చార్‌ధామ్‌ యాత్రను సులభతరం చేసేందుకు ఉత్తర కాశీ జిల్లాలో నిర్మిస్తున్న ‘సిల్క్‌యారా’ సొరంగం కుప్పకూలింది. ఈ వ్యాసం రాసేనాటికి దాదాపు పదిహేను రోజులు దాటింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన కార్మికులలో 41మంది అందులో చిక్కుకుపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలతో పాటు, మానసికంగా, భౌతికంగా కూడా ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ఆహారాన్ని, మందులను పంపుతూ, మానసిక స్థౌర్యాన్ని నిలుపుకునేందుకు సూచనలు చేస్తున్నారు. దేశం యావత్తు వారి సంక్షేమం కోసం ప్రార్ధిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ సొరంగ వ్యవహారాలలో అంతర్జాతీయ నిపుణుడు డిక్స్‌ను కూడా పిలిపించడం ద్వారా కార్మికుల ప్రాణాలను కాపాడాలన్న తన నిబద్ధతను చాటుకుంది.


ఇటీవలి కాలంలో హిమాలయ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు పర్యావరణ వేత్తలను, ప్రజలను భీతికి గురి చేస్తున్నాయి. కొద్ది ఏళ్ల కిందట కేదార నాథ్‌లో ప్రకృతి బీభత్సం, ఇటీవలి కాలంలోనే హిమాలయ పర్వత పాద ప్రాంతంలోని  జోషీమఠం పట్టణంలో భూమి కుంగిపోవడం, ఇళ్లు కూలినప్పుడే ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరపడం, కిక్కిరిసిన జనాభా, సహజ నీటి ప్రవాహానికి అడ్డంకులు, జలవిద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణాలు, ఇతర కార్య కలాపాలే ఇందుకు కారణమంటూ పర్యావరణవేత్తలు అభిప్రాయపడ్డారు. వాడియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ డైరెక్టర్‌ కళాచంద్‌ జైన్‌ ఇందుకు మూడు కారణాలు చెప్పారు. జోషీమఠ్‌ బలహీన పునాదులకు కారణం ఒక శతాబ్దం కింద వచ్చిన భూకంపంతో విరిగి పడిన కొండ చరియ అవశేషంపై వాటిని అభివృద్ధి చేయడమే కాకుండా, అది భూకంపాలు ఎక్కువగా సంభవించే అవకాశాలు గల జోన్‌ ఐదులో ఉంది. నిత్యం నీరు ప్రవహిస్తు న్నందున కాలక్రమంలో రాళ్ల సంఘటిత బలం తగ్గి, క్రమంగా శిథిలమవుతోందని  విశ్లేషించారు.

కాగా, కేవలం 4.5 కిమీల పొడవుతో సిల్క్‌యారా`దందల్‌గావ్‌ మధ్య 2016లో ఈ సొరంగ నిర్మాణాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన చార్‌ధామ్‌ రోడ్డు పథకంలో భాగంగా జాతీయ హైవేలో బ్రహ్మఖల్‌ ` యమునోత్రి సెక్షన్‌లో దీనిని ప్రారంభించారు. ఆ రహదారితో ద్వారా కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌, యమునోత్రి, గంగోత్రిలను అనుసంధానం చేయాలని భావించారు. ఆ ప్రాజెక్టు ఇప్పుడు విషాదాన్ని ఎదుర్కొంటోంది. దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు సొరంగ నిర్మాణం జరిగింది. ఇక్కడే కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించినప్పటి నుంచే  విస్తృతంగా జరుపుతున్న డ్రిల్లింగ్‌, నిర్మాణ కార్యకలాపాల పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఈ పనుల కారణంగా భూమి కుంగడం, కొండ చరియలు విరిగిపడటం, పర్యావరణ విధ్వంసం జరుగుతాయేమోననే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

భారత ప్రభుత్వం చైనాకు చెక్‌పెట్టేందుకు, యుద్ధం వస్తే సైన్యానికి అనువుగా ఉండేందుకు హిమాలయాలలో రహదారులు, సొరంగాల నిర్మాణం పనులను చేపట్టిందన్న వాదన ఉంది. ఇది అవసరం. పొరుగున ఉన్నది శత్రు దేశమైనప్పుడు, మన జాగ్రత్తల్లో మనం ఉంటూ, అవసరమైన చర్యలు తీసుకోవలసిందే. ఇటీవలి సంవత్సరాలలో చైనాతో గల్వాన్‌లో తలపడిన తర్వాత ఆ దేశం ఆ ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలను చేపడుతున్న నేపథ్యంలో భారత దేశంకూడా దానికి దీటుగా ఉండాలి. అయితే, ఇరుదేశాల నుంచి ఈ రకమైన నిర్మాణాలే చేటు తెస్తున్నాయా అనే అనుమానాలు రేగుతున్నాయి.

ఇలా ఎందుకు జరుగుతోంది?

హిమాలయ ప్రాంతం అత్యంత సున్నితమైనది.  భూగర్భశాస్త్రవేత్తల ప్రకారం  హిమాలయాల వయసు చిన్నది. ఇక్కడ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే ముందు, ప్రాజెక్టులను నిర్మించే ముందు భూమి పరిస్థితులను, ప్రకృతిని పరిరక్షించేలా అధ్యయనాలు జరిపి మరీ చేపట్టాలని పర్యావరణవేత్తలు వాదిస్తు న్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సున్నితమైన, శిఖర పర్యావరణ వ్యవస్థలపై ఎక్కువగా దృష్టిపెట్టడం లేదని, కనుక అసలు ఈ ప్రాంతాలలో భారీ ప్రాజెక్టుల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటమే మంచిదని అభిప్రాయాలు ఉన్నాయి.

రుతుపవనాల కారణంగా తడిసిన కొండల నుంచి చరియలు విరిగిపడే సంఘటనలు రహదారులు, సొరంగాల కోసం భూమిని తొలచడంతో మరింత పెరుగుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు.ఇటువంటి సున్నిత ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం కోసం పేలుడు పదార్ధాలను ఉపయోగించడం వంటివన్నీ కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నది నిపుణులు భావన. వీటితో పాటు పర్వత పాద ప్రాంతంలో రైళ్లు వేయడం, అవి పట్టాల నుంచి వేగంగా వెళుతున్నన్నప్పుడు వచ్చే ధ్వనితరంగాలు కూడా ఈ పర్వతశ్రేణులను ప్రభావితం చేస్తాయన్నది వారి మాట.

హిమాలయాలు ఎందుకు అంత సున్నితం?

హిమాలయ పర్వత శ్రేణులు, టిబెట్‌ పీఠభూమి భారత్‌, యురేషియా ప్లేట్ల కదలిక, వాటి మధ్య అభిఘాతం కారణంగా ఏర్పడ్డాయని భూగర్భ శాస్త్రవేత్తల భావన. దాదాపు 50 మిలియన్‌ సంవత్సరాల కింద ప్రారంభమైన ఈ అభిఘాతం ఇంకా కొనసాగుతోందని చెబుతున్నారు. బ్రిటిష్‌ జియలాజికల్‌ సొసైటీ,  భారతదేశం 225 మిలియన్‌ సంవత్సరాల కిందట ఆస్ట్రేలియా తీరంలో ఉం డేదని, దీనిని ఆసియా నుంచి టెథిస్‌ మహాసముద్రం వేరు చేసిందని పేర్కొంటోంది. కాగా, 200 మిలియన్‌ సంవత్సరాల కిందట మహాఖండమైన పంగియా నుంచి విడిపోయి ఆసియా దిశగా ఉత్తరంగా భారత్‌ భూమి ప్రయాణించడం ప్రారం భించింది. ఇక 80 మిలియన్‌ సంవత్సరాల కిందట ఆసియా ఖండానికి 6,400 కిమీ దూరంలో దక్షిణంగా ఉంటూ, ఏడాదికి 9నుంచి 16 సెంటీ మీటర్ల చొప్పున దాని దిశగా కదులుతూ వచ్చిందని, ఇదే సమయంలో టెథిస్‌ మహా సముద్రంలోని భూమి బహుశ ఆసియా కిందగా వచ్చి ఉంటుందని, ఈ రెండు ప్లేట్ల మధ్య మార్జిన్‌  కలిసి నేటి ఆండిస్‌ పర్వతాల వలే ఏర్పడి ఉంటాయని వారి అంచనా.

దాదాపు 40 నుంచి 50 మిలియన్‌ సంవత్సరాల నుంచి భారతీయ కాంటినెంటల్‌ ప్లేట్ల ఉత్తర దిశ కదలిక ఏడాదికి 4-6 సెంమీలకు నెమ్మదించిందని, ఇదే యురేషియా, భారత ఖండ ప్లేట్ల మధ్య తాకిడి లేదా రాపిడికి ప్రారంభానికి, నాటి టెథిస్‌ మహాసముద్రం మూసుకుపోవడానికి, హిమాల యాలు పెరుగుదల ప్రారంభానికీ సంకేతమని సొసైటీ చెబుతోంది.  యురేషియా ప్లేటు నలిగిపోయి భారతీయ ప్లేటుపైకి వచ్చింది. అయితే రెండిటి మందం, అధిక ప్లవనశక్తి (బయాన్సీ) కారణంగా ఏ కాంటినెంటల్‌ ప్లేటు మరోదాని కిందకు రాలేదు. దీనితో ఈ కాంటినెంటల్‌ ఉపరితలం మందమై, ముడుచుకోవడం, భ్రంశనం జరుగుతూ సంపీడన శక్తి  కారణంగా హిమాలయాలూ, టిబెటన్‌ పీఠభూమి పైకి వచ్చాయిట. ఇక్కడ ఉండే కాంటినెటల్‌ క్రస్ట్‌ సాధారణంగా కనిపించే సగటు మందం కన్నా రెండిరతలు అంటే 75 కిమీలు ఉంటుంది. ఇదే ఈ ప్రాంతంలో అగ్నిపర్వత కార్యకలాపాలకు చెక్‌ పెడుతోందట! ఒకవేళ అడుగున పర్వతం పేలినా, ఇంత మందంగా ఉన్న పొర నుంచి లావా బయిటకు వచ్చేలోపలే అది ఘనీభవిస్తుంది.

ఇప్పటికీ, భారత్‌ ఆసియాకు ఉత్తరం వైపుగా కదులుతున్నందున హిమాల యాలు ఏడాదికి 1 సెం.మీ. చొప్పున పెరుగుతూ వస్తున్నాయి. ఇదే ఈ ప్రాంతంలో నేడు నిస్సారదృష్టి భూకంపాలు (shallow focus earth quakes)కు కారణ మట. అయితే, అదే రేటుతో హిమాలయాలు ఎత్తు తగ్గడానికి వాతావరణం, కోత (ఎరోజన్‌) కారణమవు తున్నాయిట.

ఉత్తరకాశీ సొరంగంలో రక్షణ చర్యల పరిస్థితి:

సిల్క్‌యారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు ప్రభుత్వం పలురకాల చర్యలను చేపడుతోంది. నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒఎన్‌జిసి, ఎస్‌జెవిఎన్‌ఎల్‌, ఆర్‌వి ఎన్‌ఎల్‌, ఎన్‌హెచ్‌ఐడిసిఎల్‌, టిహెచ్‌డిఎల్‌ సంస్థలకు సొరంగాన్ని తొలిచి బాధితులను బయిటకు తెచ్చే నిర్ధిష్ట బాధ్యతను అప్పగించారు. వీరితో పాటుగా బీఆర్‌ఓ, ఐటిబిపి కూడా ఇందులో పాలుపంచు కుంటున్నాయి. ఫస్ట్‌ ఎయిడ్‌ను అందించేందుకు, అవసరమైనవారిని వాయుమార్గం ద్వారా ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు జరిగాయి.

ఈ కార్మికులందరినీ సజీవంగా బయటకు తీసుకురావాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వం, అధికారులు, గాలి సంపీడన గొట్టాల ద్వారా వారికి ఆక్సిజన్‌, విద్యుత్‌, ఆహారం పంపుతున్నారు. ఒక దశలో యంత్రాలు మొరాయించడంతో పనులు ఆగాయి. ఆమెరికాలో తయారు చేసిన ఆగర్‌ మెషీన్‌తో తొలచడం ప్రారంభించిన కొద్ది సమయానికే అందులో సాంకేతిక లోపం ఏర్పడడంతో ఆ పని నిలిపివేశారు. రక్షణదళాలు తొలిచిన మార్గం ద్వారా పైపులను చొప్పిస్తున్నారు. దాని ద్వారానే వారికి ఆహారం, మందులు వగైరాలు వెడుతున్నాయి.

అంతర్జాతీయ నిపుణుల యత్నాలు

అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు మరింత బలాన్ని చేకూర్చేందుకు ప్రభుత్వం భూగర్భ నిపుణుడు ప్రొఫెసర్‌ ఆర్నాల్డ్‌ డిక్స్‌ను పిలిపించింది. ఆయన అండర్‌గ్రౌండ్‌ స్పేస్‌ సంస్థ అధ్యక్షులు కూడా. భూగర్భ, రవాణా మౌలిక సదుపాయాల నిర్మాణ రిస్కు, కార్యాచరణ భద్రత దృక్పధం నుంచి వాస్తవ భద్రతతో ముడిపడి ఉన్న సాంకేతిక సమస్యలపై ప్రత్యేకాధ్యయనం చేశారు. ఘటనా స్థలికి చేరుకోగానే డిక్స్‌ సిల్క్‌యారా సొరంగ ప్రాంతంలో తనిఖీ నిర్వహించి, రక్షణ కార్యకలాపాలలో నిమగ్నమైన ఏజెన్సీలతో మాట్లాడారు. బాధితులను బయిటకు తెచ్చేందుకు ఇంత మంది చేస్తున్న ప్రయత్నాలు గమనించిన డిక్స్‌ ఈ ఆపరేషన్‌లో గరిష్ట పరిష్కారాన్ని కనుగొనగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, సొరంగం సమీపంలో ఉన్న ఆలయంలో పూజలు కూడా నిర్వహించారు.

ఇటువంటి పరిస్థితుల్లో రక్షణ చర్యలు ఎంత కష్టమో తెలిసిన డిక్స్‌ లోపల ఉన్న కార్మికులను క్రిస్మస్‌ నాటికి బయిటకు తేగలమంటూ ప్రకటించడం బాధితుల కుటుంబాలను నిరాశపరిచినప్పటికీ, అసలు వారు బయటకు రాగలరనే హామీ కాస్త ఊరట కల్పించింది. అంటే, వారిని బయటకు తేవడానికి మరొక నెల సమయం పడుతుందని ఆయన గరిష్టంగా అంచనా వేశారు. యంత్రంతో తొలి చిన ప్రతిసారీ ఇదిగో ఈసారి వచ్చేస్తున్నారు అని అందరూ భావిస్తున్న తరుణంలో ఏదో ఒక సాంకేతిక లోపమో, భద్రతా కారణంగానో ఆ యత్నాలు ఆగిపోవడాన్ని మనం చూస్తున్నాం. బహుశ ఆయన అంత గడువు ఇవ్వడానికి కారణం అదే అయి ఉండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సొరంగాల భద్రతకు గణనీయంగా అందించిన సేవల కారణంగా, ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి ఘటన చోటు చేసుకున్నా ఆయనకు పిలుపు వస్తుంది.

ఇటువంటి దుర్ఘటనలు జరిగితే, తప్పించుకునే మార్గం లేదని, నిర్మాణంలో నిబంధనలను పాటించ లేదని, ఇందుకు కేంద్రం బాధ్యత వహించాలంటూ ప్రతిపక్ష ఎంపీ ప్రియాంక చతుర్వేదీ విమర్శించారు. అయితే ప్రధానమంత్రి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకూ అనుక్షణం ఈ ఆపరేషన్‌పై అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్న విషయాన్ని వార్తాపత్రికలు సహా మీడియా ప్రచురిస్తోంది. రక్షణ ఆపరేషన్‌లో చివరి దశను పూర్తి అప్రమత్తతతో, వేగంగా పూర్తి చేయాలని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ అధికారులకు ఆదేశాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శ్రద్ధను వెల్లడిస్తు న్నది. రాజకీయాల మాట ఏమైనా, ప్రభుత్వాలు ఇటువంటి సున్నిత ప్రాంతాలలో ప్రాజెక్టులు నిర్మించే ముందు అనేకానేక పరీక్షలు, పరిశీలనలు చేసిన తర్వాతే వాటిని చేపట్టాలి. నిర్మాణ సమయంలో జరిగింది కనుక నష్టం పెద్దగా వాటిల్ల లేదు, కానీ పూర్తి అయిన తర్వాత జరిగి ఉంటే, ఆస్తి నష్టం, ప్రాణనష్టం కూడా జరిగేవి. బహుశ, మన పెద్దలు చార్‌ధామ్‌ను అందుకే అత్యంత పవిత్రమైన దానిగా పరిగణించి భక్తి శ్రద్ధలతో వెళ్లేవారు తప్ప నేటి పర్యాటకులు చేసే విలాసయాత్రలా కాదు. ఏది ఏమైనా మన కార్మికులు సురక్షితంగా ఆ సొరంగం నుంచి బయిటపడాలని కోరుకుందాం.

– నీల

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram