– సుజాత గోపగోని, 6302164068

సమాచార హక్కు చట్టం-2005లో అమలులోకి వచ్చిన ఓ అస్త్రం. సామాన్యుల• కూడా ప్రతి సమాచారాన్ని  తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బ్రహ్మాస్త్రం. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారీతనం పెంచిన పరిణామం. పాలనను కూడా గాడిలో పెట్టేందుకు పనికొస్తున్న ఆయుధం. కానీ, తెలంగాణ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టానికి పాతరేస్తున్నారు.

ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో పక్కాగా అమలైన సమచార హక్కు చట్టం-2005, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుంచీ క్రమంగా నిర్వీర్యమై పోతోంది. వాస్తవానికి పాలనలో పారదర్శకత పెంచడం, ప్రభుత్వంలో అవినీతిని తగ్గించడమే లక్ష్యంగా సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. కానీ, తెలంగాణ సర్కారు పనితీరు మాదిరిగానే ఈ చట్టం ప్రాధాన్యం కూడా కనుమరుగై పోతోంది. గ్రామ పంచాయతీ మొదలుకొని రాష్ట్ర సచివాలయం దాకా ఈ హక్కు చట్టం అసలు అమలు కావడం లేదు. చిన్నపాటి సమాచారం కూడా ప్రజలకు అందడం లేదు. మొత్తానికి రాష్ట్రంలోని 8వేల 924 ప్రభుత్వ కార్యాలయాల్లో అసలు సమాచార హక్కు చట్టం అమలు కావడమే లేదు. సాక్షాత్తూ సమాచార కమిషన్‌ ఈ ‌విషయాన్ని వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా నియమించాల్సిన సమాచార కమిటీల అడ్రస్‌లు లేవు. జిల్లా స్థాయిలో ఇప్పటిదాకా కమిటీలనే ఏర్పాటు చేయలేదు. ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డును ప్రైవేటుకు లీజుకు ఇస్తూ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పంద వివరాలు ఇవ్వాలంటూ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి హెచ్‌ఎం‌డీఏకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా అధికారులు సమాధానం ఇవ్వలేదు. ఒక ఎంపీ కోరితేనే సమాచారం ఇవ్వలేదంటే.. సాధారణ పౌరుల పరిస్థితేంటో, రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం పౌరులు కోరిన ఏ సమాచారం అయినా వెంటనే అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉంది.

సమాచార హక్కు చట్టం అమలు చేయడం కోసం ప్రతి కార్యాలయంలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ నిర్ణయాలు, నియామకాలు జరిగాయి. గ్రామ పంచాయతీ, తహసీల్దార్‌, ఎం‌పీడీవో కార్యాలయం, కలెక్టరేట్‌, ‌రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ.. ఇలా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నతాధికారి ప్రజా సమాచార అధికారిగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు.. తహసీల్దార్‌ ‌కార్యాలయంలో తహసీల్దార్‌ ‌ప్రజా సమాచార అధికారి-పీఐవోగా ఉంటారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ఎవరైనా సమాచారం కోరితే సకాలంలో దానిని ఇవ్వాల్సిన బాధ్యత పీఐవోదేనని చట్టం స్పష్టం చేస్తోంది. ఒకవేళ నిరాకరిస్తే సహేతుకమైన కారణం తెలపాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వకుంటే ఆ అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

 ప్రభుత్వం దీనిని ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తోందన్న ఆరోపణలున్నాయి. ఈ చట్టంతో గతంలో ప్రజలు అనేక అవినీతి వ్యవహరాలను వెలుగులోకి తెచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అనేక అవినీతి అక్రమాలను బయటపెట్టారు. అందుకే, ఈ చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండేళ్ల వరకు సమాచార కమిషనర్లనే ఎంపిక చేయలేదు. హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో సమాచార కమిషనర్లను నియమించినా.. చట్టం అమలుకు ఆరుగురు కమిషనర్లు చేసిందంటూ ఏమీ లేదు. ఈ చట్టం ప్రకారం ప్రజలు సమాచారం కోరినా వెంటనే ఇవ్వకూడదని, రాష్ట్రస్థాయిలో సంబంధిత శాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవాలంటూ గతేడాది అప్పటి సీఎస్‌ ‌సోమేశ్‌కుమార్‌ ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. హైకోర్టుతోపాటు పౌర సంఘాల ఒత్తిడితో ప్రభుత్వం ఆ ఆదేశాలను ఉపసంహరించుకున్నా. చట్టం అమలు కాకుండా.. పరోక్షంగా అడ్డుపడుతూనే ఉందన్న అభిప్రాయాలు న్నాయి.

సమాచార హక్కు చట్టంలో అత్యంత కీలకమైన అంశం, సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడం. చట్టంలోని సెక్షన్‌ 4(1)(‌బి) ప్రకారం ప్రతి ప్రభుత్వ శాఖ తమ వద్ద ఉన్న సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో బహిరంగపరచాలి. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఆసరా పింఛన్లు అందిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం లబ్ధిదారుల వివరాలతో కూడిన సమాచారాన్ని జిల్లా, మండలం, గ్రామాల వారీగా సంబంధిత గ్రామీణాభివృద్ధి శాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో అంద బాటులో ఉంచాలి. కొత్తగా మంజూరు చేస్తే వారి వివరాలనూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ ‌చేస్తూ ఉండాలి. ఇలాగే అన్ని శాఖలు అమలు చేస్తున్న పథకాల లబ్ధిదారుల వివరాలను స్వచ్ఛందంగా ప్రకటించాలి. తమ పరిధిలో అమలులో ఉన్న సంక్షేమ పథకాల వివరాలు, దరఖాస్తు చేసుకునే విధానం, ఎంపిక పక్రియ లాంటి వివరాలను కూడా శాఖలు తెలపాలి. కానీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ శాఖ కూడా దీనిని అమలు చేయడంలేదు. ఈ విషయాన్ని సాక్షాత్తూ రాష్ట్ర సమాచార కమిషన్‌ ‌ప్రకటించింది. సచివాలయం మొదలుకొని జిల్లా, మండల స్థాయిలోని 8వేల 924 ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్షన్‌ 4(1)(‌బి) అమలు కావడం లేదని కమిషన్‌ ‌తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. కమిషన్‌లో ఆరుగురు కమిషనర్లు తమ మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నా సెక్షన్‌ 4(1)(‌బి) అమలును పట్టించుకోలేదంటే వారి పనితీరును కూడా అర్థం చేసుకోవచ్చు.

జిల్లాస్థాయిలో సమాచార హక్కు చట్టం పటిష్ఠంగా అమలు చేసేందుకు కమిటీలను కలెక్టర్‌లు చైర్మన్‌లుగా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ చట్టం అమలుకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సభ్యులుగా ఎంపిక చేయాలి. చట్టం అమలుపై కలెక్టర్లు మూడు నెలలకోసారి కమిటీ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించాలి. ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఆర్టీఐ దరఖాస్తుల వివరాలను సమీక్షించాలి. దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని గరిష్ఠంగా 30 రోజుల్లో అందించేలా అన్ని శాఖలను ఆదేశించాలి. జాప్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించవచ్చు. అయితే రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ కమిటీలు లేవు. జిల్లాల్లో ఆర్టీఐ అమలును కలెక్టర్లు పట్టించు కోవడం లేదు. రాష్ట్రస్థాయిలో సమాచార కమిషన్‌ ‌నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో గరిష్ఠంగా 30 రోజుల్లో అందాల్సిన సమాచారం కోసం పౌరులు ఏళ్ల పాటు నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. చివరికి రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించినా న్యాయం దక్కడంలేదు. గత కమిషన్లు సకాలంలో సమాచారం ఇవ్వని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాయి. భారీ జరిమానాలు విధించాయి. దీంతో అధికారులు వెంటనే సమాచారం అందించేవారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఏర్పడిన రాష్ట్ర సమాచార కమిషన్‌ ‌మాత్రం అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వ శాఖలు ఆర్టీఐ దరఖాస్తులను బుట్టదాఖలు చేస్తున్నాయి.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram