శ్రీలంక ఎప్పుడూ భారత్‌తో యుద్దం చేయలేదు. ఆక్రమణకు కూడా దిగలేదు. అయినా మన దేశమే వారికో భూభాగాన్ని అప్పనంగా ఇచ్చేసింది. ఇటీవల తన ప్రభుత్వం మీద వచ్చిన అవిశ్వాస తీర్మానానికి సమాధానంగా ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో చేసిన ప్రసంగంతో కచ్చతీవు మరోసారి చర్చకు వచ్చింది. ఇందిరాగాంధీ శ్రీలంకకు కచ్చతీవును అప్పగిస్తే, అంతకు పూర్వం ఆమె తండ్రి జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ కోకోదీవులను బర్మాకు సమర్పించుకున్నారు. ఈ చారిత్రక తప్పిదాల ఫలితం- నేడు చైనా తిష్ట వేసినది ఆ దీవుల్లోనే. ఈ ఇద్దరి ముద్దుల వారసుడు రాహుల్‌ ‌మాత్రం ‘ఉల్టాచోర్‌ ‌కొత్వాల్‌కో మారా’ అన్నట్లుగా మోదీ వైఫల్యంతో చైనా మన దేశ భూభాగాన్ని ఆక్రమించిందని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు.


లోక్‌సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వా సంపై రెండు రోజుల చర్చ తర్వాత కాంగ్రెస్‌ ‌పార్టీకి దీటైన సమాధానం ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. సభ నుంచి బయటకు వెళ్లిన వారిని ఒక్కసారి అడగండి.. ‘కచ్చతీవు’ అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంది? అని.. విషయం ఏంటంటే, ఈ ద్వీపాన్ని శ్రీలంక ఏ యుద్ధంలోనూ గెలవలేదు, బలవంతంగా స్వాధీనం చేసుకోలేదు. మరి 1974లో ఈ ద్వీపాన్ని శ్రీలంకకు బహుమతిగా ఎవరిచ్చారంటూ ప్రశ్నిం చారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ‘మా భారతి’ (తల్లి భారతి)ని మూడు ముక్కలు చేసిందని అన్నారు మోదీ.

కచ్చతీవును తిరిగి భారత్‌లో కలపాలని డీఎంకే నేతలు నాకు లేఖలు రాస్తున్నారు. ‘బయటకు వెళ్లిన వారిని అడగండి, ఈ కచ్చతీవు ద్వీపం ఏంటి? మరి ఈ కచ్చతీవు ఎక్కడుంది? వాళ్లను ప్రశ్నించండి.. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి దేశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.. అంటూ ఆయన విరుచుకుపడ్డారు.

ఇంతకీ ఏమిటీ ఈ కచ్చతీవు?

భారత్‌, శ్రీ‌లంక దేశాల మధ్య హిందూ మహా సముద్రంలో చిన్న ద్వీపం కచ్చతీవు. రామేశ్వరానికి ఈశాన్యంగా 11 నాటికల్‌ ‌మైళ్ల దూరంలో, తలైమన్నార్‌కు ఆగ్నేయంగా 18 నాటికల్‌ ‌మైళ్ల దూరంలో ఈ దీవి ఉంది. 285 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కచ్చతీవు. రామనాథపురం రాజు 1902లో బ్రిటిష్‌ ‌ప్రభుత్వం నుండి పొందారు. అంతకు ముందు 1880లో మహమ్మద్‌ అబ్దుల్‌ ‌కదిర్‌ ‌మరైకెరె, ముత్తుచామి పిళ్లై, రామనాథపురం జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ ఎడ్వర్డ్ ‌టర్నర్‌ ‌మధ్య ఒక లీజు ఒప్పందం జరిగింది. ఈ లీజుకింద 70గ్రామాలు, 11దీవులలో రంగుల తయారీకి అవసరమైన ముడి సరుకును సేకరించుకునేందుకు అధికారం పొందారు. ఆ 11 దీవుల్లో కచ్చతీవు కూడా ఒకటి. 1885లో కూడా ఇదే తరహాలో మరొక లీజు జరిగింది.

1913లో రామనాథపురం రాజు, భారత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ లీజులో కచ్చతీవు పేరు కూడా చేర్చారు. భారత్‌, శ్రీ‌లంక దేశాలను పాలించిన బ్రిటిష్‌ ‌ప్రభుత్వం, కచ్చతీవును భారత్‌లో భాగంగానే గుర్తించింది తప్ప శ్రీలంక ప్రాంతంగా ఎప్పుడూ పేర్కొనలేదు. బ్రిటిష్‌ ‌పాలనలో ఈ ద్వీపం మద్రాసు ప్రెసిడెన్సీ అధీనంలోకి వచ్చింది. అంటే ఇది బ్రిటిష్‌ ‌వారి అధీనంలోకి వచ్చింది. 1947లో మనకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు తయారైన ప్రభుత్వ పత్రాలలో ఇది మన దేశంలో భాగమని స్పష్టంగా ఉంది.

మనుషులు ఉండని ఈ దీవిలో సెయింట్‌ ఆం‌టోనీ చర్చ్ ఉం‌ది. ప్రతి సంవత్సరం వారంరోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడు క్రైస్తవులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మిగతా సమయంలో జన సంచారం ఉండదు. 20 శతాబ్దం ఆరంభంలో రామనాథపురానికి చెందిన సీనికుప్పన్‌ ‌పడయాచి అనే వ్యక్తి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడని ‘ది గెజిటీర్‌’ ‌చెబుతోంది. తంగాచి మఠానికి చెందిన ఒక పూజారి ఈ ఆలయంలో పూజలు నిర్వహించే వారు. కచ్చతీవును భారత్‌తో పాటు అటు శ్రీలంక మత్స్యకారులు ఉపయోగించుకునేవారు. ఈ కారణంగా ఇది రెండు దేశాల మధ్య సమస్యగా మారింది. అనేక సందర్భాల్లో శ్రీలంక ఈ దీవి మీద తన హక్కును చాటుతూ వచ్చింది

లంకకు అప్పగించిన ఇందిర

కచ్చతీవు సమస్య పరిష్కారం దిశగా భారత్‌-శ్రీ‌లంకల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. 1974లో భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక అధ్యక్షురాలు సిరిమావో బండరునాయకెల మధ్య రెండు ముఖ్యమైన సమావేశాలు జరిగాయి. ఒకటి జూన్‌ 26‌న కొలంబోలో, మరొకటి జూన్‌ 28‌న ఢిల్లీలో. ఈ చర్చల్లో కచ్చతీవును శ్రీలంకకు ఇవ్వాలని నాటి ఇందిరాగాంధీ నిర్ణయించారు. ఈ ఒప్పందంపై వీరిద్దరూ సంతకాలు చేశారు. దీంతో కచ్చతీవు శాశ్వతంగా శ్రీలంక ఆధీనంలోకి వెళ్లింది. ఈ ఒప్పందంలో కొన్ని షరతులు పెట్టారు. భారతీయ మత్స్యకారులు తమ వలలను ఆరబెట్టడానికి ఈ ద్వీపానికి వెళ్లవచ్చు. ద్వీపంలో చర్చిని వీసా లేకుండా సందర్శించవచ్చు.

కచ్చతీవును లంకకు అప్పగిస్తూ ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నాటి తమిళనాడు సీఎం కరుణానిధి తీవ్రంగానే వ్యతిరేకించారు. శ్రీలంక నుంచి కచ్చతీవును వెనక్కి తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ ‌చేసింది.

ఈ వ్యవహారం ఇంతటితో ఆగిపోలేదు. 1976లో భారతదేశం, శ్రీలంక మధ్య సముద్ర సరిహద్దుకు సంబంధించి మరొక ఒప్పందం తెర మీదికి వచ్చింది. ఈ ఒప్పందంలో కచ్చతీవులోని చర్చిలో ఉత్సవ సమయంలో తప్ప మిగతా రోజుల్లో భారత మత్స్యకారులు, చేపల పడవులు శ్రీలంక స్పెషల్‌ ‌ఫైనాన్స్ ‌జోన్‌లోకి ప్రవేశించరాదని పేర్కొన్నారు. ఈ ఒప్పందం కచ్చతీవు వివాదానికి ఆజ్యం పోసింది. దీనిపై తమిళనాడు మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీలంకలో తమిళులకు ప్రత్యేక దేశం ‘ఈలం’ కోసం ఎల్‌టీటీఈ సంస్థ చేపట్టిన వేర్పాటువాద యుద్ధం ఈ సమస్యను మరింత జటి•లంగా మార్చింది. లంక నౌకాదళం సముద్రంపై గట్టి నిఘా పెట్టింది. తమ సముద్ర సరిహద్దుల్లో పొరపాటున ప్రవేశించే భారతీయ పడవలను శ్రీలంక నౌకాదళం స్వాధీనం చేసుకుంటోంది. మన మత్స్యకారులను బందీలుగా పట్టుకొని హింసించేవారు.

2010లో ఎల్‌టీటీఈ పరాజయం తర్వాత సముద్రంపై తమ ఉనికిని మరింత బలంగా చాటు కోవడం ప్రారంభించింది శ్రీలంక. దీంతో తమిళ నాడు జాలర్ల కష్టాలు మరింతగా పెరిగాయి.

కేంద్రంపై తమిళనాడు వత్తిడి

1991లో తమిళనాడు శాసన సభ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి, కచ్చతీవును భారత్‌లో తిరిగి చేర్చాలని డిమాండ్‌ ‌చేసింది. కేవలం తీర్మానాలతోనే ఆగకుండా 2008లో నాటి ముఖ్యమంత్రి జయలలిత సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ ‌వేశారు. కచ్చతీవును శ్రీలంకకు బహుమతిగా ఇస్తూ భారత్‌ ఆ ‌దేశంతో కుదుర్చుకున్న రెండు ఒప్పందాలనూ రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరింది. రాజ్యాంగ సవరణ లేకుండా దేశంలోని భూమిని మరే ఇతర దేశానికీ ఇవ్వరాదని వాదించారు. 2011లో జయలలిత సీఎం అయ్యాక అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు.

కచ్చతీవు శ్రీలంకదేనని 2010 ఆగస్టులో నాటి భారత విదేశాంగ మంత్రి ఎస్‌ఎం ‌కృష్ణ ప్రకటించారు. ఒకసారి ధారాదత్తం చేస్తే ఇక మనది కాదనీ, అక్కడకు వెళ్లే తమిళ జాలర్లకు రక్షణ కల్పించలేమనీ కూడా వెల్లడించారు.

2014లో కచ్చతీవు అంశంపై కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్‌ ‌ముకుల్‌ ‌రోహ్తోగీ మాట్లాడుతూ.. ఒప్పందం ప్రకారం కచ్చతీవు దీవిని శ్రీలంకకు ఇచ్చారని.. ఇప్పుడు అది అంతర్జాతీయ సరిహద్దులో భాగమని తెలిపారు. మనం కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే ఓ యుద్ధం చేయవలసి ఉంటుందన్నారు ఆయన.

కోకో దీవులదీ అదే కథ

కోకో దీవులు బంగాళాఖాతం ఈశాన్య భాగంలో ఉన్న దీవులతో కూడిన చిన్న సమూహం. అండమాన్‌ -‌నికోబార్‌ ‌దీవులకు ఎగువ భాగంలో కనిపిస్తాయి. దక్షిణాసియాలోని అతి ముఖ్యమైన ద్వీపాలలో ఇదొకటి. కోల్‌కతాకు ఆగ్నేయంగా 1255 కి.మీ దూరంలో కోకో దీవులుంటాయి. ఇవి గ్రేట్‌ ‌కోకో ఐలాండ్‌, ‌లిటిల్‌ ‌కోకో ఐలాండ్‌ అని రెండు భాగాలు. ఈ దీవులను మొదట పోర్చుగీస్‌ ‌నావికులు కనుగొన్నారు. కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నందున వారు దీనికి కోకో ద్వీపం అని పేరు పెట్టారు

ఇవి వాస్తవానికి అండమాన్‌ ‌నికోబార్‌ ‌ద్వీప సమూహంలో భాగం. తర్వాత కాలంలో ఇవి బ్రిటిష్‌ ‌వారి నియంత్రణలోకి వచ్చాయి. భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులను, రాజకీయ ఖైదీలను నిర్భంధించేందుకు బ్రిటిష్‌వారు అండమాన్‌లో జైలును నిర్మించడం తెలిసిందే. ఈ జైలులోకి ఖైదీలకు ఆహారం పండించేందుకు కోకోదీవులను ఉపయోగించుకున్నారు.

బ్రిటీష్‌ ‌ప్రభుత్వం బర్మా (ఇప్పుడు మయన్మార్‌)‌కు చెందిన జాద్వెట్‌ ‌కుటుంబానికి కోకో దీవులు లీజుకు ఇచ్చింది. భారత దేశానికి స్వాతంత్య్రం తర్వాత ఈ దీవులు సహజంగా భారత్‌కు దక్కాలి. కానీ కోకో దీవుల నియంత్రణ కోసం బ్రిటీష్‌పై వత్తిడి చేయ కూడదని భారత తొలి ప్రధానమంత్రి నెహ్రూ తీసుకున్న నిర్ణయం మరో చారిత్రక తప్పిదంగా మారింది. ఒక రకంగా బర్మాకు ఈ దీవులను విరాళంగా ఇచ్చేసినట్లయింది. బ్రిటిష్‌ ‌ప్రభుత్వంలో చర్చలు జరపాలని నాటి హోంమంత్రి సర్దార్‌పటేల్‌ ‌సూచించినా నెహ్రూ పట్టించుకోలేదు. అదృష్టవశాత్తు లక్షద్వీప్‌, అం‌డమాన్‌ ‌నికోబార్‌ ‌దీవులను కూడా వదులుకోకపోవడం స్వతంత్ర భారత దేశానికి పెద్ద ఊరట.

చైనా వలలో కోకో, కచ్చతీవు

హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రాలతో చైనాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ దేశ తీరాలకు దగ్గరగా కూడా ఈ సాగరాలు లేవు. అయినా ఈ సముద్రాలపై చైనా కన్నేసింది. మయన్మార్‌ అధీనంలో ఉన్న కోకో దీవులు చైనా నియంత్రణలోకి వెళ్లాయి. మయన్మార్‌ ‌వారికి ఈ దీవులను లీజుకు ఇచ్చేసింది. దీంతో చైనా మన దేశంపై నిరంతర గూఢచర్యం కోసం కోకో దీవులను ఉపయోగించుకుంటోంది. అండమాన్‌, ‌నికోబార్‌ ‌దీవులకు సమీపంలో ఉన్న కోకోదీవుల్లో చైనా ఇప్పటికే ఎయిర్‌‌స్ట్రిప్‌, ‌రాడార్‌ ‌స్టేషన్‌ను నిర్మించింది.

మరోవైపు మన దేశం నుంచి శ్రీలంక సాధించు కున్న కచ్చతీవుపై కూడా చైనా పాగా వేసినట్లు తెలుస్తోంది. సముద్రాలపై ఆధిపత్యం కోసం చైనా చేపట్టిన పెర్ల్ ‌గార్లెండ్‌ (‌ముత్యాలహారం) ప్రాజెక్టు కోసం గ్వాదర్‌ (‌పాకిస్తాన్‌), ‌హింగ్‌ ‌హి (మయన్మార్‌), ‌మాల్దీవులు, అంబన్‌థొట్టా (శ్రీలంక) లలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు కచ్చాతీవులో చైనా తిష్ట వేసినట్లు ఆధారాలు లభించాయి.

కోకో దీవులు, కచ్చతీవు భారత భూభాగంలోనే ఉన్నట్లయితే మన దేశ ప్రాదేశిక భౌగోళిక సరి హద్దులు మరింత పటిష్టంగా ఉండేవి. వీటిపై పట్టుకోల్పోవడంతో మన దేశ భద్రతకు ముప్పు పొంచి ఉంది. చైనా పీపుల్స్ ‌లిబరేషన్‌ ఆర్మీ ఇప్పుడు మూడు సముద్రాల్లో స్వేచ్ఛగా విహరిస్తూ భారత దేశాన్ని సవాలు చేస్తోంది. కోకో దీవులు, కచ్చ తీవులను సైనిక చర్య ద్వారా స్వాధీనం చేసుకోవడం భారత దేశానికి చాలా సులభం. కానీ ఇలా చేస్తే అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట మసకబారు తుంది.

నెహ్రూ, ఇందిరల చారిత్రిక, వ్యూహాత్మక తప్పిదాలకు కోట్లాది మంది భారతీయులు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనినే నరేంద్ర మోదీ గుర్తు చేశారు.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram