సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపర చుకోవడం.. ఇలాంటి మాటలు మరిచిపోయి నెలలు గడిచిపోయాయి. అదంతా ముగిసిన అధ్యాయం అని అంతా భావించారు. ఇంతలోనే కరోనా కొత్త వేరియంట్‌ ‌జేఎన్‌-1 ‌వ్యాపిస్తోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. మళ్లీ పాత రోజులు గుర్తుకొచ్చి చాలా మందికి వెన్నులో భయం పాకుతోంది. అదేమంత ప్రాణాంతకం కాదని, భయం అక్కరలేదని.. ఉన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్‌ను ఎదుర్కోగలవని వైద్యనిపుణుల సలహాలు కొంత ఊరటనిస్తున్నాయి. ఈ వేరియంట్‌తో భయపడవలసిన పని లేదని అన్నారు కదా అని తేలిగ్గా తీసుకుంటే మాత్రం ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే. అయితే, ప్రస్తుతానికి దీనికోసం అదనపు వాక్సిన్‌ ‌డోస్‌ ‌తీసుకోవాలసిన అవసరం లేదంటూ ఇండియా సార్స్- ‌కోవ్‌-2 ‌జెనోమిక్స్ ‌కన్సోర్షియం (ఐఎన్‌ఎస్‌ఎసిఒజి) అధిపతి డా।। ఎన్‌కె అరోరా ప్రకటించడం ప్రజలకు కొంత ఊరటను ఇస్తోంది.

కరోనా వచ్చిన కొత్తల్లోనే అది ఇప్పట్లో అంత మయ్యేది కాదని, కొంతకాలానికి శక్తిసామర్థ్యాలన్నీ ఉడిగిపోయినా మన మధ్యలోనే చిరకాలం ఉంటుందని చెప్పుకొచ్చారు. మ్యుటేషన్లతో ముప్పు తప్పదని హెచ్చరికలు చేశారు. అనుకున్నట్టు గానే కరోనాలో ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్‌ ‌లాంటి వేరియంట్ల ప్రభావాన్ని మనం చూశాం. ఇప్పుడు వ్యాప్తిలో ఉన్నది జెఎన్‌1 అనే సబ్‌వేరియంట్‌. ఇది ఒమిక్రాన్‌ ‌కుటుంబానికి చెందినది. ఒమిక్రాన్‌ ఒకట్రెండు ఉత్పరివర్తనాలకు లోనై జేఎన్‌1 ఏర్పడింది. ప్రస్తుతం శీతాకాలం నడుస్తున్నందున ఈ వైరస్‌ ‌ప్రభావం విస్తృతంగా ఉండే అవకాశం ఉన్నందున దీనిపై ఓ కన్నేసి ఉంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. శీతాకాలంలో ఇతర వైరల్‌, ‌బాక్టీరియా ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉండడంతో సార్స్-‌కోవ్‌-2 (SARS-CoV-2) కేసులు పెరిగే అవకాశం ఉందని, కనుక అత్యంత అప్రమత్తతతో ఉండాలని హెచ్చరించింది.

ప్రపంచవ్యాప్తంగా జెఎన్‌1 ‌వైరస్‌

‌లక్సంబెర్గ్‌లో మొట్టమొదటిసారి ఈ వేరి యంట్‌ను గుర్తించారు. తర్వాత రోజుల్లో అమెరికా, చైనా, బ్రెజిల్‌, ‌స్పెయిన్‌ ‌వంటి 35 దేశాల్లో కనిపి స్తోంది. సింగపూర్‌లో కేసులు యాభైవేలు దాటాయి. మన దేశంలో కేరళతో డిసెంబరు తొలివారంలో వైరస్‌ ‌గుర్తింపు జరిగేనాటికే వ్యాప్తి హెచ్చుగా ఉన్న విషయం బయటకొచ్చింది. 2020లోనూ కొవిడ్‌ ‌తొలి కేసు కేరళలోనే కనిపించింది. మిగతా చాలా రాష్ట్రాలకంటే వరుస వేరియంట్లతో సమర్థంగా పోరా డుతూ వచ్చిన అనుభవం కేరళ రాష్ట్ర ఆరోగ్యశాఖకు ఉంది. ఇప్పుడు కేరళలో వందలాది కేసులతో పాటు ఐదు మరణాలు కూడా నమోదయ్యాయి. వారంతా డెబ్బైయేళ్లకు పైబడినవారు, దీర్ఘకాలిక సమస్యల తోనూ, కాన్సర్‌ ‌వంటి వ్యాధులతోనూ బాధపడు తున్నవారేనని ఆ రాష్ట్రం చెబుతోంది. మిగతా కొన్ని రాష్ట్రాల్లో రికార్డయిన మరణాలు కూడా ఇదేరకమైనవి కావడం వల్ల, ఈ వేరియంట్‌ ‌మహా ప్రమాదకారి కాదన్న భావన వ్యక్తం అవుతోంది.

 కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, గోవా, రాజస్థాన్‌లలో కొవిడ్‌ ‌కొత్త వేరియంట్‌ ‌జాడలు కనిపించాయి. తెలంగాణలో 12, ఆంధ్రలో 6 కేసులు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్‌, ‌మిజోరాం, కొన్ని రాష్ట్రాల్లో రోజువారీ కరోనా బులెటిన్ల విడుదల ప్రారంభమైంది. కేంద్ర ఆరోగ్యమంత్రి దేశవ్యాప్త పరిస్థితిని సమీక్షించారని, అన్ని రాష్ట్రాలూ సర్వసన్నద్ధ మైనాయని వార్తలు వస్తున్నాయి. వ్యాప్తివేగం హెచ్చుగా ఉన్నప్పుడు వైరస్‌లు మరింత బలపడతా యన్న అభిప్రాయం ఉంది. దానికి తోడు క్రిస్మస్‌ ‌నుంచి సంక్రాంతి వరకూ వరుస పండగల సీజన్‌ ఉం‌డటం, శబరిమలకు రాకపోకలు ఎక్కువ కావటం వల్ల పరిస్థితి తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బాధితుల సంఖ్య, ఆస్పత్రుల పాలయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతుంది.అసలు తీవ్రత అప్పుడు మరింత స్పష్టంగా అర్థమవుతుంది.

కరోనాతో విలయం

కరోనా సృష్టించిన విలయాన్ని మరిచిపోవటం అంత తేలిక కాదు. 2020 తొలిరోజులో కొవిడ్‌-19 ‌విపత్తు చుట్టుముట్టినప్పుడు, ప్రపంచంలో రెండో అతి పెద్ద దేశమయిన భారత్‌ ‌వైరస్‌ను అదుపు చేయటంలోనూ దాని జనాభాతో పోలిస్తే మరణాల సంఖ్యను తక్కువగా ఉంచటంలో సాధించిన విజయం అసాధారణమైనది. ఇది అద్భుతమైన విషయమని అందరూ ప్రశంసించారు. కానీ ఏప్రిల్‌ 2021‌లో కొవిడ్‌ ‌రెండో వేవ్‌ ‌విజృంభించినప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. మే1, 2021న ఒక్క రోజులో అత్యధికమైన నాలుగు లక్షల కొవిడ్‌ ‌కేసులతో ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా నిలిచింది. దాంతో జనవరి 16, 2001 నుంచి సామూహిక వ్యాక్సినేషన్‌ ‌డ్రైవ్‌ ‌చేపట్టింది. అక్టోబరు మధ్య నాటికి ఒక బిలియన్‌ ‌కొవిడ్‌ ‌టీకాలు పూర్తిచేసి అరుదైన మైలు రాయిని సాధించింది. స్వదేశంలో తయారైన కొవాక్సిన్‌, ‌కొవిషీల్డ్‌తో పాటు, రష్యా తయారు చేసిన స్పుత్నిక్‌ 5 ‌టీకాలును వినియోగించింది.

అర్హులయిన 291 మిలియన్ల జనాభాలో 30 శాతం మంది పూర్తిగా రెండు డోసుల టీకాలు వేసుకున్నారు. 707 మిలియన్ల మంది మొదటి డోసు వేసుకున్నారు. అంతర్జాతీయంగా ఇదో గొప్ప ఘనవిజయం. అవసరంలో ఉన్న పేద దేశాలు, చిన్న దేశాలకు, పొరుగు దేశాలకు వ్యాక్సిన్లు పంపి కేంద్రం వసుధైవ కుటుంబకం భావనను చాటుకుంది. లక్షలాదిమంది తమ కుటుంబీకులను, ఆప్తులను, సన్నిహితులను కోల్పోయి ఒక భయానకమైన స్థితిని అనుభవించారు. ఆ గడ్డు కాలం దాటి, ధైర్యం కూడగట్టుకొని, మనసు కుదుటపడుతున్న తరుణంలో ఇప్పుడు జెఎన్‌-1 ‌వేరియంట్‌ ‌వ్యాపించిందన్న వార్త కలవరపరచటంలో ఆశ్చర్యం లేదు.

ఇప్పటికే వాక్సిన్లు వేసుకున్నవారి మీద, ఇమ్యూనిటీ మెరుగ్గా ఉన్నవారి మీదా దాని ప్రభావం తక్కువేనని ఓ అంచనా. ఆయా రాష్ట్రాల్లో పరీక్షలు, ఫలితాల సంసిద్ధత ఏ స్థాయిలో ఉన్నదో పూర్తిగా బయటకు రాలేదు కానీ, ఇప్పటివరకూ వెలుగు చూస్తున్న సమాచారాన్ని బట్టి వైరస్‌ ‌దేశమంతా వేగంగా విస్తరిస్తున్న మాట నిజం. శ్వాసకోశ సంబంధిత సమస్యలు హెచ్చి శీతాకాలం సహజం గానే భయపెడుతున్న తరుణంలో, పరీక్షలు పెంచడం, పాజిటివ్‌ ‌వచ్చినవారికి జాగ్రత్తలు సూచించి, దూరంగా ఉంచడం, అవసరమైన పక్షంలో ఆస్పత్రుల్లో చేర్చడం వంటివి పద్ధతిప్రకారం జరగాలి.

వైరస్‌ ‌ప్రభావం ఎలా ఉండనుంది?

ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వైరస్‌ ఎం‌త వేగంగా విస్తరిస్తుంది? దీని ప్రభావం ఎలా ఉంటుంది? దీనిని అదుపు చేయటానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు సరి పోతాయా? బూస్టర్‌ ‌డోసు సరిపోతుందా? ఒమెక్రాన్‌ ‌ప్రబలిన సందర్భంలో దేశంలో భారీ ఎత్తున మరణాలు సంభవించాయి. ప్రతి కుటుంబం కనీసం ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయిన పరిస్థితి, తెల్లవారి లేస్తే ఎలాంటి వార్త వినవలసి వస్తుందోనన్న భయం ప్రజల్లో ఉండేది. ప్రస్తుతం ఈ సబ్‌ ‌వేరియంట్‌కు అదనపు వ్యాక్సిన్లు అవసరం లేదని ఇండియా సార్స్ ‌కోవిడ్‌ ‌జినోమిక్స్ ‌కన్సార్షియం (ఐఎన్‌ఎస్‌ఏసీఓజీ) చీఫ్‌ ‌డాక్టర్‌ ఎన్‌. ‌కె.అరోరా సూచించారు.60 ఏళ్ల పైబడినవారికి ఇతర వ్యాధులు (కోమా ర్బిడిటీస్‌) ‌బారిన పడటం వల్ల వాళ్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే అవకాశంవల్ల వైరస్‌ ‌తీవ్రత కనిపిస్తుందన్నారు. వాళ్లు ఇప్పటికే తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరే, లేకపోతే వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు.

మళ్లీ లాక్‌డౌన్‌ ‌తప్పదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించి కొంత విషప్రచారం సాగుతోంది. గతంలో ప్రజలు ఇబ్బందులకు గురికావటం దానికి తోడు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావటం వంటి పరిణామాల నేపథ్యంలో, ఈ సారి లాక్‌డౌన్‌ ‌లాంటి వంటి కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకోక పోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కరోనానుంచి ప్రపంచం పూర్తిగా విముక్తి చెందే అవకాశాలు ఇప్పట్లో లేవు. నిరంతర పరివర్తనలతో అది ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ ఉంటుంది. ‘‘ఈ విషయాన్ని విస్మరిస్తే ప్రాణాలపైకి కొని తెచ్చుకున్నట్టే’’ అని హెచ్చరిస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్‌ ‌సైంటిస్టు డాక్టర్‌ ‌సౌమ్య స్వామి నాథన్‌. ‘‘ఇది సాధారణ జలుబులాంటిది కాదు. చాలా ప్రత్యేకమైన వేరియంట్‌. ‌ప్రజలు దీనివల్ల న్యుమోనియాతో తీవ్ర అనారోగ్యానికి గురికావడమే కాదు, దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యల బారినపడతారు’’ అని చెప్పారు. గుండె సంబంధ సమస్యలతో బాధపడేవారు, స్ట్రోక్‌ ‌బాధితులు, మధుమేహం, మతిమరుపు, మానసిక కుంగుబాటు, మానసిక సమస్యలు, దీర్ఘకాలిక అలసట, కండరాల నొప్పులతో బాధపడేవారు ఒక్కసారి కొవిడ్‌ ‌బారిన పడితే తిరిగి మామూలు ఆరోగ్యాన్ని సంతరించు కోవడం వారి శక్తికి మించిన పని అవుతుందని, అందుకే కొవిడ్‌ ‌పట్ల ఏ మాత్రం ఉదాసీనతకు చోటివ్వరాదని హెచ్చరిస్తున్నారు.

ఆదమరిస్తే అంతే సంగతులు

వైరస్‌ ‌వ్యాప్తిని అదుపు చేయటంలో వ్యక్తిగత జాగ్రత్తలు అవసరం. ఎవరయినా ఫ్లూ లాంటి సమస్యలతో బాధపడుతుంటే రెండు మూడు రోజుల పాటు బయటకు వెళ్లకుండా నాలుగు గోడల మధ్యన గడపటం మేలు. అలాగే ఇది నయం కాని పరిస్థితి ఉంటే తప్పనిసరిగా వైద్యపరీక్షలు చేయించుకోవాలి. సాధారణ ప్లూకు, కొవిడ్‌కి మధ్య తేడాను పరీక్షల ద్వారా మాత్రమే గుర్తించగలుగుతాం. ఈ అంశంలో నిర్లక్ష్య భావంతో వ్యవహరిస్తే వైరస్‌ ‌వ్యాప్తికి మీరు సహకరించినట్టే. అనేక మందిని ఇబ్బందుల పాలు చేసిన వాళ్లవుతారు. పైగా కొవిడ్‌ ‌బాధితులు వైద్యుల పర్యవేక్షణలో సరైన చికిత్స పొందకపోతే, అది దీర్ఘకాలం వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు. శరీరంలో గుండె, ఊపిరితిత్తులు లాంటి కీలకమైన శరీర అవయవాలను దెబ్బతీస్తుంది.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు

60 ఏళ్ల వయసుదాటిన వారు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా మాస్క్ ‌ధరించాలి. సామాజిక దూరాన్ని పాటించటంతో పాటు తగినంత రక్షణ లేకుండా విందులు, వినోదాలు, శుభకార్యక్రమాలకు హాజరు కాకూడదు. ఇక ప్రభుత్వం వైపు నుంచి కొన్ని చర్యలు అవసరం. నాలుగ్గోడల మధ్య పెద్ద ఎత్తున జనం గుమికూడ కుండా చూడాలి. అలాగే మురికి నీటి నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండి, ఎక్కడా నిలవకుండా చూసుకోవాలి.. ఆర్టీపీసీఆర్‌ ‌కిట్ల సంఖ్యను పెంచి పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించాలి. అప్పుడే వైరస్‌ ఏమేరకు వ్యాప్తి చెందుతోందన్న అంచనాలు బయటకు వస్తాయి. బహిరంగ ప్రదేశాల్లో, సామూహిక కార్యకలాపాల్లో నియమాలను ఉల్లం ఘిస్తున్నవారిని హెచ్చరించాలి. వ్యక్తిగత స్థాయిలో జాగ్రత్తతో పాటు, సామాజిక బాధ్యత కూడా కనబరచాలి. అప్పుడే తక్కువ నష్టంతో బయట పడటం వీలవుతుంది.

అన్ని రకాలపై పనిచేయగల టీకా అభివృద్ధికి యత్నం

రూపాంతరం చెందిన అన్ని రకాల కొవిడ్‌ ‌వైరస్‌లపై ప్రభావం చూపగల సార్వత్రిక టీకాని అభివృద్ధి చేయవలసిందిగా కోసం ప్రభుత్వం భారత్‌ ‌బయోటెక్‌ను కోరింది. ఈ కారణంగా, కొవిడ్‌ -19‌కు కారణమయ్యే సార్స్-‌కోవ్‌2 (SARS-CoV-2) వైరస్‌కు సంబంధించి రూపాంతరం చెందిన, ఉనికిలో ఉన్న స్ట్రెయిన్లను ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ఆప్‌ ‌మెడికల్‌ ‌రీసెర్చ్ (ఐసిఎంఆర్‌) ‌భారత్‌ ‌బయోటెక్‌కు అందించింది. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమిక్రాన్‌ ‌వేరియంట్లకు సంబంధించి ఒకటే వాక్సిన్‌ను తయారు చేయాలన్న క్రమంలో కొత్త వేరియంట్‌ ‌కనిపించింది. కొత్తగా ఉద్భవిస్తున్న సార్స్-‌కోవ్‌2 (SARS-CoV-2) వైరస్‌లపై కొవిడ్‌-19 ‌టీకాలు ఎంతటి రక్షణను కల్పిస్తున్నాయన్న విషయం తెలుసుకునేందుకు ఐఎస్‌ఎంఆర్‌- ‌నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌వైరాలజీ (ఐసిఎంఆర్‌-ఎన్‌ఐవి) క్రమం తప్పకుండా అధ్యయనాలు నిర్వహిస్తున్నది.

కొత్త వ్యాక్సిన్‌ ‌తయారీకి సీరం దరఖాస్తు

కాగా, దేశంలోని అతిపెద్ద వ్యాక్సిన్‌ ‌తయారీదారు, పుణె కేంద్రంగా పనిచేసే సీరం ఇన్‌ ‌స్టిట్యూట్‌ ‌జె.ఎన్‌-1 ‌కోవిడ్‌ ‌వేరియంట్‌ ‌కోసం వ్యాక్సిన్‌ ‌తయారు చేసేందుకు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ ‌యూనివర్సిటీల భాగస్వామ్యంతో 2020లో సీరం ఇన్‌ ‌స్టిట్యూట్‌ ‌కొవిషీల్డ్ ‌వ్యాక్సిన్‌ ‌రూపొందించిన విషయం మనకు తెలుసు. భారత్‌ ‌బయోటెక్‌ ‌రూపొందించిన కొవాక్సిన్‌ ‌మరొకటి. ఈ రెండు వ్యాక్సిన్లు 2021 జనవరిలో కరోనా నియంత్రణకు వినియోగించుకునేందుకు ఇండియా డ్రగ్‌ ‌రెగ్యులారిటీ ఆమోదం పొందాయి. మన దేశంలో పెద్ద ఎత్తున వాటిని వినియోగించారు. దానితో పాటు ఇతర దేశాలకు కూడా మిలియన్ల కొద్దీ డోసులను ఎగుమతి చేశారు. సీరమ్‌ ‌రూపొం దించిన కొవిషీల్డును భారత్‌ ‌బంగ్లాదేశ్‌, ‌మయన్మార్‌, ‌నేపాల్‌, ‌మాల్దీవులు, మారిషన్‌, అఫ్ఘానిస్తాన్‌, ఈజిప్టు, ఉక్రెయిన్‌, ‌న్యూజిలాండ్‌ ‌తో పాటు మరో 92 దేశాలకు పంపింది.

వచ్చే రెండు నెలలు కీలకం

ఇన్‌ఫ్లుయెంజాతో మన అనుభవం దాదాపు 700, 800 ఏళ్ల పైనే. కరోనాతో అనుభవం కేవలం నాలుగేళ్లే. ఇంకా ఎన్నో సరికొత్త అనుభవాలను ఎదుర్కోవలసి ఉంటుంది. రిస్క్ ‌తప్పదు అని తెలిసినప్పుడు దానికి తగినంత సన్నద్ధత అవసరం.

రిస్క్ అనేది ప్రమాదకరం. ముందుగా దాని గురించి తెలిస్తే తప్ప సిద్ధం కాలేం అని మీరు ఎప్పుడయితే అనుకుంటారో పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. కానీ ఎప్పుడు, ఎటు నుంచి వస్తుందో తెలియకపోయినా తప్పనిసరిగా రిస్క్ ఎదుర్కోవలసి వస్తుందన్న అంచనా ఉన్నప్పుడు ఇబ్బందేమీ ఉండదు. కాలిఫోర్నియా రాష్ట్రం భూకంపాల గురించి ఎలా ఆలోచిస్తుందో అలా రిస్క్ ‌గురించి ఆలోచించటం నేర్చుకోవాలని అమెరికన్‌ ‌రచయిత, విశ్లేషకుడు మోర్గాన్‌ ‌హౌసెల్‌ ‌సూచించారు. ‘‘తీవ్రమైన భూకంపం సంభవిస్తుందన్న విషయం వాళ్లకు తెలుసు. కానీ అది ఎప్పుడు? ఎక్కడ? ఎంత తీవ్రత అన్న విషయం మాత్రం తెలియదు. ముందస్తు హెచ్చరికలు ఏమీ లేకుండానే అత్యవసర సిబ్బంది నిరంతరం సిద్ధంగా ఉంటారు. భవన నిర్మాణాలను శతాబ్దమో, అంతకంటే ఎక్కువ కాలమో భూకంపాలను తట్టుకునే రీతిలో సాగుతూంటాయి’’. దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే జె.ఎన్‌-1 ‌కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్న అంచనాల మేరకు ఒమెక్రాన్‌ ‌మాదిరిగా ఒక్కసారిగా వైరస్‌ ఉద్ధృతంగా పెరిగి తర్వాత దానికదే చప్పున చల్లారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రాబోయే రెండు నెలలు కీలకం. మనం ఎంత అప్రమత్తంగా ఉంటామో అంతగా ఇబ్బందుల నుంచి బయటపడతాం.

– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు

 సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE