– సుజాత గోపగోని, 6302164068

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) హైదరాబాద్‌లో కదం తొక్కింది. తెలంగాణలో విద్యారంగ సమస్యలపై సమర శంఖాన్ని పూరించింది. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని బెంబేలెత్తించేలా భారీ బహిరంగ సభను నిర్వహించింది. కేసీఆర్‌ ‌సర్కారును ఆలోచనలో పడేసింది. గతంలో ఏ విద్యార్థి సంఘం నిర్వహించని రీతిలో సికింద్రాబాద్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో పెద్దఎత్తున సభ నిర్వహించింది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ఏబీవీపీ శ్రేణులు తరలిరావడంతో ఆ మైదానం కిక్కిరిసిపోయింది. ఓ రాజకీయ పార్టీ తరహాలో ఏబీవీపీ భారీ బహిరంగ సభ నిర్వహించడం, విద్యారంగ సమస్యలపై పోరుకు సై అనడం విద్యార్థి వర్గాల్లో జోష్‌ ‌నెలకొంది. అయితే, పూర్తి రాజకీయ రహితంగా కేవలం విద్యార్థి సమస్యల చర్చకు, విద్యారంగంలో సమస్యలను ఎత్తిచూపేందుకే నిర్వాహకులు ఈ సభను వినియోగించుకోవడం గమనార్హం.

రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ‌నేతలు, విద్యార్థులు కదం తొక్కారు. ‘దగా పడ్డ తెలంగాణ విద్యార్థి మార్పు కోసం మరో ఉద్యమం’ అంటూ కదనభేరి పేరుతో పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో ఆగస్టు 1వ తేదీన భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించారు. ఈ సభకు దాదాపు 50 వేల మంది ఏబీవీపీ కార్యకర్తలు తరలివచ్చారు. రాష్ట్రంలో విద్యారంగ పరిరక్షణ కోసం, అవినీతి రహిత తెలంగాణ నవ నిర్మాణానికి పదం పదం కలిపి కదనభేరీని మోగిద్దామని ఈ సభ వేదికగా ఏబీవీపీ తెలంగాణ విభాగం పిలుపునిచ్చింది. ఏబీవీపీ పోరాటంతో నాడు ఎన్నడో గుజరాత్‌లో అధికారాన్ని పోగొట్టుకున్న కాంగ్రెస్‌ ఇం‌తవరకు మళ్లీ అక్కడ గద్దె నెక్కలేదు. అలాంటి ఉద్యమమే తెలంగాణలో చేస్తామని, ఏ పార్టీకో మేం బీ టీం కాదని, ప్రభుత్వాలు ఏవైనా విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక పోరాటాలు చేస్తామని, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ తీరుపైనా ఆందోళన చేసిన నేపథ్యాన్నీ విద్యార్థి పరిషత్‌ ‌గుర్తు చేసింది.

వంద వైఫల్యాలపై ఛార్జ్‌షీట్‌

‌రాష్ట్ర ప్రభుత్వ వంద వైఫల్యాలపై ఈ బహిరంగ సభలో ఏబీవీపీ నాయకులు ఛార్జ్‌షీట్‌ ‌విడుదల చేశారు. లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం అరకొర ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నదని, ఉద్యోగ క్యాలెండర్‌ ‌విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా ఇచ్చిన వాగ్దానం వమ్ము అయ్యిందని సభ ఆక్షేపించింది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ ‌లీకేజీతో లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలను ఆడుకుంటున్నదని ఆరోపించింది. లీకేజీలు, ప్యాకేజీలతో కేసీఆర్‌ ‌కుటుంబం రాజభోగాలు అనుభవిస్తున్నదని, మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడుదామని ఏబీవీపీ పిలుపునిచ్చింది. కేసీఆర్‌ ‌సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఏబీవీపీ పని చేస్తుందని, విద్యార్థుల సమస్యలపై పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామని ఏబీవీపీ జాతీయ, రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు. ఏబీవీపీ ఆర్గనైజేషనల్‌ ‌జాతీయ సెక్రటరీ ఆశిష్‌ ‌చౌహన్‌•, ‌జాతీయ జాయింట్‌ ‌సెక్రటరీ బాలకృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి యాజ్ఞవల్క్య శుక్లా, సీడబ్ల్యూసీ సభ్యుడు శ్రవణ్‌ ‌బి. రాజ్‌, ‌జాతీయ కార్యదర్శి అంకితా పవార్‌ ‌సహా రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థి నాయకులు ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు. బీజేపీ నేతలు మురళీధర్‌ ‌రావు, మనోహర్‌ ‌రెడ్డి, ఈటల రాజేందర్‌ ‌సహా పలువులు ఈ సభకు హాజరయ్యారు.

రాష్ట్రంలో విద్యామాఫియా:యాజ్ఞవల్క్య

తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థను మాఫియాగా మార్చిందని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యాజ్ఞవల్క్య శుక్లా ఆరోపించారు. విద్యాలయాలను సమస్యల నిలయంగా మార్చిన ఈ సర్కారు అవసరం లేదని, విద్యార్థుల పక్షాన నిలిచే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలు భారత్‌ ‌వైపు చూస్తుండగా, తెలంగాణలో మాత్రం అవినీతి రాజ్యం ఏలుతుందని అన్నారు. తెలంగాణ విద్యార్థి లోకం సీఎం కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతుందని, ఆయనను ప్రగతిభవన్‌ ‌నుంచి తరిమికొట్టే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కార్పొరేట్‌ ‌కళాశాలలను పొలిమేర నుంచి తరిమేస్తామన్న కేసీఆర్‌.. ‌కానీ ఇప్పుడు వారికే అండగా నిలుస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌.. ‌భ్రష్టాచార్‌ ‌రాష్ట్ర సమితిగా మారిందని, లిక్కర్‌ ‌స్కామ్‌ ‌ద్వారా ఆ పార్టీ నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు. రాష్ట్రంలో విద్యా రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని, పేపర్‌ ‌లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని ధ్వజమెత్తారు.

కుటుంబానికే ప్రాధాన్యం: ఆశిష్‌ ‌చౌహన్‌

‌పదేళ్లలో తెలంగాణ సర్కారు విద్యారంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని, సీఎం కేసీఆర్‌ ‌ప్రగతి భవన్‌లో కూర్చొని కుటుంబ ప్రగతిని మాత్రమే సాధించారని ఏబీవీపీ ఆర్గనైజేషనల్‌ ‌జాతీయ సెక్రటరీ ఆశీష్‌ ‌చౌహాన్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మరుగుదొడ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యాపకుల నియామకం ఎందుకు చేపట్టట్లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను దోచుకున్న కేసీఆర్‌, ఇప్పుడు దేశం మీద పడబోతున్నారని, ఆయన పతనం ఈ సభతోనే ఆరంభం అంటూ ఆశిష్‌ ‌మండిపడ్డారు.

జాతీయ కార్యదర్శి అంకితా పవార్‌ ‌మాట్లాడుతూ తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక, పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సదుపాయాల్లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20 వేల టీచర్ల పోస్టుల భర్తీ వెంటనే చేపట్టాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ డిమాండ్‌ ‌చేశారు. వెంటనే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి లక్షా 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. బకాయిపడ్డ విద్యార్థుల మెస్‌ ‌ఛార్జీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

డిమాండ్ల నివేదన

ఈ సభ ద్వారా ఏబీవీపీ పలు డిమాండ్లను బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ముందు ఉంచింది. రాష్ట్రంలో మూతబడిన 8 వేల 624 పాఠశాలలను తక్షణమే తిరిగి ప్రారంభించాలని, తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 20 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, బకాయిలు పడ్డ 5 వేల 300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌స్కాలర్‌ ‌షిప్స్‌ను తక్షణమే విడుదల చేయాలని, టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి, లక్షా 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ ‌చేసింది. అంతేకాదు, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 75 శాతం బోధన, బోధనేతర పోస్టు లను భర్తీ చేయాలని సర్కారుకు ఈ సభ అల్టిమేటం జారీ చేసింది.

ప్రవాస భారతీయుల మద్దతు

పూర్వ విద్యార్థులు, ప్రవాస భారతీయులు (అమెరికా) ఏబీవీపీ కదనభేరికి పూర్తి మద్దతు తెలిపారు. విలాస్‌రెడ్డి జంబుల, శ్రీకాంత్‌ ‌తుమ్మల, శ్రీనివాస్‌ ‌కొంపల్లి, సంతోష్‌ ‌రెడ్డి, బుచ్చన్న గాజుల, నరేందర్‌ ‌గౌడ్‌ ‌దోసపాటి, బాలవర్ధన్‌, ఆదిత్య రాయుడు, భరత్‌ ‌గోలి, రామకృష్ణ, రఘువీర్‌, ‌రామ్‌ ‌వేముల, ప్రదీప్‌ ‌కట్ట తదితరులు ఈ సభకు తమ మద్దతును తెలిపారు.

సభ విజయంతో ఏబీవీపీలో కొత్త జోష్‌

ఇటీవలి కాలంలో విద్యార్థి పరిషత్‌ ‌నిర్వహించిన అద్భుత కార్యక్రమంగా ఈ సభను అభివర్ణించవచ్చు. వాతావరణం ఎలా ఉంటుందో! వర్షంతో ఎక్కడ ఆటంకం ఏర్పడుతుందోనని రాజకీయ పార్టీలు సైతం బహిరంగ సభల్ని వాయిదా వేసుకున్న పరిస్థితి నెలకొంది. కానీ, విద్యార్థి ఉద్యమాలతో అలుపెరగని పోరాటం చేస్తున్న విద్యార్థి పరిషత్‌ ‌సంకల్పానికి వరుణుడు, ప్రకృతి సైతం సహకరించాయి. సభకు హాజరైన ప్రతిఒక్కరూ అద్భుతంగా మాట్లాడారు. విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపారు. నగర పోలీస్‌ ‌యంత్రాంగం కూడా సభకు సహకరించిందని విద్యార్థి నాయకులు చెప్పారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ ‌పోలీసులు సభ జరిగిన నలుమూలలా ఎక్కడికక్కడ వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram