ఇది సినిమా థియేటర్‌లో వినిపించినా, మూడున్నర దశాబ్దాల పాటు ఆసియా ఖండాన్నీ, నిజానికి ప్రపంచాన్నీ కలత పెట్టిన కశ్మీర్‌ కల్లోలం మీద లోతైన వ్యాఖ్య.  ఉగ్రవాదం ఆ లోయను కన్నీటితో నింపింది. మతోన్మాదం ఆ భూతల స్వర్గంలోని పచ్చని నేల నిండా రక్తపు కళ్లాపి చల్లింది.‘అక్కడ ఉగ్రవాదం ఒక వ్యాపారం, మరొక కోణం ఏదీ దానికి లేదు!’ అంటుంది ప్రధాన పాత్ర. ఆ చిత్రమే ఫిబ్రవరి 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘ఆర్టికల్‌ 370’. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణమిది. దీనిని ఆగస్ట్‌ 5, 2019న బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అదొక ప్రపంచ వార్త. ఒక సంచలనం. ఐక్య రాజ్యసమితిని వాడీవేడీ చర్చకు వేదికను చేసింది.

వేలాది మంది కశ్మీరీ పండిత్‌లను లోయలో చంపినా, తరిమేసినా, అందుకు జవాబుదారీతనం లేకుండా చేసినది`ఆర్టికల్‌ 370. కొన్ని కుటుంబాలు వంశపారంపర్యంగా రాష్ట్రాధికారాన్ని అనుభవించ డానికి ఎర్ర తివాచీ పరిచినదీ అదే. డ్రైఫ్రూట్స్‌ అక్రమ రవాణా చేస్తున్నా, ఉగ్రవాదానికి నిధులు సమకూరు స్తున్నా, ఆఖరికి ఆర్థిక అవకతవకలపై విచారణ లేకుండా చేయగలిగినా అదంతా ఆ అధికరణం చలవే. పాకిస్తాన్‌ నుంచి వచ్చే దొంగ నోట్లను పంచి కుర్రకారును రాళ్లు రువ్వే అల్లరిచిల్లర మూకలుగా తయారు చేసినా అడ్డుకునే శక్తి కేంద్రానికి లేకుండా చేసినా కారణం అదే. ఇదంతా ఒకటైతే, 40 మంది సీఆర్‌పీఎఫ్‌  భద్రతా బలగాలను పొట్టన పెట్టుకున్న పుల్వామా (2019) వంటి దారుణ ఘటనపై ప్రతి చర్యలకు ఆటంకం కూడా 370. దీనినే రద్దు చేసింది కేంద్రం. ఏడు దశాబ్దాలుగా రాజ్యాంగంలో గడుసుగా తిష్ట వేసిన ఒక అధికరణాన్ని చెత్తబుట్టలో పడేయడం వెనుక పెద్ద నేపథ్యం ఉంటుంది. కానీ అది చలనచిత్రంగా రూపొందించడానికి అనువుగా ఉంటుందా? ఉంటుందనే రుజువు చేశారు ‘ఆర్టికల్‌ 370’ చిత్ర దర్శకులు, నిర్మాతలు, చిత్రానువాదకులు.

‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం నిర్మించాం. ఇది డాక్యుమెంటరీ కాదు, అయినా కల్పిత కథ’ అంటూ లాంఛనంగా ప్రకటించుకున్నా, 1947 నాటి ఎర్రకోటపై పతాక వందనం, దాని కింద నెహ్రూ కనిపిస్తున్న నలుపు తెలుపు డాక్యుమెంటరీ శకలంతోనే ఈ సినిమా ఆరంభ మైంది. ఆ పరిణామాలు, కశ్మీర్‌ను రాజా హరిసింగ్‌ భారత్‌లో విలీనం చేయడం, అందుకు దారి తీసిన పరిస్థితులు అజయ్‌ దేవగణ్‌ గళంతో నేపథ్యంలో చెప్పించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే 370 అధికరణాన్ని తాత్కాలిక ప్రాతిపదికపైన రాజ్యాంగకర్తలు ప్రవేశపెట్టారు. ఈ వాస్తవాన్నే చాలా రాజకీయ పక్షాలు సౌకర్యంగా మరచిపోయాయి. వక్రభాష్యాలు చెప్పాయి. అందుకే కశ్మీర్‌`భారత్‌ల మధ్య వారథిగా ఉండాలని భావించి ప్రవేశపెట్టిన ఆ తాత్కాలిక అధికరణమే చివరికి లోయలో ఉగ్రవాదుల స్వైర విహారానికి ఆసరా ఇచ్చింది. వేర్పాటువాదుల రక్షణకు, మూడు నాలుగు రాజకీయ కుటుంబాల ప్రయోజనాల వరకే పరిమితమైంది. దానిని రద్దు చేయడమే ఈ చిత్ర ఇతివృత్తం. జూనీ హక్సర్‌ (భద్రతా అధికారి), రాజేశ్వరీ స్వామినాథన్‌ (ప్రధాని సచివాలయ కార్యదర్శి) అనే రెండు స్త్రీ పాత్రలతోనే ఈ వాస్తవ గాథను నడిపించారు. నెహ్రూ, బుర్హాన్‌వనీ వంటి కొన్ని పేర్లు తప్ప మిగిలిన పాత్రలను వాటి హోదాలతోనే పిలిచారు. నరేంద్ర మోదీ, అమిత్‌షా, ముఫ్తీ  మోహబూబా పాత్రలకు వారి పదవుల పేర్లే ఉన్నాయి. పాత్రధారులు, ఆహార్యం, కదలికలు  ఆయా వ్యక్తులను ప్రతి లిప్తలోను తలపునకు తెస్తాయి.

 ఇతివృత్తం విషయానికి వస్తే

సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే తీరులో ఒక సరిహద్దు రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కట్టబెట్టినది 370 అధికరణం. దీనితో జరుగుతున్న విధ్వంసం ఆధునిక భారతదేశానికి తీరని వ్యధ. 1947లో రాజా హరిసింగ్‌ కశ్మీర్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశాడు. అక్కడ నుంచి నేరుగా వేర్పాటువాది సయ్యద్‌ అలీషా జిలానీ, ఉగ్రవాది బుర్హాన్‌ వనీ కాలానికి దర్శకుడు తీసుకువస్తాడు.

ఆరు అధ్యాయాలుగా సాగిన ఈ సినిమాలో తొలి అధ్యాయమే తెరకు కళ్లప్పగించే విధంగా ఉంది. ఇది హిజ్‌బుల్‌ ముజాహుదీన్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌తో మొదలవుతుంది. ఈద్‌ వేడుక కోసం ఒక ఇంటికి అతడు వచ్చాడని తెలిసి అక్కడ మాటు వేస్తాయి భద్రతాదళాలు. కొందరు ఇంటిలోకి చొచ్చుకు వెళ్లగా, జూనీ ఇంకొందరు బయట కాపు వేస్తారు. అప్పటికే తప్పించుకుపోతున్న ఉగ్రవాదులు జూనీ కంటపడ్డారు. భీకరంగా కాల్పులు జరిగాయి. వనీ చనిపోతాడు. దీనితో కశ్మీర్‌ మొత్తం అట్టుడికి నట్టు ఉడికిపోతుంది. వనీ శవంతో ఊరేగింపు జరుపుతారు. దీనికంతకీ జూనీని బాధ్యురాలిని చేస్తారు పై అధికారులు. అంత ప్రాబల్యం ఉన్న ఉగ్రవాదిని ఎలా చంపుతామని, వారితో సంప్రతింపులు మార్గమని హితోక్తులు పలుకుతారు. అంతేకాదు, ఆమెను ఢల్లీికి బదలి చేసి, మంత్రి జలాల్‌ బందోబస్తుకు నియమిస్తారు. తరువాత రాజేశ్వరి మళ్లీ ఆమెను ఒప్పించి ఎన్‌ఐఏ అధిపతిగా పూర్తి స్థాయి అధికారాలతో లోయకు పంపుతుంది. ఆ సందర్భంగా ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా ముఖ్యమైనది. కేంద్రంలోని పార్టీ ముఫ్తీ మెహబూబాతో సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నదని, 370 అక్కడి కింది వర్గాలకు, మహిళలకు హక్కులు లేకుండా చేస్తున్నదని అక్కడ పనిచేయడం ఎలా అని ప్రశ్నిస్తుంది జూనీ. ముఫ్తీ మెహబూబాతో కలసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, అక్కడి యంత్రాంగం ఆనుపానులు తెసుకోవడానికేనని తరువాత వెల్లడైంది.

బుర్హాన్‌ వనీ హత్య తరువాత లోయలో ఉగ్రవాదం మరింత పెరిగింది. ఫలితం పుల్వామా దాడి. ఆ దాడిలో జూనీకి సన్నిహితంగా ఉండే ఒక భద్రతా అధికారి కూడా చనిపోతాడు. తరువాత కూడా కొన్ని ఘటనలు జరుగతాయి. ప్రధాని అధ్యక్షతను కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారం 370 రద్దు మాత్రమేనని సమావేశంలో అభిప్రాయానికి వస్తుంది. కానీ కొందరు ఇందుకు సందేహిస్తారు. ప్రధాని కుర్చీలో నుంచి లేచి ఇంకా ఎంత కాలం ఈ ఓర్పు! మనం 370ని రద్దు చేస్తున్నాం. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండకూడదు అంటాడు. కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం లేకపోవచ్చు. అక్కడ ప్రధాని లేకపోవచ్చు. రెండు జెండాలు లేకపోవచ్చు. కానీ 370 అంతకు మించి అధికారాలు, హక్కులు కట్టబెడుతున్నది. అందుకే ప్రధాని పాత్రతో ఆ మాట అనిపించారు. అయితే ఆ చర్యలో అమాయకుడైన ఒక్క కశ్మీరీ రక్తపు బొట్టు కూడా కింద పడకూడదని ఆదేశిస్తాడు ప్రధానమంత్రి. ఇందుకు సంబంధించిన చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టే బాధ్యతను హోంమంత్రికి అప్పగిస్తారు.

 జూనీ హక్సర్‌కు ఒక విషాద గతం ఉంది. ఆమె తండ్రి కబీర్‌ హక్సర్‌ను ఒక బ్యాంక్‌ అవినీతి వ్యవహారంలో బలిపశువును చేశారు. ఆయన శవం దాల్‌ సరస్సులో కనిపించింది. 370 అమలులో ఉండగా ఆ వివాదానికి ఎలాంటి ముగింపు రాలేదు. ఆమె మనసును బాధ పెట్టే ఒక దుర్ఘటనగా మిగిలింది. 370 అధికరణ కారణంగా ఆ అవినీతి వ్యవహారంలో దోషులెవరో తేల్చడానికి బాధితులెవరో నిగ్గు తేల్చడానికి అవకాశం లేకపోయింది. దీనికి చక్కని ముగింపు ఇచ్చారు. 370 రద్దు తరువాత హక్సర్‌ను ఇరికించిన ఆ కేసును తిరగతోడుతున్నారని వార్త వస్తుంది. ఆ పేపర్‌ క్లిపింగ్‌ తీసుకువెళ్లి జూనీ దాల్‌ లేక్‌లో విడిచిపెడుతుంది. 370 రద్దుతో దేశంలో, కశ్మీర్‌లో వెల్లువెత్తిన హర్షాతిరేకాలకు సంబంధించిన వార్తలు, వాటిని ప్రచురించిన పత్రికల పేర్లుతో తేదీలతో సహా ప్రస్తావించారు. చివరికి 370 రద్దు చట్టబద్ధమేనంటూ ఇచ్చిన సుప్రీం తీర్పును ప్రసావించారు. దీనితో సినిమా ముగిసింది.

నిజానికి 370 రద్దుకు ముందు ఢల్లీిలో, మంత్రుల కార్యాలయాలలో జరిగిన ఘటనలు సినిమాలో సృష్టించిన ఉత్కంఠకు తీసిపోనంతగా విస్తు గొలుపుతాయి. న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా పరిశోధన జరిగింది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంత జరుగుతున్నా కాస్త కూడా విషయం బయటకు రానీయలేదు. క్రికెట్‌ మ్యాచ్‌లో తుది ఫలితం ఇచ్చే ఒక్క బాల్‌ పడుతున్న సమయంలో ఉండే ఉత్కంఠ ఇందులో కనిపిస్తుంది. మొదట ప్రధాని, హోంమంత్రులకు మాత్రమే ఈ విషయం తెలుసు. అధికరణం రద్దు కసరత్తు అంతా ఎవరికీ అనుమానం రాకుండా హోంమంత్రి కార్యాలయం లేదా న్యాయశాఖ మంత్రి కార్యాలయాలలో కాకుండా వేరే చోట నిర్వహించారు. అయితే సమాచారమంతా పార్లమెంట్‌ భవనం కింది అంతస్తులో ఉన్న హోంమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడు చేరేది. వాటిని పరిశీలించే పనిలో సహకరించడానికి కొందరు గుజరాతీ రాజకీయవేత్తలు కూడా అక్కడే ఉండేవారు. అమిత్‌షా, సొలిసిటర్‌ జనరల్‌ ఏ క్షణంలో మాట్లాడుకోవాలన్నా వీలుగా ఫోన్‌ ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రత్యేకంగా విప్‌ జారీ చేయడమే కాదు, ఆ ఒక్క రోజు కొత్త ఎంపీలు సభలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో తర్ఫీదు కూడా ఇప్పించింది. ఆనాటి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, రైల్వేమంత్రి పీయూష్‌ గోయెల్‌ పార్లమెంటులో హోంమంత్రి ఇచ్చే ఉపన్యాసం తయారు చేశారు. అప్పుడు అస్సాంమంత్రిగా ఉన్న హిమంత బిశ్వశర్మకు ఒక బాధ్యతను అప్పగించారు. బిల్లును ప్రవేశపెట్టే రోజున సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్‌చంద్‌ గెహ్లోత్‌ను పూర్తిగా రోజంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నిజానికి ఆయన చాంబర్‌నే వార్‌రూమ్‌గా ఉపయోగించు కున్నారు. అమిత్‌ షా, ఆయన సహాయకులు ఆ రోజంతా ఆ చాంబర్‌లోనే ఉన్నారు. ఇంత జరిగినా రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టే క్షణం వరకు ఎవరికీ ఏమీ తెలియలేదు. దీనితో బృందా ఘోష్‌ అనే జర్నలిస్టు ప్రదర్శించిన అసహనం చాలా విషయాలు వెల్లడిస్తుంది.

సినిమాలో పుల్వామా మృతులకు ప్రధాని నివాళి ఘటించే సన్నివేశం, 370 రద్దు నిర్ణయాన్ని ప్రధాని ప్రకటించే సన్నివేశం అద్భుతంగా ఉన్నాయి (ఈ సన్నివేశానికి  ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు). 370 రద్దయితే ఎలాంటి సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది? అన్న రహస్య చర్చలో స్లిప్‌ల మీద రాసే సన్నివేశం కూడా చక్కగా ఉంది. మొదట జూనీ ఒక అంశం రాసి ఓ పెద్ద బోర్డుకు అతికిస్తుంది. చివరికి ఆ బోర్డు ఖాళీ లేకుండా అలాంటి స్లిప్‌లతో నిండిపోతుంది. పాక్‌ దాడి మొదలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఉన్న వాహనాల డ్రైవర్ల వరకు సమస్యలు కనిపిస్తాయి. అప్పుడు జరుగుతున్న అమర్‌నాథ్‌ యాత్రను హఠాత్తుగా నిలిపివేశారు. రాష్ట్రంలో 144వ సెక్షన్‌ విధించారు. మాజీ ముఖ్యమంత్రులను, ముఖ్య నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. పత్రికా రచయితలు, ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక, ఉదారవాద పత్రికా రచయితలు కూపీ లాగే యత్నం చేస్తుంటారు. ఒక్క అక్షరం కూడా బయటకు పొక్కదు. బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ముందు రాత్రి మీడియా అంతా ప్రధాని నివాసం ఎదుట కాపు వేసి ఉంటుంది. కొంతసేపటి తరువాత ప్రధాని కాన్వాయ్‌ హఠాత్తుగా బయలుదేరుతుంది. ఆ గందరగోళం సద్దుమణిగిన తరువాత మరొక కారు ప్రధాని నివాస ప్రాంగణం నుంచి మరొక దారిలో రాష్ట్రపతి భవన్‌కు వెళుతుంది. అందులో ప్రధాని ఉంటారు. అబ్దుల్లా అనే స్మగ్లర్‌ని అరెస్టు చేసి తీసుకువెళుతున్నప్పుడు రాళ్లు రువ్వే మూకలు అడ్డం పడతాయి. అయితే కొద్దిసేపు యుద్ధం తరువాత వారంత వారే దారి ఇస్తారు. ఎందుకు? అబ్దుల్లాను జీప్‌ బాయినెట్‌కు కట్టి ముందుకు తీసుకువెళతారు భద్రతా సిబ్బంది.

 సినిమా పేరు వినగానే ఇది డాక్యుమెంటరీని చూడడమే అనుకుని వెళ్లే ప్రేక్షకుడు కంగు తినక తప్పదు. నాటకీయత, సన్నివేశ కల్పన, మలుపులు అద్భుతంగా ఉన్నాయి. ఇదంతా వాస్తవాల ఆధారంగా కొద్దిపాటి కల్పనతో తీసినదే. గడచిన ఏడు దశాబ్దాలుగా ఈ ఆర్టికల్‌ను రద్దు చేస్తే దేశం భస్మీపటలమైపోతుందంటూ చిరకాలం దేశాన్ని ఏలిన పార్టీ ఆడిన నాటకమే ఇలాంటి రాజకీయ కథకు పసందైన నాటకీయతను తెచ్చి పెట్టింది. కశ్మీర్‌ అందాలను, నిశిరాత్రి లోయను చాలా అందంగా చిత్రించారు. నేపథ్య సంగీతం ప్రత్యేకతను తెచ్చి పెట్టింది.

అక్షరాలా మూడో కంటికి తెలియకుండా 370ని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. మొదటి దఫా అధికారంలోకి వచ్చినప్పుడే దీనిని రద్దు చేయాలని అనుకున్నా పార్లమెంట్‌లో అందుకు తగిన బలం లేదు కాబట్టి రెండో దఫా ఎన్నికైనప్పుడు ఆ పని చేశారు. ఈ చిత్రమంతా రాజ్యాంగంలో తాత్కాలిక ప్రాతిపదికతో ఉన్నప్పటికీ అంతర్జాతీయ సమస్యగా పరిణమించిన ఒక చట్టాన్ని నేలరాయడం అవసరం అన్న వాదనతోనే నడుస్తుంది. ఇస్లాంనే కాదు, ఇస్లాం మతోన్మాదం మీద కూడా కటువైన వ్యాఖ్య వినిపించదు. దాని క్రూరత్వం మాత్రం ప్రతి ఫ్రేమ్‌లోను కనిపిస్తూనే ఉంటుంది.


తెర మీద, తెర వెనుక

జూనీ హక్సర్‌ (యామీ గౌతమ్‌), రాజేశ్వరీ స్వామినాథన్‌ (ప్రియమణి రాజ్‌), రామాయణం ఫేం అరుణ్‌ గోవిల్‌ (ప్రధానమంత్రి), కిరణ్‌ కర్మాకర్‌ (హోంమంత్రి), ఖవార్‌ అలీ, అనుమానాస్పద ఉద్యోగి (రాజ్‌ అర్జున్‌), విపక్షనేత రోహిత్‌ థాపర్‌ (అసిత్‌ రెడిజి) ఐఎస్‌ఐ అధిపతి (సందీప్‌ చటర్జీ), జర్నలిస్ట్‌  బృందా ఘోష్‌ (ఇరావతి హర్షే). ఆదిత్య ధర్‌ (కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, యూరి దర్శకుడు). సిద్ధార్థ వసానీ (సినిమాటోగ్రఫీ). ఆదిత్య సుహాస్‌ జంభాలే (దర్శకుడు).

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram