13.2.2024‌న కర్నూలులో జరిగిన స్వయంసేవకుల సాంఘిక్‌లో పూజనీయ సర్‌సంఘచాలక్‌ ‌మోహన్‌జీ భాగవత్‌ ‌సందేశం.

హిందూ సమాజాన్ని, హిందూధర్మాన్ని, దేశాన్ని మనవిగా స్వయంసేవకులందరం భావిస్తాం. అందుకని వీటి సంరక్షణ కోసం మనం పని చేస్తాం. అంతేగాని స్వలాభం కోసం, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌గొప్పతనం కోసం పని చేయడం లేదు. మనం జీవించేది స్వల్ప కాలమే. అయినప్పటికీ, తల్లీ! నీ వైభవం ఎల్లప్పటికీ వెలుగొందుతూ ఉండాలని కోరుతూ దేశక్షేమాన్ని కాంక్షిస్తూ పనిచేస్తాం. ఈ దేశ, ధర్మ సంస్కృతుల ఉన్నతి కోసం తన శక్తినంతటినీ ఉపయోగించి పని చేయాలని స్వయంసేవక్‌ ‌కోరుకుంటాడు. మన దగ్గర సాధనాలు లేవు కాబట్టి పని మానివేయం. కఠిన పరిస్థితులెదురైనప్పటికీ వాటిని ఎదుర్కొని పనిచేస్తాం. ధర్మాన్నీ, సంస్కృతినీ కాపాడటానికి అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడాలనే భావన స్వయం సేవకులలో నిర్మాణమై ఉంటుంది.  ఈ భావన ఆధారంగానే సంఘ పని జరుగుతున్నది.

డాక్టర్‌జీ ఆర్‌ఎస్‌ఎస్‌ (‌సంఘం)ను స్థాపించినప్పుడు వారి దగ్గర ధనం లేదు. చాల పేదవారు. వైద్య విద్య చదివినా ప్రాక్టీసు చేయలేదు. హిందూ రాష్ట్రాన్ని సంఘటితం చేయడం కోసం జీవితాన్ని సమర్పించారు. హిందూ అని పేరుతో పిలవడం సంకుచితమని, మతమౌఢ్యమని ఆనాడు అందరూ భావించేవారు. డాక్టర్‌జీ తలపెట్టిన పనికి ఆనాడు వారి దగ్గర ధనమే కాదు కదా, అందుకు ప్రచారం లేదు, ప్రభుత్వ సమర్థన లేదు, కార్యకర్తలు కూడా లేరు. తను సంకల్పించిన పనిని సాకారం చేసుకోవ డానికి వారొక్కరే స్వీయ శక్తిపై ఆధారపడ్డారు. దానికోసం జీవితాంతం శ్రమించారు. ఈ దేశవాసు లందరూ నావారే.. వారి జీవితాలు బాగుపడి•తే నా జీవితం కూడా సార్థకమవుతుంది కనుక వారి ఉన్నతే నా ఉన్నతి. వారంతా అభివృద్ధి సాధించలేకపోతే నా ఉన్నతికి అర్థం లేదు అనే గొప్ప భావనను డాక్టర్‌జీ మనసులో నిలుపుకొని సంఘాన్ని ప్రారంభించడానికి సాహసించారు.

డాక్టర్‌జీ ఈ పనిని సఫలం చేసి చూపించారు. నేడు సంఘం చాలా ప్రసిద్ధి చెందింది. బాగా విస్తరిం చింది కూడా. అనేక రంగాల్లో ప్రవేశించింది. రాజకీయ క్షేత్రంలో ప్రవేశించి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. విశ్వహిందూ పరిషత్‌ ‌రామజన్మభూమి ఉద్యమాన్ని నడిపి విజయాన్ని సాధించిన విషయం జనవరి 22, 2024 కార్యక్రమం ద్వారా మనందరం గమనించాం. ఈ విధంగా ప్రవేశించిన అన్ని క్షేత్రాలలోను స్వయంసేవకులు విజయం సాధిస్తు న్నారు. దీనివలన సంఘం చుట్టూ ఆరా (గ్లామర్‌) ఏర్పడింది. దీనితో చాలామంది సంఘపని మంచిదని భావించి ఆకర్షితులవుతున్నారు. సంఘ పనిలో విజయం లభిస్తుందని, నేను కూడా నా జీవితంలో ఏదైనా సాధించగలిగానని తృప్తి పొందాలని సంఘంలో చేరుతున్నారు. కానీ ఈ భావనతో సంఘంలో చేరినంత మాత్రానే సఫలత లభించదు. శుద్ధ భావన ఉండాలి. ఈ సమాజాన్ని, సంస్కృతిని, ధర్మాన్ని, దేశాన్ని నాదిగా భావిస్తాను… సంపూర్ణ భూమండలాన్ని నా కుటుంబంగా తలుస్తాననేది మన ధర్మం మనకు నేర్పిన విషయం. దీని కోసం తపించాలి. సంఘం పని మంచిదనే భావనను మనసులో ఏర్పరుచుకున్నంత మాత్రాన సరిపోదు. శరీరం, మనసు, బుద్ధిని తదనుగుణంగా మలచుకొని సమర్పించు కోవాలి. ఆ విధంగా భావ జాగృతితో పాటు ఈ మూడిండిని సమర్పించి తపస్సు గావించి నపుడు దాని ఫలితం లభిస్తుంది.

డాక్టర్‌జీకి హిందూ సమాజంపట్ల అపార విశ్వాసం ఉండేది. అయితే సమాజంలోని మిగతా వారు ఇది మృతప్రాయమైన సమాజం, దీనిని సరి చేయలేం అని భావించసాగారు. కాని డాక్టర్‌జీ దీనిని అంగీకరించకుండా, హిందువులలో అపారమైన శక్తి దాగి ఉందని నమ్మారు. దీనిని జాగృతి చేయడానికి వారికి బోధన అవసరం. అలాగే శరీరం, మనసు, బుద్ధి తయారీకి వ్యాయామం అవసరం అని డాక్టర్‌జీ భావించారు. అనేక సమస్యలున్నాయి. వాటికి ఉపాయాలు వెదకాలి. అయితే ఉపాయాలను ఉపయోగించి ఆయా సమస్యలను పరిష్కరించ గలిగిన కుశల కార్యకర్తలు అవసరం.

ఇలాంటి యోగ్యమైన కార్యకర్తలు ప్రామాణి కతతో శరీరం, మనసు, బుద్ధి అనే ఈ మూడింటిని తగిన విధంగా తయారుచేసుకొంటూ ముందుకు సాగుతున్నపుడు – మార్గంలో మొదట ఉపేక్ష, తర్వాత విరోధం, చివరగా అనుకూలత లభిస్తాయి. ‘మన పనిలో అనుకూలత లభించిన తర్వాత స్వయం సేవకులజీవితాల్లో వ్యామోహాలు వస్తాయి. కాని వాట న్నిటినీ దాటుకుంటూ నిరంతరం ముందుకు సాగాలి.

‘నిందస్తు నీతి నిపుణా యదివా స్తువస్తు

లక్ష్మీ స్సమావిశతు గచ్చతు నా యధేష్టమ్‌

అద్వైవ వా మరణమస్తు యుగాస్తరే వా

న్యాయాత్పథః ప్రవిచలన్తి పదం న ధీరాః।।’

నీతిశాస్త్ర నిపుణులు ఏదేని విషయాన్ని విమర్శించవచ్చు లేదా మెచ్చుకొన వచ్చుగాక, అట్లే సంపద వచ్చుగాక, పోవుగాక. మరణం కూడా ఇప్పుడే సంభవించ వచ్చుగాక. లేదా యుగాంతంలో వచ్చుగాక. ధీరులు మాత్రం న్యాయమార్గం నుండి ఒక్క అడుగు కూడా పక్కకు వేయరు.

ఇలాంటి ధైర్యవంతులైన కార్యకర్తలు కావాలి.

శరీరాన్ని ఉదాహరణగా తీసుకొంటే ప్రతి అవయవం ముఖ్యమైనదే. కాని అన్నిటికన్నా ప్రధానమైనది ప్రాణం. ఒక అవయవం లేకపోయినా బ్రతకచ్చుగాని ప్రాణం అనేది లేకపోతే అన్ని అవయవాలు చైతన్యం కోల్పోతాయి. శరీరం చచ్చిపోతుంది. అంటే అన్ని అవయవాలకన్నా ప్రాణం శ్రేష్ఠమైనది.

సమాజాన్ని కూడా శరీరంతో పోల్చుకొన్నప్పుడు సమాజం అన్నిటికన్నా గొప్పది. కనుక సమాజంపై విశ్వాసం ఉంచి పూర్ణ ప్రేమతో -తమ ఆచరణ, శీలం ద్వారా మార్పుకు ప్రయత్నం చేస్తూ – నిస్వార్థ బుద్ధితో, ప్రామాణికంగా, తన, మన, ధన పూర్వ కంగా పనిచేసే కార్యకర్తలు ప్రతి బస్తీలో, ప్రతి గ్రామంలో ఉండాలి. సంఘం ఉత్తమ కార్యకర్తలను శాఖ ద్వారా తయారుచేస్తుంది. ఇలా తయారైన స్వయంసేవకులు సమాజంలోని వివిధ రంగాల్లో పనిచేస్తుంటారు.

సంఘ ప్రార్థనలో చెప్పుకొంటున్నట్లు మనం సమర్థత పొందేందుకు నిత్యం శాఖకు రావాలి. సమాజం విజయశీలి కావడానికి ధర్మ సంరక్షణ చేస్తూ దేశాన్ని పరమవైభవ స్థితివైపు తీసుకెళ్లడం ప్రతి స్వయంసేవక్‌ ‌చేయాల్సిన పని.

శాఖకు వచ్చే స్వయంసేవకులలో, శాఖ నడిపే కార్యకర్తలలో పూర్ణ శ్రద్ధ  ఉంటుంది. శాఖకు రావడం వలన శూన్యం నుండి సృష్టిని నిర్మాణం చేయవచ్చనే విశ్వాసం ఏర్పడుతుంది. అన్నీ ఉన్నా శాఖ లేకపోతే ఏమీ లేనట్లే. ఈ శ్రద్ధను అంధ విశ్వాసం అనలేం. డాక్టర్‌జీ దీనిని అనుభూతి చెంది సాధించాక కార్యకర్తలు నిరంతరం ఈ పనిని చేస్తున్నారు. రాబోయే సంవత్సరంతో సంఘానికి 100 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ వంద సంవత్స రాలలో మన అనుభవానికి బలం లభించింది. నన్ను గాడిద అని పిలిచినా పరవాలేదు, హిందువు అని పిలవవద్దు అన్న ఈ దేశంలో ఇపుడు చైతన్యం మొదలయింది. ఇలాంటి ఆమూలాగ్ర పరివర్తన ఎక్కడి నుండి వచ్చింది? నాగపూర్‌లో ప్రారంభమైన ఒక శాఖ – దేశమంతా ఎలా వ్యాపించింది? సత్యాన్ని స్థాపించే కార్యకర్తలు దేశం నలుమూలలకెళ్లారు. కనుకనే ఈ మార్పు కనబడుతున్నది. ఈ మార్పు వేగం ఇంకా పెరగాలి. ఈ పని ఇంకా జరగాలి. స్వయంసేవకులు ఇంకా అనేక రంగాలలో పనిచేసి మంచి ఫలితాలు తీసుకురావాలి. దీనికోసం స్వయంసేవకులు సమాజంతో మమేకం కావాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు శాఖను పక్కన పెడితే ఏమీ సాధించలేమనేది స్వయంసేవకుల మనసులో దృఢంగా ఏర్పడాలి కనుక అలాంటి శాఖకు రోజూ వచ్చి మనస్సు లగ్నంచేసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొ నాలి. దీని ద్వారా కార్యక్రమం ఉత్సాహంగా జరుగు తుంది. అలాంటి కార్యక్రమాల ద్వారా మన శరీరం, మనసు, బుద్ధిలో పరివర్తన కలిగించే సంస్కారం లభిస్తుంది. ఇది ప్రపంచం అంగీకరిస్తున్న గొప్ప వైజ్ఞానిక తంత్రం. శాఖ వెనుక ఉన్న మర్మాన్ని నిదానంగా ప్రజలు గ్రహిస్తున్నారు. దీనిని గురించి అధ్యయనాలు కూడా  జరుగుతున్నాయి.

1925 నుండి డాక్టర్‌జీ పొందిన అనుభూతిపై విశ్వాసం ఉంచి, ఆదర్శంగా గ్రహించి స్వయంగా మనం కూడ అనుభూతి చెంది – చాల శ్రద్ధతో శాఖ పని చేస్తున్నాం. స్వయంసేవకులలో తన కుటుంబ పరిధిని దాటి శాఖ స్వయంసేవకులందరూ నా వాళ్లు అనే భావన ఏర్పడుతున్నది. ఇంకా ముందు కెళ్లి దేశంలోని ఇతర శాఖలలోని స్వయంసేవకులను కూడా నా వాళ్లు, మనవాళ్లని భావిస్తున్నాం. ఈ పరిధిని కూడా దాటి భారతదేశంలోని వారంతా నా వాళ్లు / మనవాళ్లు అనే భావన ఏర్పడుతున్నది. తద్వారా భారతీయులందరిలో సంపూర్ణ విశ్వం మనది అనే గొప్ప భావన నిండుకొంటున్నది. ఈ విధంగా మనం, మనది అనే ఆలోచన నిరంతరం వృద్ధి చెందుతున్నది. శాఖలో మనం చేస్తున్న సాధన – చిన్న కార్యక్రమాల ద్వారానే కావచ్చు – కాని మనం మనసు లగ్నం చేసి పాల్గొనడంవల్ల ఇదంతా సాధ్యం అవుతున్నది. ఆత్మ సంయమనం, అనుశాససనం మొదలైన గుణసంపద మనలో వృద్ధి చెందుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్ని రకాల భేదభావాలను దాటి సమదృష్టి అలవాటవు తుంది. ఇది పేరుకేగాదు, ఇతరుల సుఖదుఃఖాల్లో  భాగం పంచుకొంటాం. ఇదంతా భక్తితో ఆచరించడం వలన శక్తి ఉత్పన్నం అవుతుంది. ప్రాణం పోయినా సత్యాన్ని వదలిపెట్టం. దీన్నే శ్రద్ధ అంటాం. ఇటువంటి శ్రద్ధతో శాఖ పనిని చేయాలి. ఈ శ్రద్ధతోనే స్వయంసేవకులు అందరినీ ఆత్మీయతతో కలుస్తూ వారి సుఖదుఃఖాలు, గుణవృద్ధి గురించి ఆలోచిస్తూ, వారికి ప్రబోధం చేస్తుండాలి. ఇప్పటిదాకా శ్రద్ధతోనే ఈ కార్యాన్ని చేస్తూ వస్తున్నాం. యాంత్రికంగా చేయడం లేదు. దాని ఫలితాన్ని నేడు చూస్తున్నాం. భారత్‌ ఉజ్జ్వల భవిష్యత్‌ను ఈ శరీరంతో, ఈ కళ్లతో చూద్దాం. దేశహితం కోసం నేడు స్వయంసేవకులు అనేక రంగాల్లో పనిచేస్తున్నారు.

అక్కడక్కడ జైజై కారాలు వినిపిస్తుండవచ్చు. అహంకారం కలుగవచ్చు. ప్రసిద్ధి లభిస్తుండవచ్చు. సౌకర్యాలు పెరిగి సుఖాసీనత అలవాటు కావచ్చు. ఈ విధంగా అనుకూలతలో కొన్ని ఆటంకాలు రావచ్చు, అనుకూలతల ద్వారా వచ్చే దోషాలన్నింటికి దూరంగా ఉండాలి. శాఖలో పొందిన అనుశాస నాన్ని, తన జీవితంలో పాటిస్తూ కుటుంబసభ్యులు ప్రభావితం అయ్యేట్లు చూడాలి. బయటివారు కూడా మనలను చూసి ఈయన మనలాంటివాడే కాని స్వయంసేవకులు అయినందువల్ల గుణవంతు డయ్యాడని భావించి తను కూడా అలా కావాలని కోరుకొనే విధంగా మన ఆచరణ ఉండాలి.  కొత్తగా వస్తున్న స్వయంసేవకులు వీటిని నేర్చుకోవాలి. జ్యేష్ఠ స్వయంసేవకులు తాము పొందిన అనుభవాల ద్వారా ఈ గుణాలను కొత్తవారికి నేర్పించాలి.

మన కార్యపద్ధతిపై అత్యంత విశ్వాసం ఉంచి ధ్యేయపథంలో సంఘం అనే రథాన్ని ముందుకు నడిపించాలి.  ఎంత అనుకూలత ఉన్నా సంపూర్ణ సమాజ సంఘటిత కార్యశక్తితో ధర్మ సంరక్షణ చేస్తూ భారత్‌ ‌పరమవైభవాన్ని సాధిస్తూ ప్రపంచంలో ‘స్వ’జాగృతవైభవ సంపన్నం చేస్తు, సుఖశాంతులతో కూడి, మానవులందరూ సృష్టిలో కలసిమెలసి నడుస్తూ ప్రపంచం ముందుకు పురోగమించే స్థితిని మనకళ్లతో చూడవచ్చు. దీని కొరకు సంఘం అనేక యోజనలు ప్లాన్‌) ‌తయారుచేసింది. ఆ యోజన ప్రకారంగా మనమందరం కలసి పనిచేద్దాం.

-సందేశం

About Author

By editor

Twitter
Instagram