సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  ‌భాద్రపద బహుళ తదియ  – 02 అక్టోబర్‌ 2023, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


మతం దగ్గర ఒక వర్గానిది ఉదార స్వభావం. మతం పేరెత్తితేనే ఊగిపోయే లక్షణం మరొక వర్గీయులది. మత ఉద్రిక్తతలు కొందరు మతోన్మాద మైనారిటీల దుందుడుకు చర్యల ఫలితమని సుస్పష్టంగా తేలినా మెజారిటీలపైనే నింద మోపే లక్షణం ఇక్కడి ప్రత్యేకత. చరిత్ర చెబుతున్నదీ అదే. ఈ విషయమే బీజేపీ అగ్రనేత లాల్‌ ‌కృష్ణ అడ్వాని తన అయోధ్య రథయాత్ర సందర్భంలో దేశ ప్రజలకు వివరించే ప్రయత్నం అద్భుతంగా చేశారు. ఉదారవాదులు కాబట్టి ఆ సత్యం మెజారిటీలకు అర్ధమయింది. మైనారిటీలు ఇంకా అర్ధం చేసుకోవలసిన పరిస్థితిలోనే ఉన్నారు. అడ్వానీ విశ్లేషణ హిందువులు, ముస్లింలకు సంబంధించినది. ఆ మైనారిటీ వర్గంలోని కొందరికి, ఇప్పుడు మరొక మైనారిటీ వర్గంలో కొందరు తోడై 1947 నాటి పరిస్థితిని పునరావృతం చేయాలని చూస్తున్నారు. ఆయన రథయాత్రకు పదేళ్ల ముందు మైనారిటీ వర్గం సిక్కులలో దారితప్పిన కొందరు సృష్టించిన అవాంఛనీయ, ఆత్మహత్యా సదృశ ధోరణులే మళ్లీ ఇప్పుడు బుసలు కొడుతున్నాయి. దేశ విభజన సమయంలో ఏ వర్గం చేతిలో అయితే ఎన్ని తరాలయినా మరచిపోని విధంగా గాయపడ్డారో, అదే వర్గం చేతిలో పావులుగా ఆ క్షతగాత్రులే, అంటే సిక్కులు, మారిపోవడమే చరిత్రను దిగ్భ్రమకు గురి చేస్తున్నది. పాత గాయం సలుపును మరచిపోవడానికి కొత్త గాయం చేసుకోవాలన్న భూతవైద్యాన్ని ఆ దారితప్పిన సిక్కులు నమ్ముతున్నారు. ఖలిస్తాన్‌తో పాటు ఉర్దూస్తాన్‌ ఏర్పాటుకు ప్రణాళికలు వేయడం అలాంటిదే. వీళ్లే దావూద్‌ ఇ‌బ్రహీంనూ అంటకాగుతున్నారు.

ఇలాంటి ప్రణాళికల రూపకర్తలకు ఆశ్రయం ఇస్తున్న కెనడాకూ, భారత్‌కూ నడుమ సంబంధాలు దెబ్బ తినడం ఆశ్చర్యపరిచే పరిణామం కాబోదు. కెనడా ఖలిస్తానీల అడ్డా. ఖలిస్తానీలను బుజ్జగించే ప్రభుత్వమే అక్కడ రాజ్యమేలుతోంది. భారత్‌ ‌నుంచి పారిపోయిన సిక్కు ఉగ్రవాదులలో కొందరు అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. అందులో ఒకడు గురుపత్వంత్‌ ‌సింగ్‌ ‌పన్ను. సిక్కు రాజ్యం ఖలిస్తాన్‌ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న సిక్స్ ‌ఫర్‌ ‌జస్టిస్‌ అధిపతిగా ఇతడికి పేరు. డెమొక్రటిక్‌ ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ఉర్దూస్తాన్‌ ‌పేరుతో భారతదేశంలోనే ముస్లింల కోసం ఒక దేశాన్ని నిర్మించాలన్న ఇతడి ఆశయం ఇటీవలనే బయటపడింది. అసలు ఏ మతం వారు కోరుకుంటే ఆ మతం కోసం భారత్‌ను ఒక్కొక్క ముక్కగా చీల్చి అప్పగించాలని ఇతడి కల. ఖలిస్తాన్‌ ‌కుట్రదారులు ఒక్కొక్కరుగా ‘అనుమానాస్పద’ స్థితిలో మరణించడం చూసి, కొద్దికాలం పత్తా లేకుండా పోయిన పన్ను, మళ్లీ వార్తలలోకి వచ్చాడు. నిజానికి కెనడాయే ఇప్పుడు వార్తలలో ఉంది కదా! అక్కడే తలదాచుకున్న ఖలిస్తానీ హరదీప్‌సంగ్‌ ‌నిజ్జర్‌ ఆ ‌మధ్య హత్యకు గురి కావడం, ఆ హత్యలో భారత్‌ ‌ప్రమేయం ఉందని మాట తూలి దేశ ప్రధాని జస్టిన్‌ ‌ట్రూడో అభాసుపాలు కావడం తెలిసిందే.

కెనడా గడ్డ మీద నుంచి పన్ను, ట్రూడో పలికిన బీరాలు ఇప్పుడు భారత్‌లోని ఖలిస్తానీల మూలాలకు ముప్పు తెచ్చాయి. కెనడాతో పాటు అమెరికా, దుబాయి, పాకిస్తాన్‌, ఆ‌స్ట్రేలియా, బ్రిటన్‌లలో తలదాచుకుంటున్న సిక్కు ఉగ్రవాద నేతల ఆస్తుల మీద భారత్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు మొదలయ్యాయి. వీటిని జప్తు చేయబోతున్నారు. ఈ పని గురుపత్వంత్‌ ‌పన్ను ఆస్తుల జప్తుతోనే ఆరంభమైనట్టు కనిపిస్తున్నది. అమృత్‌సర్‌, ‌చండీగఢ్‌లలో ఉన్న ఆయన ఆస్తుల పని పట్టారు అధికారులు. ఆస్తులు జప్తు కావలసిన వాళ్ల జాబితాలో మొత్తం 19 మంది ఉన్నారు. ఇంగ్లండ్‌లో దాక్కున్న కుల్వంత్‌ ‌సింగ్‌ ‌మత్రా, పరంజిత్‌ ‌సింగ్‌ ‌పమ్మ, అమెరికాలో తిష్ట వేసిన హర్జప్‌ ‌సింగ్‌, ‌జే ధుల్వాల్‌, ‌పాకిస్తాన్‌లో నక్కిన వాధ్వా సింగ్‌ ‌బబ్బర్‌ ‌వంటి వాళ్లు ఆ జాబితాలో ఉన్నారు. గురుపత్వంత్‌ ‌సింగ్‌ ‌పన్ను చండీగఢ్‌లో కట్టిన ఇల్లు చూస్తే చాలు, వీళ్లు ఎలాంటి జీవితాలు గడుపుతున్నారో తెలుస్తుంది. ఇప్పుడు ఉపా కింద వీరి ఆస్తులను వేలం వేస్తారు. ఇవన్నీ అనివార్య పరిణామాలే. కోరి తెచ్చుకున్నవే.

ఇంతకీ, ఒక్కొక్క మతం వారికి వారు కోరుకున్న విధంగా భారతదేశాన్ని ముక్కలు చేసి ఇచ్చే అధికారం సిక్స్ ‌ఫర్‌జస్టిస్‌ ‌లేదా మరొక వేర్పాటు, విధ్వంసక సంస్థకు ఎవరు ఇచ్చారు? దేశంలో మా మతం వారి కోసం ఒక భాగాన్ని చీల్చి ఇమ్మని కోరినవారు ఎవరు? వీళ్లందరూ తలా ఒక ముక్క కోసుకు వెళ్లిన తరువాత మిగిలిన భాగంలో మెజారిటీ హిందువులు సర్దుకోవాలి కాబోలు! ఉర్దూస్తాన్‌ ఏర్పాటు ఆశయం ఒక విషబీజం. చరిత్రను మరచిపోయిన ఒక అజ్ఞాని ప్రేలాపన. ఉర్దూస్తాన్‌ ఎవరి కోసం? ముస్లింల కోసం.

విభజన వేళ పంజాబ్‌ ‌సిక్కుల పట్ల ముస్లిం మతోన్మాదులు వ్యవహరించిన తీరు ఎలాంటిది? ప్రస్తుతం పాక్‌ ‌భూభాగంలో ఉన్న ప్రాంతం నుంచి వలస వచ్చిన పత్వంత్‌ ‌సింగ్‌ ‌పన్ను కూడా ఈ చరిత్రను మరచిపోవడమే చిత్రం. పంజాబ్‌ను సిక్కుల నెత్తురులో ముంచిన ముస్లిం మతోన్మాద మూకల చర్యలు తడి ఆరని మరకలే. ఎందరు సోదరీమణులు బలాత్కారాలకు గురైనారో గుర్తు లేదా? విభజన నేపథ్యంలో జరిగిన కాంగ్రెస్‌ ‌సమావేశాలలో జేబీ కృపలానీ వంటివారు చెప్పిన విషయాలు ఒక్కసారి పరిశీలించినా అవన్నీ గుర్తుకు వస్తాయి. హిందువులు, సిక్కుల శవాలు నిండిన రైళ్లు పాకిస్తాన్‌ ‌నుంచి భారత్‌ ‌వచ్చాయి. ఇవన్నీ మరచిపోయి పాకిస్తాన్‌ అం‌డతో మరొకసారి భారత్‌ను విడదీయాలని ఈ ఖలిస్తాన్‌ ‌నాయకుల ఆశ. ఇక్కడ ఒక్కటే ప్రశ్న. అలాంటి ఆత్మహత్యాసదృశమైన నిర్ణయం వైపు నడవడానికి హిందువులు చేసిన తప్పిదం ఏమిటి? సిక్కుమతం హిందూమతం నుంచి జనించిందన్న సంగతయినా వీరికి గుర్తు లేదా? ఆ మత పెద్దలంతా ఎవరి చేతులలో దారుణ హింసతో చనిపోయారు? అంత నైచ్యానికి హిందువులు ఒడిగట్టారా? కాంగ్రెస్‌ ‌వంటి విచ్ఛిన్నకర శక్తి చేసిన రాజకీయ విన్యాసాల ఫలితమే ఇదంతా అన్న స్పృహ లేకుండా మొత్తం హిందువులను ద్వేషిస్తూ ఉగ్రవాదాన్ని ఆశ్ర యించడం అంటే అర్ధం అవివేకం వంటి చిన్న మాటలలో దొరకదు.

About Author

By editor

Twitter
Instagram