A man in handcuffs sits behind a gavel waiting for the judge to render his decision.

భారతదేశానికి సంబంధించి ఇటీవల రెండు అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. హిందుత్వవాద ప్రభుత్వమని, ఇక్కడ ముస్లిం మైనార్టీలకు రక్షణ లేదంటూ ప్రచారం చేస్తూ, ఊదరగొట్టే ఉదార, వామపక్షవాదుల నోళ్లు మూతవేయించే ఈ రెండు ఘట్టాలూ చారిత్రకమైనవి. మొదటిది, ముస్లిం రాజ్యమైన యుఎఇ అధ్యక్షుడు షేక్‌ ‌మహమ్మద్‌ ‌బిన్‌ ‌జాయెద్‌ ఆల్‌ ‌నహ్యాన్‌ ‌గుజరాత్‌లో జరుగుతున్న ‘వైబ్రెంట్‌ ‌గుజరాత్‌’ ‌సదస్సుకు స్వయంగా హాజరుకావడం. రెండవది మైనార్టీ వ్యవహారాల మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ మదీనాలో పర్యటించడం.

ప్రధానమంత్రి తానుగా వెళ్లి యుఎఇ అధ్యక్షుడు జాయెద్‌కు స్వాగతం పలికి, రోడ్‌షో నిర్వహించి ఆయనను ఆదరించడం అందరినీ ఆశ్చర్యపరచింది. ముఖ్యంగా, ముస్లిం మైనార్టీలను ఊచకోత కోశారంటూ ఆ ఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని నేటికీ నిందించే సందర్భం ఉన్నప్పటికీ గుజరాత్‌ ‌ప్రజలు ఈ రోడ్‌ ‌షోలో పాల్గొన్న తీరుతో మహమ్మద్‌ ‌బిన్‌కు దాని గురించి ఏమైనా సందేహాలు ఉండి ఉంటే అవి తీరిపోయిఉంటాయి. సదస్సుకు హాజరవడానికి గుజరాత్‌లో అడుగు పెట్టీపెట్టగానే, ప్రధాని మోదీ ‘కొద్దిసేపటి కిందే గుజరాత్‌లో దిగాను. రానున్న రెండురోజుల్లో వైబ్రెంట్‌ ‌గుజరాత్‌ ‌సదస్సులోనూ, తత్సంబంధిత కార్యక్రమాల్లోనూ పాల్గొంటాను. ఈ సదస్సు సందర్భంగా ప్రపంచ దేశాలకు చెందిన పలువురు నాయకులు మమ్మల్ని కలుస్తారన్నది ఎంతో సంతోషకరమైన విషయం. నా సోదరుడు హిజ్‌ ‌హైనెస్‌ ‌మహమ్మద్‌ ‌బిన్‌ ‌జాయెద్‌ ‌రాక అన్నది ఎంతో ప్రత్యేకమైనది. వైబ్రెంట్‌ ‌గుజరాత్‌ ‌సదస్సుతో నాకు సన్నిహిత సంబంధం ఉంది, ఈ వేదిక కేవలం గుజరాత్‌ ‌వృద్ధికి దోహదం చేయడమే కాదు పలువురికి అవకాశాలను సృష్టించింది,’ అంటూ సుదీర్ఘమైన ట్వీట్‌ను పోస్ట్ ‌చేశారు. అయోధ్యలో నిర్మించిన రామాలయంలో బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగనుండగా ఇది జరగడం అత్యంత విశేషమనే చెప్పుకోవాలి.

ఇది జరుగుతున్న సమయంలో మరొక మహత్తర ఘటన దేశం బయటచోటు చేసుకుంది.

మదీనాలో మైనార్టీ వ్యవహారాల

మంత్రి స్మృతి ఇరానీ

అదే, మహమ్మద్‌ ‌ప్రవక్త వలస వచ్చినట్టుగా, నివసించినట్టుగా చెప్పే సౌదీ అరేబియా రాజ్యానికి భారత మైనార్టీ వ్యవహారాల మంత్రి స్మృతి జుబిన్‌ ఇరానీ సందర్శించడమే కాదు, భారతీయ వేషభాషలతో ఆమె అక్కడ మదీనాకు వెళ్లడం సంచలనాన్ని సృష్టిస్తోంది. ముఖ్యంగా, భారత దేశంలో ముస్లింలు, వారికి అనుకూల వర్గాలమని చెప్పుకునే వామపక్ష మేధావులూ కాలం చెల్లిపోయిన ‘హిజాబ్‌’ ‌సంస్కృతిని, అందుకోసం ఉద్యమాలను సమర్ధిస్తుండగా, తనదైన భారతీయ వస్త్రధారణతో (చీర కట్టుతో), కనీసం నెత్తిపై అబాయా లేదా హిజాబ్‌ ‌వంటివేవీ లేకుండానే చారిత్రిక నగరమైన మదీనాలో కేంద్ర మైనార్టీ వ్యవహారాలు, మహిళా శిశుసంక్షేమశాఖల మంత్రి స్మృతి జుబిన్‌ ఇరానీ, తన ప్రతినిధి బృందంతో కలిసి పర్యటించడం అతిపెద్ద విశేషం. ముస్లింలను విమర్శించే పార్టీకి చెందిన మంత్రిని, అందునా మహిళను, ముఖ్యంగా తలపై ఎటువంటి ఆచ్ఛాదనా లేకుండా అనుమతించడాన్ని బీజేపీని వ్యతిరేకించే వర్గాలు అన్నీ కూడా తప్పు పడుతున్నాయి. సోషల్‌ ‌మీడియా ‘ఎక్స్’ ‌వంటివాటిపై ఈ అంశంపై ఆరోపణలు, నిందలు, ప్రత్యారోపణలు ప్రారంభమయ్యాయి. వెళ్లింది మహిళ మాత్రమే కాదు, హిందువు కావడం కూడా ఈ తుపానుకు కారణమైంది. ఈ క్రమంలోనే పాకిస్తానీలు ప్రిన్స్ ‌సల్మాన్‌ ‌పతనం ప్రారంభమైందంటూ ‘ఎక్స్’ ‌వంటి సోషల్‌ ‌మీడియా వేదికలపై తమ అక్కసును వెళ్లగక్కడం ప్రారంభించారు.

ఇందుకు కారణం, నిన్న మొన్నటి వరకూ ముస్లింలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరం మదీనాలో ముస్లిమేతరులు ప్రవేశించడమన్నది నిషేధం. ఈ నగరంలోకి ప్రవేశించి, చారిత్రిక ప్రదేశాలను పర్యటించిన తొలి ముస్లిమేతర బృందం ఈ క్రమంలోనే ఇరానీ నేతృత్వంలోనిదే అని చెప్పవచ్చు. తమకు ఆ ప్రాంతంలో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి కోరిన నేపథ్యంలో సౌదీ అధికారులు వారికి ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ఈ బృందంలో విదేశాంగ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి. మురళీధరన్‌ ‌కూడా ఉన్నారు. భారత్‌ ‌నుంచి వార్షిక హజ్‌ ‌యాత్రకు వెళ్లే యాత్రికుల కోటాను, ఏర్పాట్లను ఖరారు చేసేందుకు ఆయన కూడా ఈ పర్యటనకు వెళ్లారు. ఈ బృందం కూర్పులోనే ప్రత్యేకత ఉంది. ఇరానీతో పాటుగా, కశ్మీరీ పండిట్‌, ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన నిరుపమ కొట్రు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి హోదాలో ఈ బృందంలో భాగమయ్యారు.

మహిళలిద్దరూ-ఒకరు చీరలో, మరొకరు సెల్వార్‌ ‌కమీజ్‌లో స్వేచ్ఛగా మదీనా పరిసరాలలో సంచరించడం గమనించిన వారికి గతంలో వివాదాలు గుర్తురాక మానవు. గతంలో సౌదీకి అధికారిక పర్యటనలకు వెళ్లినప్పుడు హిజాబ్‌ ‌ధరించేం దుకు మహిళా ప్రతినిధులు తిరస్కరించి నప్పుడు ఎంతటి వివాదాలో చెలరేగుతుండేవి. అయితే, 2019లోనే తప్పనిసరిగా బహిరంగ ప్రదేశాలలో హిజాబ్‌ ‌తప్పనిసరిగా ధరించాలనే నిబంధనలో మార్పులు చేయడం వల్ల ఇప్పుడు అటువంటి వివాదాలకు తావు లేకుండా పోయింది.

ఈ క్రమంలోనే తన మదీనా పర్యటనకు సంబంధించిన ఫోటోల కొలాజ్‌ను ‘ఎక్స్’‌లో పోస్టు చేస్తూ, ‘‘ఇస్లాంలో అత్యంత పవిత్ర నగరమైన మదీనాకు నేడు చరిత్రాత్మక ప్రయాణం చేపట్టాను. దీనితో పాటుగా ప్రవక్తకు చెందిన మసీదు- అల్‌ ‌మస్జీద్‌ అల్‌ ‌నబ్వీ పరిసరాలను, ఉహుద్‌ ‌పర్వతం, ఇస్లాంలో తొలి మసీదు అయిన కాబా మసీదు సరిహద్దులలో పర్యటించాము. తొలి ఇస్లామిక్‌ ‌చరిత్రతో ముడిపడి ఉన్న ఈ పర్యటన సౌదీ అధికారుల సౌజన్యంతో మేం చేయగలగడం అన్నది ఇరు దేశాల సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాల లోతును పట్టి చూపుతుంది,’’ అని పేర్కొన్నారు.

అంతకు ముందు జెద్దా సచేతన సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షించే, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించిన, అల్‌- ‌బలాద్‌ ‌సాంస్కృతిక వైభవాన్ని ఇరానీ బృందం అన్వేషించింది. కింగ్డమ్‌ ఆఫ్‌ ‌సౌదీ అరేబియాకు చెందిన హజ్‌ ‌మంత్రి డా।। తాఫిక్‌ ‌బిన్‌ ‌ఫాజాన్‌ అల్‌ ‌రబియాతో 2024లో ఇరానీ ద్వైపాక్షిక హజ్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, భారత్‌కు ఈ ఏడాది హజ్‌ ‌యాత్రికుల కోటా 1,75,025 మందిగా ఉంది. వీరిలో 1,40,020 మంది హజ్‌ ‌కమిటీ ద్వారా మక్కా వెళ్లనున్నారు. మిగిలినవారు ప్రైవేట్‌ ‌టూర్‌ ఆపరేటర్ల ద్వారా తమ హజ్‌ ‌యాత్రను పూర్తి చేయనున్నారు.

ముస్లిమేతర బృందాన్ని మదీనాకు ఆహ్వానించడమనే సౌదీ చేపట్టిన అసాధారణ చర్య, భారత్‌ – ‌సౌదీ అరేబియాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల బలాన్ని పట్టి చూపుతోంది. ఇరు దేశాలు బలమైన సంబంధాలను కొనసాగించాలనే సంకల్పంతో ఉన్న నేపథ్యంలో ఈ పర్యటన మతపరమైన, సాంస్కృతిక మార్పిడి రంగాలలో పరస్పర అవగాహన, సహకారానికి దోహదం చేస్తుంది. ఈ ప్రతినిధి బృందంలో మైనార్టీ వ్యవహారాలు, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ అధికారులుండటం అన్నది ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికే కాదు, రానున్న హజ్‌ ‌యాత్ర సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లకు సంబంధించిన విలువైన అంశాలను తెలుసుకోవడానికి ఉద్దేశించింది.

2024 హజ్‌ ‌యాత్ర సందర్భంగా భారతీయ యాత్రికులకు సౌకర్యాలు, సంక్షేమం కోసం అవసరమైన సూక్ష్మ, సంక్లిష్ట ఏర్పాట్ల గురించి ప్రత్యక్ష వివరాలు తెలుసుకునే సంభావ్యత ఉండటమే ఈ పర్యటనలో మరొక కీలకాంశం, లక్ష్యం. లక్షల సంఖ్యలో హజ్‌ ‌యాత్రలో పాల్గొనే భారతీయ ముస్లింలకు సౌకర్యవంతమైన, ఆధ్యాత్మికంగా సఫలీకృతమైన భావనను ఇచ్చేందుకు అవసరమైన సౌకర్యాలను, సేవలు అందచేయాలన్న తన లోతైన నిబద్ధతకు కట్టుబడి ఉంటామని భారతీయ ప్రభుత్వం పునరుద్ఘాటించింది.

ఈ పర్యటనలో భాగంగా, హజ్‌ ‌వాలంటీర్లు, సంఘ సభ్యులతో, భారతీయ సంతతికి చెందిన వారితో ఇరానీ చర్చలు నిర్వహించారు. ముఖ్యంగా భారత్‌ ‌నుంచి వచ్చిన ఉమ్రా యాత్రికులతో ముచ్చటించినప్పుడు భారతీయ ముస్లింలు తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు వారు వైవిధ్యమైన అవసరాలు, కోరికల గురించి సమగ్ర అవగాహన బృందానికి కలిగింది. అంతేకాకుండా, బలమైన ద్వైపాక్షిక సంబంధాలను పెంచిపోషించడంలో ఆర్ధిక సంబంధాలు ఎలా కీలకపాత్ర పోషిస్తాయో నొక్కి చెప్తూ ఆమె సౌదీ, భారతీయ వాణిజ్యవేత్తలతో కూడా చర్చలు జరిపారు.

మదీనా ప్రాముఖ్యం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు మతపరమైన ప్రాముఖ్యతను కలిగిన, ఇస్లాంలోనే అత్యంత పవిత్ర నగరాలలో ఒకటి మదీనా. సౌదీ అరేబియాలోని హెజాజ్‌ ‌ప్రాంతంలో ఉన్న మదీనాకు అంత ప్రాముఖ్యం ఉండటానికి కారణం, అది, మహమ్మద్‌ ‌ప్రవక్త వలస వచ్చిన నగరమనే విశ్వాసం. దీనితోనే ఇస్లామిక్‌ ‌కేలెండర్‌ ‌ప్రారంభమవుతుంది. దీనితోపాటుగా, మస్జీద్‌ ‌నబావీ (ప్రవక్త విశ్రమించిన ప్రదేశం), ఉహుద్‌ ‌పర్వతం, మహమ్మద్‌ ‌ప్రవక్త ప్రపంచంలోనే తొలిసారి నిర్మించిన మసీదు అయిన మస్జీద్‌ ‌కాబా అన్నవి ముస్లింలకు అత్యంత పవిత్ర ప్రదేశాలు.

తన సౌదీ అరేబియా పర్యటన అనుభవాన్ని గురించి మాట్లాడుతూ, ఒక మహిళగా మదీనాలో ఉన్నప్పుడు నాకు సాధికారత ఉంది అనే భావనకు లోనయ్యాను. తలపై ఎటువంటి ఆచ్ఛాదనా లేకుండా స్మృతి ఇరానీ, నేను కలిసి మదీనా అంతా కలియ తిరగడం అన్నది అత్యంత అరుదు, ఒక చారిత్రిక సందర్భం. మంత్రి ఇరానీ విజ్ఞప్తి మేరకు, మదీనాలోని గల మూడు ముఖ్యమైన ప్రదేశాలను సందర్శిం చేందుకు సౌదీ ప్రభుత్వం మాకు ప్రత్యేక అనుమతిని ఇచ్చింది అని నిరుపమ కొట్రు చెప్పడం విశేషం.

ఉలిక్కి పడ్డ ప్రపంచం

ఇటీవలి కాలంలో సౌదీ అరేబియాకు, భారత్‌కు మధ్య సంబంధాలు బలపడుతు న్నాయన్న విషయాన్ని అటు భారత్‌, ఇటు సౌదీ అరేబియా కూడా బహిరంగంగానే ప్రదర్శిస్తున్నాయి, ప్రకటిస్తున్నాయి. అయితే, ఒక మహిళను తలపై ఆచ్ఛాదన లేకుండా మదీనాకు అనుమతించేతగా బలపడ్డాయని ఎవరూ ఊహించి ఉండరు. పరిమిత వనరు అయిన పెట్రోలు మీదే శాశ్వతంగా ఆధారపడలేమనే విషయాన్నే కాదు, అమెరికా చేతిలో కీలు బొమ్మ అయి వారి పెట్రో డాలర్ల కోసం ఇస్లామిక్‌ ‌తీవ్రవాదాన్ని రెచ్చగొట్టే ముల్లాలకు, తీవ్రవాద గ్రూపులకు నిధులు సమకూర్చి తాము ఎంతగా నష్టపోతున్నామో సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ ‌బిన్‌ ‌సల్మాన్‌ ‌గ్రహించిన తర్వాత ఆసియా ప్రాంతంలో బలపడుతున్న భారత్‌తో సంబంధాలను సానుకూలం చేసుకోవడం ప్రారంభించారు.

అంతేకాదు, భారతీయ సంస్కృతిలో ఉన్న యోగ, ఆయుర్వేదంను అనుసరించడంతో పాటుగా రామాయణ, మహాభారతాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టేందుకు అంగీకరించేంతగా భారతీయత పట్ల ఆయన ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే ఇస్లాంలో కూడా అనేకానేక సంస్కరణలను తీసుకువచ్చేందుకు సౌదీ అరేబియా, యుఎఇ వంటి దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి.

తస్లీమా నస్రీన్‌ ‌స్పందన

సౌదీ అరేబియాకు వెళ్లే ఇతర మహిళా పర్యాటకులలాగా తలకు హిజాబ్‌ ‌చుట్టుకోనందుకు నేను స్మృతి ఇరానీకి శాల్యూట్‌ ‌చేస్తున్నాను. మహమ్మద్‌ ‌సమాధి అయిన గ్రీన్‌ ‌డోమ్‌ను కూడా ఆమె సందర్శించాలి.

#SaudiArabia #BreakingTheTaboo

అంటూ సోషల్‌ ‌మీడియా ‘ఎక్స్’‌పై ఆమె అభినందనలు తెలిపారు. దీనితో పాటుగా ఆమె, ఒకవైపు సౌదీ అరేబియా ఇస్లామిక్‌ ‌సంస్కరణల దిశగా వెడుతుండగా, బంగ్లాదేశ్‌ ఆ ఆలోచన చేయకపోవడం, మూఢత్వంతో కొట్టుకుపోవడం పట్ల ఆవేదనను వ్యక్తం చేశారు.

తాజాగా, భారత్‌ ‌నుంచి వెళ్లిన అందరూ హిందువుతో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని, ముఖ్యంగా మహిళ, మంత్రి అయిన స్మృతి ఇరానీని హిజాబ్‌ ‌లేకుండా మదీనాలోకి అనుమతించడం కూడా అక్కడ చేపట్టిన సంస్కరణల్లో భాగంగానే చూడాలి. పరమత సహనం, ఉదారవాదం గురించి హిందువులకు నిత్యబోధలు చేసే మేధావులకు ఇది నచ్చడం లేదు. అందులోనూ అయోధ్యలో అంత భారీ కార్యక్రమానికి ముందు ఒక హిందువు బృందం సౌదీ అరేబియాకు వెడితే, ఇతర ఇస్లామిక్‌ ‌దేశాలు నోరు మెదపకపోవడం వారికి నచ్చడంలేదు.

ఈ విషయంపై ఇస్లాం పరిరక్షక దేశమైన పాకిస్తాన్‌ ఇం‌కా అధికారికంగా తన అమూల్యమైన అభిప్రాయాన్ని వెల్లడించలేదు.

– నీల

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram