ఉడిపి పారామెడికల్‌ ‌కాలేజీ ఉదంతం మీద మొత్తానికి పోలీస్‌ ‌యంత్రాంగం ఒక అడుగు ముందుకు వేసింది. సాటి విద్యార్థినిని అసభ్య చిత్రాలను తీసి బహిరంగం చేసినందుకు ముగ్గురు అమ్మాయిల మీద జూలై 27న మాల్పే పోలీసులు కేసు నమోదు చేశారు. నేత్ర జ్యోతి అనే ఆ సంస్థలో ఆ దుర్మార్గం జరిగిన సంగతిని సంచాలకులు రష్మి కృష్ణప్రసాద్‌ అం‌గీకరించినట్టు పోలీసులు చెప్పారు. షబనాజ్‌, అల్ఫియా, అలీమా అనే ముగ్గురు విద్యార్థునులపై కేసు నమోదైంది. ఇందులోని దారుణం ఏమిటంటే, ఈ ముగ్గురు ముస్లిం యువతులు, హిందూ యువతుల అసభ్య చిత్రాలు తీసి తమ వారికి ఎవరికో పంపించారు. ఈ సంగతి తెలిసిన ఒక బాధితురాలు ఆ ముగ్గురిని నిలదీస్తే సరదా కోసం తీసినట్టు వారు కొట్టిపారేశారు. ఆ ముగ్గురు విద్యార్థినులు సంస్థ యాజమాన్యం దగ్గర తమ తప్పుని ఒప్పుకున్నారు కూడా. జూలై 19న ఈ వివాదం బయటకు పొక్కడం, సామాజిక మాధ్యమాలలో హిందూ సంఘాలు ధ్వజమెత్తడం జరిగాయి. దానితో యాజమాన్యం ఆ ముగ్గురిని సంస్థ నుంచి సస్పెండ్‌ ‌చేసింది. ఇద్దరు హిందూ యువతులు స్నానాల గదిలో ఉండగా ఈ ముస్లిం యువతులు ఫొటోలు తీశారు. దానితో ఈ ముగ్గురు యువతులు హిందూ యువతుల ఫొటోలు తీయడమే పనిగా పెట్టుకున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. స్నానాల గదిలో కెమెరా ఏర్పాటు చేసి మరీ ఆ చిత్రాలు తీయడ మంటే సాధారణ విషయంగా పరిగణించడం సాధ్యం కాదని చాలామంది అభిప్రాయం.

నిజానికి ఈ దుర్మార్గానికి పాల్పడిన ముగ్గురు యువతులను పట్టించుకోకుండా, ఈ విషయం మీద సామాజిక మాధ్యమాలలో పోరాడుతున్న వారిని పోలీసులు వేధిస్తున్నారన్నది ఆరోపణ. నిందితులుగా చెబుతున్న ఆ ముగ్గురు విద్యార్థును లను యాజమాన్యం సస్పెండ్‌ ‌చేసిందనీ, నిజానికి ఈ గొడవ సామాజిక మాద్యమాలలో హిందూ సంఘాలు రగడ సృష్టించడంతో పెద్దదయిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇలా వేధింపులకు గురైన వారిలో రష్మి సామంత్‌ ఒకరు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హిందూత్వ వాదుల నోళ్లు నొక్కడానికి ప్రయత్నిస్తున్నదని ఆమె ట్వీట్‌ ‌చేశారు. ఉడిపి బీజేపీ ఎమ్మెల్యే ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు కూడా. రష్మీ సామంత్‌ ‌హిందూ అనుకూల ముద్రతో ఆక్స్‌ఫర్డ్ ‌విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్ష పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కాంగ్రెస్‌, ‌కుహనా లౌకికవాదుల హిందూ ద్వేషం గురించి ఆమె మాట్లాడుతున్నారు. ఇలా ఉండగా జూలై 28న బీజేపీ నాయకురాలు శకుంతలను కూడా పోలీసులు అరెస్టు చేసినా, ఆమెకు వెంటనే బెయిల్‌ ‌లభించింది. ఇలాంటి దుర్ఘటన మీ ఇంట్లోనే జరిగితే మీ స్పందన ఏమిటి అని ఆమె నేరుగా ముఖ్య మంత్రిని ఉద్దేశించి వెలువరించిన ట్వీట్‌ ‌రగడకు కారణమైంది.

రాష్ట్ర, ఉడిపి జిల్లాస్థాయిలో బీజేపీ నాయకులు ఈ అంశం మీద ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఆ ముగ్గురు ముస్లిం యువతుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. బీజేపీ ఉడిపి జిల్లాశాఖ అధ్యక్షుడు సురేశ్‌ ‌నాయక్‌ ‌ప్రత్యేక దర్యాప్తు బృందంతో ఈ ఘటన మీద దర్యాప్తు చేయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం ఈ కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నదని కూడా ఆయన విమర్శించారు. ఆ ముగ్గురు ముస్లిం యువతులతో పాటు మరొక ఇద్దరు అబ్బాయిలు కూడా ఈ వివాదంలో ఉన్నారని నాయక్‌ ‌చెప్పారు. తాము కేశాలతో సహా తనువంతా బుర్ఖాతో, హిజాబ్‌తో కప్పుకోవాలని అనుకునేవాళ్లు, అవతలి మాతానికి చెందిన యువతికి తెలియకుండా అసభ్యంగా చిత్రీకరించి ఆ ఫొటోలు బయటకు ఎలా పంపించారు? అసలు దీని వెనుక ఎవరు ఉన్నారు? విద్యా సంస్థలలో ఇలాంటి దుష్ట సంస్కృతి ఎందుకు ప్రవేశిస్తున్నది? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సిందే. ఒకరి జీవితాన్ని నాశనం చేసే చర్య సరదా అవుతుందా?

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram