మార్చి 1న పౌరరక్షణ ఉత్సవం ప్రపంచ వ్యాప్తంగా. 3 న రక్షణ దినోత్సవం. జాతీయంగా. ఆ తర్వాత మరికొన్నాళ్లకే అంతర్జాతీయంగా మహోత్సవం. ఈ మూడు సందర్భాల్లోనూ వినిపించే పేరు… మరీ ప్రధానంగా ‘రక్షణ’’ (8వ తేదీన ఉత్సవం వనితలకు ప్రత్యేకం. అందరి చర్చా వారి రక్షణ కోసమే). అందుకే మనం ఇప్పుడు అనుకోవాల్సిందీ, అనాల్సిందీ రెండ పదాల గురించే.

ఈ జాతీయ, అంతర్జాతీయ ఉత్సవాల వేళ ఏటా ప్రచార అంశాలు మారుతుంటాయి. మూడు ఉత్సవాల సందర్భాలూ వేర్వేరు అయినా, అంతర్లీనంగా వినిపించేదే మనో నేత్రానికి ‘కనిపించేది రక్షణాంశమే!’’ రక్షణ అంటే – అభయమివ్వడం, కాపుదల ఉండటం. ప్రాపుగా నిలవడం, శరణాగతి కల్పించడం.

సమాశ్రయం, నిర్ణయ పరికల్పనం.  ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా ఎప్పుడైనా సరే –

ఆడపిల్లలు / బాలికలు, యువతులు, మధ్యవయస్కులు, వృద్ధమహిళలు

వీరిలో ఎంతమందికి ఉంది పరిరక్షణ? ఇక…

ఈ సంవత్సర ప్రచారాంశం ‘పురోగమనాన్ని వేగవంతం చేయడం?’

అంటే- రక్షణకీ పురోగతికీ అవినాభావ సంబంధముంది. నిర్భయ వాతావరణం విస్తరిస్తేనే, వనితాలోకం పురోగామిత్వం పొందుతుంది.  ఇంతకీ ఇప్పుడున్నది ఎటువంటి వాతావరణం? ఇంతటి ‘రణ’ సివిల్‌ ఇం‌కెక్కడి పురోగమన వేగం?

మనసును గుర్తించి గౌరవించని చోట వర్తమానం, భవితవ్యం -రెండూ భయానకమే. కుటుంబంలో, సమాజంలో బాధ్యత వహించే ఆమెను వంకర చూపుతో చూస్తే…. ఫలితం తెలిసిందే.

ఆడశిశువుగా పుట్టినప్పటి నుంచీ బాధలు ఇప్పటికీ ఇంకా కొన్ని దేశాల్లో ఉన్నాయి. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచీ తన జీవనయానం ముగిసేవరకు నానారకాల కష్టనష్టాలు.

ఆడశిశు హత్యలు ఇంకానా? లోపల ఉండగానే చిదిమేయడమా!

చదువుకునే దశలోని అమ్మాయితో ఇంటా బయటా నానా చాకిరీ చేయించడమా?

ఉద్యోగినులకు పని ప్రదేశాలలో వేధింపులా?

పెళ్లి సమయంలో కట్నకానుకల గురించిన డిమాండ్లా?

మెట్టినింట హింస, సాధింపు. ఆఖరికి ప్రాణహరణం. వృద్ధులైన మహిళలకూ పలువిధాల బాధలు. మానసికంగా, శారీరకంగానో కూడా. ఎక్కడినుంచే కాదు – ‘అయినవాళ్ల’ నుంచే.

బాల్యం, యౌవనం, కౌమారం, వార్థక్యం. ఈ నాలుగు దశల్లోనూ స్త్రీకి ఎంతమేర ఉంది సంరక్షణ?

ఇదంటూ ఉంటేనే కదా- అడుగైనా, నడకైనా, పరుగైనా!

మొదట్లో మహిళా శ్రామిక దినోత్సవం. భావనా పరంపరతో సదస్సులు చికాగో, న్యూయార్క్, ‌మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. అమెరికాతో పాటు జర్మనీ ముందుకొచ్చింది. విస్తరణ కృషిలో అప్పట్లోనే 17 దేశాలు పాల్గొన్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, ‌స్విట్జర్లాండ్‌… ఇం‌కా కొన్నిచోట్ల శతాధిక సంవత్సరాల కిందటే వనితల దినోత్సవాలను నిర్వహించుకున్నారు.

అదంతా మార్చి నెలలోనే. అన్ని దేశాల్లోనూ 8 నే మహిళా దినోత్సవం అనేది పలు శాబ్దాల కిందటే నిర్ణయమైంది. అదీ శతాధికమే మరి. ఐక్యరాజ్యసమితికి చెందిన సర్వప్రతినిధి సభా ఆనాడే ప్రకటించింది.

ఇదంతా నేపథ్యం.

మనదేశానికి సంబంధించి, ‘‘శ్రామిక మహిళా సంఘ కృషికి వేదిక గుజరాత్‌. ‌వర్తమానంలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఈ రోజును ప్రత్యేకంగా పరిగణించి గౌరవిస్తున్నాయి. గత పాతికేళ్లను అవలోకిస్తే…యూఎన్‌కు ప్రచారాంశం అనేకమార్లు అహింసమీదనే కేంద్రీకృతమైంది. అవకాశాలు, అభివృద్ధి, సమత్వం, నిర్ణయశక్తి, వనితా సాధికారత పైనే అంతా కేంద్రీకృతమవుతోంది.

పత్రికారంగ ప్రోత్సాహం ఉండనే ఉంటుంది. అమెరికాలో ఉమెన్స్ ‌డే పేరిట ఒక పత్రికే ఉండేది. పలు స్త్రీ అంశాల గురించి రాస్తుండటం ఇప్పటికీ ఉంది. ఆహారం తయారీ, ఇంటి అలంకరణలు, పిల్లల పెంపకం, కళలు – వంటివి మాత్రమే కాదు. వనితల స్వరక్షణ, వారి పరిరక్షణ గురించిన ఆలోచనలూ ఆచరణలు విస్తరించాలన్నది ఇప్పటికీ అందటా వ్యాప్తి చెందింది. స్త్రీ సంక్షేమ బాధ్యత ఏ ఒక్కరిదో కాదు. అది అందరిదీ.

ఆ మాట కోస్తే – వెన్నెల కురిపించినా, అగ్నిని రగిలించినా ఆమే! అలకల నీలవేణి, అరుణారుణ పాణి, ఇటొక్క మాట ఓ చిలుకల కొల్కి! నీ ప్రణయ సీమలలో వసియింపనిమ్ము-మంజుల మధురార్ద్ర మూర్తి ! మనసుల్‌ ‌కుసుమింప ప్రసూనమాలతో గళము నలంకరింతు కడకన్నుల కాంక్షలు పల్లవింపగన్‌’ అం‌టే ఆ అనురాగ భావనను మనసారా స్వీకరిస్తుంది. అంతేకాదు.. సందర్భానుసారంగా ‘సురుచిర సురభిళ సుమమాలలో/ ప్రళయ మహాజ్వల జ్వాలలలో / మధుర గాథగా, విధుర బాధగా/ విధి నిర్వహణమే విజయపతాకగా’ కొనసాగుతుంది కూడా.

 ఆగ్రహాగ్ని రగిలిందా- అపరకాళికే అవుతుంది వనిత. ‘ఇది మహాశక్తి విజయ మియ్యది దురంత/ దుర్మద దురాక్రమణదురుద్యోగములకు/ దుర్భర పరాజయమ్మ! ఘాతుక కిరాత/ జాతి పెను భూతములకు శాశ్వతసమాధి! అనేలా దురాగతాలన్ని మీద యుద్ద ప్రకటన చేస్తుంది. అనుగ్రహం, ఆగ్రహం ఉంటాయి తనలో. అందువల్లనే తనదైన ఆత్మవిశ్వాసాన్ని సంభావించాలి ఎవరైనా. వీరనారీమణులు ఎందరు లేరు? త్యాగచరితలు ఎందరెందరో కదా!

ఒక్కసారి తలచుకుంటేనే ధీరత్వం నిండుతుంది మనలో. రెండు చేతులూ జోడించి న•మస్కరించాలని అనిపిస్తుంది ఎన్నోమార్లు. వారి నిశ్చయత అంతగొప్పది. స్వత••ంత్రస్ఫూర్తి ఎంతో విస్తృతమైనది. ఎదురైన సవాళ్లను ఎదుర్కోవాలన్నా, కొత్తవి రాకుండా జాగ్రత్త వహించాలన్నా వనితే.

‘ప్రణయినీ, ప్రశయ రూపిణీ తానే/ కిన్నెర మీటుతుంది, శంఖాన్నీ ఊదుతుంది/ ఆమెను ఆమెగా గౌరవిస్తే అదే దినోత్సవం!’… తనకు రక్షణ సమస్యగా మారిందంటే, అదొక ఉత్పాతమే. చిన్నపుడు ఆమె ఒడే బిడ్డలకు బడి. ఆ బిడ్డలే పెరిగి పెద్దవాళ్లయ్యాక తల్లిని ఏ అనాథ ఆశ్రమానికో చేరిస్తే ఆరోగ్యం సహా ఎటువంటి రక్షణ కల్పించకపోతే..తన కన్నీరు సాగరఘోషలే అవుతాయి. ఎప్పుడైనా, ఎక్కడైనా గౌరవంలో మొదటి వరుసలోనే ఉంచాలి ఆమెను. ఇంటా బయటా కృతజ్ఞత కనబరచాలి.

ప్రపంచంలో ఒక దేశానికి తొలి అధ్యక్షురాలు ఎవరు? అనౌషి. అంతరిక్ష యాత్రికురాలు ప్రధమంగా ఎవరు? ఎవరెస్టును తొలుత అధిరోహించిన లలన? జంకోతవి.

ఇంకా మన దేశాన… ఒక రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్‌ ‌సరోజినీనాయుడు, ప్రథమ వనితా ముఖ్యమంత్రి సుచేతా కృపలానీ.

మొట్టమొదటి మహిళా ఐపీఎస్‌ ఉన్నతాధికారిణి కిరణ్‌బేడి. ప్రథమంగా ఈ లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ ‌పునీత.

రక్షణ / భద్రతాదళాల నిర్వహణ పరంహా హరిత – కంచన్‌ ‌పోలీస్‌ ‌విభాగ లేడి డీజీ వైమాన దళ తొలినారీ పైలట్‌. ‌మొదటి మహిళ ఎయిర్‌ ‌వైస్‌ ‌మార్షల్‌ ‌కూడా ఉన్నారు. ఒలంపిక్‌ ‌మోడల్‌ ‌మహిళా విజేత కరణం మల్లేశ్వరకదా! వీరందరు చైతన్య జ్యోతులు. సబల అనే పదానికి నిండైన రూపాలు.

భారత చరిత్రను చూడండి. ఒరలో తుపాకులు, నడుముకు కత్తులతో సంగ్రామ రంగంలో వీరఝాన్సీ.

ప్రళయకాల మహోగ్ర భానుకిరణంగా మెరిసింది వీరాంగన రుద్రమ. భృకుటిలో భీకరతరంగం, కంఠంలో కరాళ హూంకారమున్న ఏకవీరాదేవి. అయినవారిలో రక్షణని ప్రబోధించింది స్త్రీ హృదయం. కన్నబిడ్డలకు తక్షణ కర్తవ్య నిర్దేశం చేసింది.

జయభవానీ! జయజయ భవానీ !

‘‘వీరమాత జిజియ ఆరాధిస్తున్నది/ జగజ్జనని దుర్గను / అప్పుడే అరుదెంచిన బాలశివాజీకి/ విజయతిలకం దిద్దింది నుదుటను / కళకళ వెలిగే కర్పూరహారతిని / కన్నబిడ్డ కనులకద్దింది సుతారంగ / ఆ జననీ ఆనంద బాష్పాలు / జగజ్జనని ఆశీః పుష్పాలు / వీరకుమార శివునిపైన జల జల రాలాయి’’….

అంటూ ప్రబోధ గీతిక అందించింది కవి కలం.

‘‘శివా! నీ భవానీ ఖడ్గంపైన ఒట్టు అరాచకాన్ని పోగొట్టు, గమ్యం గుర్తించు, కర్తవ్యం నిర్వర్తించు. విజయీభవ’’ అని పలికింది జిజియామాత. జై శివాజీ అన్నట్లుంది గుడిలో జగన్మాత.

ఇదీ సహజశక్తి సంపన్నత అంటే. స్త్రీ మూర్తి పటుత్వం అజేయం. సంవత్సరంలో ఒకరోజు అని కాదు, ప్రతిరోజు ఉత్సవాలు జరుగుతాయన్నంత స్ఫూర్తిమత్వం అంతటా విస్తరించాలి. అంతర్జాతీయ వనితా దినోత్సవం అనడంతోనే, వారిమీద నేరాల గణాంకాలను వెల్లడించి అటువంటి పరిస్థితి అంతరించాలని కోరుకోవటంతోనే సరిపోదు. అసల ఆ విధమైన ఆక్రోశానికి భిన్నంగా ఉండే ప్రశాంతయుత సామాజిక వాతావరణం కావాలి, రావాలి, నిలవాలి, గెలవాలి.

సమాజ జీవనంలోని జాగృత వైఖరే స్త్రీ జాతికి సదా సర్వదా ఆశాజ్యోతి. వనితమీద నేరానికి పాల్పడితే పుట్టగతులుండవన్న గుండెలదిరే బెదురు నేరగాళ్ళకు కల్పించి తీరాలి. చట్టం చర్యలు ఉక్కులా పదును తేలితే, పాలకపక్షాలు ఉక్కు పిడికిలి బిగిస్తే, మిగిలిన పౌర సమాజమంతా ఉక్కు సంకల్పానికి ప్రతీకగా నిలిస్తే… అదీ అంతర్జాతీయ మహిళాదినోత్సవ నిర్వహణ అంటే.

జయభేరి మ్రోగించాలన్నా, అంతకుముందే ఉద్యమ శక్తిగా రాణించాలన్నా నారీమణులే! మన దేశంలోనైనా విదేశాలలోనైనా.

-జంధ్యాల శరత్‌బాబు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram