– మధురాంతకం రాజారాం

బాలభానుని అరుణ కాంతుల్లో కన్యాకుబ్జం మిలమిల మెరసిపోతున్నది. కోట దగ్గరి నుంచీ పట్టణం పొలిమేర వరకూ వీధుల పొడుగునా చలువ పందిళ్లు అమర్చబడుతున్నాయి. పట్టు పావడా కుచ్చెళ్లు నేలపై జీరాడుతుండగా బాలికలు వీధుల్లో ముత్యాల రంగవల్లికల్ని తీరుస్తున్నారు. శుభ ముహూర్తానికి ఇంకా రెండు రోజులు వ్యవధి ఉన్నప్పటికీ, కోటలో అప్పుడే మంగళకరమైన సన్నాయిమేళం సన్నసన్నగా ప్రారంభమై ఉన్నత స్థాయినందుకుంటున్నది. అంతఃపురంలో అటూ, ఇటూ సంభ్రమంగా తిరుగుతూ, పరిచారికలు పెళ్లి కూతురికి కావలసిన అలంకరణ ద్రవ్యాలనన్నింటినీ సర్దుకుంటున్నారు.

రాజప్రాసాదానికి దాపున వున్న ప్రమదావనంలో స్వయంవర మండప నిర్మాణం పూర్తి కావస్తోంది. పైపై నగిషీ పనుల్లో లీనమై వున్న శిల్పుల ముఖా రవిందాలు, మండపం అంతా అతిలోక సుందరంగా తయారైనందు చేతనేమొ ప్రఫుల్లితాలై, సంతృప్తిని ఒలకబోస్తున్నాయి.

ఆ ఆరామానికి చివరగా వున్న పర్ణ్లకుటీరం ముంగిట ఒక వృద్ధ శిల్పి ఒంటరిగా తన కర్తవ్యంలో నిమగ్నుడై వున్నాడు. అతని చేతులు యంత్రపు మరల్లా వడిగా పనిచేస్తున్నాయి. మరికొన్ని గడియల్లో పూర్తి కావడానికి సిద్ధంగా వున్న ఒక పురుష విగ్రహం పాదాలను అతడు మలచుకుంటున్నాడు.

అది పృథ్వీరాజు ప్రతిమ।

అసూయకన్నా దుష్టమైన కాలాహి  ప్రపంచంలో వేరొకటి లేదన్న పెద్దల యొక్క మాట పొల్లు కాదు. జయచంద్రుడు పృథ్వీరాజుపైన అకారణ ద్వేషం వహించాడు. అంతటితో ఊరుకోలేదు. ప్రతీకార వాంఛ అతని శరీరంలోని ప్రతి అణువునా పెల్లు బికింది. ముఖాముఖిగా ఢిల్లీశ్వరుణ్ణి ఎదుర్కొని పోరాడే సాహసం అతనికి లేదు. అందుచేత అతడు మరొక ఉపాయం వెదకవలసి వచ్చింది. తన కుమార్తెకు స్వయంవరమని ఛప్పన్న దేశాలలో చాటించాడు. అన్ని దేశాలకూ ఆహ్వానాలు పంపాడు, ఒక్క ఢిల్లీకి తప్ప! అది నిజంగా పృథ్వీ రాజుకు అవమానకరమైన విషయమే. అయితే లక్ష అవమానాలతో అతణ్ణి క్రుంగింప తలచిన జయచంద్రుడు అంతటితోనైనా ఊరుకోలేక పోయాడు. ‘‘పృథ్వీరాజు విగ్రహాన్ని స్వయంవర మండపం వాకిట నిలబెట్టిస్తాను. అతడు నా వాకిట కావలి బంటు!’’ అంటూ అతడు వికటాట్టహాసం చేశాడు.

కానీ జయచంద్రునికి, తనెవడినైతే వాకిణి కావలిబంటుగా పరిగణిస్తున్నాడో,  అతడే తన కుమార్తె హృదయాన్ని దోచుకున్న వీరపురుషుడని తెలియదు!

చెంపలపై నుంచీ క్రిందికి దిగజారుతున్న స్వేద బిందువుల్ని తుడుచుకుంటూ  శిల్పి పైకి లేచాడు. శిల్పం పూర్తైపోయింది. దర్పాన్ని,ఠీవిని వెలార్పుతున్న ఆ విగ్రహాన్ని చూచి శిల్పి తన శిల్పకళా ప్రావీణ్యానికి తానే విస్తుపోయాడు. అయినా అతని మనసులో ఏదో ఒక చింత ఉండి ప్రజ్వరిల్లుతూ వుంది. ‘‘వీరపూజ చేయడమొక పవిత్ర సంప్రదాయంగా పరిగణించే భారతదేశంలో, ఆ విగ్రహాన్ని ముందు తరాల వారు పూజించడానికి నిర్దేశించడం… వాకిటి కావలిబంటుగా… ‘‘పాపము శమించుగాక!’’ అనుకుంటూ శిల్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

తరువాత కొంతసేపటికి యువరాణి కోటలో నుంచీ బయటికి వస్తున్నందుకు చిహ్నంగా కోట బురుజులపై నుంచి నగారాలు ఒక్క పెట్టున నినదించాయి. అందలాలు బారులు బారులుగా వచ్చి ఉద్యానవనంలో ఆగినాయ్‌. ఒక చెలికత్తె తలుపు తెరువగా జరీదువ్వలువలతోనూ, సర్వాభ రణాలతోనూ అలంకరించబడిన సర్వ మంగళ విగ్రహంలా, పుత్తడి బొమ్మ సంయుక్తాదేవి పల్లకీ నుంచి ఈవలికి వచ్చింది.

ఆమె రాజహంసలా మెల్లగా ఎక్కడికో నడవసాగింది. పరిచారకులు ఆమెను అనుసరించారు.

ప్రాణపతి అనుగ్రహం సంపాదించడం కోసం పువ్వుల్తో అతని ప్రతిమను పూజించడానికి వెళ్తున్న పర్వతరాజ తనయలా వుందప్పుడు సంయుక్తా కుమారి.

చూపుమేర దూరంలో కనులవిందుగా కనిపించింది జగదేగవీరుడైన పృథ్వీరాజు యొక్క మనోజ్ఞ స్వరూపం. ఆషాఢ మేఘాన్ని  తిలకించి వివశమై •పోయిన నెమిలి పడుచులా సంయుక్త ఆ విగ్రహం దగ్గరికి వెళ్లింది.

విగ్రహం దగ్గర ఏ స్వప్నలోకాల్లోనో  విహరిస్తున్నట్టు అరమోడ్పు కన్నులతో కూచుని వున్న ఒక వ్యక్తి అడుగుల సవ్వడి విని లేచి నిలబడి సవినయంగా యువరాణికి అంజలి ఘటించాడు.

‘ఎవరు నీవు?’ అని ప్రశ్నించింది రాకుమారి.

‘‘నేను శిల్పిని యువరాణీ!’’ అన్నాడతడు వంచిన తలను పైకెత్తకుండా,

‘‘ఈ సుందర విగ్రహాన్ని తీర్చిదిద్దిన మహాశిల్పివి నువ్వేనా?’’

‘‘ఈ భృత్యుడింతకంటే సుందర శిల్పాల్ని తయారుచేయగలడు, యువరాణి!’’

‘‘కానీ ఇంతకంటే గంభీరమైన విగ్రహాన్ని నువ్వు సృజించలేవు’’ అన్నది యువరాణి. శిల్పి బదులు పలుకలేదు. శిల్ప సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్న సంయుక్తా దేవిని అతడు చూడనట్లే చూస్తూ, అవశుడై వుండిపోయాడు. ఉన్నట్టుండి మళ్లీ యువరాణి ఒక ప్రశ్న వేసింది.

‘‘ఇంతటి మనోహరమైన ఆకృతిని నువ్వెలా చిత్రించగలిగావు శిల్పీ?’’

శిల్పికేం చెప్పాలో తోచలేదు. యువరాణి తన ప్రశ్నకు తనే వ్యాఖ్యానం చెప్పబోయింది. ‘‘అంటే… అంటే…’’ యువతీ తన సహజమైన సిగ్గుతో ఆమె తనకు తోచిన భాగాన్ని చెప్పలేకపోయింది.

ఆమెకు ప్రశ్నకు అర్థమేమిటో శిల్పి ఆకళించుకుని ‘‘నేను అనేకమార్లు పృథ్వీ రాజును చూచాను యువరాణి!’’ అన్నాడు.

‘‘ఎప్పుడు?’’

‘‘కొన్ని రోజులు ఢిల్లీశ్వరుని కొలువు కూటంలో ఆస్థాన శిల్పిగా పనిచేశాను యువరాణీ!’’

‘‘అలాగా! అయితే అక్కడి నుంచీ ఎందుకు వచ్చేశావు?’’

‘‘కళాభిరుచిలేని నరేంద్రుల దగ్గర శిల్పుల బ్రతుకు సాగుతుందా యువరాణీ!’’

‘‘ఏమిటీ!’’

‘‘అవును యువరాణీ! ఒక్క కళాభిరుచేమిటి? ఏ సద్గుణ లేశమూ లేని పృథ్వీరాజును సేవించడం నాకిష్టం లేదు.’’

‘‘నువ్వు పిచ్చివాడివి కావు గదా!’’

‘‘కాను….సత్యాన్ని చూచి చెబుతున్నాను. పృథ్వీరాజు ప్రపంచమనుకుం టున్నత మహావీరుడేం కాదు. నిజం చెప్పవలసి వస్తే అతడు భీరువు. దయా దాక్షిణ్యాలు ఏ కోశానా లేని కఠిన హృదయుడు. ప్రజా హృదయాన్ని అర్థం చేసుకోలేని ఆజ్ఞుడు. సద సద్వివేక శూన్యుడు కామాకుల…’’

‘‘అసత్య ప్రలాపీ! నీ మాటలు కర్ణకఠోరంగా వున్నాయి. ఇక మాట్లాడకు. వెళ్లు. ఈ ఉద్యాన వనం నుంచే కాదు, ఈ కన్యాకుబ్జ రాజ్యం నుంచే వెళ్లిపో’’ అని శాసించింది యువరాణి.

శిల్పి తలవంచుకుని వెళ్లిపోసాగాడు.

‘‘విజయా! ఆ శిల్పిని ఆగమని చెప్పు. అతని ప్రవర్తన ఎలాంటిదై•నప్పటికీ, అతని శిల్పకళా చాతుర్యం మాత్రం అనన్య సాధారణమైంది. ఈ కంకణాన్ని అతనికి పారితోషికంగా బహూకరించు’’ అని ఎడమ చేతి నుంచి నవత్న ఖచితమైన సువర్ణ కంకణాన్ని తీసి విజయ చేతికిచ్చి సంయుక్తా కుమారి వడివడిగా అక్కడి నుంచీ నిష్క్రమించింది.

ఢిల్లీ కోట బురుజులపైన జయభేరి మ్రోగుతున్నది. రాజ ప్రాసాదాలన్నీ అసంఖ్యాక దీపరాజితో, దేవేంద్రుని వైజయంతంలా శోభిస్తున్నాయి. నగరవాసులు విజయోత్సవం చేసుకుంటున్నారు.

స్వయంపరాగతులైన రాజులనందర్నీ జయించి, సంయుక్తా ద్వితీయుడై పృథ్వీరాజు ఆ రోజు సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నాడు.

అంతఃపురంలోని దేవీమందిరంలో సంయుక్త తొలిసారిగా తన ప్రాణేశ్వరునికి యిలవేల్పయిన మహిషాసురమర్దనిని పూజిస్తూ వున్నది. పూజించి దేవి చరణాలపైనున్న కుంకుమతో తిలకం తీర్చుకుని, తిరిగి చూచినది. దరహాస వదనుడైన పృథ్వీ రాజు కనుపించాడామెకు.

ఈ శుభ సమయాన నేను నీకొక చిన్న బహుమానాన్ని సమర్పించు కోవ చ్చునా, సంయుక్తా!’’ అన్నాడతడు.

ఆమె బదులు చెప్పకముందే పృథ్వీరాజు ఒక చిన్న సువర్ణ మంజూషను ముందుకు చాచాడు. సంయుక్త దాన్ని అందుకుని మూత తెరిచింది. తానా రోజున శిల్పికి బహూకరించిన బంగారు గాజు ప్రత్యక్షమైందామె కాపెట్టెలో

నివ్వెరపోయింది సంయుక్తాదేవి. రెండు క్షణాలు మ్రాన్పడిపోయి ఆ తరువాత ‘‘మీరు… మీరు…’’ అంటూ ఆమె ఆర్థోక్తిలో ఆగిపోయింది.

‘‘అవును సంయుక్తా! నేనే ఆ శిల్పిని’’ అన్నాడు పృధ్వీరాజు. శౌర్య స్వరూ పిణిగా అక్కడ వెలసి వున్న జగన్మాత కన్నుల్లో నుంచీ ఆ క్షణాన చల్లని వెన్నెల కాంతులు పెల్లుబికి లోకంపైకి ప్రసరించినాయ్‌.

(20.8.1954 ‌జాగృతి నుంచి)

About Author

By editor

Twitter
Instagram