా ఈ రాష్ట్రాలదే. ప్రస్తుతం బీజేపీకి లోక్‌సభ లో 303 సీట్లుండగా, 2014లో వీటి సంఖ్య 282. ఈసారి నరేంద్రమోదీ 400 సీట్లు సాధన లక్ష్యంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో, పార్టీ ప్రధానంగా దక్షిణాదిపై దృష్టి కేంద్రీకరించింది. కర్ణాటకలో 28, తమిళనాడులో 39, పుదుచ్చేరిలో ఒక లోక్‌సభ స్థానా లున్నాయి. తమిళనాడులో స్థానం సంపాదించేందుకు మోదీ ‘కాశీ-తమిళ్‌ సంగమ్‌’ వంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో బలంగా ఉన్న ద్రవిడ రాజకీయాలపై ఈ ‘సాంస్కృతిక సమ్మేళన’ మార్గం ఎంతమేర పనిచేస్తుందో చూడాలి.


కాంగ్రెస్‌ అనుకూల ఫలితాల వెంటే పాక్‌ అనుకూల నినాదాలు కూడా

కాలుతొక్కిన రోజే కాపురం సంగతి తెలిసిపోతుందని సామెత. దాదాపు పది మాసాల క్రితం కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిచిన సందర్భంలోనే పాకిస్తాన్‌ అనుకూల శక్తులు గళం విప్పాయి. కాంగ్రెస్‌ గెలుపు సంకేతాలు స్పష్టం కావడంతో మే 15, 2023 తిలక్‌వాడి (బెలగావి) ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అంటూ గుర్తు తెలియని వ్యక్తులు నినాదాలు చేశారు. మే 10వ తేదీన అక్కడ పోలింగ్‌ జరిగింది. బీజేపీ ఓడిపోతున్నట్టు, కాంగ్రెస్‌ గెలుస్తున్న ఖరారు కావడంతోనే కొందరు వ్యక్తులు, వారంతా కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులే, రెచ్చిపోయి పాక్‌ అనుకూల నినాదాలు చేశారని నివేదికలు అందాయి. దీని మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. ఈ వార్త సామాజిక మాధ్యమాలలో రావడంతో హిందుత్వ సంస్థలు పలుచోట్ల ధర్ణాలు మొదలుపెట్టాయి. కాంగ్రెస్‌కు మొత్తం 224 అసెంబ్లీ స్థానాలలో 135 దక్కాయి. బీజేపీ 65, జేడీ (ఎస్‌) 19 స్థానాలు గెలిచాయి.

శాసనసభలలో, బయట పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు చేయడం కశ్మీర్‌ నుంచి కర్ణాటక వరకు పాకిందని అర్ధమవుతుంది. 2018లో మహ్మద్‌ అక్బర్‌ లోనే కశ్మీర్‌ శాసనసభలో పాకిస్తాన్‌ జిందాబాద్‌ అని నినాదం ఇచ్చాడు. ఇతడు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సభ్యుడు. 2023 వరకు ఈ కేసు నడిచింది. ఇతడు క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో కేంద్రం అప్పుడు కోరింది కూడా. బిహార్‌లోని అర్రా జిల్లాలో ఇలాంటి నినాదాలు చేసినందుకు ఐదుగురిని అదుపులోకి (2022) తీసుకున్నారు.పుణేలో జరిగిన ఒక కార్యక్రమంలో పాప్యులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ(2022) నినాదాలు చేశారు. ఆగస్ట్‌ 26,2021న ఉజ్జయినీలో మొహర్రం ఊరేగింపును పోలీసులు నిలిపివేయవలసి వచ్చింది. ఇందుకు కొవిడ్‌ కారణమని చెప్పినా, నిజానికి ఆ ఊరేగింపులో పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. జనవరి 24, 2021న ఢల్లీిలోని ఖాన్‌మార్కెట్‌ మెట్రో స్టేషన్‌ దగ్గర పాక్‌ అనుకూల నినాదాలు చేసిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అఖిల భారత ఐక్య డెమాక్రటిక్‌ ఫ్రంట్‌ నాయకుడు (బంగ్లా చొరబాటుదారుల నాయకుడు) సిల్చార్‌ విమానాశ్రయంలో దిగగానే పలువురు పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు చేశారు.

సీఏఏ వ్యతిరేక ఆందోళనల సమయంలో బెంగళూరులోనే అమూల్య లియోన్‌ అనే ఆమె పాక్‌ అనుకూల నినాదాలు చేసి చిక్కుల్లో పడిరది. ఆమె మీద దేశద్రోహం కేసు నమోదయింది.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram