కరణీయమ్‌ కృతమ్‌ సర్వమ్‌ తజ్జన్మ సుకృతిమ్‌ మమ ధన్యోస్మి

కృతకృత్యోస్మి గచ్ఛామద్య చిరం గృహమ్‌ కార్యార్ధమ్‌ పునరాయాదుమ్‌

తథాప్యా శాస్తిమే హృది మిత్రైః సహ కర్మకురువన్‌ స్వాంతః

సుఖమవాప్నుయాత్‌ ఏషాచేత్‌ ప్రార్థనమ్‌ దృష్ట్వా క్షమస్వ

 కరుణానిధే కార్యమిదమ్‌ తవైవాస్తి తావకేచ్ఛా బలీయసి

(నేను చేయవలసిన కార్యం చేసి కృతకృత్యుడనై ఇంటి వెళ్లిపోతున్నాను. సంఘకార్యం కోసం ఈ కార్యకర్తల మధ్య మళ్లీ పుట్టించమని ప్రార్ధిస్తున్నాను.)

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు నిర్మాణం ఒక మహాయజ్ఞం. అందుకు పాటుపడినవారంతా రుషితుల్యులు. రంగాహరి అలాంటివారిలో ఒకరు. నిరాడంబర జీవితం, నిండైన వ్యక్తిత్వం వారిది. ఆయన ఒక ఆర్షవిజ్ఞాన ఖని. ఆధునికతను మథించిన జ్ఞాని.ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతవేత్తలలో అగ్రగణ్యులు రంగాహరి. రంగాహరి, ఆర్‌. హరి, హరి… సంఘంలో ఆయనకు ఉన్న పేర్లు ఇవి. గాంధీజీ హత్య తరువాత దేశవ్యాప్తంగా అరెస్టయిన వారిలో ఆయన ఒకరు. అంటే 75 ఏళ్ల సంఘ ప్రస్థానానికి ఆయన ప్రత్యక్ష సాక్షి. సంఘం మీద నిషేధం ఎత్తివేయాలని కోరుతూ దేశమంతటా జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్నందుకే డిసెంబర్‌ 1948లో ఆయనను అరెస్టు చేసి ఏప్రిల్‌ 1949 వరకు నిర్బంధంలో ఉంచారు. దీనితో ఆయన బీఏ చదువు ఆగిపోయింది. రాజనీతిశాస్త్రం, చరిత్ర, సంస్కృతం ఐచ్ఛికాంశాలుగా బీఏ చదువుతూ ఉండగానే ఆ సంక్షోభం తలెత్తింది. ఆర్‌ఎస్‌ఎస్‌ మీద నిషేధం ఎత్తివేసిన తరువాత మాత్రమే ఆయన విడుదలయ్యారు. తరువాత చదువు కొనసాగించారు. బీఏ తరువాత ప్రత్యేకంగా సంస్కృతం చదువుకున్నారాయన. ఆ తరువాతే మే 3, 1951న ఆయన తాలూక ప్రచారక్‌గా బాధ్యత స్వీకరించారు. సంవత్సరం తరువాత జిల్లా ప్రచారక్‌ అయ్యారు. ఆపై విభాగ్‌ బాధ్యతలు నిర్వహించారు. కేరళ 1950 దశకం నుంచి కమ్యూనిస్టు ప్రభావంలోనే ఉండేది. ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ వంటివారి నాయకత్వంలో కమ్యూనిస్టులు ఇతర సంస్థల పట్ల జులుం ప్రదర్శించే వారు కూడా. అలాంటి నేపథ్యంలో అక్కడ సంఘ బాధ్యతలు నిర్వహించడం అసిధారావ్రతమే.

కొద్దిగా గమనించినా చాలు, ఒక వ్యక్తిలో, ఒక జీవితంలో ఇంత కృషి ఎలా సాధ్యమన్న ప్రశ్న వస్తుంది. దారుణమైన ప్రతికూలతల మధ్య కేరళ కార్యక్షేత్రంలో ఆయన సాహసోపేతంగా పనిచేశారు. భారతీయ పురాణాల మీద విలువైన వ్యాఖ్యానాలు రచించారు. సంఘ చరిత్ర అనదగిన సంపుటాలు వెలువరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రవాహశీలత అఖండంగా కొనసాగుతున్నదంటే రంగాహరి వంటి మహనీయులు ఇందుకోసం జీవితాలను త్యాగం చేయడమే కారణం. అందుకే ఆ జీవితం పరిపూర్ణ మైనది. ఎప్పటికీ మార్గదర్శకమైనది.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఎదుర్కొన్న అన్ని నిర్బంధాలు రంగాహరి అనుభవంలోనివే. అత్యవసర పరిస్థితి (జూన్‌ 25, 1975 – మార్చి 21, 1977) స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. ఆ సమయంలో కేరళలో ఆజ్ఞాతంలో ఉంటూ పనిచేసిన ముగ్గురు ప్రముఖ నాయకులలో రంగాహరి ఒకరు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏర్పడిన లోక్‌సంఘర్ష సమితి కేరళ ప్రాంత బాధ్యతలు కూడా ఆయన నిర్వహించారు. మిగిలిన ఇద్దరు కె.భాస్కర రావు, పీఎం అధవ్‌జీ. కేరళలో జరిగిన ఆజ్ఞాత పోరాటంలో ఆ ముగ్గురే కీలకం. ఆ సమయంలో సంఘం తరపు రహస్య పక్ష పత్రిక ‘కురుక్షేత్ర’ను ఆయనే మలయాళంలో వెలువరించేవారు. ఆ కాలంలో అజ్ఞాతంలో ఉండి పనిచేసిన వారికి నాలుగు మెతుకులు దొరకడమే దుర్లభంగా ఉండేది. అయినా రంగాహరిగారితో ప్రయాణం, ఆయన బైఠక్‌లు వింటే ఎలాంటి అతిశయోక్తి లేకుండా చెప్పాలంటే పంచభక్ష్య పరమాన్నాలను మరిపించేవి. ఆయనతో ప్రయాణాలు అలాంటి కాలంలో కూడా విహార యాత్రలను మరిపించేవి. అంత ఉక్కపోతలోనూ ఆయన సమక్షం మలయ మారుతంలా ఉండేది.

అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత కురుక్షేత్ర పత్రిక ప్రచురణను బాహాటంగా  ప్రారంభించి, ఆ బాధ్యతను రంగాహరిగారికి అప్పగించారు. కేరళ వంటి చోట ఆయన 1983 నుంచి 1994 వరకు ప్రాంత ప్రచారక్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1991లో బౌద్ధిక్‌ ప్రముఖ్‌గా ఎంపికై 2005 వరకు కొనసాగారు. తరువాత ఆసియా, ఆస్ట్రేలియాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హిందూ స్వయంసేవక్‌ సంఫ్‌ుకు ప్రభారిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాలంలోనే ఆయన 22 దేశాలలో పర్యటించారు. సంఘ క్రియాశీలక బాధ్యతల నుంచి పూర్తిగా విరమించుకున్న తరువాత ఆయన అధ్యయనానికి, ఆరోగ్యం సహకరించిన మేర ఉపన్యాసాలు, రచనా వ్యాసంగాలకే అంకిత మయ్యారు.

రంగాహరి బహు భాషా పండితులు. మలయాళం, సంస్కృతం, హిందీ, కొంకణి, మరాఠి, తమిళం, ఆంగ్ల భాషలలో ఆయన ప్రావీణ్యం లోతైనది. మలయాళం, హిందీ, ఇంగ్లిష్‌, కొంకణి భాషలలో పుస్తకాలు రాశారు. ‘శ్రీగురూజీ సమగ్ర’ పేరుతో హిందీలో వెలువడిన12 సంపుటాలు ఆయన చేతుల మీదుగానే రూపొందాయి. హిందీలో గురూజీ జీవితచరిత్రను కూడా ఆయనే రాశారు. ఇందులో శ్రీగురూజీ సమగ్ర సంకలనాల పని ఒక వ్యక్తి చేయగలిగినది కాదు. అది వారికే సాధ్యమైంది. రెండవ సర్‌సంఘచాలక్‌గా గురూజీ ప్రయాణం, ఆయన రాసిన వేలాది లేఖల నుంచి సమాచారం తీసుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం (నాగపూర్‌) నుంచి గురూజీ రాసిన ప్రతిలేఖకు ఆయన సహయకుడు ఒకరు నకలు తీసేవారు. గురూజీ హిందీ, ఇంగ్లిష్‌, మరాఠీలలో లేఖలు రాసేవారు. ఆ సహాయకుడు కార్డు, కవరు, స్టాంప్‌ల ఖరీదును కూడా రాసి పెట్టేవారు. ఒకసారి రంగాహరి గారు ఒకరితో సరదాగా అన్నారట, ‘గురూజీ ఉత్తరాలు పరిశీలిస్తే భారతీయ తపాల వారి ధరవరల చరిత్ర బాగా తెలుస్తుంది’ అని. ఆ ఉత్తరాలన్నింటిని పూర్తిగా చదవడం వల్ల సంఘ చరిత్ర ఆయనకు పరిపూర్ణంగా తెలిసింది.

కేరళలోని కొజికోడ్‌లో 1942లో తొలిశాఖను స్థాపించినవారు దత్తోపంత్‌ ఠేంగ్డీ అని చెప్పుకోవడం పరిపాటి. కానీ గురూజీ ఉత్తరాలను పరిశీలించిన తరువాత తెలిసిన విషయం మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన ప్రచారక్‌ థెలక్‌జీ కేరళలో శాఖను ప్రారంభిం చారు. 1941లోనే ఆయన కేరళలో తిరువనంత పురం, కొల్లాం జిల్లాలలో శాఖలు ప్రారంభించడమే కాదు, నాగపూర్‌లో జరిగే శిక్షావర్గలకు కూడా కేరళ నుంచి స్వయంసేవకులను ఆయన తీసుకువెళ్లారు. ఈ సమాచారం తెలిసిన మరుసటి సంవత్సరమే రంగాహరి మధ్యప్రదేశ్‌లో పర్యటించవలసి వచ్చింది. అప్పుడు థెలక్‌జీ ఆచూకీ తెలుసుకుని వెళ్లి ఆయనను కలుసుకున్నారు. అఖిల భారత బౌద్ధిక్‌ ప్రముఖ్‌ తనను చూడడానికి రావడంతో థేలక్‌జీ విస్తుపోయారు. ఈ బౌద్ధిక్‌ ప్రముఖ్‌ తాను శాఖలు ప్రారంభించిన చోటు నుంచి వచ్చినవారని తెలిసి మరింత ఆనందించారాయన.

గురూజీ శతజయంతికి గురూజీ సమగ్ర 12 సంపుటాల పని మొదలుపెట్టారు. 2004-2006 మధ్య ఒక బృందం సహకారంతో ఆయన పని పూర్తి చేశారు. తరువాత అదే మిగిలిన భారతీయ భాషలలోకి అనువదించారు. అయితే ఏ సంపుటి లోను కూడా తన పేరును వేయడానికి ఆయన ససేమిరా అంగీకరించలేదు. ఆఖరికి ఉపోద్ఘాతంలో కూడా పేరును ప్రచురించలేదు. అందుకు ఆయన చెప్పిన కారణం విశిష్టమైనది. స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ జీవిత, రచనల సంకలనాలు చేసిన వారి పేరు కనిపించదని, తాను కూడా వారి బాటలోనే నడుస్తానని రంగాహరి చెప్పారు. ఆయన జీవితంలో అనేక అద్భుత గ్రంథాలను రచించారు. కానీ ఎక్కడా రచయిత పేరుకు ప్రాముఖ్యం ఇవ్వలేదు. తరువాత ఆయన గ్రంథాలలో ఒకదానికి పురస్కారం ఇవ్వదలుచుకున్న ఒక సంస్థ సహాయకుల ద్వారా ఆయనకు సమాచారం ఇచ్చింది. అప్పుడు కూడా ఆయన ఒక ప్రచారక్‌గా తాను పురస్కారాలకు దూరమని చెప్పారు.

గురూజీ మంత్రదీక్ష తీసుకున్న సంగతి కూడా గురూజీ రచనల సంకలనం సమయంలో రంగాహరి తెలుసుకున్నారు. స్వామి అఖండానంద గురూజీకి మంత్రదీక్ష ఇచ్చారు. అఖండానంద అంటే స్వామి వివేకానందుల 15 మంది అంతేవాసులలో ఒకరు. రంగాహరి జ్ఞాపకశక్తి అమోఘం. డిసెంబర్‌ 2021లో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వచ్చి పరామర్శిం చారు. ఆ ఇద్దరు కలుసుకోవడం అది రెండోసారి మాత్రమే. తరువాత గోవా గవర్నర్‌ పిఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై పరామర్శకు వచ్చారు. ఆయన రచయిత కూడా. అందుకే రంగాహరి అంటే విశేషమైన గౌరవం. ఈ గవర్నర్‌ తన సహాయకుడిని (ఏడీసీ) పరిచయం చేశారు. ఏ రాష్ట్రం నుంచి వచ్చారు అని అడిగితే కర్ణాటక అని చెప్పారాయన. తరువాత తండ్రి పేరు అడిగారు. ఆ పేరు వినగానే రంగాహరి ఆయన ఫలానా సంవత్సరంలో ఫలానా చోట జరిగిన 20 రోజుల సంఘ శిక్షావర్గలో పాల్గొన్నారని చెప్పారు. తరువాత అది అక్షరాలా నిజమని తేలింది. కేరళ సీపీఎం ప్రముఖుడు ఎంఎం లారెన్స్‌, రంగాహరి సెయింట్‌ అల్బర్ట్‌ పాఠశాలలో సహాధ్యాయులు. వారిది ఎర్నాకులం. తరువాత కూడా ఆ ఇద్దరి మధ్య స్నేహం కొనసాగింది. లారెన్స్‌ సంతానం కూడా రంగాహరిని చూసి వెళ్లేవారు.

రంగాహరి క్రీయాశీలకంగా లేకపోయినప్పటికి సంఘ పెద్దలు ఆయన సలహాలను స్వీకరించేవారు. పూజనీయ కేఎస్‌ సుదర్శన్‌జీ సంఘ నిర్ణయాల విషయంలో రంగాహరిని తన మార్గదర్శకునిగా భావించేవారు. డాక్టర్‌ మోహన్‌ భాగవత్‌ కూడా ఇదే సంప్రదాయం కొనసాగించారు.రంగాహరి మరణం ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రేరణతో నడిచే సంస్థలు, వ్యక్తులకే కాదు, దేశంలోని జాతీయవాద శక్తులన్నింటికీ అశనిపాతం వంటిదే. ఆయన గురించి ఎక్కువ మందికి తెలిసి ఉండదు. ఆయనను తక్కువ మంది మాత్రమే గుర్తు పడతారు. కానీ ఒక జ్ఞానిగా, మేధావిగా, ఆధునిక జాతీయవాదం మీద ఆయన వేసిన ముద్ర దృఢమైనది. ఆయన ఉపన్యాసం ఒక్కసారి విన్నా అది బోధపడుతుంది. ఆధునిక సాంస్కృతిక జాతీయవాదానికి ఆయన సరికొత్త భాష్యం చెప్పారు. ఆయన ఎంత తాత్త్వికుడో అంత సంఘటనా శక్తిసంపన్నులు కూడా. కేరళ వంటి భూమిలో ఆర్‌ఎస్‌ఎస్‌, అనుబంధ సంస్థలు నిలదొక్కుకుని నడుస్తున్నాయంటే దాని వెనుక ఉన్నది రంగాహరి వ్యక్తిత్వం, జీవితకాల కృషి.

కార్యక్షేత్రంలో ఇంత సమున్నత విజయం సాధించిన రంగాహరి కలానికి కూడా ఎంతో శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. రామాయణ, భారతాల గురించి ఆయన కొన్ని వ్యాఖ్యానాలు రాశారు. ‘మహాభారతంలో యుథిష్టిరుడు’ అన్న పుస్తకంలో అలాంటివాటిలో ఒకటి. మహా భారతంలో కర్ణుడు అనే పుస్తకంలో అసలు కర్ణుడి పాత్రకు కొత్త భాష్యం ఇచ్చారాయన. విదురుడు, ద్రౌపది, భీష్ముడు, వ్యాసుడి నారదుడు, వ్యాసుడి కృష్ణభగవానుడు వంటి పుస్తకాలు ఆయన రాశారు. రామాయణ అంతర్‌ బహిర్‌ చిత్రం అన్న వ్యాఖ్యానం కూడా ఎంతో విలువైనది.  భద్రకాళి చరితమ్‌ మరొక అమూల్య భాష్యం. శ్రీపాద్‌ దామోదర్‌ సాత్వేత్కర్‌  హిందీలో రాసిన ‘వేదాలలో జాతీయత భావన’ను రంగాహరి మలయాళంలోకి  అనువదించారు. డాక్టర్‌ హెడ్గెవార్‌ ఎంపిక చేసిన ఉత్తరాలు, సంఘ పరిణామ చరిత్ర, హిందూ సంస్కృతిపై పండిత్‌ ఎస్‌డి సాత్వేత్కర్‌ వ్యాసాల సంకలనం ఆయన రచించారు. సంస్కృతం నుంచి శంకరాచార్య ప్రశ్నోత్తరిని ఆయన అనువదించారు. ఏ విధంగా చూసినా యాభయ్‌ వరకు పుస్తకాలను ఆయన కలం వెలువరించింది.

రంగాహరి ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్ధిద్దాం!


స్వయంసేవకులను తీవ్ర విచారంలో మిగిల్చి వెళ్లిపోయారు

ఆదర్శవంతమైన వ్యవహార సరళి, వాస్తవికత కలిగిన కార్యకర్త, గొప్ప చింతనాపరులు రంగాహరి మరణం మమ్మల్ని కలచివేసింది. మమ్మల్నందరినీ ప్రోత్సహిస్తూ ఉండే అనుభవజ్ఞులాయన. ఆయన పరిపూర్ణమైన, అర్థవంతమైన జీవితం గడిపారు. ఆయన అఖిల భారత బౌద్ధిక్‌ ప్రముఖ్‌గా ఉన్నప్పుడు ఆయన  పరిచయంలోకి వచ్చిన ఎందరో స్వయంసేవకులు ఈ రోజు తీవ్ర విచారంలో మునిగిపోయారు. అంత్యదశలో కూడా శరీరం సహకరించడం లేదన్న సంగతి తెలిసి కూడా ఆయన తన అధ్యయనం, రచనా వ్యాసంగాలను విరమించుకోలేదు. తనను కలుసుకోవడానికి వచ్చిన స్వయంసేవకులను కూడా ప్రశాంతవదనంతో పలకరించేవారు. ‘పృథ్వీస్తూకం’ మీద ఆయన రాసిన వ్యాఖ్యానం ఈ అక్టోబర్‌ 11న ఢిల్లీలో విడుదలైంది. తను పెద్దగా మాట్లాడలేకపోయినా, మిగిలిన వక్తల ఉపన్యాసాలను ఆస్వాదిస్తున్నట్టు ముఖకవళికలతో వ్యక్తీకరించారు. వ్యక్తిగతంగా, సంఘం తరఫున ఆయన మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకుంటున్నాను.

(సర్‌సంఘచాలక్‌ డాక్టర్‌ మోహన్‌భాగవత్‌ సంతాప సందేశం/ఎక్స్‌ ద్వారా)

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram