కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని నడిపిస్తోన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమర శంఖారావం పూరించింది. పాలమూరు వేదికగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ‘పాలమూరు ప్రజాగర్జన’ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి నాంది పలికారు. ఆ తర్వాత రెండు రోజులకే నిజామాబాద్‌లోనూ బహిరంగసభలో పాల్గొన్నారు.రాష్ట్రంలోని ఇతర పార్టీలు అధికారమే పరమావధిగా పనిచేస్తున్నాయి తప్ప ప్రజల గోడును పట్టించుకోవడం లేదని పాలమూరు బహిరంగ సభలో ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారు. ప్రధానంగా దశాబ్దాలుగా ఊరిస్తోన్న పసుపుబోర్డును రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, దేశంలోనే అతిపెద్ద గిరిజన విశ్వవిద్యాలయాన్ని మేడారంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జనం హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ కీలక ప్రకటనలు అదీ.. సాక్షాత్తూ ప్రధానమంత్రి స్వయంగా చేయడం తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి ఫాలోయింగ్‌ను పెంచింది.

పాలమూరు జిల్లాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ‘నా కుటుంబ సభ్యులారా!’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ‘‘తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. తెలంగాణలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రంలో రోడ్డు, రైలు కనెక్టివిటీ పెంచాల్సిన అవసరముంది. తెలుగు రాష్ట్రాలకు మహారాష్ట్ర మధ్య రవాణా సదుపాయాలు మెరుగవుతాయి. కొత్త ప్రాజెక్టుల్లో 5 మెగా ఫుడ్‌ ‌పార్కస్, 4 ‌ఫిషింగ్‌ ‌క్టస్టర్స్ ‌నిర్మిస్తాం’’ అని ప్రకటించారు. తెలంగాణ ప్రజల కోసం తాను రెండు ప్రతిష్టాత్మక నిర్ణయాలు ప్రకటించనున్నట్టు తెలిపారు. ఇక్కడ పసుపు విస్తృతంగా పండుతోందని చెప్పుకొచ్చిన నేరేంద్ర మోదీ.. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసిందని, పసుపు పంటపై పరిశోధనలు పెరిగాయని చెప్పారు.పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందంటూ, రాష్ట్రానికి పసుపు బోర్డు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.అలాగే ములుగు జిల్లాలో రూ.900 కోట్లతో ఆదివాసీల కొంగు బంగారం ‘సమక్క సారక్క’ పేరుతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

రాష్ట్రంలో రూ.13,500 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, కేంద్రం చేపట్టిన పనులతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని ప్రధాని భరోసా ఇచ్చారు. 2014కు ముందు కేవలం 2400 కిలోమీటర్ల నేషనల్‌ ‌హైవేలు ఉండేవని.. ఈ పదేళ్లలోనే బీజేపీ ప్రభుత్వం 2500 కిలో మీటర్ల నేషనల్‌ ‌హైవేలను నిర్మించిందన్నారు. ‘ప్రజలు మాటలతో మభ్యపెట్టే ప్రభుత్వానికి బదులు పని చేసే పారదర్శక ప్రభుత్వాన్ని కావాలను కుంటున్నారు. అవినీతి రహిత పాలన రావాలని కోరుకుంటున్నారు’ అన్నారు. వచ్చే ఎన్నికల్లో చెప్పింది చేసే ప్రభుత్వమే రానుందంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్దిని రెండు పార్టీలు అడ్డు కుంటున్నాయంటూ.. కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీలపై మోదీ నిప్పులు చెరిగారు.

ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీ లక్ష్యంగా.. పలు ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అందరికీ తెలుసని, బీఆర్‌ఎస్‌ ‌కారు స్టీరింగ్‌ ‌మరో పార్టీ చేతిలో ఉందన్నారు. అవినీతి, కమీషన్లకు పేరుగాంచిన ఆ రెండు కుటుంబాలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని విమర్శించారు. సామాన్య ప్రజల గురించి ఆ కుటుంబాలకు ఎలాంటి ఆలోచన లేదన్నారు. ప్రైవేటు లిమిటెడ్‌ ‌కంపెనీలు మాదిరిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని విమర్శించారు. ఆ కంపెనీలో డైరెక్టర్‌, ‌మేనేజర్‌, ‌సెక్రటరీ అన్ని పదవులు ఆ కుటుంబ సభ్యులవేనని ఎద్దేవా చేశారు. కొన్ని అవసరాల కోసం కొందరిని సహాయకులుగా నియమించుకున్నారని విమర్శించారు.

 కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కుటుంబస్వామ్యంగా మార్చుతున్నాయని, ‘కరప్షన్‌, ‌కమీషన్‌’ ఆ ‌పార్టీల సిద్ధాంతమని నరేంద్రమోదీ ఆరోపించారు.

 సామాన్యుల సంక్షేమం గురించి,వారి మెరుగైన జీవన ప్రమాణాల గురించి బీజేపీ ఆలోచిస్తుందని ప్రధాని అన్నారు. అందుకే తెలంగాణలో తమ పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని, నాలుగేళ్లలో బీజేపీని బలోపేతం చేశారని, రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని అన్నారు. తన హామీలపై తెలంగాణ ప్రజలకు భరోసా ఉందని, తాను హామీ ఇచ్చానంటే.. నెరవేర్చుతారన్న నమ్మకం వారిలో ఉందని,అందుకే రాష్ట్రంలో బీజేపీ అధికారానికి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీపై ప్రజల ప్రేమ చూసి కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌కు నిద్రపట్టదన్నారు

 తెలంగాణ ప్రజల బతుకులు బాగుపర్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని, పేదలకు గ్యాస్‌, ఇళ్లు ఉచితంగా ఇస్తున్నామని మోదీ చెప్పారు. ఢిల్లీలో ఓ సోదరుడు ఉన్నాడనే నమ్మకాన్ని తెలంగాణ సోదరీమణులుకు కల్పించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మహిళల జీవితాలను మెరుగు పర్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నానని, అందులో భాగంగానే మహిళా బిల్లును ఆమోదించు కున్నామన్నారు.

బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రైతులను మభ్య పెడుతోందని, సాగునీటి పథకాల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని నరేంద్రమోదీ ఆరోపించారు. సాగునీటి కాలువల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోతోంది కానీ.. ఆ కాలువల్లో అసలు నీరు ఉండదని విమర్శించారు. రైతు రుణమాఫీ హామీ ఇచ్చినా తెలంగాణ సర్కారు అమలు చేయలేదని, ఫలితంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో తమ ప్రభుత్వం లేకున్నా.. రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రైతుల కోసం రామగుండం ఫెర్టిలైజర్స్‌ను తెరిపించామని, సరసమైన ధరలకే ఎరువులను అందిస్తున్నామని చెప్పారు.

కళలు, సంస్కృతికి తెలంగాణ పెట్టింది పేరని, ఈ హస్తకళలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని ప్రధాని గుర్తు చేస్తూ, ఈ కళలకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వకర్మ యోజన ద్వారా కులవృత్తులు, హస్తకళల వారికి ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు.. ‘రాణి రుద్రమదేవి వంటి ధీరవనితలు పుట్టిన గడ్డ మనది. మహిళల గొంతు చట్టసభల్లో మరింత గట్టిగా వినిపించే రోజులు వస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ల చట్టంతో చట్టసభల్లో మహిళల సంఖ్య మరింత పెరుగుతుంది. మహిళలు ఇల్లు కట్టుకుంటే కేంద్రం పీఏంఏవై నిధులు ఇస్తోంది. ఎలాంటి గ్యారంటీ లేకుండా ముద్ర బ్యాంకు ద్వారా వీధి వ్యాపారులకు రుణాలు ఇస్తున్నాం. 2014కు పూర్వం ధాన్యం కొనుగోళ్లకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రూ.3,400 కోట్లు మాత్రమే ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు రూ.27 వేల కోట్లు ఇస్తోంది. తెలంగాణ రైతులను రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి లబ్ధి పొందిన సర్కారు ఆ తర్వాత రైతులను విస్మరించింది. కానీ మేం పీఎం కిసాన్‌ ‌ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం.’ అని మోదీ వివరించారు.

ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారులు, రైలు మార్గాలు, పెట్రోలియం, సహజ వాయువు, ఉన్నత విద్యలకు సంబంధించి దాదాపుగా 13,500 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నాగపూర్‌- ‌విజయవాడ ఎకనామిక్‌ ‌కారిడార్‌లో భాగంగా రోడ్డు ప్రాజెక్టుకు, 90 కిలో మీటర్ల పొడవైన ఫోర్‌ ‌లైన్‌ ‌యాక్సెస్‌తో కూడిన ఖమ్మం – విజయవాడ గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌హైవే పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. కృష్ణపట్నం-హైదరాబాద్‌ ‌మల్టీ ప్రొడక్ట్ ‌పైప్‌లైన్‌ ‌శంకుస్థాపన హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీలో కొత్త భవనాలు ప్రారంభించారు. హసన్‌-‌చర్లపల్లి హెచ్‌పీసీఎల్‌ ఎల్పీజీ పైప్‌లైన్‌, ‌సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు.

 తదుపరి రెండు రోజుల్లోనే నిజామాబాద్‌ ‌జిల్లాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నిజామాబాద్‌ ‌పర్యటనలో 8 వేల 21కోట్ల అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేశారు. రామ గుండంలో నిర్మించిన 8 వందల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్‌ ‌ప్లాంట్‌ను వర్చువల్‌ ‌పద్ధతిలో ప్రారంభిం చారు. అల్ట్రా సూపర్‌ ‌క్రిటికల్‌ ‌సాంకేతికతను ఈ ప్రాజెక్టులో ఉపయోగించారు. ఈ ప్రాజెక్టులో బొగ్గు వినియోగం తక్కువ, విద్యుత్‌ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. రూ. 1360 కోట్లతో 496 బస్తీ దవాఖానా లకు, 50 పడకల క్రిటికల్‌ ‌కేర్‌ ‌బ్లాక్‌లను మోదీ ప్రారంభించారు. 305 కోట్ల రూపాయలతో నిర్మితమైన రైల్వే విద్యుత్‌ ‌లైన్‌ను జాతికి అంకితం చేశారు.

తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఓవైపు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో భారతీయ జనతాపార్టీ అంతే మెరుపు వేగంతో అభివృద్ధి పనులు మొదలు పెట్టడం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణాన్ని ఆవరించేలా చేసింది. పైగా ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా పర్యటించి.. వరాల జల్లు కురిపించడం కాషాయ శ్రేణుల్లో జోష్‌ ‌పెంచింది.

– సుజాత గోపగోని, 6302164068,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE