సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  పుష్య  బహుళ  దశమి – 05 ఫిబ్రవరి 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన నాలుగు రోజులకే జ్ఞానవాపి అంశం దేశంలో చర్చనీయాంశం కావడం కేవలం యాదృచ్ఛికం. ఆ చర్చ కొనసాగేదే కూడా. భారత పురావస్తు శాఖ నివేదిక వెలువడడం, జనవరి 29న ఉత్తరాఖండ్‌ జ్యోతిషపీఠం శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానందను జ్ఞానవాపి ప్రదక్షిణ చేయడానికి అనుమతించక పోవడం దేశంలో చర్చకు రాకుండా ఉండడం సాధ్యం కాదు. జ్ఞానవాపి హిందువులదా? ముస్లింలదా? తేల్చే అంశం కోర్టులో ఉన్నది కాబట్టి, ముందస్తు అనుమతి తీసుకోలేదు కాబట్టి స్వామి ప్రదక్షిణను అనుమతించడం లేదని పోలీసులు చెబుతున్నారు. పైగా అక్కడ 144 సెక్షన్‌ కూడా అమలులో ఉన్నది. అయినా ఒక మఠాధిపతికి ఇలాంటి అనుభవం ఎదురుకావడం సరైనది కాదు.

జ్ఞానవాపి ఒక బ్రహ్మాండమైన హిందూ దేవాలయం మీద కట్టిన మసీదేనని భారత పురావస్తు శాఖ ఇచ్చిన 839 పేజీల నివేదిక చెబుతున్నది. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‘జ్ఞానవాపి మసీదు’ అనవద్దు, అలా పిలవడం వల్ల వివాదం పరిధి పెరిగిపోతుందని సున్నితంగా హెచ్చరించడం దేశమంతా గమనించింది.

భారత పురావస్తు శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం జ్ఞానవాపి లోపల 55 హిందూ దేవీదేవతల ప్రతిమలు లభ్యమైనాయి. వినాయకుడు, నంది, మారుతి వంటి ప్రతిమలు ఉన్నాయి. స్వస్తిక్‌, త్రిశూలం వంటి గుర్తులు కూడా కనిపించాయి. కొద్దినెలల క్రితమే శివలింగం బయటపడి జ్ఞానవాపి కేసు స్వరూపాన్నే మార్చి వేసింది. నమాజ్‌కు ముందు చేసే వజూ (చేతులు శుభ్రం చేసుకోవడం) దగ్గర ఈ శివలింగం ఉంది. అది ఫౌంటేన్‌ అని ముస్లిం వర్గాలు వాదించబోయి బొక్క బోర్లా పడ్డాయి. శివలింగం ఉన్న ప్రాంతాన్ని ఇంతకాలం వినియోగించుకున్న తీరు, ఇప్పుడు దాని మీద ముస్లిం వర్గాలు వినిపిస్తున్న వాదన రెండూ కూడా హిందువులకు అవమానకరమే.

హిందూధర్మానికి సంబంధించిన ఇన్ని ఆనవాళ్లు ఉంటే, నిజంగానే ఆ కట్టడం నమాజ్‌ చేయడానికి పనికి వస్తుందా? ఈ విషయం మీద ముస్లింలలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అనిపిస్తుంది. 29వ తేదీ రాత్రి ఒక ప్రముఖ టీవీ చానల్‌లో వచ్చిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ ముస్లిం పండితుడు అతీక్‌ ఉర్‌ రహమాన్‌ ఒక మాట అన్నారు. తానైతే ఆ మసీదుకు పోను, నమాజ్‌ చేయను అన్నారాయన. కారణం ఇదే. కానీ స్థానిక ముస్లింలు అందులో నమాజ్‌ చేస్తున్నారు. అది ముస్లింల అధీనంలోనే ఉన్నది. జ్ఞానవాపిని మసీదు అని చెప్పడానికి ఇస్లాం నిబంధనలే ఆమోదించడం లేదు. ఈ వాస్తవాన్ని ఒక పండితుడు (రహమాన్‌) అంగీకరించారు. అయినా హిందూ చిహ్నాలను దాచిపెట్టి, వాటిని సర్వే చేయకుండా కోర్టు కేసుల ద్వారా అడ్డుకుంటూ జాప్యం చేయడం ప్రశ్నార్థకమే. అయోధ్యలో అయిందేమిటో తెలుసు. ఇప్పుడు కాశీలో. రేపు మధురలో కూడా కావచ్చు. చారిత్రక సత్యాలను ఎక్కువ కాలం మరుగుపరచలేరు. అవి ఏదో ఒక మూల నుంచి బయటకు వస్తాయి. ఎటొచ్చీ అలాంటి ఒక సందర్భం రావాలి. కాశీలో ఇప్పుడు అలాంటి సందర్భం వచ్చి ఆధారాలు బయటపడ్డాయి. మరి ఆ కట్టడాన్ని హిందువులకు అప్పగించవచ్చు కదా అని వ్యాఖ్యాత ప్రశ్నించారు. ఈ ప్రశ్న నిర్మాణాత్మకమైనదే. అయోధ్య అనుభవాన్ని బట్టి అయినా ముస్లింలు ఆ పని చేయవచ్చు. అయోధ్య వివాదం ఐదువందల ఏళ్ల నాటిది. గడచిన మూడున్నర దశాబ్దాలుగా భారత రాజకీయ, సామాజిక వ్యవస్థలను శాసించింది. ఒక ఉద్రిక్తత వాతావరణాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఇది పునరావృతం కాకుండా నివారించడానికైనా జ్ఞానవాపిని, ఈ ఆధారాలను బట్టి హిందువుల పరం చేయవచ్చు కదా అన్నారు వ్యాఖ్యాత. అందుకు మాత్రం ఆ ముస్లిం పండితుడు జవాబు దాటవేశారు.

అయోధ్య, కాశీ, మధుర ఇవి మాత్రమే మేం కోరుతున్నాం, పెద్ద మనసు చేసుకుని, వాస్తవిక పరిస్థితులను, వర్తమాన కాలాన్నీ దృష్టిలో ఉంచుకుని ముస్లింలు ఆ పని చేస్తే మంచిదని హిందువులు చిరకాలంగా కోరుతున్నారు. జ్ఞానవాపి విషయంలో తొలిసారి విశ్వహిందూ పరిషత్‌ కూడా గొంతెత్తింది. ఆ ప్రాంగణాన్ని హిందువులకు అప్పగించాలని కోరింది. ఈ దృక్పథం నుంచి హిందువులు, ముస్లింల మధ్య చర్చ ప్రారంభం కావడమే మంచిది. గతం నుంచి పాఠాలు నేర్చుకోవడానికి బొత్తిగా ఇష్టపడని మతోన్మాదం, మొగలుల కాలం నాటి ఆధిక్యతనే ఇప్పటికీ కోరుకుంటున్న ఆధిపత్య ధోరణి జడలు విప్పరాదు. అయినా అందుకు సంబంధించిన జాడలు అప్పుడే కనిపిస్తున్నాయి. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు హాజరైనందుకు భారత ఇమామ్‌ల సంఘం అధ్యక్షుడు ఇల్యాసీ మీద ఫత్వా జారీ చేసి ఒక అవాంఛనీయ వాతావరణానికి తెర తీశారు. భారత పురావస్తు శాఖ నివేదికను కూడా కొట్టిపారేసేందుకు ఎంఐఎం నాయకుడు ఒవైసీ తహతహ లాడుతున్నారు. ఇలాంటి గొంతులు బలపడక ముందే ఆ చర్చల ప్రక్రియ ప్రారంభం కావడం అవసరం. ఎందుకంటే ఈ దేశంలో అన్ని వర్గాలు సయోధ్యతో, సామరస్యంతో జీవించవలసి ఉందనేదే పరమ సత్యం. వాస్తవిక దృష్టి. అయితే అది మెజారిటీ ప్రజల బాధ్యత మాత్రమే కాదు. ఇన్ని సాక్ష్యాధారాలు బయటపడిన తరువాత కోర్టులు ఎలాంటి తీర్పును ఇస్తాయో ఊహించవచ్చు. ప్రతి మసీదులోను శివలింగాలు వెతికే ప్రయత్నం చేయరాదని ఇప్పటికే హిందువులు భావిస్తున్నారు. కాబట్టి వారు న్యాయంగా కోరుతున్న మూడు మహా పుణ్యక్షేత్రాలను సగౌరవంగా అప్పగిస్తే దేశ చరిత్రలో అదొక మహోన్నత ఘట్టమే అవుతుంది.

About Author

By editor

Twitter
Instagram