అన్నదానం అన్నింటికన్నా మిన్న. ఆ అన్నమే జీవాధారం., సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. అన్నపూర్ణమ్మ అనుగ్రహఫలం, బలం. అందుకే ఆ మాత అన్నపూర్ణేశ్వరిని అనుదినమూ తలుస్తాం, కొలుస్తాం. ‘నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ/ నిర్ధూతాఖిల ఘోరపాపనీకరీ ప్రత్యక్ష మహేశ్వరీ/ ప్రాలేయాచల వంశ పావనీకరీ కాశీపురాధీశ్వరీ/ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ’ అంటాం. ఆమెను సదా మననం చేసుకునే వారికి ఏ లోటూ ఉండదంటుంది మన భారతీయ తత్వ చింతనం. ఆ కారణంగానే అన్నదానాన్ని మహాయజ్ఞంలా నిర్వహిస్తారు కొందరు. అందులో సంతృప్తి, సంతోషం పొంది తమ జీవితాల్ని చరితార్థం చేసుకుంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా-అన్నం లోపిస్తే బతుకగలరా ఎవరైనా? మరి అన్నదానం చేయడమే బతుకు అర్థం, పరమార్థం అని భావించి ఆచరించి తరించేవారూ లోకంలో కొందరుంటారు. అదే కొద్దిమందిలో ముందు వరసన నిలిచినవారు బాలాంబ. దశాబ్దాల జీవనకాలం. ఆమె సాధించిన ఘనత మాత్రం అనంతం. ఇంటిపేరు కైవారం. ఆ పదానికి స్తోత్రం అనే అర్థమూ ఉంది. స్తుతించాలి, స్తోత్రం చేయాలి అని మనకు అనిపించేంత మూర్తిమత్వం కైవారం బాలాంబది!


తనదైన ధర్మాన్ని మనసా, వాచా, కర్మణా ఆచరించడమే తప్ప మరి ఏ విధమైన ఆలోచనా లేనంత మహోన్నతురాలు బాలాంబ. స్వస్థలం గుంటూరు ప్రాంతం. చిన్నపాటి పల్లెటూరు అంగలకుదురులో పుట్టారు. అప్పుడు అక్కడ వారికెవరికీ తెలియదు – ఆ బాలికే పెద్దయ్యాక అన్నదాన నాయిక అవుతుందని. తొలి నుంచీ ఆబెకు  కావ్యపఠనమంటే  మక్కువ ఎక్కువ. పురాణ గ్రంథాల సారాంశాన్ని తెలుసుకోవాలన్న సదాభిలాష మెండు. శ్లోకాలు చదివారు. పద్యగమనాలు తెలుసుకున్నారు. ఏ అంశం ఎంతటి ప్రభావపూరితమో సమగ్ర అధ్యయనం ద్వారా అనుభవానికి తెచ్చుకున్నారు. భావం తెలిసి వస్తున్న కొద్దీ మనోవైశాల్యమూ సుసాధ్యమైంది. అంతటి సమగ్రత నుంచి దానధర్మాల గురించిన నవాలోచన ఇనుమడించింది. గీతాచార్యుడు అన్నట్టు ‘‘అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాదన్న సంభవః/యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః’ అని! ప్రాణప్రదాయని అన్నమే. అది వర్షాధార మేఘంవల్ల పంట అనంతర రూపమవు తుంది. అదే మేఘం ఎలా రూపొందుతుంది? యజ్ఞ నిర్వహణ, అగ్నిక్రతువుల పొగల కారణంగానే. యజ్ఞమన్నది కర్మాచరణ ఫలితం కదా! ఉత్తమ, ఉదాత్త కర్మ అన్నదానమే. ఇదే బాల్యం నుంచీ బాలాంబ మదిలో పదిలంగా స్థిరపడింది. కాలగమనంలో అన్నదాతగా జీవితాన్ని వెలిగించి ధన్యతను పొందారు. వరప్రసాదితగా సంభావనకు పాత్రురాలైన బాలమ్మ జీవితం అంతా మలుపుల మయమే!

అంతరార్థం ఆమెకే తెలుసు

బాలాంబ తండ్రి సుబ్బన్న. చదువుకున్న పురాణ కావ్యాలను ఊళ్లో వారికి నిత్యమూ వివరించేవారు. వారికి కలిగే సందేహాలకు తగు సమాధానాలిచ్చి ధార్మికతను మరింత ప్రాచుర్యానికి తెస్తుండేవారు. దయ, దానం, ధర్మం గురించి నిత్యమూ సోదాహరణ వివరణ. ‘అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే / జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి’ శ్లోకం తరచుగా తండ్రి నోటి నుంచి వెలువడుతుండేది. సామాజిక వాస్తవికతనూ జోడించి విశదీకరించే తీరు కుమార్తెను సహజంగానే ఆకట్టుకుంది. ఒక రోజున అన్నదానపు పుణ్యఫలానికి సంబంధించి సవివరణ విశదీకరణ ఇచ్చారు తండ్రి. తనకు ఉన్నది ఇతరులకు ఇవ్వడమే దానగుణం. ఆ ఇవ్వడంలో పక్షపాతం అస్సలు ఉండకూడదు. అవతలి వ్యక్తి స్థితిని యథావిధిగా గ్రహించి ఆదుకోవాలి. అంతేకానీ ‘స్థాయి’ ప్రధానపాత్ర వహించడం తగదు. సరైన స్థోమతలేని వారికి, శారీరక శక్తి లోపించిన వారికి, వయోవృద్ధులకు, ఇతరత్రా నిస్సహాయులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్న మాటలు ఆమె యోచనకు క్రియాశక్తిని జతపరిచాయి. పురాణాలూ, ఇతిహాసాలను కేవలం చదవడంతో సరిపెట్టుకోవడం కాకుండా; వాటి అంతరార్థాన్ని, సందేశ సారాన్ని ఆచరించి చూపాలన్నది బాలాంబకు ఎంతగానో అవగతమైంది. ప్రత్యేకించి అన్నదాన ప్రాధాన్యమే మదిని ఆవరించి, భవిష్యత్‌వాణి బాణీగా పరిణమించింది. అదెంతో పెద్ద మలుపు.

దాన, జ్ఞాన సంపన్నత

వివాహ జీవితం ఆనందప్రదంగా సాగిపోతూ వచ్చింది. భర్త సుబ్బన్నకీ ఆమె దానధర్మాల ప్రశస్తిని వివరించి చెప్తుండేది. ఇద్దరి మధ్యనా ఆసక్తికర చర్చలు కొనసాగేవి. అవే చర్చోపచర్చలు బాలాంబ పరిణతిని ఇంకెంతో విస్తృతపరచాయి. కాలం గడిచిపోతూ ఉండగా, అతి పెద్ద కుదుపు! పతి ఆకస్మిక  మృతి ఆమెను దుఃఖ సాగరంలో ముంచెత్తింది. దిక్కుతోచని పరిస్థితి. రోజులు గడుస్తున్న కొద్దీ, ఆమె జీవితభాగాన్ని ఆధ్యాత్మికత పూర్తిగా ఆవహించింది. మెట్టిన ఊళ్లో స్వామి ఆలయ దర్శనం నిత్యమూ చేసుకునేవారు. భగవానుని సేవలోనే శేషజీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. ఎవరికైనా వృద్ధాప్యం తప్పదు కదా! వయోవృద్ధులుగా కాక, జ్ఞాన వృద్ధులుగా ఎన్నెన్నో గ్రహించారు ఆ విద్వాంసురాలు. ఇంకొంత కాలానికి మనసు తపస్సువైపు మళ్లింది. తపో ఫలం అర్థమేమిటన్నదీ అనుభవానికి వచ్చింది. ఏళ్ల తరబడి గుండె గుడిలో గూడుకట్టుకున్న ‘దానం’ క్రియాత్మక పాత్ర పోషించింది. అంతే, అప్పటి నుంచీ, తన మెట్టినింటి ఊళ్లోనే, ఆ మంగళగిరి గ్రామంలోనే అన్నదాన సేవను ప్రారంభించారామె. సంకల్పబలంతో అది విస్తరించి, సేవానిరతికి సముదాత్త నిదర్శనంగా భాసించింది. అన్నదాతగా ఆమె పేరును సుస్థిరపరచి, వందలాది భక్తజనులకు ఆలంబనగా నిలిచింది. ప్రత్యేకించి మంగళగిరి తిరుణాలలో! లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో! అక్కడే ధర్మ సంస్థ వ్యవస్థాపన!

అనుదిన సేవాయాత్ర

అన్నపూర్ణ పేరిట భోజనసత్రం స్థాపన. అప్పటికి బాలాంబ వయసు 60 సంవత్సరాల పైమాటే! అన్నదానం విశిష్టతను చెప్పడం కాదు, చేసి చూపించిన ఆదర్శనీయ మహిళ. భోజనం పెట్టడమన్నది కేవలం ఆహార వితరణ ఒక్కటే కాదు. ‘నేను సేవచేస్తున్నాను. వారు సేవ పొందుతున్నారు’ అనే ఏకపక్ష భావన తగదు. అన్నదానాన్ని ఆహారప్రదానంగా మాత్రమే చూడకూడదు. అది ఒక సేవచేసే అవకాశమని తెలిసి మసలాలి. బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్థమే అన్నం అనుకుంటే పొరపాటే! అన్నమే దేహంలోకి ప్రవేశించి, ప్రాణశక్తిగా మారుతుంది కాబట్టి అన్నదానం అంటే ప్రాణదానమే చేసినట్లవుతుంది. ఇటువంటి మాటలతో కూడా భక్తుల జ్ఞాన ఆకలి తీర్చేవారు బాలాంబమాత. ధర్మసంస్థ నిర్వహణలోని అన్నదాన సత్రంలో యాత్రికులందరికీ సేవలు సాగిస్తుండేవారు. ఈ నిరంతర సేవాయాత్రలో మీకు స్ఫూర్తి ఎవరు అని ఎవరైనా అడిగితే – తల్లిదండ్రుల, భర్త గురించి చెప్తుండేవారామె. నిరతాన్నదానం లక్ష్మీ నృసింహుని కరుణాకటాక్ష వీక్షణ ప్రభావమేనని బదులిస్తుండేవారు. యోగినిగా జీవించారు. సేవానిరతురాలుగా జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు.సేవనూ, భక్తినీ సమ్మిళితంచేసి, ప్రజల మనోమందిరాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సువిశాల ప్రపంచాన్నే దానమిచ్చినా ఆకలి పీడితుడి బాధతీరదు. అది తీరాలంటే అన్నదానమే పుణ్యమార్గమని ఆమె జీవితం మనకు ఉద్బోధిస్తుంది.

ఆశ, శ్వాస

శాశ్వత అన్నదానమనేది నారాయణసేవ. కనక రజతాలను, మరెన్నో సంపదలను దానమిచ్చినా తృప్తి కలగకపోవచ్చు. కానీ అన్నంపెట్టి ఆదరిస్తే, ఆ వ్యక్తి కళ్లలోని వెలుగు ఇంతా అంతా కాదు. ఆ వెలుగులను  తిలకించేందుకే బాలాంబ తన జీవితమంతటినీ అంకితం చేశారు. అది దైవ ఆశీర్వాదంగా భావించారు. దానం పొందినవారి ఆశీస్సులే అమూల్యమని తలచారు. క్రమం తప్పకుండా నిర్వర్తించే అన్నదాన కార్యక్రమాలు జీవితాన్ని కృతార్థంచేసి తీరతాయని ఆచరణ ద్వారా నిరూపించారు. నిరతాన్నదానానికి ప్రతీకలుగా తెలుగునాట మహనీయ మహిళామణులున్నారు. జిల్లెళ్ళమూడి అమ్మ, డొక్కా సీతమ్మ… వీరి మహనీయత మొత్తం భారతావనికే స్ఫూర్తిదాయకంగా భాసించి అందరి జేజేలూ అందుకుంది, అందుకుంటోంది. అలాగే కైవారం బాలాంబ. ఆమెను తలచుకున్నంతనే మన మనసు మరింత భక్తి తరంగితమవుతుంది. సేవ అనే రెండక్షరాల అసలు అర్థంగా ఆ రూపం, ఆ సేవాభావం అంతటా నిండుతుంది. వనితాలోక మణిపూస, ఆశాజీవన శ్వాస ఆమె. సదా సర్వదా ఆరాధ్యనీయ, ఆదర్శప్రాయురాలు.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram