అక్టోబర్‌ 15 ‌నుంచి దేవీ శరన్నవరాత్రులు

శరన్నవరాత్రుల నిర్వహణలో ఆధ్యాత్మిక భావనతో పాటు సామాజిక బాధ్యత ఇమిడి ఉంది. ముఖ్యంగా విదేశీయులదాడులను ఎదుర్కొనేందుకు, స్వరాజ్య సాధన సందర్భంలోనూ ప్రజలను సంఘటితపరచి, చైతన్యవంతులను చేసేందుకు జాతీయ నాయకులు ఈ ఉత్సవాలను వేదికగా చేసుకున్నారు. అత్యాశతో అవకాశాలు (వరాలు) అందిపుచ్చుకొని లోక కంటకులుగా మారే వారికి శిక్ష దప్పదని, స్వార్థరహితంగా, పరమార్థ దిశగా, నలుగురికి ప్రయోజనం కలిగే  దిశలో సాగాలని జగన్మాత చర్యలు చాటుతున్నాయి. నియంతృత్వపోకడలతో ధార్మికతను, ధార్మికశక్తిని, సనాతన ధర్మాన్ని అణచివేసే / అణచివేతకు యత్నించే భావపరంపర గలవారంతా అసుర లక్షణాలు కలవారేనని పెద్దలు వ్యాఖ్యానించారు. అలాంటి లక్షణాలు గల ఆధునిక మహిషాసురులను మర్దించేందుకు సజ్జనశక్తి జాగృతం కావాలి.

భారతీయ సంస్కృతిలో శక్తి ఆరాధనకు విశిష్ట స్థానం ఉంది. దేవీ నవరాత్రులు శక్తి ఉపాసనకు ప్రతీకలు. ప్రకృతిలోని, మానవ ప్రవృత్తిలోని చెడులను దూరం చేయడానికి శక్తిని ఉపాసించ వలసిన ఆవశ్యకతను ఈ పండుగ గుర్తు చేస్తుంది. ‘ధర్మం నశించి, అధర్మం పెరిగినప్పుడు ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలో నన్ను నేను సృష్టించుకుంటాను’ అని శ్రీకృష్ణ భగవానుడు ‘భగవద్గీత’లో చెప్పినట్లే ‘దానవులు లోకంలో బాధలు కలిగించి నప్పుడల్లా వారిని సంహరించేందుకు అవతారాలు దాలుస్తుంటాను’ (ఇత్థం యదా యదా బాధా దానవోత్థా భవిష్యతి/తదాతదా వతార్యాహం కరిష్యామి సంక్షయమ్‌) అని భగవతి చెప్పినట్లు ‘దుర్గా సప్తశతి’ పేర్కొంటోంది. ఆ ప్రకారమే, మధుకైటభు లను, శుంభనిశుంభులను, రక్తబీజుడిని, చండ ముండులను, మహిషాసురుడిని వివిధ రూపాలలో కడతేర్చి లోకాలను కాపాడారు. ఆశ్వీయుజ మాసంలో సకలలోక జనని ఆదిశక్తిని అనేక రూపాలుగా ఆరాధిస్తారు. శుద్ధ పాడ్యమి నుంచి నవమివరకు ఆదిశక్తి అవతారాలను రోజుకొక్కటి చొప్పున పూజిస్తారు. శైవులు, వైష్ణవులు, శాక్తేయులు స్వల్ప తేడాలతో దేవీపూజ చేస్తారు. నవరాత్రులలో నవదుర్గలను అర్చిస్తారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్దిధాత్రి అని ‘దేవీకవచం’ జగజ్జనని నవ రూపాలను పేర్కొంటోంది. అమ్మవారిని సాత్విక, రాజస, తామస అని మూడు విధాలుగా అర్చిస్తారు. యజ్ఞాలు, బలులు లేని పూజ సాత్వికం. బలులతో కూడిన పూజ రాజసం. జపయజ్ఞాలు లేకుండా సుర మాంసాది ఉపాహారాలు నైవేద్యంగా గల పూజ తామసం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం సాత్విక విధానంలోనే పూజలు జరుగుతున్నా, కొన్ని ప్రాంతాలలో మిగిలిన రకాల పూజలు ఉన్నాయి.

ఒకప్పుడు దేవీ నవరాత్రులను వసంత రుతువులో (చైత్రమాసం) నిర్వహించేవారని, రామాయణ కాలం వరకు ఆ విధానం ఉండేదని చెబుతారు. రావణుడితో యుద్ధ సమయంలో శ్రీరామ చంద్రుడు ఆశ్వీయుజ మాసంలో చండీహోమం నిర్వహించి దుర్గాదేవి అనుగ్రహ పాత్రుడయ్యాడని, నాటి నుంచి శరదృతువులో నవరాత్రులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, అందుకే వీటిని శరన్నవరాత్రు లుగా వ్యవహరిస్తున్నారని ప్రతీతి.

నవరాత్రుల వ్రతం గురించి దేవీభాగవతంలోని తృతీయ స్కంధంలో వివరంగా ఉంది. దీక్షాకంకణధారులై తొమ్మిది రోజులూ కలశస్థాపన చేసి పొలిమేరలు దాటకుండా ఈ వ్రతం చేయాలి. అవకాశం లేనివారు దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి… ఈ మూడు రోజుల్లో అమ్మను ఆరాధించవచ్చని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ఎన్ని రోజులు పూజించారన్నది కాకుండా, ఎంత నిష్ఠతో అర్చించారన్నదే ఇక్కడ ప్రమాణం, ప్రధానం. దీక్ష నిరాటంకంగా సాగాలని, అభీష్టాలు సిద్ధించాలన్న ఆకాంక్షతో వెలిగించే అఖండ దీపం దీక్షా కాలమంతా కొండెక్కకుండా చూసుకోవాలి. నవరాత్రుల సందర్భంగా కన్యకాపూజ, సుమంగళి, పూజ, మహాచండీయాగం మున్నగునవి నిర్వహిస్తారు. దీర్ఘసుమంగళిగా ఉండాలని దేవిని భక్తిశ్రద్ధలతో అర్చిస్తారు. 2-10 సంవత్సరాల మధ్య వయస్సు గల వారితో చేయించే పూజను ‘కుమారీ/కన్యకా పూజ’అంటారు. వీరిలో రెండేళ్ల వయసు శిశువును కుమారి, మూడేళ్ల చిన్నారిని త్రిమూర్తి, నాలుగేళ్ల పాపను కల్యాణి, అయిదేళ్ల బాలికను రోహిణి, అరేళ్ల బాలికను కాళిక, ఏడేళ్ల బాలికను చండిక, ఎనిమిదేళ్ల బాలికను శాంభవి, తొమ్మిదేళ్ల బాలికను దుర్గ, పదేళ్ల బాలికను సుభద్ర అని వ్యవహరిస్తారు. ఈ పూజ వల్ల కష్టాలు తొలగిపోయి, అనుకున్నవి నెరవేరుతాయని, రోగ, శత్రు బాధ నివారణ మవుతుందని విశ్వాసం. శ్రీచక్ర పూజ కూడా ఈ సందర్భంలో ప్రాధాన్యత వహించింది.

దుర్గమ్మ పేరులో ‘ద’కారం దైత్య నాశకం, ‘ఉ’కారం విఘ్ననాశకం, ‘గ’కారం పాపనాశకం. ‘ఆ’భయ నాశక వాచకం. కనుకనే ఆ తల్లి నామాన్ని పలికినా, స్మరించిన సర్వపాపాలు నశిస్తాయని సాక్షాత్తు పరమశివుడే చెప్పినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. దుర్గమ్మ అవతారాలను మననం చేసుకుంటే… పాడ్యమినాడు జన్మించిన మహామాయ మహాకాళియై మధుకైటభులను సంహరించింది. విదియనాడు మహాలక్ష్మియై మహిషాసురమర్దిని అయింది. తదియ నాడు మహాసరస్వతిగా అవతరించి శుంభనిశుంభులను సంహరించింది, చవితినాడు యోగమాయగా నందుని ఇంట పుట్టి నందగా కంసుడిని భయ పెట్టింది. పంచమి నాడు విజృంభించి దమనుడు అనే రాక్షసుడిని చీల్చి రక్తదంతిగా పేరు పొందింది. షష్ఠినాడు శాకంబరి అయి కరవు కాటకాలను దూరం చేసింది. సప్తమి నాడు ఆవిర్భవించి దుర్గముడనే రాక్షసుడిని దునిమి దుర్గగా పేరుపొందింది. అష్టమినాడు మాతంగుని ఇంట• మాతంగినిగా జన్మించి అస్పృశ్యతను దూరం చేసింది. నవమి నాడు భ్రమరిగా అవతరించి భ్రమరాల సహాయంతో అరుణుడనే రాక్షసుడిని అంతమొందించింది. ఇలా అణచివేయడమో, సంహరించడమో, చేసి విజయ దుర్గగా లోకమాతగా నిలిచారు. ఈ విజయ పరంపరలన్నీ కలిపి జరుపుకునేదే విజయదశమి.

దేవదానవుల మధ్య హోరాహోరి పోరు సాగు తున్న సమయంలో మహిషాసురుడు (దున్నపోతు) వరగర్వితుడై భౌతిక బలదర్పంతో విజృంభించాడు. నియంతగా వ్యవహరించాడు. వేదాలను దూషించాడు. యజ్ఞాలను ధ్వంసం చేశాడు. మునీశ్వరులను పీడించాడు. లోకాలు తల్లడిల్లుతు న్నాయి. సజ్జనులు, ధర్మ పరాయణులు, దేవబృందం ఆతని దుశ్చర్యల గురించి విధాతకు మొరపెట్టు కున్నారు. ‘అమేయశక్తి సంపన్నుడు మహిషుడు మరణంలేని వరం పొందాడు. అయితే, స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వేసి, ఆమె చేతిలో చావులేని వరాన్ని పొందలేదు. కనుక అతను స్త్రీ చేతిలోనే మరణిస్తాడు. అయితే అతన్ని ఎదుర్కోగల స్త్రీ మూర్తి ఎవరు? ఆతని సంహారానికి ఒకరిద్దరు సరిపోరు. సంఘటిత తపోశక్తి, దైవశక్తి దీనికి అవసరం. తపోధనులు, దైవీ సంపన్నులైన మీరంతా మీమీ శక్తులను సంఘటితం చేయండి. దీనితో ఒక మహాశక్తిని సృష్టించి తద్వారా మహిషాసురుడిని మట్టుపెట్టవచ్చు’ అని హితవు పలికాడు. ఆ ప్రకారం బ్రహ్మ తన ముఖం నుంచి పద్మరాగమణికాంతిని, శంకరుడు నల్లని శైలాకారాన్ని, శ్రీమహావిష్ణువు సర్వవ్యాప్తమైన ధవళకాంతిని ప్రసాదించారు. ఫలితంగా, అష్టభుజదేవియై, జగన్మోహనాకారమై, మహాశక్తి రూపిణిగా జగన్మాత అవతరించారు. సుజనులకు చల్లని తల్లిగా, కుజనులకు మహోగ్ర రూపంలో సింహవాహినిగా గోచరించారు. ఆమె గురించి అసుర గూఢచారులు మహిషుడికి తెలిపారు. ఆమె ముగ్ధసౌందర్యాన్నీ వర్ణించారు. కామమోహితు డైన మహిషుడు తనను వివాహమాడాలని ‘అమ్మ’కు సందేశం పంపాడు. ‘యుద్ధంలో నన్ను తగిన రీతిలో ఓడించి వివాహమాడవచ్చు’ అని ఆమె ప్రత్యుత్తరం పంపగా, ‘అదెంత పని’ అనుకున్నాడు అసురుడు. ఇద్దరి మధ్య తొమ్మిది రోజుల పాటు భీకర పోరు సాగింది. మహిషుడు మహోగ్ర రూపంతో మాయా యుద్ధానికి దిగాడు. ఇక ఉపేక్షిస్తే లోకాలు సంక్షోభం చెందుతాయనే భావనతో, విష్ణువు ప్రసాదించిన సుదర్శన చక్ర ప్రయోగంతో అమ్మవారు అతనిని కడతేర్చారు. జగన్మాత శిష్టులకు రక్షగా నిలిచినట్లే, దుష్టులను శిక్షించక మానరని ఆధ్యాత్మికవాదుల విశ్వాసం.

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram