చారిత్రక కథ

– శ్రీ డి.సీతారామారావు

సెప్టెంబర్‌ 17 ‌నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల ముగింపు సందర్భంగా


హైదరాబాదు ప్రాంతంలో నర్గుండ ఒక చిన్న సంస్థానం. ఈ సంస్థానం స్వాతంత్య్రేచ్ఛకు స్థావరము, వీరత్వానికి పుట్టినిల్లు. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామ కాలంలో నర్గుండ రాజు భాస్కరరావు బాబాసాహెబు స్వాతంత్య్ర సమరసేనాని, విప్లవ నాయకుడైన నానాసాహేబు పీష్వా పంపిన స్వాతంత్య్ర సందేశాన్ని స్వీకరించాడు. తన పటాలాలకు సమర్థంగా తర్ఫీదు ఇచ్చాడు. రోహిలాలు, అరబ్బీలు, పఠానులు మున్నగువారు నవ్యరీతులలో యుద్ధ శిక్షణ పొందేరు.

సాయంకాల సంధ్యారుణకాంతులు నర్గుండ కోటకు అనతి దూరములో నున్న భైరవ దుర్గంపై ప్రసరించి నలుపుతో కలిసిన ఎరుపు శోభను ప్రసాదిస్తున్నాయి. భైరవదుర్గం నల్లని సానరాతితో కట్టబడి ఉంది. అరుణ పతాకం నీరెండలో ప్రకాశిస్తూంది. దుర్గంలో భవానీ దేవాలయంలో సాయంకాల పూజా చిహ్నంగా గంటలు ఘణ ఘణ మ్రోగుతున్నాయి. దుర్గపు సింహద్వారాన్ని బలిష్ఠులైన యిరువురు యోధులు కాపలాకాస్తున్నారు. కొందరు వీరయోధులు తమ గుర్రాలను చెట్ల గుంపు మధ్యన కట్టి విప్లవ చిహ్నంగా గులాబి పుష్పాలను కాపలా వారికిచ్చి లోనికి ప్రవేశించారు. ఆ యోధుల ప్రవేశాన్ని చుట్టుపట్ల ఎవరూ గమనించినట్లు లేదు.

భవానీ దేవాలయంలో గర్భగృహానికి ముందుగా పదహారు స్తంభాల మండపం ఉంది. ఒక్కొక్క స్తంభంపైన ఒక్కొక్క కళారూపిణియైన దేవీమూర్తి చిత్రమై ఉంది. పరాశక్తిని షోడశ కళల రూపంలో ఆరాధించే విధానానికి మూల పురుషుడు రాజా భాస్కరరావు బాబాసాహెబు.

మంటపంలోని ఒక శిల్పఖండం! అది పాలరాతి విగ్రహం. అది అష్ట త్రిపుర భవానీ విగ్రహం. ఆ శిల్పంలోని ప్రతి అంగము దైవిక రూప సంపత్తి కల్గి యథా శాస్త్రోపేతంగా అమరి శోభిస్తోంది. ‘‘మనోహరం’’ అనే ఒకానొక అవ్యక్త నిర్గుణరూపం ఆ శిల్పంలో ఇమిడి సారూప్యభావాన్ని పొంది భాసిస్తోంది. ఆ రూపఖండంలో గాంభీర్యం, సౌందర్యం, వీరత్వం, అఖండత్వం – ఇత్యాది రూపకళలు శరీరంలో లావణ్య ఝరివలె ప్రవహిస్తున్నాయి. ఇన్ని కళలతో పుంజీభవంచిన ఆ మూర్తిలో సౌమ్యత, ప్రేమ, కరుణ, మాతృత్వం ఒకే ఒక కన్నుల జంటలో ఇమిడ్చాడు మహాశిల్పి. ఆ విగ్రహాన్ని చూచి ఆ యోధులు చేతులు జోడించి అప్రయత్నంగా ‘‘జగజ్జననీ! సమస్త చరాచర జీవరాసులకు నీవు మాతృమూర్తివి. మేము తలపెట్టిన ఈ స్వాతంత్య్ర సంగ్రామంలో విజయం చేకూర్చు తల్లీ!!’’ అని ప్రార్థన చేసేరు.

ఇంతలో సింహబలుడైన యువవీరుడు భుజాన తుపాకి ధరించి లోనికి వచ్చాడు. ఆ యోధులు వినమ్రులై నిలబడ్డారు. ఆ వచ్చినవాడు మరెవరో కాదు ‘విప్లవజ్యోతి’ భాస్కరరావు. ఆలయంలో ప్రవేశించిన ఆ వీరయోధులను చూచి గంభీర స్వరంతో ఆయన ‘అచంచల దీక్షా పవిత్ర హృదయాలతో నిండిన, హైందవ శ్రేయోకాముల, నిరంతర సేవాత్యాగాలతో వెలిగే ఈ అఖండ భారత దివ్య స్వాతంత్య్ర జ్యోతి అల్పమైన ఈ ఆంగ్లేయ కీటకాల అలజడికి ఆరిపోతుందని మీరు ఏలా భావిస్తూన్నారో నాకు తెలియకున్నది. అదిగో! అటువైపు చూడండి! సత్వగుణ ప్రధానురాలైన భారతమాత నేడు తమో గుణాన్ని ఆవహింపచేసుకొని సాక్షాత్తూ తామసమూర్తియై రౌద్రాకారం తాల్చి కాళిమూర్తియైనది. మాతృదేశ గౌరవం, యశస్సు, శక్తి సంపన్నత స్వాతంత్య్రం నశిస్తూన్న ఈ సమయంలో చావు బ్రతుకుల సమస్య ఏర్పడింది. క్షణ క్షణం కుదించుకుపోతూన్న మన దేశ సరిహద్దులను విస్తరింపజేసి విశాల భారతభూమిని నిర్మించాలి. భారతీయతను మీరంతా అటు హిమాలయాలు మొదలు ఇటు కన్యాకుమారి వరకు స్వాతంత్య్ర ఘోష ప్రతిధ్వనిస్తోందాయనునట్లు ఒక్కసారిగా ప్రళయకాల ప్రభంజనంలా విజృంభించి కంటికి కనుబడిన ప్రతి ఆంగ్లేయుని తెగనరకండి! లేవండి! ముందంజ వేయండి!’ అని ధైర్యాన్ని ఇస్తూ ఆ వీరయోధులను హెచ్చరించాడు.

* * * * * *

ఆనాడు ఆదివారం 1858 సం।। మే నెల 25 తారీకు. ఆంగ్ల సిపాయీలకు శలవు దినం. ‘బ్రిగేడియర్‌ ‌మాన్సన్‌’ ‌విడిది చేసిన భవంతిలో ‘చుట్ట పొగ’ గదుల నిండా దట్టంగా అలుముకొని ఉంది. మంచాలు, కుర్చీలు, బెంచీలు నేల గదులన్నిటి నిండా, కూర్చునీ పడుకొనీ తప్పత్రాగి మనుష్యులాక్రమించు కొన్నారు. బీరు గ్లాసులూ, తుపాకులూ కలిసి మెలిసి అంతటా కాలుపెట్టే జాగా లేకుండా చిందరవందరగా పడి ఉన్నాయి.

ఆకాశంలో నీలిమబ్బుల బారులు తెలి వెన్నెల వెలుగులతో దోబూచులాడు కొంటూన్నాయి. నేలమీద వెలుగు నీడలు ఒండొంటిననుసరించి పరుగు లారంభించాయి. ఆకాశాన్ని అంటుతున్న కొండమల్లి పూలు విరబూసి వెలుగు నీడల్లో నవ్వుతూ సువాసనలు విరజిమ్ముతున్నాయి.

ఊపిరి దిగబట్టుకొని ఒక యువవీరుడు మామిడిచెట్టు చిటారు కొమ్మ మీదకు ఎగబ్రాకుతున్నాడు. ఒళ్లు అక్కడక్కడ కొంచెం చీరుకుపోయినా అతనికి చీమ కుట్టినట్టయినా అనుపించలేదు. దట్టముగా అలుముకొన్న చిగురుటాకుల గుబురులో పొంచియున్నాడు. తన సంగతి ఎవరైనా పసికడుతున్నారేమో అని చాలా జాగ్రత్తగా ఆ గుబురులో నుంచి నేల నాలుగు చెరుగులా పరిశీలించాడు. చెక్కు చెదరని ఆ ఉక్కు లాంటి శరీరం; గూటాల్లాంటి దండలు, దూలాల వంటి తొడలు; నలుపైనా నిగనిగలాడే దేహచ్ఛాయ, పొడుగాటి ముక్కు, ముక్కుకు తగ్గ, ఉబ్బిన, గుండ్రని, ఎఱ్ఱని, పెద్ద ముఖంతో, ఆ మృత్యుభీషణమూర్తిలా ఉన్న ఆ గొరిల్లా యుద్ధవీరుని చూడగనే ‘‘ధీరోద్ధతో సమయతీవ ధరిత్రీమ్‌’’ అనే లోకోక్తి జ్ఞప్తికి వస్తుంది. అతడు ‘అరుణ జ్యోతి’ భాస్కరరావు.

రాత్రి రెండో యామం కూడా గడిచిపోతూంది. మబ్బుల మాటున దాగిన చందమామ తెర తొలగించుకొని యీవలకు వచ్చి భవంతి పరిసర భాగం అంతా వెలుగులలో ముంచెత్తుతున్నాడు. ఇంతలో మారుమూల ఒక జాగిలం మొరిగింది. అతడు శిరస్సు బాగా పైకెత్తి భవంతి గవాక్షమువైపు లోపల పరిశీలిం చాడు. అతని అదృష్టం పండింది. ఆ వెలుగులో నెమ్మది నెమ్మదిగా నిద్ర ముఖముతో అడుగులో అడుగు వేసుకొంటూ మత్తుగా తూలుతూ ‘మాన్సన్‌ ‌సేనాని’ మేడ పరండావైపు వచ్చి చుట్టుప్రక్కల కలయజూస్తున్నాడు. ఇదే సమయమనుకొని తుపాకి సరిగా గురిపెట్టి ఒక్క గుండుతో పిట్టని నేల రాల్చినట్లు నేల రాల్చినాడు భాస్కరరావు. ఈ దెబ్బ భవంతిలో ఇతర సేవనులకు కార్‌ ‌మనిపించింది. వెనువెంటనే ఊపిరి బిగబట్టి ఒక్క దూకులో మేడ కిటికీ మీదకు ఎగిరి ఊచ గట్టిగా పట్టుకొని అతి కష్టంమీద వరండా మీదకు చేరుకొని ప్రళయకాల నటరాజులా ‘మాన్సన్‌’ ‌మీదకు విజృంభించి ఒకే ఒక వేటుతో అతని తల తెగనరికి వెల్లువలా ప్రవహిస్తున్న కవోష్ణ రక్తంతో భవానీదేవి పాద పద్మములను కడిగేడు. దీనితో భవంతిలోనున్న మిగతా ఆంగ్ల సిపాయీలు అండచ్యుతి పొందిన ఇంద్రదేవునిలాగై పోయారు. ఇంతలో భవంతి ప్రక్క పొదలలో పొంచి ఉన్న దేశభక్తుల తుపాకి గుండ్లు అగ్నివర్షంలా మీదికి వస్తున్నాయి. అన్ని వైపులా ఏకోన్ముఖంగా, పెను తుపాన్‌లా పురోగమిస్తున్న హైందవ యోధులను చూడగనే ఆంగ్లేయులకు కార్‌మనిపించింది. దీనితో చెల్లాచెదురై పారిపోతున్న ఆంగ్ల సిపాయీలను నిలువునా ఎక్కడికక్కడ కాల్చివెయ్యడమే హిందూ సైనికుల పని అయిపోయింది. విప్లవకారులు సాగించుచున్న ప్రళయసంగ్రామం ముందు మిగత ఇంగ్లీషు సేనానులు ‘నీలూ, బ్రిగేడియర్‌ ‌పార్క్’ ‌రక్షణకు దారి తెన్ను కానక చిందరవందరైన పీనుగు పెంటలను త్రొక్కుకుంటూ, క్షతగాత్రులను వదలి పరారయ్యారు.

(26.7.1971 ‘జాగృతి’ సంచిక నుండి)

About Author

By editor

Twitter
Instagram