సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  పుష్య శుద్ధ ద్వాదశి – 22 జనవరి 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేనివి కొన్ని ఉన్నాయి. ఆహ్వానించదగినవి మాత్రం విశేషంగా ఉన్నాయి. దేశ చరిత్ర దిశ మారుతున్న సంకేతాలు కూడా గణనీయంగానే ఉన్నాయి. ఇదీ`అయోధ్య భవ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠ వేళ భారతీయ సమాజంలో కనిపిస్తున్న దృశ్యం. మరొకవైపు ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచం ఎదురుచూస్తున్నదన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ప్రాణప్రతిష్ఠ భారతీయ నాగరికతలోనే ఒక మలుపు అన్నది ప్రస్తుతానికి ఎందరో విజ్ఞులకు కలిగిన అంచనా. ఐదు వందల ఏళ్ల ఓర్పుకీ, ఎదురుచూపులకీ, పోరాటాల ఫలితాలకీ, త్యాగాలకీ ఇది పరాకాష్ట అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇంతటి మహోన్నత ఆధ్యాత్మిక క్రతువులో భాగస్వామి కావడానికి వీలుగా 11 రోజుల అనుష్టాన దీక్షను కూడా ప్రారంభించినట్టు ఆయన ‘ఎక్స్‌’లో జాతి జనులకు తెలియచేశారు. 12వ తేదీన ఈ విషయం ప్రకటించిన మోదీ, ఆ రోజే నాసిక్‌లో ఒక ఆలయంలో స్వయంగా శుచి కార్యక్రమం నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో తాను భౌతికంగా ఉన్నప్పటికీ తన గుండెచప్పుళ్లలో 140 కోట్ల మంది భారతీయుల హృదయ స్పందన కూడా ఉంటుందని అన్నారాయన.  అయోధ్య ఆలయ నిర్మాణం కోసం భగవంతుడు పంపించిన ప్రతినిధి మోదీ అని లాల్‌ కృష్ణ అడ్వానీ ‘రాష్ట్రధర్మ’ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖీలో వ్యాఖ్యానించారు. 2005లో ఆఖరిసారి సందర్శించిన అడ్వానీ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విచ్చేస్తే అయోధ్యవాసులంతా ఆనందిస్తారని రామాలయ ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్రదాస్‌ అభిలషించారు. అడ్వానీ వెళతారనే ఎక్కువమంది నమ్మకం. వెళ్లాలన్నదే చాలామంది ఆకాంక్ష. అలాగే అయోధ్య మందిర నిర్మాణం కోసం మూడు నాలుగు దశాబ్దాలుగా తపించిన వారికీ, పోరాడినవారికీ కూడా ఆ మహత్తర కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం భగవంతుడు కల్పించాలని ఆశిద్దాం.

ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఆహ్వానానికి కాంగ్రెస్‌ పార్టీ ‘గౌరవప్రదమైన’ నిరాకరణ ఎవరినీ ఆశ్చర్యపరిచేదే కాదు. జనవరి 10న ఈ గౌరవప్రదమైన నిరాకరణ గురించి ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. ఇచ్చిన మర్యాదను స్వీకరించడానికి కూడా సంస్కారం కావాలి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి అలాంటి సంస్కారాన్ని ఆశించడం శుద్ధ దండగ. ఆ పార్టీ చరిత్ర అలాంటిది. చింతన అలాంటిది. గాఢమైన జాతీయభావాలనూ, దేశంలోని మెజారిటీ ప్రజల మనోభావాలనూ ఆ పార్టీ ఏనాడూ గౌరవించిన పాపాన పోలేదు. ఆ క్రమంలోనే హిందూత్వ భావనలను కలిగిన ఏ ఒక్క నేతకూ స్వాతంత్య్ర పోరాట సంస్థగా కూడా కాంగ్రెస్‌ నిలువ నీడనివ్వలేదు. బాలగంగాధర తిలక్‌, అరవింద ఘోష్‌, లాలా లాజ్‌పతిరాయ్‌, బిపిన్‌చంద్ర పాల్‌ వంటి వారందరినీ వెళ్లగొట్టేవరకు అది నిద్రపోలేదన్నది చరిత్ర. మరొక గొప్ప ఉదాహరణ సోమనాథ్‌ ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం. ఆ కార్యక్రమంలో పాల్గొనాలని దృఢ సంకల్పంతో ఉన్న నాటి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ను నిలువరించడానికి ప్రథమ ప్రధాని చేసిన ప్రయత్నం జుగుప్సాకరమైన ఘట్టం. ఇప్పుడు కూడా అంతే. అసలు రాముడి ఉనికే లేదని అత్యున్నత న్యాయస్థానానికి చెప్పేసిన పార్టీ, ఆయన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వస్తుందని అనుకోలేం. ఇదొక్కటేనా కారణం? ఆ సంస్థకు ఇప్పుడు నాయకత్వం వహిస్తున్న వారి వ్యక్తిగత విశ్వాసాలు కూడా ఈ గౌరవప్రదమైన నిరాకరణకు కారణమే. ‘సనాతన ధర్మ’ నిర్మూలనే ధ్యేయంగా ఉన్న డీఎంకే ఇచ్చే ముష్టి రాజకీయ దానం చేజారిపోతుందేమోనన్న బెంగ  ఎలాగూ ఉంటుంది. నిజానికి ఎన్నికల తేదీని ఇప్పటికే  ప్రకటించి ఉంటే, ‘జన్యుధారి’ రాహుల్‌గాంధీ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఎగిరి చక్కా వచ్చేవారే. ఇక కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులుగా చలామణి అయ్యే నెహ్రూ`గాంధీ కుటుంబీకుల బంట్లు  చేస్తున్న వ్యాఖ్యలు మరీ వికారంగా ఉన్నాయి. మందిరం బీజేపీ – ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ ప్రాజెక్ట్‌ అట. పిలుపులలో మర్యాద లేదట. అయోధ్య ఉద్యమం ప్రారంభమయ్యే నాటికి ఆర్‌ఎస్‌ఎస్‌ లేదు, బీజేపీ అసలే లేదు. ఇవన్నీ దేశంలోని మెజారిటీ ప్రజల మనోభావాలను దారుణంగా కించపరిచేవేనని తెలియనంత పదవీదాహంతో వీరు వేగిపోతున్నారు. కానీ ఇదంతా పదవీ రాజకీయమేననీ, సెక్యులరిజాన్ని ఇంకా భ్రష్టుపట్టించడమేనని వీళ్లకి అనిపించడం లేదు. కమ్యూనిస్టులు, మమత, నితీశ్‌ వంటివారిది కూడా ఇదే ధోరణి.

కానీ కాంగ్రెస్‌ పార్టీలోనే డాక్టర్‌ కరణ్‌సింగ్‌ వంటివారు ఆహ్వాన తిరస్కృతిని నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నారు. ‘వాళ్లెందుకు (ఆహ్వానం అందినవాళ్లు) వెళ్లడం లేదో నాకు తెలియదు. అందుకు నేను విమర్శించను. కొందరు నాయకులు వ్యక్తిగత హోదాలో వెళ్లినా మంచిదేనని ఆయన హితువు పలికారు. తనకు ఆహ్వానం ఉన్నా 93 ఏళ్లు కాబట్టి కదలలేనని చెబుతున్నారు.

ఐదువందల ఏళ్ల అయోధ్య పోరాటంతుది దశలో అయినా ముస్లింలు ఆ కట్టడాన్ని హిందువులకు స్వచ్ఛందంగా ఇచ్చి ఉంటే భారతదేశ చరిత్రలో గొప్ప ఘట్టం చోటు చేసుకుని ఉండేదని అన్ని వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు. చరిత్రలో జరిగిన తప్పుతో జరిగిన ఘోర తప్పిదాన్ని  గుర్తించి, నమాజు చేయకుండా విడిచిపెట్టిన ఒక కట్టడాన్ని హిందువులకు అప్పగించి ఉంటే దేశంలో సమైక్యతకూ, మత సామరస్యానికీ గొప్ప మలుపు అయి ఉండేదే. కానీ కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, ఇతర సెక్యులర్‌ పార్టీలు ముస్లింలను అందుకు సిద్ధపడనివ్వలేదన్నది ఒక కఠోర సత్యం. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠనూ బహిష్కరించాయి. అలా, ఇంత జరిగినా హిందువులకీ, ముస్లింలకీ మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతూ ఉండడమే తమ అభిమతమని ఈ వైఖరితోనూ నిరూపించాయి.

About Author

By editor

Twitter
Instagram