రాష్ట్రంలో ఇసుకను విచ్చలవిడిగా తరలించుకుపోతున్నారు. ఇసుకను సరఫరా చేసేందుకు జేపీ వెంచర్స్ ‌సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న రెండేళ్ల ఒప్పందం ఈ ఏడాది మే 13తో ముగిసింది. జేపీ సంస్థ జీఎస్టీ నంబర్‌ను కూడా సస్పెండ్‌ అయినట్లు  తాజాగా వెలుగులోకి వచ్చింది. అంటే జీఎస్టీ కూడా కట్టడం లేదు. ఆ సంస్థ ఒప్పందం గడువు పెంచు కోలేదు. అయినా నదుల్లో, వాగుల్లో ఇసుకను తవ్వేసి జేపీ సంస్థ పేరుతో ఉన్న వే బిల్లులతో తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు ఇసుక తవ్వుకుని అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

దాదాపు మూడు నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా గనుల శాఖ నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. నెలకు రూ. వెయ్యి కోట్లు చేతులు మారుతున్న ఈ వ్యవహారంలో అధికారులు, పాలక పక్షం పెద్దలు భాగస్వాములుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చాక కొత్త ఇసుక పాలసీ పేరిట ఇసుకను అమ్మకం సరుకుగా మార్చేసింది. ఆ తర్వాత పలుమార్లు కొత్త పాలసీలను ప్రకటించినా సమస్యలు తీరలేదు. ధరలు అందుబాటులోకి రాలేదు. ఇసుక బ్లాక్‌ ‌మార్కెట్‌లో విచ్చలవిడిగా లభిస్తూనే ఉంది. దీనిని సాకుగా చూపి మే13, 2021న జేపీ వెంచర్స్ ‌సంస్థతో రాష్ట్ర గనుల శాఖ ఇసుక అమ్మకాలపై ఒప్పందం చేసుకుంది. రెండేళ్లపాటు ఇసుక అమ్మకం కాంట్రాక్టు దక్కించు కున్న జేపీ వెంచర్స్ ‌టర్న్‌కీ అనే సంస్థకు ఉప కాంట్రాక్టు ఇచ్చింది. నిబంధనల ప్రకారం ఏపీలోనే ఇసుక సరఫరా చేయాల్సి ఉండగా ఇతర రాష్ట్రాలకు నిరాటంకగా సరఫరా అయింది. అధికార పక్ష నేతల ఒత్తిళ్లు, బెదిరింపులు భరించలేక టర్న్‌కీ కూడా గత సెప్టెంబరులోనే వ్యాపారానికి దండం పెట్టి తప్పుకొందంటున్నారు. అయితే జేపీ వెంచర్స్-‌టర్న్‌కీ పేరిటే ఈ ఏడాది మే 12 వరకు ఇసుక వ్యాపారం సాగింది. టెండర్‌ ఒప్పంద కాలపరిమితి మే 13 నాటికి ముగిసిపోయింది. ఒప్పందం మేరకు ఇసుక అమ్మకాల నుంచి జేపీ గ్రూప్‌ ‌తప్పుకోవాలి. జేపీ వెంచర్స్ ‌జీఎస్టీ నంబర్‌ ‌జూన్‌ 6‌న సస్పెండ్‌ అవడంతో ఆ సంస్థ ప్రభుత్వానికి జీఎస్టీ కట్టదు. ప్రభుత్వం జీఎస్టీ వసూలు చేయదు. కాని ఇసుక ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన డబ్బంతా ఎక్కడికో చేరిపోతోందనేది ప్రశ్నార్ధకం.

నెలకు వెయ్యి కోట్లు

ఇసుక అక్రమసరఫరా వెనుక వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు అధికార యంత్రాంగం సహకరిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పటిది కాదు. జేపీ వెంచర్స్ ‌కాంట్రాక్టు ఉన్నప్పుడు కూడా తీర ప్రాంతాల్లో ఇసుకను యధేచ్ఛగా తరలించుకు పోయారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇసుక అక్రమ సరఫరాను నిలదీసిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులపై దాడులు, నిర్బంధాలు, అక్రమ కేసులతో తీవ్రంగా హింసించిన సందర్భాలు అనేకం. ఇసుకాసురుల చేతిలో దాడులకు గురికాని ప్రతిపక్షాల కార్యకర్తలు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ అక్రమ వ్యవహారానికి ప్రభుత్వం సహకారం పూర్తిగా ఉందని విమర్శలు ఉన్నాయి.

 ఇక ఇసుక అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణ ముప్పు ఏర్పడటంతో కొత్తగా అనుమతులు ఇచ్చేదాకా తవ్వకాలు చేపట్టవద్దని ఎన్‌జీటీ ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా విచ్చలవిడి ఇసుక తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఇసుకాసురులు ఇవేమీ లెక్కచేయడం లేదు. ఇసుకను మరింత యధేచ్ఛగా భారీ క్రేన్లతో తవ్వి వందల కొద్దీ లారీల్లో తరలిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రతి నెల కనీసం రూ. వేయి కోట్లు వెనకేసుకుంటున్నారనేది విపక్షాల ఆరోపణ. ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మునంతటిని తమ జేబుల్లోకి నెట్టేసుకుంటున్నారు. ఇసుకను కళ్ల ముందే తరలించుకుపోతున్నా గనుల శాఖలో ఏ మాత్రం స్పందన లేదు. ఏమీ తెలియనట్లుగా, కనిపించనట్లుగా ఉంటోంది. ‘స్పందన’, ‘జగనన్నకు చెబుదాం’ వంటి కార్యక్రమాల్లో అక్రమ ఇసుక తవ్వకాలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నా పట్టించు కోవడంలేదు. ఈ దందా వెనుక ప్రభుత్వ పెద్దలు ఉండటమే అందుకు కారణం అంటున్నారు. పైగా… ఇసుకను తవ్వుకుంటున్న నేతలను ఇబ్బంది పెట్ట వద్దని ‘పై నుంచి’ ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

మూసుకున్న కళ్లు

ఈ అక్రమ ఇసుక తవ్వకాలు, సరఫరా మొత్తం ప్రభుత్వ పెద్దల కనుసన్నుల లోనే జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాత ఒప్పందం ముగిశాక ప్రభుత్వం కొత్త ఏజెన్సీని ఎంపిక చేయాలి. లేదా కొత్త పాలసీని ప్రకటించాలి. కానీ, ఇవేవీ చేయలేదు. జిల్లాల వారీగా ఇసుక తవ్వి అమ్ముకునేందుకు అక్రమ ఒప్పందాలు జరిగిపోయాయంటున్నారు. ఇసుక రీచ్‌లు ఎక్కువగా ఉన్న కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి తదితర నదులున్న చోట నెలకు రూ. 20 కోట్ల చొప్పున చెల్లించేలా ఇసుక కాంట్రాక్టు ఇచ్చేశారని, ఒక నెల అడ్వాన్స్ ‌చెల్లించాలన్నది కీలకమైన షరతుగా విధించారని కూడా ప్రచారం జరుగుతోంది. ఎంత తవ్వుకున్నా, ఎక్కడ అమ్ముకున్నా ప్రశ్నించే ప్రసక్తి లేదని తమకు మాత్రం ప్రతినెలా రూ.20 కోట్లు ఇస్తే చాలు అని ఒప్పదం జరిగి పోయిందట. జిల్లాల వారీగా వైసీపీ నేతలు పోటీలు పడి మరీ ఇసుకపై ప్రభుత్వ పెద్దలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారంటున్నారు. ఒప్పందం చేసుకున్న స్థానిక నేతలు చెలరేగిపోయారు. యంత్రాలతో ఇసుక తవ్వొద్దన్న నిబంధనకు పాతరేశారు. చివరికి… నదీ గర్భంలో డ్రెడ్జింగ్‌ ‌ద్వారా కూడా ఇసుకను తోడేస్తున్నా రనేది ఆరోపణ. గత వంద రోజులుగా రీచ్‌ల్లో తవ్వకాలు, అమ్మకాలు నిరంతరాయంగా జరుగు తున్నాయి. జేపీ సంస్థ పేరిటే రహదారి (వే) బిల్లులు ఇస్తున్నారు. దానిపై టర్న్‌కీ సంస్థ లోగో, బార్‌కోడ్‌ ఉం‌డటం, దీనిపై విపక్షాల విమర్శలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోవడంతో ప్రభుత్వ తీరుపై ఆనుమానాలు తీవ్రం అయ్యాయి.

 10 కోట్ల లన్నుల తవ్వకాలు?

జేపీ వెంచర్స్ ‌పేరుతో రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు పెద్ద అవినీతి వ్యవహారంగా మారాయి. ఆ సంస్థ ప్రభుత్వంతో కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం రాష్ట్రంలోని ఇసుక రేవుల్లో ఏడాదికి రెండు కోట్ల టన్నులు తవ్వి తీయాలి. కానీ 10 కోట్ల టన్నుల ఇసుక అక్రమంగా తవ్వి తీసి విక్రయించి జేబులు నింపుకొంటున్నారు అని విపక్షాల ఆరోపణ. అధికారం ఉంటే రాష్ట్రం మొత్తం తమకే రాసిచ్చేసినట్లు వైసీపీ భావిస్తోందంటు న్నారు. జేపీ వెంచర్స్ ‌పేరుతో రాష్ట్రంలోని ఇసుక రేవులన్నింటిని అధికారపక్షం తన గుప్పిట్లో పెట్టుకుంది. ఎంత తవ్వు తున్నారో…ఎంత అమ్ము తున్నారో అంతా మాయగా కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో ఆన్‌లైన్లో ఇసుక బుకింగ్‌, ‌చెల్లింపులు లేవు. రవాణా వాహనాలకు సరైన అనుమతులు, బిల్లులు లేవు. ఒప్పందం కాల పరిమితి ముగిసినా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేస్తున్నారు. చిత్తు కాగితాల వంటి బిల్లులు చేతిలో పెట్టి పంపిస్తున్నారు. టన్ను ఇసుక ధర రూ.470 అని పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. ఆ ధరకు ఇసుక ఎక్కడైనా దొరుకుతోందా? బిల్లులు లేకుండా తమ రాష్ట్రంలోకి వస్తున్న ఇసుక లారీలను తెలంగాణ ప్రభుత్వ అధికారులు సీజ్‌ ‌చేస్తే ఏపీ ప్రభుత్వం కిక్కురుమనలేదు. ఇసుక దోపిడీ సొమ్మంతా తాడేపల్లికే చేరుతోందని ప్రజలు అనుకొంటున్నారు. దీనికి సీఎం సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్‌ ‌చేస్తున్నా ప్రభుత్వం నోరు మెదపడం లేదు.

జోరుగా తవ్వకం – అక్రమ రవాణా

రాజమహేంద్రవరం పరిధిలోని గోదావరి ర్యాంపుల్లో ఇష్టానుసారం ఇసుక తవ్వేస్తున్నట్టు సమాచారం. గోదావరిలో నీరు ఉండటంతో డ్రెడ్జింగ్‌ ‌ద్వారా ఇసుక తీస్తున్నారని అభియోగం. లారీల సైజులో ఉండే డ్రెడ్జింగ్‌ ‌పడవలను తెచ్చి రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకూ ఇసుక తవ్వి గోదావరి ర్యాంపుల్లో గుట్టలుగా పెడుతున్నారు. వాటిని పగటి పూట అమ్మేస్తున్నారు. స్టాక్‌ ‌పాయింట్ల పేరిట ఇసుక నిల్వలు పెట్టి టన్ను రూ.700 నుంచి రూ.800 వరకూ విక్రయిస్తు న్నారట. కృష్ణా, మున్నేరు నదుల్లో వైసీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుపు తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో లారీలను తెలంగాణ ప్రాంతాలకు పంపుతున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం పాతఇడ్లంక వద్ద కృష్ణానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక, బుసకను తరలిస్తూ కోట్లు దండు కుంటున్నారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఇసుక తవ్వకాలు జరుగు తున్నాయి. రేపల్లె పెనుమూడి, ఓలేరులో ఇసుకను కృష్ణానది నుంచి ఇసుకను డ్రెజ్జర్లతో తోడి మర పడవల్లో తెచ్చి వందలకొద్దీ ట్రాక్టర్లతో తరలిస్తున్నారని ఆరోపణ. గుంటూరు పెదకూరపాడులో కృష్ణానది నుంచి, వినుకొండ మండలం ఇమ్మడివరంలో గుండ్లకమ్మ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు.

నెల్లూరు జిల్లా పెన్నానదిలోని 12 రీచ్‌ల నుంచి, భగత్‌సింగ్‌ ‌కాలనీ, సంగం వద్ద, ఎఎస్‌పేట గుంపర్ల పాడు మండలంలో, పెన్న, స్వర్ణ•ముఖి, కాళంగి, పంబలేరు, బీరాపేరు, మామిడికాలువల నుంచి ఇసుకను తోడేస్తున్నారంటున్నారు. తుంగభద్ర నది ఇసుక తవ్వకాలకు సి.బెళగల్‌ ‌మండలం కొత్తకోట, కె.సింగవరం, పల్లెదొడ్డి, ముడుమాల, ఈర్లదిన్నె వద్ద నాలుగు డిసిల్టేషన్‌ ‌రీచులు (నది నీటిలో బోటు ద్వారా ఇసుక తవ్వకాలు), కౌతాళం మండలం గుడికంబాలి-1,2,3, మరళి-1,2 కలిపి ఐదు ఓపెన్‌ ఇసుక రీచులు, నందవరం మండలం నాగులదిన్నె వద్ద ఓపెన్‌ ‌రీచుల్లో ఇసుకను తోడేస్తున్నారని ఆరోపణ. ఆలూరు, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో హంద్రీ, వేదవతి నదుల్లో నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిత్రావతి, వేదవతి నదుల నుంచి ఇసుకను తవ్వేసి అమ్ముకుంటున్నారంటున్నారు.

డి. హీరేహాళ్‌ ‌మండలం తిమ్మలాపురం సమీపంలో వేదవతి నది నుంచి, పుట్టపర్తి సమీపంలో చిత్రావతి నది నుంచి ఇసుకను ట్రాక్టర్లలో నింపుకొని సొమ్ము చేసుకుంటు న్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. డెంకాడ మండలం కేంద్రం సమీపంలో చంపావతి నదిలో 10 నుంచి 12 అడుగుల లోతు వరకు ఇసుకను తోడేస్తున్నారని ఆరోపణ. పగలంతా నది నుంచి ఇసుకను ఒడ్డుకు చేర్చి చీకటి పడ్డాక ట్రాక్టర్ల ద్వారా విజయనగరం కార్పొరేషన్‌, ‌డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం, తగరపువలస, విశాఖపట్నం ప్రాంతా లకు తరలిస్తున్నారట. రేగిడి మండల కేంద్రం, బొడ్డవలస ప్రాంతాల్లో నాగావళి నది నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. గోస్తని నది నుంచి గంట్యాడ మండలం, ఎస్‌.‌కోట, జామి మండలాల్లో భారీగా ఇసుకను తరలిస్తున్నారు. కడప జిల్లా చెన్నూరులో పెన్నా నుంచి ఇనుకను అక్రమంగా తోడేస్తున్నారు.

కమలాపురంలో వీఎన్‌పల్లె మండలం సంగమేశ్వర ఆలయ సమీపంలో జోరుగా తవ్వకాలు జరుపుతున్నారు. సంగమేశ్వరస్వామి గుడి దగ్గర నదిలో, పెండ్లిమర్రి మండలం కొత్త గంగిరెడ్డిపల్లెతో పాటు పెన్నా, పాపాఘ్ని నదుల్లో ఎక్కడపడితే అక్కడ తవ్వేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పీటీఎం మండలంలో పాపాఘ్ని, బాహుదా, పింఛా, చెయ్యేరు, మాండవ్య నదులలోనూ ఇసుకను తవ్వేస్తున్నారు. ఇవేకాకుండా.. స్థానికంగా ఉండే వాగులు, వంకలు, కుంటల్లో సైతం ఇసుకను అక్రమంగా తీసు కెళ్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ, ఛైర్మన్‌,‌సెంట్రల్‌ ‌లేబర్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు,

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram