– పి. చంద్రశేఖర ఆజాద్‌

ఎం‌డివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

‘‘మీ నాన్న మీ ఇద్దరికీ సమానంగానే ఇచ్చారని నేను అనుకుంటాను. రమేష్‌కు ముందు నుండి వాళ్ల నాన్నగారి నుండి కొన్ని ఆస్తులు వచ్చాయి. పైగా కలిసి వచ్చింది. మా అక్క ఇప్పుడు లేదు. మేం ఇద్దరం ఒకేలాలేం. అయినా మా అక్క నన్ను చూసి అసూయ పడలేదు’’.

‘‘అప్పటి కాలం వేరు. అప్పటి మనుషులు వేరమ్మా’’.

‘‘మనం అలా ఎందుకు ఉండకూడదు అంటున్నాను’’.

భువన మాట్లాడలేదు.

‘‘నా పేరుతో ఆస్తులు వున్నాయి. మీ నాన్న దగ్గర ఎన్ని వున్నాయో నాకు తెలియదు. ఒకప్పుడు ఆయన్ని కలవటం అదృష్టం అనుకునే వారు. ఇప్పుడు ఆయన ముంబయ్‌లో వుంటున్నారా?’’

‘‘తెలియదమ్మా’’.

‘‘అంటే మనందరం ఆయన గురించి పట్టించుకో లేదు. ఈ ఆస్తంతా ఆయన వల్ల మనకు వచ్చింది. కొంత కాలం ఇక్కడే వున్నారు. చివరికి రాజన్‌ ఈ ‌వయసులో దగ్గర వుండి మీ నాన్నను చూసుకుంటు న్నాడు. మనందరం అందుకు సిగ్గుపడాలి కదా! ఏ ఆస్తులు ఇస్తామని రాజన్‌ ఆయన దగ్గరున్నాడు?’’

ఆలోచిస్తున్నారు.

‘‘అమ్మా నాన్నలు కూడా ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి పట్ల మొగ్గు చూపాల్సి వస్తుంది. ఇక్కడ పరిస్థితులు అలాంటివి. పోటీ అనేది మనుషుల్ని, మనస్సుల్ని పాడు చేస్తుంది భువనా…! ఇంత వుంది. మనం అదే తిండి తింటున్నాం. ఎక్కువ తింటే అరగదు. అవే కార్లు, ఖరీదు ఎక్కువ. నాకయితే రసజ్ఞ నచ్చింది. ఇప్పుడు ఫోన్‌ ‌చేసి మీ ముందు మాట్లాడతాను. సరయూకి నీకూ ఆస్తి రాయాలను కుంటున్నాను. నీకు ఏ ఆస్తి కావాలని. తనేమంటుందో వింటావా?’’

‘‘సరయూని కూడా అడుగమ్మా’’.

‘‘వద్దు. నేను నా ఆస్తిని మీకు కాకుండా ఏ సంస్థలకో రాస్తాను. అప్పుడేం చేస్తారు. నాలుగు రోజులు నన్ను తిట్టుకుంటారు. లేదా బతికున్నంత కాలం, గుర్తొచ్చినప్పుడల్లా మా అమ్మ ఇలా చేసింది అనుకుంటారు. అంతకు మించి ఏం చేయగలరు?’’

‘‘చేసేదేముంది’’ అంది భువన.

‘‘అందుకే నేను చెబుతున్నా. చిన్నదయినా మనవరాలు నా కళ్లు తెరిపించింది. తాతయ్య గురించి అడిగినప్పుడు అనుకున్నాను. ఆయన్ని ఇంకొకరు గుర్తు చేయాలా? అందులోనూ ఈ వయసులో మనకి తెలియకుండా ఎక్కడెక్కడో బతకాలా? అప్పుడు సిగ్గుతో చితికిపోయాను’’ అంది. ఆమె కంఠంలో బాధ ధ్వనించింది.

‘‘ఈ ఒక్క రోజుతో మనందరం మారిపోతామని నేను అనుకోవటం లేదు. అలాగే బలవంతాన కలిసినా ఎక్కువ రోజులు ఆ బంధం వుండదు. అందుకని మన ఆలోచనలు పూర్తిగా మారిపోవాలి. అంతేకాదు. రేపు సరయూ-రసజ్ఞల మధ్య ఈ పంతాలూ, పట్టింపులు మళ్లీ మొదలవ్వవచ్చు. ఎప్పుడు ఏం జరుగు తుందో చెప్పలేం. మనం బతికి వున్నంత కాలం స్వచ్ఛంగా వుందాం’’ అని ప్రభాత్‌ ‌ని చూస్తూ…

‘‘బాబూ… ముందు నువ్వోసాయం చేయాలి’’ అంది.

‘‘చెప్పండి అత్తయ్య గారూ’’.

‘‘మీ మావయ్య ఎక్కడ వుంటున్నారో తెలుసుకో వాలి. అదేమంత కష్టమైన పని అని నేను అనుకోను’’.

‘‘కనుక్కుంటాను’’.

‘‘నాలుగయిదుసార్లు మనందరం కలుసుకోవాలి. ఇప్పటి దాకా మనసులో దాచుకున్న విషయాలు బయటకు చెప్పుకోవాలి. చెదిరిపోయిన గూడుని మళ్లీ ఏర్పాటు చేసుకోవాలి’’ అంది.

ఇద్దరూ తలలూపారు.

* * * *

అదే సమయంలో వసుంధర సరయూతో మాట్లాడుతోంది.

‘‘అమ్మమ్మ ఇండియా వచ్చింది’’.

‘‘నిజమా!’’

‘‘ఇప్పుడు ముంబయిలో వుండి వుంటుంది’’.

‘‘పిన్ని దగ్గరా!’’

‘‘అంత కంటే అక్కడ ఎవరున్నారు?’’

‘‘ఏంటీ సడన్‌ ‌మార్పు’’.

‘‘ఇదంతా రసజ్ఞ చేసింది’’.

‘‘నిజమా’’ అంది.

‘‘అవును. నువ్వు ఎప్పుడు వస్తున్నావు?’’

‘‘నాకు ఇప్పుడే రావటం కుదరదు. ఇక్కడ అనుకున్నంత ఈజీగా పనులు కావటం లేదు. చాలా సమస్యలు వున్నాయి. తాత ఇన్ని రకాల ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ ‌చేసుకున్నాడా అనిపించింది’’.

వసుంధర నిర్ఘాంతపోయింది.

‘‘మళ్లీ మాట్లాడుకుందాం. నాకు నిద్ర వస్తోంది’’ అంది.

* * * *

ఉదయం శ్వేత ఆలస్యంగా లేచింది. రాత్రి చదువుతున్న నవలను మధ్యలో ఆపాలనిపించలేదు. చివరి వరకు చదివింది. నవలలో రాసినట్లు జరుగుతుందా అనేది అనుమానం. ఎక్కడైనా అరుదుగా జరగవచ్చు. ఇది రచయిత కలగన్న ఓ అందమైన ఊహ. ఇలా జరిగితే బాగుంటుంది అనిపించి వుంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి పుస్తకాలు కూడా రావాలి. చదువుతున్నంతసేపూ అమ్మా నాన్న ఈ పుస్తకం చదివితే ఎంత బాగుంటుంది అనిపించింది.

అప్పటిదాకా ఆ పుస్తక ప్రభావంలో వుంది. రాత్రి జరిగిన గొడవ గుర్తు రాలేదు. ఇంత వరకు ఇంటిలో ఎలాంటి శబ్దాలు లేవు అనుకుని బయటకు వచ్చింది. అమ్మా నాన్న ఇద్దరూ కనిపించలేదు. అప్పుడు సర్వెంట్‌ ‌కనిపించింది. తను రాత్రి వుండదు. ఉదయం వచ్చి అన్ని పనులూ చేసి వెళ్లిపోతుంది.

‘‘మమ్మీ కనిపించటం లేదు గుడికి వెళ్లిందా?’’ అడిగింది.

‘‘లేదమ్మా… అయ్యగారూ అమ్మగారూ ఊరు వెళ్లారు’’.

‘‘ఎప్పుడు?’’

‘‘గంట అవుతుంది’’.

‘‘సరే’’ అంది.

‘‘కాఫీ ఇవ్వమంటారా?’’

