– సుజాత గోపగోని, 6302164068

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీగా రెండుసార్లు విజయబావుటా ఎగరేసిన తెలంగాణ రాష్ట్ర సమితి.. తన పేరు మార్చుకున్న తర్వాత భారత రాష్ట్ర సమితి పేరుతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగబోతోంది. ఈ క్రమంలోనే తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించేసింది. గత ఎన్నికల సమయంలోనూ ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కేసీఆర్‌.. ‌ప్రతిపక్షాలకు కనీసం గుక్కతిప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అసెంబ్లీని రద్దు చేసేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రభుత్వ పీఠాన్ని అధిష్టించారు. ఇప్పుడు అదే ఊపుతో హ్యాట్రిక్‌ ‌మీద కన్నేశారు.

వాస్తవానికి గత కొన్నాళ్లుగా నెలకొన్న పరిస్థితులు, పలుమార్లు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై కేసీఆర్‌ ‌బాహాటంగానే క్లాస్‌ ‌పీకడం వంటి పరిణామాలు చూసి ఈసారి దాదాపు సగం మంది ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ ‌మొండిచేయి చూపిస్తారని రాజకీయ విశ్లేషకులు కూడా భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. మరోసారి సిట్టింగ్‌లకే పెద్దపీట వేశారు కేసీఆర్‌. ‌దీంతో, కొన్నాళ్లుగా పార్టీ టికెట్‌ ‌కోసం బెంగపెట్టు కున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ ఊహించలేని ఊరటను కల్పించారు. కానీ, ఈ పరిణామం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. కేసీఆర్‌ ‌వెన్నులో భయం మొదలైందన్న వాదనలకూ బలం చేకూరుస్తోంది.

కేసీఆర్‌ ‌ప్రకటించిన అభ్యర్థుల విషయంపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. కారణం, ఈ లిస్టులో సగానికి పైగా అగ్రకులాలు వారే ఉండటం. ‘నా బీసీలు, దళితులు’ అని చెప్పుకునే కేసీఆర్‌.. ‌వారిని సీట్ల విషయంలో మాత్రం పక్కన పెట్టారు. దీనిపై ప్రతిపక్షాలకు విమర్శల అస్త్రం దొరికినట్లైంది. సామాజిక వర్గాల నుంచి మొదలు కొని.. అభ్యర్థుల అవినీతి, అక్రమాల ఆరోపణలను కూడా లెక్కలోకి తీసుకోనితనం కేసీఆర్‌ ‌లోపల దాగి ఉన్న భయానికి నిదర్శనమన్న విశ్లేషణలు వినిపిస్తు న్నాయి. అందుకే, అగ్రకులాలకు, డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసేవాళ్లకే ఈసారి కూడా టికెట్లు కేటాయించా రన్న వాదనలు బలంగా వస్తున్నాయి.

మెరుపులేం లేవు, అన్నీ మరకలే

భారత రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో మెరుపులేం లేవు. కానీ మరకలు పడిన నేతలందరికీ జాబితాలో చోటు దొరికింది. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఐ ప్యాక్‌ ‌టీం సర్వేలు చేసినప్పుడు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పుకున్నారు. యాభై మందిని మారుస్తారని లీకులు వచ్చాయి. చివరికి ఏడుగురి విషయంలోనే నిర్ణయం తీసుకున్నారు. నిజానికి వీరు తిరగబడేవారు కాదు.. కనీసం బలమైన వాళ్లు కాదు. వారిని మార్చినా మార్చకపోయినా పోయేదేం లేదు. మరి తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల విషయంలో కేసీఆర్‌ ఎం‌దుకు కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోయారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో పలువురు రెండుసార్లు గెలిచిన వారుండగా, మరికొందరు మూడుసార్లు గెలుపొందిన వారు కూడా ఉన్నారు. దీంతో వారిపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడటంతో పాటు రాజకీయంగానూ సొంత పార్టీలోనే అసంతృప్తులు, అసమ్మతులు పెరిగిపోయాయి. 2018లోనే చాలా నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలకు ప్రజా వ్యతిరేకత ఎదురయింది. చివరికి దళితబంధు నిధుల్లోనూ ఎమ్మెల్యేలు వాటాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకరు.. ఇద్దరు కాదు.. దాదాపు అందరు ఎమ్మెల్యేలు ఇలాంటి దందాలు లెక్కలేనన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయినా.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ పెద్దసంఖ్యలో సిట్టింగ్‌ల వైపే కేసీఆర్‌ ‌మొగ్గు చూపారు. అందరినీ మార్చలేక.. కొందర్ని మార్చితే ఎదురయ్యే సమస్యలను తట్టుకోలేక కేసీఆర్‌.. ‌మార్చామని చెప్పుకోవడానికన్నట్లుగా ఏడుగుర్ని మార్చినట్లుగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా చూస్తే కేసీఆర్‌ ‌లిస్టులో ఆత్మరక్షణ ధోరణి ప్రస్ఫుటమవుతోంది కానీ.. ఏ మాత్రం కాన్ఫిడెన్స్ ‌కనిపించడం లేదన్నది ఎక్కువ మంది అంటున్న మాట. ఇక అభ్యర్థులని ప్రకటించి దూకుడుగా ఉన్న కేసిఆర్‌.. ఈసారి 95-105 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అంత తేలికగా కనిపించడం లేదు.

అగ్రకులాలకే అధిక ప్రాధాన్యం

115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌ ‌వారిలో 58 మంది అగ్రకులాలకు చెందిన వారికే అవకాశం కల్పించారు. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 40 మంది ఉండగా, కేసీఆర్‌ ‌పోటీ చేయనున్న రెండు నియోజక వర్గాలు (కామారెడ్డి, గజ్వేల్‌) ‌కలిపి.. ఆయన సామాజిక వర్గమైన వెలమలు 12 మంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఆరుగురు, బ్రాహ్మణులు, వైశ్యులు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

బీసీల నినాదానికి పాతర

ఇక రాష్ట్రలో అత్యధిక జనాభా ఉన్న బీసీల నుంచి 23 మందికి మాత్రమే సీట్లు కేటాయించడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కలిపి 28 సీట్లు కేటాయించారు. మొత్తంగా చూసుకుంటే బీసీలు, దళితులకు కలిపి 51 సీట్లు మాత్రమే ఇచ్చారు. అంటే అగ్రకులాల కంటే తక్కువ అన్న మాట. ఇప్పుడు ఈ అంశాలనే విపక్షాలు అస్త్రంగా మలుచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే, టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరగడంపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. తెలంగాణలో 60 శాతం ఉన్న బీసీలకు 20 శాతం టికెట్లు మాత్రమే ఇచ్చారని మండిపడుతున్నారు. 5 శాతం ఉన్న రెడ్లకు 33 శాతం, అరశాతం ఉన్న వెలమలకు 16 శాతం టికెట్లు ఎలా కేటాయిస్తారని నిలదీస్తున్నారు.

అక్కడలా.. ఇక్కడిలా…

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కేసీఆర్‌ ‌కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో నిరసనలు చేపట్టి, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలూ కదిలేలా చేసినా.. బీఆర్‌ఎస్‌ ‌తాజా జాబితాలో మాత్రం కేవలం ఏడుగురు మహిళలకే స్థానం కల్పించి 6 శాతానికే పరిమితం చేశారు. ఇక మునుగోడు ఉపఎన్నిక సమయంలో వామపక్షాల సహకారం పొందిన కేసీఆర్‌.. ‌సాధారణ ఎన్నికల్లో వారితో పొత్తు ఉంటుందని నాడు ప్రకటించినా తాజాగా కమ్యూనిస్టులకు మొండిచేయి చూపారు.

రెండు చోట్ల కేసీఆర్‌ ‌పోటీ బలహీనతకు సంకేతమా?

ఈసారి కేసీఆర్‌ ‌కామారెడ్డి, గజ్వేల్‌ ‌నియోజక వర్గాల నుంచి బరిలోకి దిగనున్నారు. అయితే ఈ నిర్ణయంతో కేసీఆర్‌లో భయం మొదలైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గజ్వేల్‌లో పోటీ చేస్తానని బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ‌చెబుతున్నారు. ఈ మేరకు ఆయన తరచూ ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు కూడా. బీజేపీ ఏమైనా చేయగలదు అనేందుకు మమతా బెనర్జీ ఉదంతాన్ని కేసీఆర్‌ ‌దృష్టిలో పెట్టుకుని ఉండవచ్చు. పశ్చిమ బెంగాల్లో మమత పార్టీ గెలిచింది కానీ మమతా బెనర్జీ ఓడిపోయారు. కేసీఆర్‌ ‌తనకు అలాంటి పరిస్థితి రాకుండా రెండు చోట్ల పోటీ చేయాలనుకుంటున్నట్లు వినిపి స్తోంది. కామారెడ్డి ప్రాంతం తన పూర్వికులది కావడంతోనే అక్కడి నుంచి బరిలోకి దిగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు బీఆర్‌ఎస్‌ ‌వర్గాలు చెబుతు న్నాయి. అంతేకాకుండా.. కేసీఆర్‌ ‌కుమారుడు కేటీఆర్‌ ‌పోటీ చేసే సిరిసిల్ల నియోజక వర్గానికి కామా రెడ్డి సరిహద్దుగా ఉంది. మరోవైపు కుమార్తె కవిత ఎంపీగా పోటీ చేసే నిజామాబాద్‌ ‌లోక్‌సభ స్థానం పైనా కొంత ప్రభావం చూపే అవకాశం ఉందన్న అంచనాతో కేసీఆర్‌ ఉన్నారని చెబుతున్నారు.

బీఆర్‌ఎస్‌ ‌నేతల్లో ఆగ్రహ జ్వాలలు

అభ్యర్థుల జాబితా కొన్ని చోట్ల ఆశావహుల్లో ఆగ్రహజ్వాలను రగిల్చింది. టికెట్ల విషయంలో అసంతృప్తులు, అలకలు రాకుండా వారం రోజుల నుంచి కేసీఆర్‌, ‌కేటీఆర్‌, ‌హరీష్‌రావు కసరత్తు చేసినా.. జాబితా ప్రకటించాక అసంతృప్తులు బాహాటంగానే బయటికొచ్చారు. ఇప్పటికే ఖానాపూర్‌ ‌సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అధిష్టానంపై తిరుగు బావుటా ఎగురవేశారు. ఈ క్రమంలోనే రేఖానాయక్‌ ‌భర్త శ్యామ్‌ ‌నాయక్‌ ‌కేసీఆర్‌ ‌టికెట్లు ప్రకటించిన రోజు రాత్రే రేవంత్‌ ‌రెడ్డి, ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్‌ ‌కండువా కప్పుకున్నారు. రేఖానాయక్‌ ‌ఖానాపూర్‌ ‌నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఆమెకు ఓకే చెప్పింది. బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ ‌బాపూరావు, నకిరేకల్‌ ‌మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృ ప్తిగా ఉన్నారు. కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు సోషల్‌ ‌మీడియాలో తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పెద్దపల్లి నుంచి టికెట్‌ ఆశించిన నల్ల మనోహర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి మరోసారి టికెట్‌ ఇవ్వకపోవడం పట్ల పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు టికెట్‌ ఇవ్వడం పట్ల పార్టీ అధిష్టానం పునరాలోచించాలని, లేదంటే ఆయన కోసం పని చేయబోమని.. అంబర్‌పేట నియోజకవర్గ ఇన్‌చార్జి, పార్టీ నేతలు ఆల్టిమేటం జారీచేశారు. మహేశ్వరం నుంచి టికెట్‌ ఆశించిన తీగల కృష్ణారెడ్డి, పరిగి నుంచి టికెట్‌ ఆశించిన డీసీసీబీ ఛైర్మన్‌ ‌మనోహర్‌రెడ్డి కూడా అసంతృప్తి బాటలో ఉన్నారు.

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు మంత్రి హరీష్‌రావుపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. కేసీఆర్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించానికి సరిగ్గా రెండున్నర గంటల ముందు.. ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తనకు తిరిగి మల్కాజ్‌గిరి నుంచి సీటు, అదనంగా తన కుమారుడికి మెదక్‌ ‌నుంచి కూడా సీటిస్తే సరి.. లేకుంటే మాత్రం తడాఖా చూపిస్తా అన్న రీతిలో వ్యాఖ్యానాలు చేశారు. కాగా, మల్కాజ్‌ ‌గిరి అభ్యర్థిగా మైనంపల్లికే మళ్లీ అవకాశం కల్పించారు. మెదక్‌ ‌నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డికే తిరిగి అవకాశం ఇచ్చారు. కాగా, పెద్ద సంఖ్యలో అభ్యర్థులతో తొలి జాబితాను స్వయంగా ప్రకటించిన కేసీఆర్‌.. అవసరమైతే ఒకరిద్దరిని మారుస్తామని కూడా చెప్పడం గమనార్హం.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE