పార్లమెంటులో మణిపూర్‌ ‌కల్లోలంపై ప్రతిపక్షాలు నానా రభస సృష్టిస్తున్న సమయంలోనే, నాలుగు దశాబ్దాల నాటి పాలకులు, నేటి ప్రతిపక్ష నాయకులు తొక్కి పెట్టిన ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ ‌మత ఘర్షణలపై జ్యుడిషియల్‌ ‌కమిషన్‌ ఇచ్చిన నివేదికను యోగి ప్రభుత్వం ఆగస్టు 8న ఉత్తర్‌‌ప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చింది. ఎన్నికలలో గెలుపుకోసం ఓటు బ్యాంకు రాజకీయాలు, మైనార్టీ సంతృప్తీకరణ విధానాలు అవలంబించడం వల్లే 40 ఏళ్లపాటు ఈ నివేదిక వెలుగులోకి రాలేక పోయింది. ఇప్పుడు ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ప్రతిపక్షాలకు నచ్చడం లేదు. ఇంతకాలమైన తరువాత  దీనిని బయటపెట్టడం వల్ల ప్రయోజన మేమిటని ప్రశ్నిస్తున్నారు కానీ, వాస్తవంగా వారు భుజాలు తడుముకుంటున్నట్టుగా ఉంది.

1980లో ఈ అల్లర్లు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. నాడు ఉత్తర్‌పద్రేశ్‌ ‌రాష్ట్రమంతా వ్యాపించి 300మంది ప్రాణాలను బలిగొన్న అల్లర్లకు సంబంధించిన నాటి అలహాబాదు మాజీ న్యాయ మూర్తి సక్సేనా ఇచ్చిన నివేదికను నాలుగు దశాబ్దాల పాటు ప్రభుత్వాలు బహిర్గతం చేయకుండా, అందులో వారు చేసిన సూచనలను పాటించకుండా తాత్సారం చేశాయి. మత కల్లోలాలు ఎక్కడ జరిగినా అటు రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ ఎస్‌ఎస్‌)‌ను, ఇటు భారతీయ జనతా పార్టీని అందుకు బాధ్యులను చేయడం నాటి పాలకులకు, మీడియాకు ఆనవా యితీగా ఉన్న విషయం తెలిసిందే. కానీ జస్టిస్‌ ‌సక్సేనా నేతృత్వంలోని న్యాయ కమిషన్‌ ‌సమర్పించిన 496 పేజీల నివేదిక ఆర్‌ఎస్‌ఎస్‌కూ, బీజేపీకి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. అంతేనా, నాటి ముస్లింలీగ్‌ ‌నాయకుడైన డా।। షమీమ్‌ అహ్మద్‌ఖాన్‌ను, ఆయన ముఖ్య మద్దతు దారులను ఈ కల్లోలాలకు బాధ్యులుగా తేల్చింది. తమ రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చు కోవడం కోసం వారు అల్లర్లను రెచ్చగొట్టడమే కాక పాలనా యంత్రాంగంపై తిరగబడి పోరాడేందుకు సిద్ధ మయ్యారని సక్సేనా నివేదిక పేర్కొంది. బహుశ, నాటి ప్రభుత్వాలు దానిని బయట పెట్టకపోవడానికి కారణం ఇదేనేమో!

ఏమిటీ మొరాదాబాద్‌ అల్లర్లు?

మొరాదాబాద్‌ ‌పట్టణంలోని ఒక ఈద్గా వద్ద ఆగస్టు 13, 1980 ఈ అల్లర్లు ప్రారంభమై దావా నలంలా సంభల్‌, అలీగఢ్‌, ‌బరేలీ, ప్రస్తుత ప్రయాగ రాజ్‌ అయిన అలహాబాద్‌కు, మొరాదాబాద్‌ ‌గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి 1981 వరకు కొనసాగాయి. కనిపించకుండా పోయిన వారిని కలుపుకుని 289 మంది మరణించినట్టు నాటి రాష్ట్ర హోంమంత్రి స్వరూప్‌ ‌కుమారి బక్షి అసెంబ్లీలో వెల్లడించారు.

మొరాదాబాద్‌లోని ఈద్గా మైదానంలో ముస్లింలు ఈద్‌-ఉల్‌- ‌ఫితర్‌ ‌ప్రార్ధనలు చేస్తున్న సమయంలో రెండు పందులు మైదానంలో కనిపించాయి. ఇస్లాంలో పందులను హరామ్‌గా లేదా నిషిద్ధమై నవిగా పరిగణిస్తారు. వాటిని చూడగానే, ముస్లింలు ఆగ్రహంతో ఊగిపోతూ, విచ్చలవిడిగా అల్లర్లకు దిగారు. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన పోలీసులపై రాళ్లు విసరడంతో, వారు ఆ గుంపుపై కాల్పులు జరిపారు. ఇంక అంతే, ఉన్మాదంతో రెచ్చిపోయి, పోలీసుస్టేషన్లు, పోలీస్‌ ఔట్‌పోస్టులు, హిందువులపై దాడి చేశారు. తమకు సంబంధంలేని వ్యవహారంలోతమపై దాడులు చేస్తున్నందుకు హిందువులు తిరగబడడంతో అది మత ఘర్షణల రంగు పులుముకుంది. దీనితో ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌రాష్ట్రం కొన్ని నెలలపాటు ఉద్రిక్తలతో ఉడికిపోయింది.

ఆర్‌ఎస్‌ఎస్‌, ‌హిందూ సంస్థల పాత్రను కొట్టి పారేసిన నివేదిక

1980 మొరాదాబాద్‌ అల్లర్లలో అటు ఆర్‌ఎస్‌ఎస్‌కు కానీ, ఇటు హిందూ సంస్థలకు కానీ ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని నివేదిక స్పష్టంగా వెల్లడించింది. ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కానీ బీజేపీ కానీ ఎటువంటి రహస్య సమావేశాలూ నిర్వహించలేదని, అటువంటి ఆధారాలు కూడా లేవని పేర్కొంది. వారు ఏ రకంగానూ, ముస్లిం వ్యతిరేక చర్యలకు జనాలను రెచ్చగొట్టలేదని నివేదిక చెప్పింది. వాస్తవాలను విస్తృతంగా విశ్లేషించిన అనంతరం, ఈ సంస్థలకు ఏరకంగానూ ఇందులో జోక్యం చేసుకోలేదనే విషయం తేలిందని నివేదిక నొక్కి చెప్పింది.

ముస్లిం లీగ్‌ ‌నాయకుడి కీలక పాత్ర

కమిషన్‌ ‌పరిశోధనలో డా।। షమీమ్‌ అహ్మద్‌ ‌ఖాన్‌, అతడి మద్దతుదారులు, ముస్లిం లీగ్‌ అనుబంధ సభ్యులు పోషించిన కీలక పాత్రను నొక్కి చెప్పాయి. వాస్తవానికి నాడు ఈద్‌ఖానా, భురా చౌరాహా, బర్ఫ్‌ఖానాలో సంభవించిన మరణాలకు తోపులాట కారణమని, ఇందుకు పోలీసులను, అధికారులను బాధ్యులను చేయలేమని కమిషన్‌ అభిప్రాయపడింది. రాళ్లు విసురుతున్న అల్లరి మూకల నుంచి తమను తాము కాపాడుకునేందుకే పోలీసులు ఈద్గా వద్ద కాల్పులు జరిపారంటూ పోలీసులకు కూడా కమిషన్‌ ‌క్లీన్‌ ‌చిట్‌ ఇచ్చింది.

నివేదిక సూచనలు

నివేదిక కేవలం నాటి ఘటనలలో వాస్తవాలను బయటపెట్టడమే కాదు, భవిష్యత్తు గురించి లోతైన అంతర్‌ ‌దృష్టులను ఇస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఏర్పడితే ఎదుర్కొనేందుకు, వాటిని అణచివేసేందుకు వ్యూహాలను ప్రతిపాదించింది. ముఖ్యంగా భవిష్యత్తులో సంక్షోభ సమయంలో వదంతులను ఎదుర్కొనేందుకు లౌడ్‌ ‌స్పీకర్లను ఉపయోగించాలని సూచించింది.

వీటన్నింటినీ మించి, ముస్లింల సంఖ్య పెరగడం, రాజకీయ నాయకులు వారిని ఓటు బ్యాంకుగా పరిగణించి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం మంచిది కాదని నివేదిక పేర్కొంది. ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణాలలో ముస్లిం నాయకులు తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి సాధారణ ముస్లింలను రెచ్చగొట్టడమేనని నివేదిక స్పష్టం చేసింది. ముస్లింలను ఓటుబ్యాంకుగా చూసే వైఖరిని ప్రోత్సహించరాదని నివేదిక హితవు పలికింది. వారిని ఒక వ్యాపార వస్తువుగా ఎన్నికల సమయంలో పరిగణిస్తే ఫలితాలు ప్రమాదకరంగా ఉంటాయని హెచ్చరించింది.

వెల్లడైన ఈ వాస్తవాలు చారిత్రిక వృత్తాంత వివరణలను తిరిగి అంచనా వేసుకునేందుకే కాక, మతపరమైన ఘర్షణల బహుముఖీయ స్వభావాన్ని గుర్తించి, అన్ని విశ్వాసాలను గౌరవించే ఒక సమరస మైన సమాజం దిశగా కలిసి పని చేసే అవకాశాన్ని కల్పిస్తాయి.

దేశంలో మత ఘర్షణలు

 భారతదేశంలో అతి భారీ స్థాయిలో జరిగిన మత ఘర్షణలుగా దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని నౌఖాలీ, బీహార్‌లోని గ్రామీణ ప్రాంతాలలో జరిగిన వాటిని పరిగణిస్తారు. కానీ, ఈ జాడ్యం 1893లో ముంబైలో చోటు చేసుకుంది. ఇందులో వందమంది మరణించగా, 800మంది గాయపడ్డారు. 1857లో సైనికుల తిరుగుబాటు అనంతరం హిందూ, ముస్లిం వర్గాల మధ్య బ్రిటిష్‌ ‌వారి విభజించి, పాలించే విధానాలు దేశంలో మత మౌఢ్యాన్ని, ఉద్రిక్తతలను పెంచాయి. ముఖ్యంగా 1921-1940 మధ్య కాలం క్లిష్టంగా సాగింది. 1926లో కలకత్తాలో జరిగిన ముహర్రం వేడుకల సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణ 28 మరణా లకు దారితీసింది. అయితే, ఇవన్నీ స్వాతంత్య్రానికి పూర్వం జరిగినవి. స్వాతంత్య్రా నంతరం చోటు చేసుకున్న అతి భారీ మత కల్లోలాలు 1961లో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగాయి.

1969 అహ్మదాబాద్‌ ‌ఘర్షణలు: హిందూ, ముస్లింలకు మధ్య అల్లర్లు అహ్మదాబాద్‌లో 1969లో ప్రారంభమయ్యాయి. ఈ అల్లర్లలో సుమారు వెయ్యి మంది మరణించారు. కాగా, ఈ అల్లర్లను కేవలం మొరార్జీ దేశాయ్‌ అనుచరుడిగా ఉన్న నాటి గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిని అభాసుపాలు చేసేందుకు కాంగ్రెసు లోని ఇందిర మద్దతుదారులు సృష్టించినవనే వార్తలు నాడు వెలువడ్డాయి.

అనంతరం ఉత్తర్‌‌ప్రదేశ్‌లోనూ, దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో ఇవి జరుగుతూనే వస్తున్నాయి.

1979లో జెంషెడ్‌పూర్‌లోనూ, అలీగఢ్‌ ‌లోనూ జరుగగా, 1980లో మొరాదాబాద్‌లో మత కల్లోలాలు చోటు చేసుకున్నాయి.

1984లో సిక్కుల ఊచకోత: ఇందిరాగాంధీ హత్యానంతరం ప్రారంభమైన సిక్కుల ఊచకోత 15 రోజులపాటు కొనసాగింది. ఇందులో 2,700మంది మరణించగా, వేలాదిమంది గాయపడ్డారు. ఎన్నో విచారణా ప్యానెళ్ల తర్వాత 8మందిని శిక్షించగా, ఇందులో పాల్గొన్న రాజకీయ నాయకులు, పోలీసులు తప్పించుకున్నారు.

1987 మీరట్‌ అల్లర్లు: దాదాపు రెండు నెలలు కొనసాగిన అల్లర్లలో పోలీసులు దర్యాప్తు జరిపి నప్పటికీ, అనంతరం ప్రభుత్వం వాటిని ఉపసంహ రించింది. హషీంపూర్‌ అనే ప్రాంతంలో అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను అక్కడి ప్రజలు అడ్డు కోవడం, అదనపు సిబ్బంది రావడంతో ఆగ్రహించి ఘర్షణకు దిగడం, అనంతరం చినికి చినికి గాలివానై 350మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది.

1989 భాగల్‌పూర్‌ ‌ఘర్షణలు: పోలీసుల అత్యాచారాలకు వ్యతిరేకంగా అక్టోబర్‌ 23, 1989‌న అల్లర్లు ప్రారంభమై నెలరోజుల పాటు సాగాయి. నమోదు చేసిన 864 కేసులలో 535 కేసులను ఆధారాలు లేకపోవడంతో కొట్టివేసి, నేరస్థులను వదిలేశారు. ఈ అల్లర్లలో వెయ్యిమంది ఊచకోతకు గురికాగా, 50వేల మంది నిర్వాసితులయ్యారు, 11,500 గృహాలను దహనం చేశారు.

1992 ముంబై అల్లర్లు: బాబ్రీ మసీదు కూల్చి వేసిన కొద్ది గంటల్లోనే ముంబైలో అల్లర్లు ప్రారంభం అయ్యాయి. 1992 డిసెంబర్‌లో ఆగకుండా ఐదు రోజుల పాటు, జనవరిలో ఒక పదిహేనురోజుల పాటు ముందెన్నడూ లేని విధంగా జరిగిన ఈ అల్లర్లలో దాదాపు 1,788 వ్యక్తులు మరణించగా, కోట్ల విలువైన ఆస్తులు ధ్వంస మయ్యాయి. దీనిపై వేసిన శ్రీ కృష్ణ కమిషన్‌ ఐదేళ్ల అనంతరం తన నివేదికను సమర్పించినా, ఆధారాలు లేక తప్పించు కున్నవారే ఎక్కువ.

2002 గుజరాత్‌ అల్లర్లు: విశ్వ హిందూ పరిషత్‌ (‌వీహెచ్‌పీ•) కార్యకర్తలు ప్రయాణిస్తున్న రైలుపై 27 ఫిబ్రవరి 2002న ముస్లిం మూకలు దాడి చేసి, నిప్పంటించాయి. ఈ ఘటనలో 58 మంది హిందూ కార్యకర్తలు మరణించారు. ఈ ఘటన ఫలితంగా చోటు చేసుకున్న భారీ అల్లర్లలో అనేకమంది మరణించారు.

దశాబ్దాల పాటు కేంద్రంలో, రాష్ట్రాలలో అధికారం చేపట్టిన సెక్యులర్‌ ‌పార్టీ కాంగ్రెస్‌ ‌పాలనలోనే అత్యధిక మత ఘర్షణలు, కల్లోలాలు చోటు చేసుకున్నాయి.  జాబితాలో పేర్కొన్నవి కొన్నే అయినా, మైనార్టీల సంతృప్తీకరణ రాజకీయాల కారణంగా ఆ కాలంలో దేశవ్యాప్తంగా మతపరమైన ఘర్షణలు చేసుకోని రాష్ట్రం లేదనడం అతిశయోక్తి కాదేమో!

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram