విలువిద్య….అర్జున పురస్కారం అందుకున్న మహిళామణి శీతల్‌ ‌దేవి.

కొత్త సంవత్సరాది తరుణంలో మహత్తర విశేషమిది!

ఎందుకంటే- ఆ ఆర్చరీ ఛాంపియన్‌కి చేతులు లేవు!‘

అదేమిటి? అసలు చేతులు లేని ఆమెకు విలువిద్య

పురస్కారమా?’అని  నివ్వెరపోకండి.

కాళ్లనే చేతులుగా ఉపయోగించిన శక్తిరూపిణి ఆమె.

ఇంతకీ  ఆ అమ్మాయికి పదిహేడేళ్లే!!

హాట్సాఫ్‌ ‌శీతల్‌ ‌దేవీ!!!

అరుదైన ఆకారం తనది. తాను సాధించిందీ ఎంతో అరుదైన ఘనతే! శీతల్‌ది జమ్మూకశ్మీర్‌లోని మారుమూల గ్రామం లోయిధర్‌ ఆమె పుట్టిన ఊరు. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన ఆమె అసాధారణ విజయాలతో ఆశ్చర్యపరుస్తోంది.

తల్లిపేరు శక్తి. ఆ పేరులోని తీరు కూతురికి ప్రాప్తించింది. తండ్రి మన్‌సింగ్‌. ‌శక్తి సంపన్నతనే నమ్మిన వ్యక్తి. పుట్టిన బిడ్డను చూసి ఆ దంపతులు నిర్ఘాంతపోయారు. షాక్‌ ‌మెలియా అనే అరుదైన వ్యాధి ఫలితం ఆ పాప. అత్యంత అరుదైన రుగ్మత. లక్షమందిలో ఒకరికి సంక్రమించే అరుదైన రుగ్మత. చేత••ల పైభాగం కనిపించదు. శరీరం లోపలే జోడించినట్లు ఉంటుంది.

నిలువునా కుంగిపోయిన అమ్మానాన్న వెంటనే తేరుకున్నారు. విధి వైచిత్రిని ఒక సవాలుగా స్వీకరించారు. అదీ, తల్లీ తండ్రీ, కూతురి గొప్పతనం.

‘కుదిరితే పరిగెత్తు…. లేకపోతే నడువు

అదీ చేతకాకపోతే పాకుతూ పో

అంతే కానీ – ఒకేచోట అలా

కదలకుండా ఉండిపోవద్దు.

అలాగే ఉండిపోతే ఎలా?

పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు

ఏదీ ఆగదు; ఆగడానికి వీల్లేదు

అనుకున్నది సాధించి తీరాల్సిందే. నీలో….

కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురు

దానితో సహా ఏదీ ఆగకూడదంతే.

లే… కదులు… ముందుకు సాగు…

సంకెళ్లను తెంచు. నువ్వు ఉన్నచోట నుంచే పరుగు ఆరంభించు?’

ఇదే శీతల్‌ ‌పంతం, పట్టుదలా.

ఆ అమ్మాయి పేరులో చల్లదనం ఉన్నా తీరు మొత్తం సలసలకాగే వేడి తనమే. మహామహా ఉత్సాహం. అలుపూ సొలుపూ ఏ మాత్రం లేని, రాని శక్తితత్వం.ఆమెకు 12 సంవత్సరాలపుడు జిల్లా కేంద్రం కిష్త్వార్‌లో జరిగిన ఓ యువజన సమ్మేళనానికి వెళ్లింది.

ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది రాష్ట్రీయ రైఫిల్స్. ‌దేశంలో తీవ్రవాద వెన్ను విరిచిపారేసే సాయుధ దళం. యువశక్తిని చక్కగా వినియోగించుకునే భారతీయ బృందం. సైన్యంలోని కీలక విభాగం.

ఆ అధికారుల గుర్తించారీ అమ్మాయిని. అసాధారణ ఘన వియాలు సాధించే అద్భుతశక్తి ఆమె లోలోపల ఉందని గ్రహించారు. ‘చేతుల్లో ఉండాల్సిన బలమంతా ఆమె కాళ్లలో కేంద్రీకృతమైందని గుర్తించారు. తన నైపుణ్య కేంద్రం అదే కాబట్టి, ఆ కాళ్లతోనే ఆమెకు ఇష్టమైన విలువిద్య శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. ‘అమ్మాయీ! భవిష్యత్తు నీదే’ అంటూ ప్రోత్సహించారు.వారి నమ్మకం వమ్ము కాలేదు. ఆమె ఆత్మవిశ్వాసంతో శిక్షణలో దూసుకెళ్లింది. ఏడాది తిరగకుండానే, ‘జయహో’ అనిపించింది.

విద్య, వైద్యం, శిక్షణ, సౌలభ్యం – అన్నింటా అంతటా గట్టి మద్దతు లభించిందా యువతికి. కాలంతో పాటే తన విశ్వాసశక్తీ సమాంతరంగా ప్రవహించింది. అమేయమైన ఆమె ఆత్మబలం ముందు అంతటి వైకల్యమూ తలవంచింది.

2023 సంవత్సరంలో ‘నారీ భేరి’ మోగింది. కేవలం ఆ ఒక్క ఏడాదిలోనే అన్ని రికార్డులనీ బద్దలు కొట్టిందా జగజ్జెట్టి. ఆసియా పారాలింపిక్‌ ‌కమిటీ నుంచి ‘అత్యుత్తమ యూత్‌ అథ్లెట్‌’ అవార్డు సంపాదించింది. అదే సంవత్సరానికి సంబంధించి, అర్జున అవార్డు!

అంతకుముందు…2022లో వ్యక్తిగత, మిక్స్‌డ్‌ ‌టీమ్‌, ‌డబుల్స్ ‌విభాగాలలో ‘హాంగ్‌జ్‌’ ‌వేదిక నుంచి పురస్కారాలు.

అవి నాలుగో ఆసియా పారాగేమ్స్. ఆసియా క్రీడలకు సమాంతరం. దివ్యాంగ అథ్లెట్ల కోసం ఏర్పాటైన విశ్వక్రీడోత్సవాలు. వాటిల్లో వరసగా అన్నింటిలోనూ అపార పటిమ చూపింది శీతల్‌దేవి. గత అక్టోబరులో చైనాలో ముగిసిన ఆ పోటీల్లో ఎంతో ధాటి కనబరచి, క్రీడా విశ్లేషకులతో ‘శభాష్‌’ అనిపించుకుంది. భేష్‌ ‌భేష్‌ అని పురస్కృతులందచేసింది ఆసియన్‌ ‌పారాలింపిక్‌ ‌కమిటీ.

అది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని విఖ్యాత సంస్థ. ఆసియా ఖండంలోని పదుల కొద్దీ జాతీయస్థాయి కమిటీలకు అందులో సభ్యత్వముంది. అంతర్జాతీయ పారాలింపిక్‌ ‌కమిటీకి అనుబంధం. ఆ సంస్థ ఆమెను సమున్నత రీతిన సత్కరించింది. అథ్లెట్లు అందరికీ మార్గదర్శనిగా అభివర్ణించింది.

‘వనితాలోకంలో ఆమె నవయువరాణి’ అని ప్రసార ప్రచార సమాచార మాధ్యమాలు ప్రస్తుతించాయి. ఏ ఆయుధాలు లేకుండానే సమర రంగాన నిలిచి గెలిచిందని ఎంతగానో కొనియాడాయి. ‘క్రీడా సముద్రాన పెను అలలు సృష్టించిన ధీరవనిత’ అంటూ పతాక శీర్షికల్లో ప్రకటించాయి. పారాగేమ్స్‌లో మొట్టమొదటగా స్వర్ణపతకం గెలుచుకున్న యువతీలలామ, ఆత్మవిశ్వాసమే ఆమెకు రెక్కలని ప్రశంసించాయి. చేతులు లేకున్నా తన చేతలతో కూడా పతకాలనీ చేజిక్కించుకున్న ధీర చరితురాలని పత్రికలూ, టీవీలూ కీర్తించాయి.

‘బెస్‌ ‌యూత్‌ అథ్లెట్‌ ఆఫ్‌ ఏషియన్‌ అవార్డస్’. ఆ ‌మహోన్నత గౌరవం ఆమెకే సొంతమని దేశదేశాలూ శ్లాఘించాయి.

భారత ప్రభుత్వం ‘అర్జున్‌’ ‌ప్రకటించింది. ‘అర్జున’ అనేది ఎంతెంతో సాధికారికం. అత్యుత్తమ క్రీడా ప్రదర్శనకు భారత ప్రభుత్వమే బహూకరించే శిఖరస్థాయి పురస్కారం.

విభిన్న శ్రేణి వైకల్యాలున్న విలు విద్య ధీరుల కోసం ఒక స్థాయి ఆట. ఆ క్రీడా మైదానంలో మెరుపులన్నింటినీ ఒక్కసారిగా మెరిపించిన ఆమెను ఆడపిల్ల… కేంద్రం పరమోన్నత తీరున సత్కరించింది. అంతర్జాతీయ ఆర్చరీ ఫెడరేషన్‌ ‌శుభాకాంక్షల వర్షం కురిపించింది.

పిడికిలి, మణికట్టు, మోచేయి, భుజం – ఇవీ కదా ఏ మనిషికైనా ప్రథమ, ప్రధాన ఆధారాలు. అవి లోపించినా, చెదరకుండా అదరకుండా బెదర

కుండా విజయఢంకా మోగించిన ఆమెను దేశదేశాలూ అన్ని క్రీడా వ్యవస్థలూ అగ్రస్థానాన నిలబెట్టాయి.

ప్రపంచ నెంబర్‌ ‌వన్‌ ఆర్చర్‌గా, పారా రంగాన దీటుగా మేటిగా ధా•గా వెలుగుతోంది. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ము•ర్ము నుంచి అర్జున పురస్కారం స్వీకరణ వేళ శీతల్‌ ‌భావోద్వేగం అనంతంగా మారింది… క్రీడోత్సవాల సాహసపథంలో దూసుకెళ్లిన యువతిని రాష్ట్రపతి నిండు మనసుతో ఆశీర్వదించారు. ‘అమ్మాయీ! సాహసం అంటే నీదే, సాహసి ఎవరంటే నువ్వే’ అంటూ అభినందనలతో ముంచెత్తారు.

యువశక్తికి తిరుగులేదు. ఎదురు ఉండదు.

అర్జునుడులానే ఈ అర్జున అవార్డీ మహిళా సవ్యసాచి.

రెండు చేతులతోనే ఒకే పని చేయగలగడం. కుడి, ఎడమచేతి పనిని ఒక్కసారిగా చేయడం. మరి…. చేతులు లేకున్నా విల్లు సంధించి ప్రయోగించి రికార్డులు సృష్టించిన మన శీతల్‌ ‌దేవిని ఏమని పిలవాలి?

మీరే చెప్పండి.

– ‌జంధ్యాల శరత్‌బాబు,

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE