– ‌జంధ్యాల శరత్‌బాబు

తనదైన ఆలోచన, తాను మాత్రమే చేపట్టగల ఆచరణ… ఇదీ నార్గిస్‌ ‌మొహమ్మదీ విలక్షణత. పౌరుల హక్కులూ, వాటి పరిరక్షణ గురించి పోరాడుతూన్న  యాభై ఒక్క వసంతాల వనితే నోబెల్‌ ‌శాంతి పురస్కృతి విజేత.  ప్రత్యేకించి ఇరాన్‌లోని మహిళా హక్కుల మహోద్యమానికి పరోక్ష నేతృత్వం వహిస్తున్న తన జీవితం సమస్తమూ సంచలనాలమయమే!

వాతావరణమంతా ప్రశాంతంగా కనిపిస్తుంది. కనిపిస్తుందేకానీ అక్కడ ప్రశాంతత ఉందని కాదు. ఎక్కడో ఏ మారుమూల నుంచో ఉన్నట్లుండి ఒక కేక చీల్చుకొస్తుంది. ఆ దీనస్వరం వెనక విపరీత అణచివేత ఉండనే ఉంటుంది. ఎవరు ఎక్కడ ఉక్కు కాలుతో తొక్కిపెడుతున్నా, ఆ బాధకీ భయానికీ బాధిత గుండె తల్లడిల్లుతుంది. అటువంటి తల్లడిల్లడం కొంతవరకే. అటు తర్వాతే, మొదలై తీరుతుంది ప్రతిఘటన!

పీడకుల పనిపట్టాలనీ, పీడితుల వెన్ను తట్టాలనీ నార్గిస్‌ ‌తపన, తాపత్రయం, గట్టిపట్టుదల.

ఫలితం ఏమిటీ అంటే.. 1. ఇప్పటికే పదమూడుసార్లు నిర్బంధం, 2. మొత్తం ఐదు పర్యాయాలు కారాగారవాసం. 3. అక్కడున్నది ఉన్మాద ప్రభుత్వం కాబట్టి, లెక్కపెట్టి మరీ నూటయాభై నాలుగు కొరడా దెబ్బలు!

వీటన్నింటినీ మించి, ఆ యోధకి పడిన జైలుశిక్ష ఎంత కాలమో తెలుసా?

మూడు దశాబ్దాలకుపైగా!!

నేటికీ ఆమె కటకటాల వెనకే ఉన్నారు. కటిక చీకటి కదా అనుకోకుండా, అక్కడే ఆ ఇరుకిరుకు గదిలోనే అఖండ జ్యోతిని వెలిగించుకున్నారు. అది అనంత ఆత్మవిశ్వాసం, తిరుగంటూలేని విప్లవతత్వం.

విసుగూ, విరామం, అలుపూ సొలుపూ లేని ఆ నారీశక్తిని ఏ నియంతృత్వం బంధిస్తుంది? అత్యంత ప్రతిష్ఠాత్మక, ప్రపంచ ప్రఖ్యాత అవార్డు లభించకుండా ఏ దుష్టత్వం అడ్డుపడుతుంది?

ఇరాన్‌ ‘‌స్థితి’ జగతికి తెలిసిందే. విశాల దేశమైనా, పర్వత ప్రాంత సమన్వితమైనా, జనసాంద్రత అత్యధికంగా ఉన్నా అదంతా భౌగోళికం. అక్కడా కేంద్ర బిందువు సంస్కృతే అయినా, పలు విధాల కళలు భాగస్వామ్యం వహిస్తున్నా, నిర్మాణశైలి అంతర్జాతీయ ప్రశస్తి అందుకున్నా – అంతవరకే!  పురాతన సాహిత్యం, విశేష తత్వచింతనం అలరారుతున్నా, సంప్రదాయ సంగీత ప్రాధాన్యమంటూ ఉన్నా… కాల పరిణామక్రమం ఎన్నెన్నో మార్పు చేర్పులు తెచ్చింది. సైనిక ప్రాబల్యం హెచ్చడంతో, ఆ చర్యలే పెచ్చు మీరడంతో, ఇప్పుడంతా కనిపించేది ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ, కఠినాతి కఠినంగా శాసించే లక్షణమే!

కొన్నాళ్ల క్రితం ఒక యువతిని ఇరాన్‌ ‌పోలీసులు నిర్బంధించారు. తలమీద వస్త్రం సరిగ్గా వేసుకోలేదంటూ ఆరోపణ మోపారు. నిర్బంధంలో ఉండగానే ప్రాణం కోల్పోయిందామె! సంప్రదాయ పరిరక్షణ పేరుతో ప్రాణాలకే ముప్పు తెస్తారా? అని వనితా లోకం ఉద్యమించింది. అప్పుడు ముందు నిలిచి దృఢంగా స్వరాన్ని వినిపించిన మహిళామణి నార్గిస్‌. ‌రగిలిపోయిన అధికారులు ఆమెనీ బంధించి కారాగారంలో ఉంచారు. స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు దాదాపు ఏడాదిగా!

ఎక్కడ అణచివేత ఉంటే అక్కడ అగ్నిలా భగ్గుమంటారామె. తన ప్రతీ అడుగునీ తిరుగులేని అస్త్రంగా మార్చుకుంటారు. సామాజిక బాధ్యత వహించి సేనానిగా నిలుస్తారు. ఠాణాల ఊచల వెనక హక్కుల ఉల్లంఘనను ఆత్మబలంతో ఎదిరిస్తారు. నానారకాల బంధనాల మధ్యన కడతేరుతున్న పడతులను చూసి ఒక కంట నీరు, మరో కంట మంట.  అమానుషాల నుంచి నిస్సహాయులను పరిరక్షించాల్సిన పాలకులే కళ్లు మూసుకుని, చేతులు ముడుచుకుని కూర్చుంటారా అంటూ నిగ్గదీస్తారు నార్గిస్‌.

‘‌నాది ధర్మాగ్రహం, నేను కోరేది పరిష్కారం. మీ రాజకీయాలు, వివరణలు, సవరణలు, ఊకదంపుడు మాటలు నా దగ్గర చెల్లవు. నిలదీసి అడిగిన నన్ను, నావంటి పడతులను హింసించి ఉసురు తీయలేరు మీరెవరూ?’ అని సమరనాదం చేస్తున్నందుకే, ఇరాన్‌లో పాలకులకు కంటగింపు. కక్షలూ, కార్పణాలతో, ఉక్రోష వైఖరులతో ఆమెను ఇంకా బంధించే ఉంచారు.

నార్గిస్‌ది తొలి నుంచీ బాధిత కుటుంబం. జంజన్‌ ‌ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆమె భౌతికశాస్త్ర పట్టభద్రు రాలయ్యారు. చదువుకునే రోజుల్లోనే స్త్రీ సంక్షేమం గురించి రచనలెన్నో చేశారు. సందర్భానుసారం, పోరాట బావుటా చేపట్టి ఆందోళనలెన్నింటినో నడిపారు. ఇరానీ ప్రభుత్వ నేరపూరిత ధోరణిని నిరసించినందుకే మొదటిసారి అరెస్టయ్యారు. అప్పుడు ఆమెకి పాతికేళ్లు! అప్పట్లోనే సంవత్సరం పైగా కారాగారం పాలయ్యారు.

మరింత కాఠిన్యాన్ని పెంచుకున్న ఆ ప్రభుత్వం ఆమె మీద అభియోగాల దండయాత్ర చేసింది. విద్రోహానికి పాల్పడిందంటూ మరోసారి నిర్బంధకాండకు తెగబడింది. ఆ అకృత్యం ఆగకపోగా, తెగ పెరుగుతూ వచ్చింది. కటకటాలపాలై అనారోగ్యం బారినపడిన నార్గిస్‌ ‌కొన్నాళ్లు బెయిలుమీద బయటికొచ్చారు. కాస్తంత ఓపిక వచ్చాక, మళ్లీ పోరుబరిలోకి దిగారు. రాజకీయ కుటిలత్వంతో ప్రత్యర్థులకు మరణశిక్షలు ‘విధిస్తున్న’ పాలకపక్షాన్ని ఎదిరిస్తూ ఉద్యమాన్ని విస్తరించారు.  దీంతో, తిరిగి నిర్బంధం! న్యాయస్థానాన్ని ఆశ్రయించి విడుదలైనా, ఇంకోసారి కూడా ఆ ధీర అతివ తగ్గలేదు సరికదా- గళాన్ని పెంచారు. ఊరుకుంటాయా అధికార ఉన్మత్తతలు? అప్పటి నుంచీ టెహ్రాన్‌ ‌నగరంలోని బందిఖానాలోనే ఆమె!

‘అక్రమ నిర్బంధాలు వద్దు. లైంగిక హింసకు పాల్పడేవాళ్లను వదలొద్దు. కటువైన ఆంక్షల పేరిట పౌరుల హక్కుల్ని కాలరాయొద్దు..’ ఇవే ఆ ఉద్యమకారిణి నినాదాలు. ఇటువంటివి అసలే నచ్చని పక్షపాత పాలకులు దమనకాండను ప్రయోగిస్తూ వస్తున్నారు. పిడికిలి బిగిస్తే తప్ప పరిస్థితి మారదని ఏనాడో గ్రహించిన ఆమె ప్రతిఘటనోద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కారాగారంలో ఉన్నా, ఆ సంకల్పబలం సాగేదే కానీ ఆగేది కాదు.

ఐక్యరాజ్యసమితికి సంబంధించిన ‘వరల్డ్ ‌ప్రెస్‌ ‌ఫ్రీడమ్‌’ ‌పురస్కృతి సైతం ఇదే ఏడాదిలో ఆమెను వరించి వచ్చింది. భర్త మరెవరో కాదు – తన సహచర హక్కుల కార్యకర్త. ఆ దంపతులకు కవల పిల్లలు. వారంతా ఫ్రాన్స్‌లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే, వారిని నార్గిస్‌ ‌చూసి కూడా కొన్ని సంవత్సరాలైంది!

వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఎన్నెన్ని కష్టనష్టాలు చుట్టుముట్టినా – తొణకని బెణకని తత్వం ఆమెది. ‘స్వేచ్ఛ అనేది పవిత్రం. దానికోసం ఎవరినీ ప్రాధేయ పడాల్సిన పని ప్రజలకు లేదు, ఉండకూడదు. ఒకరు ఇస్తే తెచ్చుకునేది కాదు స్వతంత్రం అంటే, ఆ సహజ హక్కు ప్రతీ వనితకీ ఉంటుంది. అన్యాయాన్ని బాధితులు ఇంకా ఎంతకాలం సహిస్తారు? ఎవ్వరూ ఆగరు. విముక్త సాధనకు పోరు నాదం చేస్తూనే ఉంటార’న్నది ఆ హక్కుల పరిరక్షకురాలి అంతరంగం.

ఇంతటి స్థితప్రజ్ఞత, అకుంఠిత దీక్షాదక్షత నిండి ఉన్నందునే నోబెల్‌ ‌శాంతి బహుమానం ఆమెనే స్వాగతించింది. అసమాన ధీరత్వానికి గుర్తింపూ గౌరవాలు లభించిన సందర్భం ఇది. రచయిత్రిగా ఆమె కలం పట్టింది వనితల కోసమే. ఉద్యమ నాయికగా పోరుబాటను చేపట్టిందీ వారి హక్కుల సంరక్షణ గురించే.

ఇటువంటి సంభావనం నిశ్చయంగా శాశ్వత స్ఫూర్తి ప్రదాయకం. ప్రపంచంలో ఎందరో పోరాటవాదు లున్నారు. ధ్యేయం నెరవేరేలా కలాన్ని, గళాన్ని ప్రయో గిస్తున్నారు. కానీ.. కారాగార గదిలో ఉంటూ, చీకటిలో చిరు దీపంలా తానే వెలుగుతూ, ఎప్పటికైనా కాంతి వచ్చి తీరుతుందని మనసా వాచా కర్మణా విశ్వసించి వ్యవహరించేంత కారణజన్ములు ఎందరుంటారు? వారిలో అగ్రస్థాయి నాయిక నార్గిస్‌. ‌మనోశక్తి రీత్యా ఏకైక పాలిక. పలు విధాల పీడనపాలైన పడతుల పాలిట సమైక్య ఆశాదీపిక! యోధత్వానికి నిర్వచనం, విజయ కాంక్షకు తానొక పర్యాయపదం! జయహో!

About Author

By editor

Twitter
Instagram