‘‘వద్దు. ఇప్పుడే లేచాను. బ్రష్‌ ‌చేసుకుని వస్తాను’’ అని తన గదికి వెళ్లింది.

రాత్రి నుండి ఏం జరిగి వుంటుందా అని ఆలోచించింది. ఉదయం ఇప్పటికిప్పుడు ఎక్కడికి బయలుదేరి వుంటారు. ఏదో జరగబోతోంది. ఇద్దరూ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అప్పుడు ఆద్య గుర్తు వచ్చింది. వెంటనే తనకు ఫోన్‌ ‌చేసింది.

‘‘అక్కా ఏంటి విశేషాలు’’.

‘‘చాలా వున్నాయి. నిన్న ఇంట్లో పెద్ద యుద్ధం నడిచింది’’.

‘‘ఇంత వరకు నువ్వు చెప్పలేదు’’.

‘‘రాత్రేగా జరిగింది. ఆ సమయంలో నిన్ను డిస్ట్ట్రబ్‌ ‌చేయటం ఎందుకని వూరుకున్నాను. రాత్రి నీ దగ్గర నుండి తెచ్చుకున్న పుస్తకం పూర్తి చేసాను. ఎలా వుంది అని అడుగుతావు. ఆ పుస్తకం మనం ఏం చేయాలో చెప్పింది అనుకుంటున్నాను’’.

‘‘అవునక్కా… బిట్వీన్‌ ‌ది లైన్స్ ఆ ‌పుస్తకంలో ఎన్నో విషయాలు వున్నాయి’’.

‘‘ఆ విషయాలు మనం తీరిగ్గా మాట్లాడుకుందాం ఆద్యా… ఉదయం అమ్మా నాన్నలు ఊరు వెళ్లారు అని తెలిసింది. నేననుకోవటం వాళ్లు హైదరాబాద్‌ ‌వచ్చి వుంటారని… నిన్ను ఇప్పుడు టార్గెట్‌ ‌చేస్తారు’’.

‘‘నేను అందుకు సిద్ధంగా వున్నాను అక్కా’’ అంది ఆద్య.

‘‘మనం కూడా క్విక్‌ ‌డెసిషన్స్ ‌తీసుకోవలసిన సమయం వచ్చింది. నువ్వు ఇప్పటికిప్పుడు బయలుదేరి రాగలవా?’’

‘‘చెన్నైకా?’’

‘‘చెబుతాను. ఇంకో అరగటంలో పోగ్రామ్‌ ‌చెబుతాను. ఈ రోజు నువ్వు కాలేజీకి వెళ్లవద్దు. అవసరం అయితే మనం రెండు మూడు రోజులు స్పేర్‌ ‌చేయాల్సి వుంటుంది. బట్టలు తీసుకుని రా’’.

‘‘అలాగే అక్కా’’ అంది ఆద్య.

అప్పటి నుండి శ్వేత చకచక పనులు చేయటం మొదలు పెట్టింది. క్రైసిస్‌ ‌మేనేజ్‌మెంట్‌ అనేది తను చేయబోయే ఉద్యోగంలో ఓ భాగం. అది తుఫాన్‌ ‌కావచ్చు. సునామి కావచ్చు. అలాగే రాజకీయంగా అప్పటికప్పుడు విరుచుకుపడే పరిణామాలు కావచ్చు. శ్వేత ముఖం గంభీరంగా తయారయింది.

* * * *

రిత్విక్‌ ‌గోవింద్‌ ఎదురుగా కూర్చున్నాడు. ఆయన ముఖం గంభీరంగా వుంది.

‘‘రామకృష్ణగారు లండన్‌ ‌వెళ్దాం అంటున్నారు రిత్విక్‌’’.

‘‘అం‌దుకేగా సర్‌. ‌వీసా తీసుకుంది’’.

‘‘నిజానికి మన ముగ్గురం బయలుదేరి వెళ్లాలి. నేను కనీసం పది రోజులు ఆగుదాం నాకు కొన్ని ముఖ్యమైన పనులున్నాయి అన్నాను. అందుకు రామకృష్ణ గారు ఒప్పుకోవటం లేదు. నీ పనులు నువ్వు చూసుకో.. నేనూ రిత్విక్‌ ‌వెళ్తాం అంటున్నారు’’.

‘‘ఇప్పుడేం చేద్దాం సర్‌’’.

‘‘‌రాజన్‌ ఇక్కడే వుంటాడు. మీరు ఇద్దరూ వెళ్లాలి. రామకృష్ణ గారి అన్ని విషయాలు నువ్వు చూసుకోవాలి’’.

‘‘ఆ విషయం గురించి మీరు ఆలోచించకండి. నాకు ఆయన తాతగారి లాంటి వారు. మా నాన్న లేరు. ఆయనకు సేవ చేసే అదృష్టం ఈ రూపంలో వచ్చింది అనుకుంటాను. రాజన్‌ ‌దగ్గర నేను పెద్దాయన డైరీ అంతా రాసుకుంటాను. ఎప్పుడు ఏ మందులు ఇవ్వాలో, ఇంకా అన్ని విషయాలు’’.

‘‘నేను మీతో రాలేకపోతున్నాను. అయితే నా మనసంతా అక్కడే వుంటుంది’’ అన్నాడు గోవింద్‌.

‘‘‌నన్ను మీ స్వంత మనిషి అనుకుని ఇక్కడికి పిలిచారు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటాను సర్‌’’.

‘‘‌నేను నా పనులు అయిన వెంటనే ఏ నిమిషంలో అయినా బయలుదేరి వస్తాను. నేను ఆఫీస్‌కి వెళ్తాను’’ అని గోవింద్‌ ‌లేచాడు. అప్పుడు అతని కళ్లు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతను నమ్మలేనట్లు చూస్తున్నాడు.

శ్వేత-ఆద్య నడిచి వస్తున్నారు. రిత్విక్‌ ‌వారిని చూస్తున్నాడు-ఎవరి అమ్మాయిలు అనుకుంటూ!

గోవింద్‌లో పసిబిడ్డ వున్నాడు. ఆయన తన్మయత్వంలోనూ ఏడుస్తుంటాడు. ఇప్పుడు అదే జరుగుతోంది.

ఇద్దరూ వచ్చి గోవింద్‌ ‌పాదాలకు నమస్క రించారు.

అప్పుడు ఇద్దరినీ లేపి హృదయంలో పొదువుకుని ఏడుస్తున్నాడు.

‘‘నేను బతికి వున్నంత వరకు ఇలాంటిది చూస్తాననుకోలేదు. మీరు నేను చనిపోయినా చూడటానికి వస్తారనుకోలేదు’’ అంటున్నాడు.

‘‘అలా అనకండి. ఇది ఎప్పుడో జరగాల్సింది. ఆలస్యం అయింది’’ అంది శ్వేత. అనుమానం వచ్చిందాయనకి.

‘‘ఈ తాత కోసం ఇంటి దగ్గర తగాదాపడి వచ్చారా?’’

‘‘అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం తాతగారూ’’ అంది ఆద్య. అప్పుడు రిత్విక్‌ ‌కేసి తిరిగాడు…

‘‘రిత్విక్‌… ‌నా మనవరాళ్లు… శ్వేత… ఆద్య… మై ఫ్రౌడ్‌ ‌గ్రాండ్‌ ‌డాటర్స్’’ అన్నాడు ఉద్వేగంగా. ఇద్దరూ రిత్విక్‌ని గుర్తు పట్టారు. ఆ పుస్తకం వెనకాల అతని ఫోటో వుంది.

‘‘మీరు గ్రాండ్‌ ‌పా మ్యూజింగ్స్ ‌పుస్తకం రాసారు’’ అంది ఆద్య

‘‘అవునమ్మా… ఆ నవలను ముందు నాకే పంపాడు. నేను ప్రచురించలేక పోయాను’’.

‘‘అదేంటి తాతగారూ…! అలాంటి నవలలు మీకు నచ్చటం మానేసాయా?’’ అంది శ్వేత.

‘‘ఈ మధ్య కాలంలో పత్రిక స్వరూపం మారిపోయింది. సారీ తాతగారు ఇలా అంటు న్నందుకు. ఇప్పుడు మన పత్రికలో ముఖ్యంగా మంత్లీలో నాకు మీ హృదయం కనిపించటం లేదు. వ్యాపారం. రొటీన్‌ ‌స్టఫ్‌ ‌కనిపిస్తోంది. మంచివి సంవత్సరానికి ఒకటి రెండు నవలలు ప్రచురిస్తే పత్రిక సర్క్యులేషన్‌ అం‌త డ్రాస్టిక్‌గా పడిపోతుందని నేను అనుకోను’’ అంది ఆద్య.

రిత్విక్‌ అం‌దరినీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. గోవింద్‌ ‌బుద్ధ మనవరాళ్లు తన నవల గురించి మాట్లాడటం అతను వూహించనిది.

‘‘మనం అవన్నీ మాట్లాడుకుందాం. దానికి ముందు ఒక విషయం మీకు చెప్పాలి. మన కుటుంబంలో ఘర్షణ జరిగినప్పుడు ఇలా జరగకూడదు. మీ అందరూ కలవాలి, ఎప్పటికయినా కలుస్తారు అని ముందుగా ఉత్తరం రాసింది రిత్విక్‌’’.

ఇద్దరూ రిత్విక్‌ని కృతజ్ఞతా భావంతో చూస్తున్నారు.

‘‘అప్పుడు నేను ఆ తీవ్రతలో వున్నాను. అందుకే కొంత కాలం నేను రిత్విక్‌ని దూరంగా పెట్టాను’’ అని…

‘‘మన దగ్గర నా గురుతుల్యులు వున్నారు. ముందు వారిని కలుద్దాం రండి’’ అని రామకృష్ణ దగ్గరకు తీసుకు వెళ్లాడు. అప్పుడాయన ఓ ఇంగ్లీష్‌ ‌పుస్తకం చదువుతున్నారు.

‘‘సర్‌’’ అని పిలిచాడు. రామకృష్ణ పుస్తకం పక్కన పెట్టి కళ్లజోడు సవరించు కున్నాడు. ముందు అస్పష్టంగా కనిపించారు. క్రమంగా ఉద్వేగంగా చూస్తున్న ఆద్య, శ్వేతని చూసాడు.

‘‘నువ్వు శ్వేత… నువ్వు ఆద్య.. అవునా!’’

ఇద్దరూ ఒకరి నొకరు చూసుకుని ఆయన పాదాలు టచ్‌ ‌చేసారు. పక్కన కూర్చున్నారు. ఆయన బలవంతం మీద.

‘‘వాటే మెమరబుల్‌ ‌డే బుద్ధా’’ అన్నాడు తన్మయత్వంగా…

గోవింద్‌ ‌కళ్లు చెమర్చుతున్నాయి.

‘‘మీ తాతగారు మీ ఇద్దరి గురించి తలవని రోజు వుండదు. ఏమయినా మీరు ఈ రోజు మీ తాతకి మరో ఇరవై సంవత్సరాల ఆయుష్షు పెంచారు’’ అన్నాడు.

‘‘బుద్ధా ఇది మనవరాళ్లు వచ్చిన సందర్భం. ఎంజాయ్‌ ‌చెయ్యండి’’ అన్నాడు.

* * * *

సముద్రపు ఒడ్డున గోవింద్‌, ‌శ్వేత, ఆద్య కూర్చున్నారు.

సముద్ర కెరటాలు వారి మనసుల్లో ఉద్వేగాల్లా విరుచుకుపడుతున్నాయి.

‘‘ఇప్పుడు చెప్పండి’’ అన్నాడు గోవింద్‌ ఇద్దరినీ చూస్తూ…

‘‘మేం చెప్పటానికి రాలేదు. మీ నుండి వినటానికి వచ్చాం తాతగారు’’ అంది శ్వేత.

‘‘మాకు కొన్ని విషయాలు లీలగా తెలుసు. ఏం జరిగింది అన్నందుకు అందరికీ కోపం వచ్చింది. అయితే ఇందులో అమ్మమ్మ లేదు. తను మనశ్శాంతి కోసం యాత్రల్లో వుంది. మీకు కూడా చెప్పటానికి ఇష్టం లేకపోతే చెప్పండి. మనం స్నేహితులుగా వుందాం’’ అంది ఆద్య.

గోవింద్‌ ‌బుద్ధ కళ్లు మూసుకున్నాడు కొద్ది క్షణాలు…

(సశేషం)

About Author

By editor

Twitter
Instagram