రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న విషయం నిజమేనని అందిన నివేదికను సర్వోన్నత న్యాయస్థానం ముందు ఉంచాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ ) ఆదేశించడంతో రాష్ట్ర సర్కారు న్యాయస్థానం ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్‌జిటి నిర్వహించిన విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. అక్రమ మైనింగ్‌పై సామాజిక కార్యకర్త దండా నాగేంద్ర ఎన్‌జిటిలో పిటిషన్‌ ‌దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దానిమీద విచారణ జరిపిన ఎన్‌జిటి, తవ్వకాలను ఆపేయాలని, తవ్వకాలకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని పర్యావరణ అటవీమంత్రిత్వశాఖను గతంలో ఆదేశించింది. ఆ మేరకు ఏర్పాటైన అటవీ మంత్రిత్వ శాఖ కమిటీ తన నివేదికలో, ర్టాంలో ఇసుక తవ్వకాలకు సంబంధించిన పలు అక్రమాలను వివరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఇంకా భారీగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు నివేదికలో నిర్ధారించింది. ఫొటోలతో పాటు ఇతర సాక్ష్యాధారాలతో నివేదికను ఎన్‌జిటికి అందజేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఎలాంటి అనుమతులు లేకుండా 24 గంటలూ తవ్వకాలు చేపడుతున్నారని, ఒక్కో రీచ్‌లో రోజుకు రెండు వేల టన్నుల మేర తవ్వకాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. శాటిలైట్‌ ‌చిత్రాల ద్వారా తవ్వకాల ఆధారాలు సేకరించామని వివరించింది. ఎలాంటి ఈసీలు లేకుండా తవ్వకాలు చేస్తున్నారని తెలిపింది.

గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు అమలు కావట్లేదని ఎన్‌జిటి పేర్కొంది. కేంద్ర కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని కేంద్ర పర్యావరణ అటవీశాఖకు ఎన్‌జిటి ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంలో కలెక్టర్ల నివేదిక, కేంద్ర మంత్రిత్వశాఖ నివేదిక పూర్తి భిన్నంగా ఉన్నాయని పేర్కొంది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోందని, ఏం చేయాలనేది న్యాయస్థానమే తేలుస్తుందని స్పష్టం చేసింది. తాము కూడా నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి అందజేస్తామని తెలిపింది.

దర్జాగా ఇసుక అక్రమ రవాణా

ఆంధప్రదేశ్‌లో దర్జాగా సాగే దందాల్లో ఇసుక అక్రమ రవాణా ఒకటి. నదులు, వాగులు, వంకల నుంచి రాత్రింబవళ్లనే తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను అక్రమంగా తవ్వి అమ్ముకోవడం ఏళ్ల తరబడి జరుగుతూనే ఉంది. నాటి ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కొత్త ఇసుక   విధానంతో ఇసుక సరఫరాను నిలిపివేసింది. దీంతో నిర్మాణరంగం పూర్తిగా కుదేలైపోయింది. ఆ రంగంలోని సుమారు 30 లక్షల కార్మికులు ఉపాధి దొరకక రోడ్డున పడ్డారు. 2019 అక్టోబరులో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ఎత్తివేసి కొత్త విధానాన్ని తెచ్చింది. అదీ లోపభూయిష్టంగా ఉండటంతో దానిని మార్చారు. ఇలా ఇసుక విధానాన్ని మూడుసార్లు మార్చి, ఇసుకను పూర్తిగా వ్యాపారవస్తువుగా చేసేశారు. సామాన్యులకు ఇసుక దొరకడం లేదు. ఇసుక బంగారం కంటే విలువైనదిగా విమర్శలొచ్చాయి. ఐదేళ్ల కిందట ట్రాక్టరు ఇసుక ధర రూ.1500 ఉండగా, ఇప్పుడు రూ.5000 దాటింది. ఏటా రూ.50 వేల కోట్ల మేర అక్రమ వ్యాపారం జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అవినీతిని ప్రశ్నించిన వారిపై కక్షగట్టి ప్రమాదాల పేరుతో ఇసుక లారీలు, ట్రక్కుల చక్రాల కింద నలిపేస్తున్నారని ఆరోపణలు పెరిగాయి. గతంలో యూపీ, బిహార్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌వంటి రాష్ట్రాల్లో జరిగే ఇలాంటి సంఘటనలు ఇప్పుడు ఏపీలో నిత్యకృత్యమైపోయాయని రాజకీయపార్టీలు, పర్యావరణవేత్తలు అంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మే 12, 2021 -మే 13, 2023 మధ్యకాలంలో ఇసుక కాంట్రాక్టును జేపీ వెంచర్‌కు ఇచ్చింది. 2021 మేలో ఇసుక టెండర్‌ అప్పగించారు. ఆ సంస్థ పేరిట వైసీసీ నేతలు, ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేసినట్లు, వేల కోట్ల అక్రమార్జనకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇసుక సరఫరాను సులభతరం చేసినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకున్నా అదంతా అబద్దమని వినియోగదారులు విమర్శిస్తున్నారు. ఇసుక బ్లాక్‌ ‌మార్కెట్‌లో యధేచ్ఛగా లభిస్తోందంటున్నారు. రోజూ చెన్నై, బెంగుళూరు, హైదరాద్‌లకు కొన్ని వందల లారీల ఇసుకను తరలించడం, దానిని అడ్డుకున్న వారిపై దాడులు చేయడం నిత్యకృత్యమైపోయింది. కొత్త వాల్టా చట్టం, దాని నిబంధనలు, 25, 71 జీవోల ముసుగులో అధికారికంగానే అంతులేని దోపిడీకి తెరలేచిందంటున్నారు. కేవలం ఇసుక లాబీయింగ్‌తోనే పాలకపార్టీ నేతలు కోట్లాది రూపాయలను మింగేశారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 40 రీచ్‌లలో యంత్రాల్లేకుండా ఇసుకను తవ్వుకోవచ్చు కానీ 500 రీచ్‌లలో ఏకంగా జేసీబీలను రంగంలోకి దించి తవ్వేసుకున్నా రంటున్నారని, ఒకేసారి 2 టన్నుల ఇసుకను వెలికి తీసే బకెట్లను వాడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇక తాజాగా 2 నెలల క్రితం కాంట్రాక్టులు దక్కించు కున్న జేసికేసి, ప్రతిమ ఇన్‌‌ఫ్రా సంస్థలు కూడా ఇవే తప్పులు చేస్తూ దొరికిపోయా యంటున్నారు.

జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు

ఇసుక అక్రమ తవ్వకాలతో, పర్యావరణ విధ్వంసం చేస్తున్నారంటూ ఆగస్టులో జేపీ వెంచర్స్‌పై గుంటూరుకు చెందిన నాగేంద్రకుమార్‌ ‌జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ‌కేసు వేశారు. రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ (సియా), కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని జాయింట్‌ ‌కమిటీలతో ఎన్జీటీ విచారణలు చేయించింది. సెమీ మెకనైజ్డ్ ‌రీచ్లో భారీ యంత్రాలు ఉపయోగించి ఇసుక తవ్వకాలు చేస్తున్నారని, పర్యావరణ పరిరక్షణ మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించారని విచారణలో తేలింది. చేతిరాతతో వే బిల్లులు ఇస్తున్నారు. కంప్యూటరైజ్డ్ ‌బిల్లులు లేవు. సీసీ కెమెరాలు లేవు. వాహనాలకు జీపీఎస్‌ ‌ట్రాకింగ్‌ ‌లేదు. ఇలా అడుగడుగునా ఉల్లంఘనలే. జిల్లాల వారీగా రీచ్‌ ‌వివరాలు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం, గనులశాఖ అవేవీ ఇవ్వలేదని, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఎన్జీటీకి నివేదించింది. దీంతో 2023 మార్చి 23న ఎన్జీటీ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గుంటూరు, చిత్తూరుతో పాటు రాష్ట్రంలోని అన్ని రీచ్‌ల (110-బీ2 కేటగిరీ) కు ఇచ్చిన పర్యావరణ అనుమతుల (ఈసీ)ను రద్దు చేసింది. జేపీ వెంచర్స్ ‌తీవ్రస్థాయిలో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఒక్కో రీచ్‌కు రూ.18 కోట్ల చొప్పున పెనాల్టీ విధించింది. ఆ సొమ్ము చెల్లించాలని, ఆ తర్వాతే ఇసుక మైనింగ్‌కు కొత్తగా ఈసీలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశించింది. రాష్ట్రంలో 2023 మార్చి 23 నాటికి బీ2 కేటగిరీ సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచ్‌లు 110 ఉన్నాయి. వీటికి ఇచ్చిన ఈసీలు రద్దయ్యాయి. అలాగే, ఎన్జీటీ ఆదేశాల మేరకు జేపీ వెంచర్స్ ఒక్కో రీచ్‌కు 18 కోట్ల చొప్పున మొత్తం 110 రీచ్‌కు కలిపి రూ. 1908 కోట్లు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. పెనాల్టీ చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించడంతో జేపీ వెంచర్స్ ‌సుప్రీం కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చేనాటికి ఇసుక అక్రమాలపై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ జాయింట్‌ ‌కమిటీల నివేదికలు అందలేదు. 2023 ఆగస్టులో సుప్రీం తీర్పు ప్రకారం ్ణ,ఇసుక తవ్వకాలు చేపట్టడానికి కొత్తగా పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. కానీ ఈసీలు లేకుండా, ఇసుక రీచ్లకు కొత్తగా అనుమతి లేకున్నా 2023 నవంబరు నెలాఖరు వరకు జేపీ వెంచర్స్ ఇసుక తవ్వకాలు జరిపిందని, పర్యావరణ మార్గదర్శకాల ఉల్లంఘన జరిగిందని కేంద్ర అటవీ పర్యావరణ పరిరక్షణ విభాగం ఎన్జీటీకి నివేదించింది. ఈ నేపథ్యంలో ఈ నివేదికను సుప్రీంకోర్టు ముందుంచాలని ఎన్జీటీ ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కొత్త ఈసీలు తీసుకున్నాక మైనింగ్‌ ‌చేయాలన్న ఆదేశాన్ని జేపీ వెంచర్స్ ఉల్లంఘించిందని కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు పక్కా ఆధారాలతో నివేదికలు రూపొందించాయి. సుప్రీం కోర్టు ఈ నివేదికలను పరిగణనలోకి తీసుకొంటే ఎన్జీటీ విధించిన పెనాల్టీ అంశంపైనే తొలి విచారణ జరగనుంది. గుంటూరుకు చెందిన నాగేంద్రకుమార్‌ ‌కూడా ఇదే అంశంపై మరో పిటిషన్‌ ‌దాఖలు చేశారు.

అధికార దుర్వినియోగం

ఏపీ ఇసుక దోపిడీపై గతంలోనే సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ నేతల లెక్కలేనితనం, అధికారం యంత్రాంగం తోడ్పాటు వల్ల ఈ దోపిడీ యథేచ్ఛగా సాగుతూనే వచ్చింది. వైసీపీ పాలన పగ్గాలు చేతిలోకి తీసుకున్నప్పటి నుంచి యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసింది. స్వలాభం కోసం అధికారులు చాలామంది అధికారపార్టీ చెప్పినట్లు చేస్తూ ఆ పార్టీ కార్యకర్తల కన్నా ఎక్కువగా పనిచేశారు. ఇసుక అక్రమ రవాణాను కనిపెట్టలేకపోయారంటే రాష్ట్ర గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఎన్ఫోర్స్మెంట్‌ ‌బ్యూరోలది ఘోర వైఫల్యం అనేకన్నా వారికి అన్నీ తెలుసనీ కాని పట్టించుకోలేదని విమర్శలొస్తున్నాయి. 26 జిల్లాలకు గాను 25 జిల్లాల కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో ఎక్కడా ఇసుక అక్రమ తవ్వకాలు జరగడం లేదని కూడబలుక్కొని ఒకే మాట మీద నిలబడటం, మూకుమ్మడి అబద్ధం చెప్పడమేనని బ్యూరోక్రసీ అవినీతికి ఇది పరాకాష్ఠగా పార్టీలు ఆరోపిస్తున్నాయి. కలెక్ట ర్లంతా ఒకే ఫార్మాట్లో నివేదికలు సమర్పించడం ఎన్‌జీటీని దిగ్భ్రాంతి పరిచింది. కలెక్టర్లు అక్రమ రీచ్‌లు వదిలేసి ఉత్తుత్తి రేవులకు వెళ్లి పరిశీలించి చేతులు దులుపుకున్నట్లు ఎన్‌జీటీకి స్పష్టంగా అర్థమైపోయిందని తెలుస్తోంది. ఎన్నికల ముందు వైసీపీ ఆ పరిణామం ప్రభావాన్ని చూపనుందని అంటున్నారు.

వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ

ఛైర్మన్‌,‌సెంట్రల్‌ ‌లేబర్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram