– డి.అరుణ
విజయవంతమైన ఆదిత్య ఎల్-1
తాము భారతీయులమైనందుకు గర్వపడేలా చేసిన చంద్రయాన్ 3 విజయం తర్వాత, పదిరోజులు కూడా తిరక్కుండానే 2 సెప్టెంబర్ 2023న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో తొలి అంతరిక్ష ఆధారిత మిషన్ ఆదిత్య ఎల్-1ను ప్రయోగించడం… ఉపగ్రహాన్ని తీసుకుని పిఎస్‌ఎల్‌వి – సి57 విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో దూసుకుపోవడంతో జాతి గుండె మరొకసారి గర్వంతో ఉప్పొంగింది.
ఉప గ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి లాంచ్ వెహికల్ ప్రవేశపెట్టింది. కాగా, ఆదిత్య ఎల్ -1 ప్రయాణం అంత సులువైనది కాదు. అది నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించేందుకు నాలుగు నెలలు పడుతుందని శాస్త్రవేత్తల అంచనా. సూర్యుడు – భూమి మధ్య పథంలో, భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోగల లాగ్‌రేంజ్ పాయింట్ (ఎల్ 1- రెండు గ్రహాల గురుత్వాకర్షణ శక్తులు సమతుల్యంగా ఉండే స్థానం) చుట్టూ గల కాంతివలయ కక్ష్యలో ఈ అంతరిక్ష నౌకను ప్రవేశ పెట్టడం దీని లక్ష్యం. ఈ కేంద్రం లేదా స్థానంలో ఉపగ్రహం ఉండటం వల్ల రెండు గ్రహాలకు సంబంధించి సాపేక్షంగా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. మనకు ఎన్నో లక్షల కిలోమీటర్లు అనిపించినా, ప్రస్తుతం ఉద్దేశించిన దూరం, భూమికి-సూర్యుడికి మధ్య ఉన్న దూరంలో 1శాతం మాత్రమే. సూర్యుడు వాయువు కలిగిన భారీ గోళం, ఇటువంటి సూర్యుడి బాహ్య వాతావరణాన్ని ఆదిత్య ఎల్-1 అధ్యయనం చేస్తుంది.
కీలకమైన లాగ్‌రేంజ్ పాయింట్
చంద్రయాన్-3 చంద్రుడిపై దిగినట్టు ఆదిత్య ఎల్-1 సూర్యుడిపై దిగదు, పైగా సూర్యుడి సమీపానికి కూడా వెళ్లదు. అయితే చంద్రయాన్ మిషన్‌లానే సూర్యుడిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ఉపగ్రహం ఆదిత్య-ఎల్1.
ఎల్ 1 కేంద్రం చుట్టూగల కాంతివలయ కక్ష్యలో ఉపగ్రహాన్ని ఉంచడం వల్ల ఎటువంటి గ్రహణాలు/ఆచ్ఛాదనలు లేకుండా నిరంతరం సూర్యుడిని చూడగలగడం అనే ప్రధానమైన లాభం ఉంటుంది. ఇది సౌర కార్యకలాపాలను పరిశీలించడమే కాక, వాస్తవ కాలంలో అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావాన్ని పరిశీలించడాన్ని సాధ్యం చేస్తుంది. అంతేకాకుండా, భూమి అయస్కాంత క్షేత్రం, వాతావరణం ప్రభావితం కాకముందే సౌర రేడియేష న్‌ను, అయస్కాంత తుపాన్లను గ్రహించేందుకు అవకాశం ఉంది.
దీనితోపాటుగా, ఎల్ 1 కేంద్రంవద్ద గురుత్వా కర్షణ శక్తుల స్థిరత కారణంగా తరచుగా కక్ష్య నిర్వహణ అవసరాన్ని తగ్గించడమే కాక ఉపగ్రహ కార్యాచరణ సామర్ధ్యాన్ని అనుకూలపరుస్తుంది.
ఏడు పేలోడ్లతో ప్రయాణిస్తున్న ఆదిత్య
ఈ అంతరిక్ష నౌక ఏడు పేలోడ్‌లు తీసుకుని వెడుతున్నది. ఈ 7 పేలోడ్లను దేశీయంగా అభివృద్ధి చేశారు. ఇందులో ఐదు ఇస్రో అభివృద్ధి చేయగా, మరో రెండింటిని ఇస్రో సహకారంతో భారతీయ విద్యా సంస్థలు తయారుచేశాయి. ఇవి, ఎలక్ట్రో మాగ్నెటిక్, పార్టికల్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్స్‌ను (విద్యుదయస్కాంత, రేణువులు, అయస్కాంత క్షేత్ర శోధనా సాధనాలు) ఉపయోగిస్తూ ఫోటోస్పియర్ (కాంతిమండలం), క్రోమోస్ఫియర్ (వర్ణ మండలం లేదా సూర్యవాతావరణం)తోపాటుగా సూర్యుడి వెలుపలి పొరలు (కొరోనా -సూర్యుడి చుట్టూ కనిపించే కాంతి వలయం)ను పరిశీలించనున్నాయి. ప్రత్యేక అనుకూల స్థితి కేంద్రం ఎల్-1ను ఉపయోగించుకుని, నాలుగు పేలోడ్లు నేరుగా సూర్యుడిని నిరంతరం వీక్షిస్తుండగా, మూడు పేలోడ్లు సహజ స్థితి లేదా యదార్ధ స్థానంలో లాగ్‌రేంజ్ పాయింట్ ఎల్-1 వద్ద రేణువులు, కణాలు, క్షేత్రాలను అధ్యయనం చేయడం ద్వారా ప్రధానమైన అంతర్ గ్రహ మాధ్యమంలో సౌర గతిశీలత విస్తరణ ప్రభావపు శాస్త్రీయ అధ్యయనా లను నిర్వహిస్తాయి.
కాంతివలయం వేడెక్కడం, కాంతివలయం పదార్ధ విసర్జన (కొరోనల్ మాస్ ఎజెక్షన్), అగ్ని కీలల ముందస్తు దశ, వాటి కార్యకలాపాలు, లక్ష ణాలు, అంతరిక్ష వాతావరణ గతిశాస్త్రం, రేణువులు, క్షేత్రాల విస్తరణ తదితర అంశాలను అర్థం చేసు కునేందుకు ఆదిత్య ఎల్-1 పేలోడ్లు కీలక సమా చారాన్ని అందిస్తాయని భావిస్తున్నారు. ఎల్ -1 కేంద్ర కాంతికక్ష్యలో ఉపగ్రహాన్ని ఉంచడం వల్ల ఉండే ప్రధాన లాభం సూర్యుడిని ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా నిరంతరం వీక్షించగలగడం.
ఆదిత్య ఎల్ -1 మిషన్ శాస్త్రీయ లక్ష్యాలు
– సౌర ఎగువ వాతావరణ (వర్ణమండలం, కాంతివలయ) గతిశీలతను అధ్యయనం చేయడం.
– వర్ణమండల, కాంతివలయాల తాపమానాలు పెరగడం, పాక్షికంగా అయనీకరణ అయిన జీవద్రవ్యం, కాంతివలయ పదార్ధ విసర్జనలు, జ్వాలల ప్రారంభ దశ, భౌతిక శాస్త్ర అధ్యయనం.
– యదార్ధస్థితిలో రేణువు, జీవద్రవ్య వాతా వరణాన్ని పరిశీలించి, సూర్యుడి నుంచి వచ్చే రేణువుల గతిశీలత అధ్యయనానికి సంబంధిం చిన డాటాను అందించడం.
– సౌర కాంతివలయం, దాని తాపన విధాన భౌతికశాస్త్రం.
– కాంతివలయ, కాంతివలయ వంపులలో జీవద్రవ్యం నిర్ధారణ: ఉష్ణోగ్రత, గతివేగం, సాంద్రత.
– అభివృద్ధి, సిఎంఇల మూలం, గతిశీలత.
– అంతిమంగా సౌర విస్ఫోటన ఘటనలకు దారి తీసేలా బహుళ పొరలలో (వర్ణమండలం, విస్త రించిన కాంతివలయం, దాని మూలా ధారం) సంభవించే పక్రియల క్రమాన్ని గుర్తించడం.
– సౌర కాంతివలయంలో ఐస్కాంత క్షేత్ర స్థితధర్మ శాస్త్రాన్ని, అయస్కాంత క్షేత్ర కొలతలు.
– అంతరిక్ష వాతావరణానికి దారి తీసే సౌర పవ నాల మూలం, కూర్పు, గతిశీలత అధ్యయనం.
స్వల్ప బడ్జెట్‌తో ఆదిత్య ఎల్-1
మన ఇస్రోశాస్త్రవేత్తలను మించిన దేశభక్తులు మరొకరు ఉండరనడం అతిశయోక్తి కాదేమో! ఒకవైపు రాజకీయనాయకులు బకాసురులై ప్రజా ధనాన్ని మింగివేస్తుంటే, మన దేశ ప్రజలకు మాత్రమే కాక యావత్ ప్రపంచానికీ ఉపయోగపడే ఆవిష్కరణ లను అతి తక్కువ ఖర్చుతో ఇస్రో శాస్త్రవేత్తలు చేయడం ఎంతో అభినందనీయం. చంద్రయాన్-3 మిషన్ కోసం రూ. 615 కోట్లను ఖర్చు చేయగా, ఆదిత్య ఎల్1 కోసం రూ. 400 మాత్రమే ఖర్చు చేశారు! ఒక హాలీవుడ్, బాలీవుడ్ సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో తమ మిషన్లను వారు తయారుచేసి, ప్రయో గిస్తున్నారు. విఫలమైన ప్రయోగాల పదార్ధాలను కూడా తిరిగి ఉపయో గిస్తామని, తమ వద్ద ఏ లోహం కానీ, పదార్ధం కానీ మిగిలి ఉన్నా దానిని వినియోగంలోకి తెస్తామని, ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
సుదీర్ఘ ప్రయాణం
సెప్టెంబర్ 2, 2023న ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 భూసంబంధ కక్ష్యలలో 16 రోజులు ప్రయాణిస్తుంది. ఈ సమయంలో ప్రయాణానికి అవసరమైన గమనవేగాన్ని పొందేందుకు అది ఐదు కార్యసాధక వ్యూహాలకు లోనవుతుంది. అనంతరం, ఆదిత్య ఎల్-1 ట్రాన్స్ లాగ్ రేంజియన్ ఇన్సర్షన్ మనూవర్‌కు (ఉపసర్గ లాగ్‌రేంజ్‌లో చొప్పించే వ్యూహానికి) లోనయ్యి, ఎల్-1 లాగ్‌రేం పాయింట్ సమీపంలోని గమ్యానికి తన 110 రోజుల పథ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఎల్ 1 కేంద్రానికి చేరిన అనంతరం, సూర్యుడికి, భూమికి మధ్య సమతుల్య మైన గురుత్వాకర్షణ కలిగిన స్థానం ఎల్1 చుట్టూ గల కక్ష్యలో ఆదిత్య ఎల్-1ను మరొక యుక్తి చేరుస్తుంది. ఈ ఉపగ్రహం తన మిషన్ జీవితకాలం అంతా భూమి, సూర్యుడిని కలిపే రేఖకు దాదాపు లంబంగా ఉండే సమతుల క్షేత్రంలో గల క్రమరహిత ఆకారంలో ఉన్న కక్ష్యలో ఎల్ 1 చుట్టూ తిరుగుతూ గడుపుతుంది.
కాగా, ప్రయోగించిన అనంతర భూ ఆధారిత మెనూవర్ (ఎర్త్ బౌండ్ మెనూవర్ -ఇబిఎన్1)ని బెంగళూరులోని ఐఎస్‌టిఆర్‌ఎసి నుంచి ఆదిత్య విజయవంతంగా పూర్తి చేయగలిగింది. అది ప్రస్తుతం సాధించిన కక్ష్య దూరం 245 కిమీ× 22459 కిమీలు అని ఇస్రో వెల్లడించింది. ఉపగ్రహం ఆరోగ్యంగా ఉందని కూడా తెలిపింది. ఇక రెండవ యుక్తి (ఇబిఎన్ 2)ని సెప్టెంబర్ 5, 2023న సుమారు మూడు గంటల ప్రాంతంలో చేపట్టనున్నట్టు కూడా వెల్లడించింది. మొత్తంగా ఐదు యుక్తులు పూర్తి చేసుకుని అది లక్షిత ప్రాంతాన్ని దాదాపు నాలుగు నెలల్లో చేరుకుంటుంది.
మూడేళ్ల ముందే జరగవలసిన ప్రయోగం
అనేక సాంకేతిక కారణాల వల్ల ఆదిత్య ఎల్-1 మిషన్ ప్రయోగాన్ని పలుసార్లు వాయిదా వేశారు. మొదట 2020లో ప్రయోగించాలని నిర్ణయించి, తర్వాత దానిని 2021వరకు నెట్టి, ఆపైన 2022కు వాయిదా వేశారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా, ఈ ప్రయోగాన్ని 2023వరకు వాయిదా వేసి, మొత్తం మీద దానిని విజయవంతంగా ప్రయోగించారు.
యథావిధిగా ఆలయాలలో పూజలు చేసిన శాస్త్రవేత్తలు
మిషన్ చంద్రయాన్ – 3 ముందు, తర్వాత కూడా శాస్త్రవేత్తలు ఆలయాలకు వెళ్లడాన్ని తప్పుపడుతూ కొందరు వ్యక్తులు చేసిన ప్రతికూల వ్యాఖ్యలను ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ తిప్పికొట్టిన విషయం తెలిసిందే. ఈసారి ఆదిత్య ఎల్ 1 ప్రయోగానికి ముందు కూడా సోమనాథ్ సహా ఇందులో కీలకంగా పాలుపంచు కున్న శాస్త్రవేత్తలంతా ఆలయాలబాట పట్టారు. తాము ప్రయోగించనున్న రాకెట్ మూలరూపానికి పూజలు చేయించి, తాము ఆశీస్సులు పొంది వచ్చారు. సెక్యులర్ ఇండియాలో ఇవన్నీ సరికాదు అని భావించే ఉదారవాద, ప్రధానస్రవంతి ఆంగ్ల మీడియా మింగలేక కక్కలేక అన్నట్టు ఈ దృశ్యాలను చూపడమే కాదు, పండితులు చదివే మంత్రాలను ఒకే ఒక్కక్షణం విధిలేక వినిపించింది. ప్రతి ప్రయోగానికీ ముందు షార్ సమీపంలోగల చెంగాళమ్మ ఆలయంలో పూజలు నిర్వహించడం శాస్త్రవేత్తలకు ఆనవాయితీగా వస్తున్న విషయం.
అంచనాలను మించుతున్న చంద్రయాన్-3
ఇదిలా ఉండగా, మనందరి కళ్ల ముందూ చంద్రుడి దక్షిణ ధ్రువంపై మృదువుగా దిగి ఇస్రో సంస్థను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన చంద్రయాన్ మిషన్-3 తన కోసం కష్టపడ్డ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను, గర్వపడుతున్న భారతీయు లను నిరాశపరచకుండా తనకు ఉద్దేశించిన లక్ష్యాల న్నింటినీ చకచకా నెరవేరుస్తోంది. అంతటి నిశ్శబ్దంలో తన తపస్సును కొనసాగిస్తోంది. వారం కిందట చంద్రుడిపై దిగిన చంద్రయాన్ ఇప్పుడు అక్కడ మధ్యాహ్న కాంలో ఉంది. వచ్చేవారమంతా రాత్రి అనుభవంలోకి వస్తుంది. వాస్తవానికి చంద్రుడికి ఉత్తరాన ఉన్న ధ్రువం, అంటే మనకు కనిపించే భాగం అంతా గోలగోలగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే, మనం ఇక్కడ నుంచి ఉపయోగించే రేడియో తరంగాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు వంటివన్నీ కూడా అక్కడ కాకిగోల చేస్తుం టాయి. అందుకు భిన్నంగా దక్షిణ ధ్రువం ఈ విశ్వ రహస్యాలు లేదా సంభాషణలు వినగలిగేందుకు వీలుగా అత్యంత నిశ్శబ్దంగా ఉంటుంది. అందుకే, దీనిని అంతరిక్షంలోకి మరింత లోతుగా దూసుకు పోయేందుకు సింహద్వారంగా అభివర్ణిస్తున్నారు.
కాగా, విజయవంతంగా అక్కడికి దిగి ప్రయోగాలు చేస్తున్న విక్రంను, ప్రగ్యాన్‌ను అక్కడి ఉష్ణోగ్రతలకు అలవాటు పడి, తిరిగి పని చేసేందుకు వీలుగా ఇప్పటి నుంచే నిద్రపుచ్చుతున్నామంటూ ఇస్రో ప్రకటించింది. తాము కొత్తగా చేసిన ప్రయోగ స్థానం నుంచి సమాచారం అందడంతో, పేలోడ్లను స్విచ్ ఆఫ్ చేశామని, ల్యాండర్ రిసీవర్‌లను ఆన్‌లో ఉంచామని ఒక ట్వీట్‌లో ఇస్రో వెల్లడించింది. విక్రంలో సౌర విద్యుత్ మొత్తం తరగిపోయిన తర్వాత అది ప్రగ్యాన్ పక్కన నిద్రకు ఉపక్రమిస్తుందని తెలిపింది. రెండు పరికరాలు సెప్టెంబర్ 22, 2023 నాటికి నిద్రలేపాలని ఆశిస్తున్నట్టు కూడా సంస్థ పేర్కొంది.
మరొకసారి విజయవంతంగా విక్రం ల్యాండింగ్
విక్రం ల్యాండర్ తన మిషన్ లక్ష్యాలను అధిగ మించి సాధించిందని సెప్టెంబర్ 4, 2023న ఇస్రో ప్రకటించింది. అది హాప్ (కప్పగంతు) ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని కూడా సంస్థ పేర్కొంది. ఇక్కడ నుంచి కమాండ్ ఇవ్వగానే అది ఇంజిన్లను ప్రారంభించి, తనకు తానుగా 40 సెంటి మీటర్ల ఎత్తు ఎగిరి, ఉన్న చోటు నుంచి 30-40 సెంటీమీటర్ల దూరంలో సురక్షితంగా దిగిందని ఇస్రో ట్వీట్ చేసింది. దీని ప్రాముఖ్యతను వివరిస్తూ, ఈ తొలి అడుగు భవిష్యత్తులో పంపిన శాంపుల్, మానవ మిషన్‌లు తిరిగి వచ్చే అవకాశాల గురించి ఉత్సాహాన్ని ఇస్తోందని వివరించింది. అన్ని వ్యవ స్థలూ సాధారణంగా పని చేస్తున్నాయని, ఆరోగ్యంగా ఉన్నాయని కూడా తెలిపింది. ర్యాంప్, ఛేస్ట్ (సిహెచ్‌ఎఎస్‌టిఇ), ఐఎల్‌ఎస్‌ఎను ముందుగా వెనక్కి మడిచి, ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత తిరిగి మోహరించినట్టు ఇస్రో తెలిపింది.
ఆగస్టు 23న చంద్రుడిపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ అనుకున్న సమయానికన్నా ముందుగానే తమ కార్యకలాపాలను మొదలు పెట్టాయి. విక్రమ చంద్రుడి దక్షిణ ధృవంపై జాగ్రత్తగా దిగడం, ప్రగ్యాన్ అందులో నుంచి బయిటకు వచ్చి తన బుడిబుడి నడకలు వేయడం జరిగిపోవడాన్ని కూడా మనం చూశాం. కాగా, ఆగస్టు 24వ తేదీన అక్కడి వాతావరణ పరిస్థితుల గురించి ఇస్రోకు సమాచారం వచ్చేసింది.
ఛేస్ట్ (ChaSTE Chandra’s Surface Thermophysical Experiment) అంటే చంద్రుడి ఉపరితలంపై తాపగతి భౌతిక ప్రయోగం అన్నది అక్కడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల ప్రవర్తనను అర్థం చేసుకునేందుకు, ధ్రువం చుట్టుపక్కల గల చంద్రుడి ఉపరితల మట్టి ఉష్ణోగ్రతల ప్రొఫైల్‌ను కొలిచేందుకు ఉద్దేశించింది. ఇది ఉపరి తలం కింద 10 సెంటీ మీటర్ల లోతుకు చేరుకోగలిగిన సామర్ధ్యం గల నియంత్రిత వ్యాప్తి కోసం ఉష్ణోగ్రత పరిశోధక యంత్రాంగాన్ని కలిగి ఉంది.
ఈ పరిశోధక యంత్రానికి 10 వ్యక్తిగత/ వివిధ ఉష్ణోగ్రత సెన్సార్లను బిగించారు. దీనిద్వారా ఆగస్టు 24వ తేదీన చంద్రుడి ఉపరితలంపై, ఆ ప్రాంతంలో వివిధ లోతుల్లో గల ఉష్ణోగ్రతలను తన వ్యాప్తి సమయంలో నమోదు చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇటువంటి ఉష్ణోగ్రతలను మొట్టమొదటి సారి నమోదు చేసి, ప్రోఫైల్ చేసింది మన సంస్థే కావడం విశేషం. ఆగస్టు 27వ తేదీన తిరిగి విక్రం ల్యాండర్ మరింత సమాచారాన్ని పంపడంతో ఇస్రోశాస్త్రవేత్తలు దాని విశ్లేషణలో నిమగ్న మవుతున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన పిఆర్‌ఎల్ సహకారంతో స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ (ఎస్‌పిఎల్), విఎస్‌ఎస్‌కి చెందిన బృందం ఈ పేలోడ్‌ను తయారు చేసింది.
చంద్రయాన్ 3 రోవర్ పై గల లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కొపీ (ఎల్‌ఐబిఎస్ – లేజర్ ప్రేరిత వర్ణపటమాపన విడదీత) దక్షిణ ధ్రువంపై మౌలిక మూలకాల కూర్పు కొలతలను సహజ స్థితిలో ఏమిటన్నది తెలుసుకొనేందుకు పంపింది. ఇలాంటి ప్రయోగం జరగడం కూడా మొట్టమొదటిసారే. ఆ సహజస్థితి కొలతలు ఆ ప్రాంతంలో సల్ఫర్ ఉనికిని కచ్ఛితంగా నిర్ధారిస్తున్నాయి. సాధారణంగా, ఇది ఆర్బిటర్లపై ఉండే పరికరాల ద్వారా సాధ్యమయ్యేది కాదు. లిబ్స్ అనేది తీవ్రమైన లేజర్ స్పందనలకు పదార్ధాలను బహిర్గతం చేయడం ద్వారా ఆ పదార్ధాల కూర్పును విశ్లేషించే శాస్త్రీయ సాంకేతికత. ఏదైనా రాయి లేదా మట్టి పై అత్యధిక శక్తితో కూడిన లేజర్ స్పందనను కేంద్రీకరించినప్పుడు, ఆ లేజర్ స్పందన అత్యంత వేడిమితో కూడిన, స్థానికీకరించిన జీవద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇలా సేకరించిన జీవద్రవ్య వెలుగును వర్ణపటంగా నిశ్చియించి, ఛార్జ్‌తో కూడిన పరికరాల వంటి డిటెక్టర్ల ద్వారా కనుగొంటారు. ప్రతి పదార్ధం జీవద్రవ్య స్థితిలో ఉన్న సమయంలో తమవైన వెలుగు తరంగ దైర్ఘ్యాన్ని ప్రసరిస్తున్న ప్పుడు ఆ పదార్ధంలోని మౌలిక కూర్పును నిర్ధారిస్తారు.
ప్రాథమిక విశ్లేషణలు చంద్రుడి ఉపరితలం పై అల్యూమినియం (ఎఎల్), సల్ఫర్ (ఎస్), కాల్షియం (సిఎ), ఇనుము (ఎఫ్‌ఇ), క్రోమియం (సిఆర్), టైటానియం (టిఐ)ల ఉనికిని లిబ్స్ ఆవిష్కరించినట్టు వెల్లడించాయి. అంతేకాకుండా, మాంగనీసు (ఎంఎన్), సిలికాన్ (ఎస్‌ఐ), ఆక్సిజన్ (ఒ) ఉనికి ఉన్నట్టు తెలుస్తోంది. హైడ్రోజన్ ఉనికి కోసం సమగ్ర విచారణ జరుగుతోంది.
లిబ్స్ పేలోడ్‌ను బెంగళూరులోని ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టంస్ (ఎల్‌ఇఒఎస్)/ ఇస్రో ప్రయోగశాలలో తయారు చేశారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై మట్టి, రాళ్లు దేనితో తయారయ్యాయి, ఇది ఇతర ఎత్తైన ప్రాంతాల నుంచి ఎలా భిన్నం అనే ప్రశ్నలకు సమాధానాలను తన శాస్త్రీయ పరికరాల సాయంతో చంద్రయాన్-3 కనుగొనే ప్రయత్నం చేస్తోంది. రోవర్‌పై అమర్చిన ఆల్ఫా పార్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ (ఎపిఎక్స్ఎస్) అన్నది స్వల్పవాతా వరణం కలిగిన చంద్రుడి వంటి గ్రహాల ఉపరిత లంపై మట్టి, రాళ్ల మౌలిక కూర్పును సహజస్థితిలో విశ్లేషించేందుకు ఉత్తమమైన పరికరం. ఉపరి తలంపై గల శాంపిల్‌పై ఆల్ఫాకణాలను విడుదల చేసే రేడియో యాక్టివ్ మూలాన్ని, ఎక్స్‌రే లను ఇది కలిగి ఉంటుంది.
కాగా సల్ఫర్ సహా అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, ఇనుముకి సంబంధించిన స్వల్ప మూలకాల వంటి ఆసక్తిగల పదార్ధాల ఉనికిని ఆవిష్క రించింది. లిబ్స్ పరికరం కూడా ఈ పదార్ధాల ఉనికిని నిర్ధారించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన విశ్లేషణలు కొనసాగుతున్నాయి.
ఎపిఎక్స్ఎస్‌ను అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్‌ఎసి) తోడ్పాటుతో ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ (పిఆర్‌ఎల్) అభివృద్ధి చేయగా, బెంగళూరులోని యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ (యుఆర్‌ఎస్‌సి) ఆ పరికరాన్ని నిర్మించింది.
చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్‌పై కలిగిన రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయనోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్ – లాంగ్‌మ్యూర్ ప్రోబ్ (ఆర్‌ఎఎంబిహెచ్‌ఎ-ఎల్‌పి) పేలోడ్ దక్షిణ ధ్రువ ప్రాంతంలోని ఉపరితలంపై చంద్రుడి జీవద్రవ్య వాతావరణాన్ని తొలిసారి సహజస్థితి కొలతలను తీసుకుంది.
జీవద్రవ్యంను వర్గీకరించేందుకు ఉపయోగించే లాంగ్‌మ్యూర్ శోధక పరికరం అన్నది నిశ్చలంగా ఉన్న చంద్రుడి జీవద్రవ్య వాతావరణంలో పని చేస్తూ ఉండేలా దీనిని తయారు చేశారు. ఇది ల్యాండర్ నుంచి విడివడి పని చేస్తుంది. ఈ పరికరం 1 మిల్లి సెకెండ్‌లో డ్వెల్ టైమ్‌తో, స్వల్పమైన పికో-ఆంపి యర్లల మినిట్ రిటర్న్ కరెంట్లను కూడా కనుగొన గలదు. ఈ పరికరం అయాన్, ఎలక్ట్రాన్ సాంద్రత లను, రిటర్న్ కరెంట్ కొలత ఆధారంగా వాటి శక్తిని కూడా నిర్ధారించగలదు.. ఇప్పటివరకూ, చంద్రుడిపై ఉదయపు సమయంలో చంద్రుడి ఉపరితం చుట్టూ ఉండే జీవద్రవ్యం స్వల్పమని తొలి అంచనాలు చెప్తున్నాయి. ఈ పరిశోధన నిరంతరాయంగా సాగు తుంది. చంద్రుడి ఉపరితల ప్రాంతానికి సమీపంలో సౌర అంతరిక్ష వాతావరణ పరిస్థితుల్లో ఉండే హెచ్చుతగ్గుల కారణంగా జరిగే చార్జింగ్ పక్రియను అవగతం చేసుకోవడానికి ఇది ఎంతో ముఖ్యం.
ఈ పరికరాన్ని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (విఎస్‌ఎస్‌సి), స్పేస్ ఫిజిక్స్ లేబొరేటరీ (ఎస్‌పిఎల్) అభివృద్ధి చేశాయి.
లూనార్ సీస్మిక్ యాక్టివిటీ (ఐఎల్‌ఎస్‌ఎ- చంద్రుడిపై కంపనల కార్యకలాపాల)కోసం ఉద్దే శించిన మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టం (ఎంఇ ఎంఎస్) చంద్రుడిపై రోవర్, ఇతర పేలోడ్ల కదలికల వల్ల సంభవిస్తున్న ప్రకంపనలను నమోదు చేసింది. సహజంగా సంభవించే కంపనలు, ప్రభావాలు, కృత్రిమ ఘటనల కారణంగా అక్కడి ఉపరితల ప్రకంపనలను కొలవడం ఐఎల్‌ఎస్‌ఎ ప్రాథమిక లక్ష్యం. ఆగస్టు 25వ తేదీన రోవర్ ప్రయాణపు ప్రకంపనలను నమోదు చేయడమే కాదు, సహజమని భావిస్తున్న ఒక ఘటనను 26వ తేదీన నమోదు చేసింది. ఈ ఘటనకు మూలాన్ని శోధిస్తున్నారు.
ఈ పరికరాన్ని ప్రైవేటు పరిశ్రమల సహకారంతో బెంగళూరులోని ఎల్‌ఇఒఎస్ రూపకల్పన చేసి, సాకారం చేసింది. దీనిని చంద్రునిపై ఉంచేందుకు ఉద్దేశించిన యంత్రాంగాన్ని బెంగళూరులోని యుఆర్‌ఎస్‌సి అభివృద్ధి చేసింది. మనకన్నా ముందునుంచి ధనిక, అభివృద్ధి చెందిన దేశాలు చంద్రుడు, సూర్యుడిపై ఇటువంటి ప్రయోగాలు చేస్తూ వస్తున్నాయి. అమెరికాకు చెందిన నాసా పార్కర్ సోలార్ ప్రోబ్‌ను సూర్యుడికి చాలా సమీపానికి పంపింది. అంటే, అది ఎల్-1, 2,3 పాయింట్లను కూడా దాటి సూర్యుడి కాంతివలయం సమీపానికి వెళ్లింది. కానీ, మన దేశ ప్రయోగాలకు వారికీ ఉన్న తేడా కేవలం బడ్జెట్‌లోనే కాదు, మానవాళి సంక్షేమం కోసం చేసే యత్నాలలో కనిపిస్తుంది. భారతీయులు మన శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలకు గర్విస్తున్నా, ఇవన్నీ సమస్త మానవాళి సంక్షేమం కోసమే.
హిందూధర్మంలో సూర్య ఆరాధన
సనాతన హిందూ ధర్మం జీవనాన్ని పరిరక్షించడంలో సూర్యుడు ఎంత కీలక పాత్ర పోషిస్తాడో తెలుసుకుని, ఈ మొత్తం విశ్వగమనానికి ప్రధాన సూత్రధారి ఆయన అని కీర్తించింది. వేదాల ప్రకాశాన్ని, శక్తిని తనలో కలిగిన దేవుడిగా హిందువులు సూర్యుడిని ఆరాధిస్తారు. సూర్యుడు ఏడు బంగారు గుర్రాలు కలిగిన రథంలో పద్మంపై కూర్చుని ఉంటాడని రిగ్వేదం పేర్కొంటుంది. ప్రత్యూషానికి అధిపతి అయిన అరుణుడు ఆయనకు రథసారథిగా ఉన్నాడని అభివర్ణిస్తుంది. గరుత్మంతుడి సోదరుడైన అరుణుడు అత్యంత బలమైన, విశాలమైన దేహాన్ని కలిగి ఉంటాడని, ప్రపంచాన్ని సూర్యుడి తాపం నుంచి కాపాడేందుకు ఆయన సూర్యుడి ముందు ఉంటాడని కూడా చెప్తుంటారు. సూర్యుడిని ఉదయం రిగ్వేదంతో, మధ్యాహ్నం యజుర్వేదంతో, సాయంత్రం సామవేదంతో ఆరాధిస్తారు. మనుషులు చేసే మంచి, చెడు పనులను గమనిస్తూ సూర్యుడు తన బంగారు రథంలో ఆకాశంలో కాలచక్రంతో ప్రయాణిస్తుంటాడని, ఆయన రథానికి గల ఏడుగుర్రాలు వారంలోని ఏడు రోజులనే వర్ణన కూడా ఉంది. నారద మహర్షి కూడా తన కోరికలను నెరవేర్చుకోవడం కోసం సూర్య భగవానుడి ఆరాధన చేశారని చెప్తారు.
ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం
భారత తొలి సౌర మిషన్ అయిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం భారతదేశ స్వదేశీ అంతరిక్ష కార్యక్రమాన్ని నూతన పథంలోకి తీసుకువెళ్లే మైలురాయి విజయం. ఇది అంతరిక్షాన్ని, ఖగోళ దృగ్విషయాన్ని అర్థం చేసుకునేందుకు మనకు ఎంతో తోడ్పడుతుంది. ఈ అసాధారణ ఫీట్‌ను చేపట్టి ఇస్రో శాస్త్రవేత్తలను, ఇంజినీర్లకు నా అభినందనలు. ఈ మిషన్ విజయవంతం కావడానికి నా శుభాకాంక్షలు
– భారతరాష్ట్రపతి ద్రౌపది ముర్ము
చంద్రయాన్-3 విజయం తర్వాత భారత్ తన అంతరిక్ష యాత్రను కొనసాగిస్తోంది. భారతదేశపు తొలి సోలార్ మిషన్, ఆదిత్య ఎల్-1ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రోలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు శుభాకాంక్షలు. సమస్త మానవాళి సంక్షేమం కోసం ఈ విశ్వం గురించి సరైన అవగాహనను అభివృద్ధి చేసుకోవడం కోసం మా శాస్త్రీయ కృషి ఆవిశ్రాంతంగా సాగుతుంది,
– ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
మిషన్ ఆదిత్య ప్రయోగం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు
– కేంద్ర హోం మంత్రి అమిత్ షా
చంద్రుడితో పాటు ఇప్పుడు సూర్యుడు కూడా స్వావలంబన కలిగిన భారతదేశపు శక్తిని వీక్షిస్తాడు. ఇస్రో సహా మొత్తం టీమ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు
– యోగి ఆదిత్యనాథ్, యుపి ముఖ్యమంత్రి