తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టె పండుగ బతుకమ్మ. ఇది ఆ ప్రాంతవాసులు బతుకు చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రకృతిని ఆరాధించే అతి పెద్ద పండుగ. ధనిక-పేద, చిన్న-పెద్ద భేదం లేకుండా కలసికట్టుగా పాటలతో జరుపుకునే వేడుక. హైటెక్‌/ఆధునిక యుగంలోనూ అత్యంత ఆదరణ పొందుతున్న పండుగ అనడంలో అతిశయోక్తిలేదు. రాష్ట్రేతర, ప్రవాసాంధ్రులు ఈ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు.

భాద్రపద అమావాస్య నుంచి ఆశ్వీయుజ శుద్ధ నవమి వరకు పండుగను ఎంతో సంబరంగా చేసుకుంటారు. ప్రకృతిని ఆధారం చేసుకుని భక్తి పారవశ్యంతో బతుకమ్మ తల్లిని కొలుస్తారు. ప్రకృతి అందాలను చాటి చెప్పే పండుగ ఇది. ప్రకృతిలో లభించే తంగేడు, గునుగు, గుమ్మడి, చేమంతి, గోరింట, సీతజడ, కట్ల, రుద్రాక్ష, బీర, గన్నేరు, సొర తదితర రకరకాల పూలను సేకరించి ‘బతుకమ్మ’ను క్రమపద్ధతిలో పేరుస్తారు. వీటిలోని జౌషధ గుణాలు, సుగంధ పరిమళాలు ఆరోగ్యానికి హితమని వైద్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పూలతో దేవతలను అర్చించడం సహజం. కానీ పూవులనే దేవతగా సంభావించడం బతుకమ్మ పండుగలోని ప్రత్యేకత. పూవులను గౌరీదేవిలా ఆరాధిస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు ఆలయ ప్రాంగణాల్లోనో, మైదానాల్లోనో, ఇళ్ల ముంగిటో బతుకమ్మను ఉంచి ఆమె చుట్టూ తిరుగుతూ ‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో…’ లాంటి పాటలతో ఆనందంగా గడుపుతారు. పులిహోర, దద్ద్యోజనం, చక్కెర పొంగలితో పాటు ఆరు రకాల పొడులు (పల్లీలు, నువ్వులు, పెసర్లు, జొన్నలు, గోధుమలు, కొబ్బరి) తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

బతుకమ్మ పండుగ•కు సంబంధించి సామాజిక, చారిత్రక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కథనం ప్రకారం, చోళరాజ్యంలో ధర్మాంగద, సత్యవతి దంపతుల నూరుగురు పుత్రులు యుద్ధంలో మరణించగా, సత్యవతి కఠోర తపస్సు ఫలించి లక్ష్మీదేవి ఆమెకు కూతురుగా జన్మిస్తుంది. తాను బతికి ఎన్నో బతుకులకు దారి చూపే దేవతగా ‘బతుకమ్మ’గా ప్రాచుర్యంలోకి వస్తుందని ఆమె పుట్టినప్పుడు మునులు ఆశీర్వదించారట. ఆ స్ఫూర్తితోనే ‘గుమ్మడి పూలు పూయగా బ్రతుకు/తంగెడి పసిడి చిందగ బ్రతుకు/గునుగు తురాయి కులకగ బ్రతుకు/కట్ల నీలిమలు చిమ్మగ బ్రతుకు/బ్రతుకమ్మా బ్రతుకు/అమ్మని మరువని సంతానము గని/బ్రతుకమ్మా బ్రతుకు..’ అని ప్రజాకవి కాళోజీ రాశారు. మరో కథనం ప్రకారం, భూస్వాముల అకృత్యాలను భరించలేక ఒక గ్రామీణ మహిళ బాలిక ఆత్మహత్య చేసుకోగా, ఆ ఊరి ప్రజలు చిరకాలం ‘బతుకమ్మా’ అని దీవించారని, ఆమె స్మృత్యర్థం పండుగను జరుపుకుంటున్నారని చెబుతారు. తమకు ఎలాంటి ఆపదలు వాటిల్లకూడదని, కుటుంబాలు చల్లగా ఉండాలని బతుకమ్మను కోరుకుంటారు. జీవితంలో ఒడుదొడుకులను అధిగమించి, జీవితాన్ని చక్కదిద్దుకునే తీరును బతుకమ్మ పాటలు వివరిస్తాయి.

కృష్ణా-మూసీనదుల సంగమ ప్రదేశంలో క్రీ.శ. 1211 ‘బ్రతుకేశ్వర స్థానం’ ఉండేదని ఉమ్మడి నల్గొండ జిల్లా వాడపల్లిలో (ఓడపల్లి) దొరికిన కాకతీయ గణపతి దేవుని కాలానికి చెందిన శాసనం పేర్కొంటోంది. దానిని బట్టి అక్కడ బతుకమ్మలను నిమజ్జనం చేసేవారని తెలుస్తోంది.కాకతీయ రుద్రమ దేవి బతుకమ్మను ఆరాధించినట్లు సాహితీవేత్తలు పేర్కొన్నారు. ఆమె దేవగిరి రాజులపై విజయం సాధించి, రాజధాని ఓరుగల్లుకు చేరిన తరువాత విజయ సూచకంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారని ఆచార్య తిరుమల రామచంద్ర రాశారు. మేలుగుంటు సోదరులు సుమారు ఎనిమిది శతాబ్దాల క్రితం అక్కడ బతుకమ్మ గుడిని నిర్మించారు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram