రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. రాజకీయ ప్రయోజనాలు, అవసరాలు మాత్రమే రాజకీయ శత్రుమిత్ర సంబంధాలను నిర్దేశిస్తాయి. అవసరం అనుకుంటే మూడుముళ్లు వేస్తుంటాయి, వేసిన ముళ్లను విడదీస్తుంటాయి. ఎన్నికల పొత్తుల గురించి, అందరూ ఏకాభిప్రాయంతో అంగీకరించే మూల సూత్రాలలో ఇదొకటి.

అయితే, ఇప్పుడు తమిళనాడులో అన్నా డీఎంకే, బీజేపీల మధ్య తెగిన బంధం కూడా అంతేనా అంటే, అంతే. కాదంటే కాదు.. అనే విశ్లేషణలు వినిపిస్తు న్నాయి. స్థూలంగా చూస్తే అంతే. సూక్ష్మంగా చూస్తే కాదు. అవును, సాధారణ పొత్తులు, తెగతెంపుల తంతుకు; అన్నా డీఎంకే, బీజేపీతో  తెగతెంపులు చేసుకుని, ఎన్డీఏ నుంచి వైదొలుగుతూ తీసుకున్న నిర్ణయానికి మధ్య కొంత తేడా ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

సహజంగా, రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఏర్పడినప్పుడు, లేదా పొత్తులు తెగిపోయినప్పుడు, ఆ ప్రభావం ఆ రెండు పార్టీలపై మాత్రమే ఉంటుంది. ఆ పార్టీల జయాపజయాలను మాత్రమే అది ప్రభావితం చేస్తుంది. కానీ, ఇప్పుడు అన్నా డీఎంకే తీసుకున్న నిర్ణయం ప్రభావం ఆ రెండు పార్టీలకు మాత్రమే పరిమితం కాదు. ఒక విధంగా చూస్తే, రాష్ట్ర రాజకీయ స్వరూప, స్వభావాలపైనా, సైద్ధాంతిక పునాదులపైనా ప్రభావం చూపబోవడమే ఇప్పుడు చర్చ. అంతేకాదు, ఈ తెగిన బంధం రాష్ట్ర రాజకీయ కథా కథనాన్ని, కథా గమనాన్ని (స్టేట్స్ ‌పొలిటికల్‌ ‌నెరిటీవ్‌) ‌ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇంతవరకు తమిళ రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ రాజకీయాలకు, బీజేపీ హిందూ జాతీయ వాదం ఒక ప్రత్యామ్నాయంగా తెరపైకొచ్చింది.

ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‌కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ‌లేవనెత్తిన ‘సనాతనధర్మ’ వివాదానికి కొనసాగింపుగా చోటు చేసుకున్న అన్నా డీఎంకే-బీజేపీ పొత్తు రద్దు వ్యవహార ప్రభావం కేవలం ఆ రాష్ట్ర రాజకీయాలపైనే కాదు, జాతీయ రాజకీయాలపైనా ఉంటుందని అంటున్నారు.

ద్రవిడమే ..

ఎవరు ఔనన్నా, కాదన్న తమిళనాడు రాజకీయాలు, జాతీయ రాజకీయాలకు కొంత భిన్నంగా, దూరంగా ఉంటాయనేది కాదనలేని నిజం. ముఖ్యంగా ద్రవిడ రాజకీయ పార్టీలు, అవసరార్థం జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా జాతీయ భావజాలంతో మమేకం అయిన సందర్భాలు లేవు. రాజాజీ, కామరాజ్‌ ‌వంటి జాతీయనేతల కాలంలో తమిళ, జాతీయ రాజకీయాల మధ్య మరీ ఇంత దూరం లేదు. ముఖ్యంగా, 1965 హిందీ (హిందూ) వ్యతిరేక ఆందోళన నేపథ్యంగా ద్రవిడ వాదం బలపడిన తర్వాత, తమిళనాడు రాజకీయాలలో ప్రాంతీయవాదం, బలం పుంజుకుంది. అలాగే, తమిళ రాజకీయాల్లో బ్రాహ్మణ (హిందూ) వ్యతిరేక నాస్తికవాదం, వ్యక్తి ఆరాధన (పర్సనాలిటీ కల్ట్) ‌వంటి ప్రత్యేకతలు పెద్దపీట వేసుకు కూర్చున్నాయి. ఈ నేపథ్యంలోనే 1967లో దేశంలోనే మొట్ట మొదటి ప్రాంతీయ పార్టీ ప్రభుత్వం మద్రాస్‌ (‌తమిళనాడు) రాష్ట్రంలో కొలువు తీరింది. ద్రవిడ మున్నేట్ర కజగం (డీ•ఎంకే) అధికారంలోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి రాష్ట్రంలో ద్రవిడ రాజకీయమే రాజ్యమేలు తోంది. గడచిన మూడు దశాబ్దాల కాలంలో కరుణానిధి, జయలలిత వంతుల వారీగా అధికారాన్ని పంచుకున్నారు.

 ఆ ఇద్దరూ కాలం చేసినా, ద్రవిడ పార్టీలదే పైచేయిగా ఉంది. అంతే కాదు, డీఎంకే, అన్నా డీఎంకేలతో పాటుగా మరో డజనుకు పైగానే, ఉప ప్రాంతీయ పార్టీలు కీలకంగా ఉన్నాయి. ఇందులో పరిమిత స్థాయిలోనే అయినా, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల పార్టీలు కూడా ఉన్నాయి. ఎన్ని ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలున్నా, అన్ని పార్టీల సూత్రం మాత్రం ఒక్కటే- ద్రవిడవాదం. అయితే, ఇటీవల కాలంలో తమిళ ప్రజలు మార్పును కోరు కుంటున్న సంకేతాలు స్పష్టమవుతూ వస్తున్నాయి.

బీజేపీ ప్రత్యేక దృష్టి

తమిళనాడుపై పట్టు బిగించేందుకు గతంలో జాతీయ పార్టీలు ఎందుకనో గట్టి ప్రయత్నాలు పెద్దగా చేయలేదు. ద్రవిడ పార్టీలతో పొత్తులకే పరిమిత మయ్యాయి. కాగా, ఇటీవల కాలంలో బీజేపీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, ఆ దిశగా అడుగులతో మొదలు పెట్టి పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే, బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం అనూహ్య పరిణామం కాదు. నిజానికి, గత కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, ఆ రెండు పార్టీల పొత్తు ఎప్పుడైనా పుటుక్కుమనవచ్చనే ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. చివరకు అదే జరిగింది.

అయితే, పొత్తు విచ్ఛిత్తికి, అన్నా డీఎంకే నేతలు చెపుతున్నట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, ద్రవిడ పార్టీ పూర్వ నేతలు పెరియార్‌ ‌రామ స్వామి, ఎంజేఆర్‌, ‌జయలలిత.. ప్రస్తుత పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామిని ఉద్దేశించి చేసిన విమర్శలు, ఇందుకు సంబంధించి తాము చేసిన ఫిర్యాదుల విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం చూపుతున్న ఉదాసీన వైఖరి కారణమా? లేక అన్నామలై దూకుడు, ఆయన సారథ్యంలో బీజేపీ అనూహ్యంగా ఎదుగు తున్న తీరు కారణమా? అంటే, అదీ, ఇదీ ఏది కారణం అయినా, అన్నా డీఎంకే తీసుకున్న నిర్ణయంతో, జయలలిత మరణం తర్వాత, ఆ పార్టీ ఎదుర్కొన్న అంతర్గత సంక్షోభం నేపథ్యంగా, ఇరుపార్టీల మధ్య ఏర్పడిన స్నేహబంధం ముగిసింది.

 ఇప్పుడు అసలు ప్రశ్న అది కాదు. ఎన్నికల పొత్తులు వస్తుంటాయి, పోతుంటాయి. గతంలో అటల్‌ ‌బిహారీ వాజపేయి ప్రభుత్వాన్ని ఒక్క ఓటు తేడాతో పడగొట్టడంలో కీలక పాత్ర పోషించిన అన్నా డీఎంకేనే, జయలలిత చనిపోయిన తర్వాత, అంతర్గత సంక్షోభం నుంచి బయటపడి, అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీని శరణు వేడింది. ఇప్పుడు అదే అన్నా డీఎంకే, మిత్రపక్షం ఎదుగుదలను జీర్ణించుకోలేక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మిత్రధర్మాన్ని పాటించడం లేదనే ఆరోపణను సాకుగా చూపి, స్నేహబంధాన్ని తెగతెంపులు చేసుకుంది.

అయితే, అన్నామలై ఎప్పుడో చేసిన వ్యాఖ్యలు లేదా విమర్శలకు ఇంత కాలానికి స్పందించడం ఏమిటి? అంటే, ఆ ‘అన్నా’ నేతల నుంచి సరైన సమాధానం లేదు. అప్పుడలా, ఇప్పుడిలా అంటూ ఏవేవో పాతముచ్చట్లు ఏకరవు పెడుతున్నారే కానీ ‘క్లియర్‌ ‌కట్‌’‌గా ‘ఇదిగో ఇదీ కారణం, అన్నామలై సారథ్యంలో బీజేపీ ఎదుగుదలే తెగతెంపులకు అసలు కారణం’అనే నిజాన్ని, అన్నా డీఎంకే నేతలు ఎందుకనో నిర్భయంగా చెప్పలేక పోతున్నారు.

దూకుడు కారణమా?

 అన్నా డీఎంకే కొంత కాలంక్రితం బీజేపీ ముఖ్య కార్యకర్తలు కొందరిని ప్రలోభ పెట్టి తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా మిత్రధర్మం గీత దాటింది. కాని, ‘మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్లు’ ఆ పార్టీ నేతలు అసలు నిజాలను దాచి పెట్టి, బీజేపీనే మిత్రధర్మం పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. తెగతెంపులకు అదే కారణంగా చూపిస్తున్నారు.

ఆ పార్టీ నేతలు చెబుతున్న, చూపుతున్న కారణాలు ఏవైనా, అసలు కారణం మాత్రం రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణ. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై దిగ్విజయంగా సాగిస్తున్న పాదయాత్రకు లభిస్తున్న ప్రజాదరణ మింగుడు పడకనే అన్నా డీఎంకే, బీజేపీతో తెగతెంపులు చేసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంచెలంచెలుగా సాగుతున్న అన్నామలై పాదయాత్ర, అన్నా డీఎంకేకు పట్టున్న ప్రాంతాల్లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది.

మరోవంక, 2021 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన అనంతరం, అన్నా డీఎంకేలో అంతర్గత విభేదాలు పతాక స్థాయికి చేరాయి. మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ ‌సెల్వం వర్గాల మధ్య విభేదాలు కోర్టు వరకు వెళ్లాయి•. చివరకు పళనిస్వామి పార్టీపై పట్టు సాధించినా, పన్నీర్‌ ‌సెల్వంను పార్టీ నుంచి బయటకు పంపినా, పార్టీలో అంతర్గత విభేదాలు సద్ద్దుమణగ లేదు. మరోవంక జయలలిత సన్నిహిత సహచరి శశికళ, జయలలిత మేనల్లుడు దినకరన్‌ ‌తమ రాజకీయాలు తాము చేస్తున్నారు. బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే పన్నీర్‌ ‌సెల్వం వర్గం కూడా బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు సాగిస్తోంది. మరోవంక అన్నామలై పాదయాత్ర పళనిస్వామికి కంటిలో నలుసు, కాలిలో ముల్లులా బాధిస్తోంది. అయితే, అన్నా డీఎంకే నేతలు మాత్రం, అన్నామలై మిత్రధర్మాన్ని పాటించక ఒంటరిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే, విడిపోతున్నామని అంటున్నారు.

 ఎవరికి లాభం ?

అదలా ఉంటే ఎన్డీఏ నుంచి అన్నా డీఎంకే వైదొలగడం వలన ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అని విశ్లేషిస్తే… ఇప్పటికిప్పుడు ఎలా ఉన్నా, దీర్ఘకాలంలో ప్రయోజనం బీజేపీకే అని విశ్లేషకుల అభిప్రాయం. కొంతకాలంగా, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, ‘మార్పు’ కనిపిస్తోంది. ముఖ్యంగా, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో, బీజేపీ/ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం, ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు చోటు చేసుకుంది. మోదీకి ప్రజాదరణ పెరుగుతూ వస్తోంది. కరుణా నిధి, జయలలిత అనంతర కాలంలో ఆ స్థాయిలో ప్రజాదరణ మోదీకి మాత్రమే లభిస్తోంది. ఆయన బహిరంగ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవు తున్నారు. మరోవంక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరుతున్నాయి. దీంతో బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. ఆ మేరకు, ద్రవిడ ఓటు బ్యాంకు తరుగుతూ వస్తోంది.

‘కలిసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు’ అన్నట్లుగా, రాష్ట్ర బీజేపీకి అన్నామలై అధ్యక్షుడిగా వచ్చారు. ఈ మాజీ ఐపీఎస్‌ అధికారి.. ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‌ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటం, బీజేపీని ప్రజలకు, మరీ ముఖ్యంగా యువతకు దగ్గర చేస్తోంది. డీఎంకే ప్రభుత్వ అవినీతిని సాక్ష్యాధారాలతో ఎండగడుతూ అన్నామలై విడుదల చేసిన, ‘డీఎంకే ఫైల్స్’ ‌రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఈ విషయంలో అన్నామలై ద్రవిడ పార్టీ ‘అమ్మ’గా ఆరాధించే మాజీ ముఖ్యమంత్రి, పురుచ్చితలైవి జయలలిత అవినీతినీ వదిలిపెట్టలేదు.

అన్నామలై చేస్తున్న పాదయాత్ర ప్రకంపనలు సృష్టిష్టోంది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే…తక్షణ రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ పాదయాత్ర చేపట్టలేదు. హిందూ జాతీయవాదాన్ని మరింత బలంగా జనంలోకి తీసుకువెళ్లే లక్ష్యంతోనే పాదయాత్ర చేస్తున్నారు. ఇదే సమయంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని స్టాలిన్‌ ‌కుమారరత్నం ఉదయనిధి స్టాలిన్‌ ‌చేసిన వ్యాఖ్యలు ఓటర్లను బీజేపీకి అనుకూలంగా ‘పోలరైజ్‌’ ‌చేస్తున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మెల్లమెల్లగా ద్విముఖ రూపం నుంచి త్రిముఖ రూపంగా మారుతోంది. ద్రవిడ రాజకీయ పునాదులలో కదలిక మొదలైంది. అందుకే, ఉదయనిధి, తమిళ ప్రజల్లో బలంగా నాటుకు పోయిన ద్రవిడ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు, ఉద్దేశపూర్వకంగానే సనాతన ధర్మాన్ని దూషించారు. ఆ భయంతోనే, అన్నాడీఎంకే, బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. ఇది ఒకరకంగా బీజేపీకి మాజీ మిత్రపక్షం ఇచ్చిన వరంగా పరిశీలకులు పేర్కొంటున్నారు.

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram