– విజయశ్రీముఖి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


పోలీస్‌ ‌స్టేషన్‌…

‘‘‌మేడమ్‌, ‌యస్‌.ఐ.‌గారు మిమ్మల్ని రమ్మంటున్నారు, వెళ్లండి•.’’

కానిస్టేబుల్‌ ‌పిలుపుతో రవ్వంత బెరుకుగా, లోపలికి వెళ్తూ..

‘నిన్న తోడుగా అపర్ణ వచ్చింది. కానీ, స్టేషన్‌ ‌నిండా జనం, గందరగోళంగా  ఉండటంతో ఈరోజు రమ్మన్నారు.

తనకి పనుండి ఈవేళ రాలేదు.

ఏమిటో..పోలీస్‌లను, ఖాకీడ్రెస్‌లను చూస్తుంటే భయం, అభయం కూడా కల్గుతుంటాయి’ మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళింది హంసలేఖ.

‘‘చెప్పండి. మీపేరు, ఎక్కడ ఉంటారు ఏమిటి మీ ఇబ్బంది?’’

యస్‌.ఐ.అడిగినవాటికి జవాబులు చెప్పిందామె.

‘‘ఆ పక్క గదిలో రైటర్‌గారుంటారు. వెళ్లి కంప్లైయింట్‌ ‌రాసివ్వండి.’’

యస్‌.ఐ. ‌మాటతో అటు నడిచింది.

తలవంచి రాసుకుంటున్న రైటర్‌ ‌జేబుమీదున్న నేమ్‌ప్లేట్‌పై పేరు కనిపిస్తోంది.. ధర్మారావు అని.

‘‘నమస్తే సర్‌’’ అం‌ది హంసలేఖ.

కిందికి జారిన కళ్లద్దాల పైనించి చూస్తూ అన్నాడు ఆయన

‘‘నమస్తే, చెప్పండి …’’ ఆగాడు.

‘‘కంప్లైయింట్‌ ఇవ్వడానికి వచ్చాను సర్‌’’ అం‌దామె.

‘‘మీరూ అందుకే వచ్చారా? ఈరోజు ‘కార్తీక విదియ’ కదా…ఏ సోదరీమణి  ఐనా భగినీహస్త భోజనానికి రమ్మని  పిలవటానికి వస్తారేమోనని ఆశగా  చూస్తున్నానులెండి. సరే, కూర్చోండి’’ ఎదురుగా ఉన్న కుర్చీ చూపాడు.

చిన్నగా నవ్వింది హంసలేఖ

ఇప్పుడామెకు బెదురు పోయినట్లు, తేలిగ్గా అనిపించింది.

కుర్చీలో కూర్చున్న ఆమె ముందుకు  వైట్‌ ‌పేపర్‌ ‌పెట్టిన పేడ్‌, ‌పెన్‌ ‌జరిపి ‘‘రాయండి’’ అన్నాడు రైటర్‌.

  ‌కుడిచేతి బొటనవేలుకున్న కట్టుని  చూపుతూ చెప్పింది హంసలేఖ

‘‘కూరగాయలు కోస్తుంటే పొరపాటున తెగి, బాగా గాయమయ్యింది. చెప్తానండీ, రాస్తారా’’ అడిగింది.

    పేడ్‌ ‌తన ముందుకు లాక్కుని  ‘‘చెప్పం డమ్మా’’ అన్నాడు.

చెప్పసాగింది హంసలేఖ

‘‘నేను జూనియర్‌ ‌కాలేజీ లెక్చరర్‌గా చేస్తున్నా నండీ. నా భర్త కూడా  ఒక ప్రభుత్వోద్యోగే. నేని క్కడ, ఆయన..’’ చెప్పటం ఆపి, ‘‘మీరు రాయడంలేదు’’  అడిగింది హంసలేఖ.

‘‘మీరు విషయం మొత్తం చెప్పండి. దాన్ని క్రమపద్ధ్దతిలో రాస్తాను.’’

అన్నాడు రైటర్‌.

‌చెప్పసాగింది హంసలేఖ

‘‘మాకు ఇద్దరు బాబులు. తొమ్మిది, ఏడు తరగతులు చదువుతున్నారు. ఉద్యోగాలు మూలంగా చెరొక ఊర్లో ఉంటున్నాం. శని, ఆదివారాల్లో తను ఇక్కడకు వచ్చి వెళ్తుంటారు…’’

   ఆగింది హంసలేఖ.ఆమె చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు రైటర్‌.

 ‘‘‌కొన్నాళ్లుగా ఆయన ప్రవర్తనలో మార్పు గమ నించాను. ఇంటి విషయాలు కూడా పట్టించుకోక పోవడంతో ఆరా తీశాం.

…గత మూడేళ్లుగా ఆయన అక్కడ ఎవరో ఒక మహిళతో బాగా సన్నిహితంగా ఉంటున్నట్లు తెల్సింది.. అడిగితే ముందు బుకాయించినా, తర్వాత  ‘‘అవును. అయితే నువ్వేం చేస్తావ్‌?’’ అన్నారు.

‘‘ఏం చేస్తాను? ఇద్దరం చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నవాళ్లం. అరుచు  కుంటే పిల్లల ముందు, వినే వాళ్లకు అసహ్యంగా ఉంటుందని  మౌనంగా           ఉండిపోయాను.

అప్పటి నుండి ఆయన వచ్చిన్నాడు పిల్లలతో పాటు వండి పెట్టడం.. వెళ్లి పోతే నాపనేదో నేను చూసుకోవడం చేస్తున్నాను.’’ అంది హంసలేఖ.

 ‘‘అలా చేస్తు న్నందుకు మీరు గట్టిగా వ్యతిరేకించ లేదా?’’ అడిగాడు రైటర్‌.

 ‘‘‌లేదు…’’ అందామె.

ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు.

కొద్దిక్షణాలు ఎటో చూస్తూ నిశ్శబ్దంగా ఉండి పోయింది హంసలేఖ. తర్వాత  నెమ్మదిగా స్పష్టంగా చెప్పసాగింది…

‘‘సర్‌! ‌భర్తగాని..ఎవరైనా సరే, మనల్ని  తమకు తాముగా మనస్ఫూర్తిగా అభిమానించటమో, ప్రేమించటమో చేయాలి. మనం నచ్చకో, వాళ్లకిష్టం లేకనో దూరం జరిగేప్పుడు, మనం  వాళ్లను  అడు క్కోవడం, వెంటపడి,  ఏడ్చి..అరచి అల్లరిచేసి.. కేవలం మనిషిని మాత్రమే పొందగలగడం అవసరమా? నే నలా ఇష్టపడనండి’’ ఆమె మాటల్లో విసుగు విరక్తి మిళితమైనట్లు అనిపించింది రైటర్‌ ‌కి. ‘‘కానీ…మీకు పిల్లలున్నారు.వాళ్లకు తండ్రి…’’

రైటర్‌ ‌మాటలకు మధ్యలోనే అంది

‘‘అందుకేగా వచ్చినప్పుడు వాళ్లతో  పాటు వండిపెట్టేది?’’ చెప్పింది.

ఆయనకేవో సందేహాలున్నా…అడగ లేక పోయాడు.

  ‘‘అలాంటప్పుడు ఇంక మీ ఫిర్యాదు ఏమిటి? ఎవరి మీద?’’ అన్నాడు.

‘‘అదే చెప్తున్నాను. ఆయనీ మధ్య  నెలజీతాలు రాగానే వచ్చి, నాజీతంలో ఎంతోకొంత ఇమ్మని అడగటం… ఇవ్వకపోతే..అరుపులు కేకలు తిట్లు  ఇంట్లో రగడ…గోలెందుకని కొన్నాళ్లు తప్పక ఇచ్చి, ఇబ్బంది పడేదాన్ని. కానీ ఎన్నాళ్లు? పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు…పైగా ప్రతినెలా కట్టే  ఇ.ఎమ్‌. ఐ.‌ల్లాంటివి ఎన్ని ఉన్నాయి?  ‘‘నా జీతంతో ఇల్లు గడుపుకుందాం’’ అంటూ కొన్న ఫ్లాట్‌కి, వెహికల్స్‌కి నా జీతంలో లోన్లు పెట్టించా రప్పుడు. తనేం పట్టించుకోకపోగా, నెలనెలా ఈ టార్చర్‌ ‌భరించలేక పోతున్నాను.’’

మౌనంగా విన సాగాడు రైటర్‌.

‘‘…ఆయన వచ్చిన ఆ ఒక్కపూట పిల్లల్ని ఇంట్లో లేకుండా ట్యూషన్‌ ‌కో,  సెలవైతే ఆడుకోడానికో పంపిస్తాను.’’

ఆగి ఆగి చెప్తోంది హంసలేఖ

‘‘…ఇరుగు పొరుగువాళ్లు  అలా పంపటం మా ఏకాంతానికి కాబోలు అనుకుంటారు. కానీ, తిట్లలో ఆయన వాడే భాషా, ఇవ్వనందుకు నన్ను..’’

ఆగిపోయిందామె.

కళ్లు వాల్చుకుని రైటింగ్‌ ‌పేడ్‌ ‌వైపు  చూడ సాగాడు రైటర్‌.

‘‘..‌తల్లిగా, వాళ్లను సరిదిద్దే పెద్దగా ఉన్న నేనే వాళ్ల  కళ్ల ముందు తిట్లు, దెబ్బలు తింటూ పడి ఉంటే..పిల్లలకు గౌరవం, భయంలాంటివి ఎందుకు ఉంటాయి? ఇలాగే పెరుగుతూంటే రేపువాళ్లెలా తయారవుతారు?  మొన్న కూడా ఇదే జరిగింది. మరింత భయంకరంగా. ఇంక  భరించే ఓపిక నాకు లేదు సర్‌…

ఆయనతో అవసరాలు, హక్కులూ  నేనేం ఆశించటంలేదు. ఇక మీదట మా జోలికి రాకుండా, మమ్మల్నింకా హింసించకుండా ఉంటే..అంతే చాలు మాకు.’’

   చెప్పటం ముగించి, తన హ్యాండ్‌  ‌బ్యాగ్‌లో నుంచి నీళ్ల బాటిల్‌  ‌తీసుకొని తాగింది. చేతి రుమాలుతో నుదుటిపై, చెంపలపై పట్టిన చిరు చెమటలను అద్దుకుంది హంసలేఖ.

  పైన ఫ్యాన్‌ ‌తిరుగుతున్నా ఆమెకు చెమటలు పడుతున్నాయంటే,ఎంత మానసిక ఒత్తిడికి లోనవు తోందో … అర్ధమౌతోంది రైటర్‌కి.

అలవాటయిన కంప్లైంట్లే కనుక చకచక రాస్తూనే  అడిగారాయన.

‘‘మీ ఫిర్యాదు మీ భర్తపై మాత్రమే కదా?’’ అని.

అప్పుడే గుర్తుకు వచ్చినట్లుగా అంది, ‘‘మా అత్తా మామగార్ల పేర్లు కూడా చేర్చండి. వాళ్ల  పేర్లు…’’

రాస్తున్నవాడల్లా ఆగి తలెత్తి చూస్తు అడిగాడు

‘‘వాళ్లు కూడా ఆయన్ని సపోర్ట్ ‌చేసి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? వాళ్లెక్కడ ఉంటున్నారు?’’ అని.

‘‘మా అత్తామామగార్లు మాతో కాక, వేరుగా కాస్త దూరంగా ఉంటారు’’ చెప్పింది హంసలేఖ.

‘‘అది సరేనండీ…మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో ఆయనకు వాళ్ల నుండి  ప్రోత్సాహం ఉందా? లేకపోతే, వాళ్లు కూడా మిమ్మల్ని ఏదోకటి అంటూ సతాయిస్తూ ఉంటారా?’’ అడిగాడు.

ఒక్క నిమిషం ఆగి. ‘‘నిజానికి కొడుకు ప్రవర్తన వాళ్లకూ నచ్చడం లేదండీ. ఇద్దరూ  వయసు పైబడిన వాళ్లే. చెప్పినా వినటం లేదని వదిలేసి ఊరు కున్నారు’’  చెప్పింది.

‘‘మీతో, పిల్లలతో ఎలా ఉంటారు?’’

‘‘వాళ్లొక చోట, మేమిక్కడ  కదా.. కలిసినప్పుడు బాగానే ఉంటారు.’’

‘‘మరెందుకు వాళ్లని కూడా చేర్చడం’’ సందేహంగా అడిగాడు రైటర్‌.

‘‘‌ఫోర్‌ ‌నైన్టీ ఎయిట్‌ -ఎ. ‌సెక్షన్‌ ‌గృహ హింస.. చట్టం కింద  కుటుంబంలో మిగతా వాళ్లను కూడా ఇరికిస్తే కేసు బలంగా ఉంటుందనీ…మా వాళ్లు చెప్పారు…’’  చెప్పింది హంసలేఖ.

ఆమె మాటలు విన్న రైటర్‌ ‌చేతిలోని  పెన్‌ ‌ప్రక్కన పడేశాడు. కనిపించనివ్వని విసుగుతో, హంసలేఖ వైపుచూస్తూ  అన్నాడు

‘‘కేసు, సెక్షన్ల మాట అలాఉంచి… ఒక సోదరిలా మీతో ఒక్క నిమిషం మాట్లాడవచ్చా?’’ అని.

‘‘తప్పకుండా  సర్‌’’ అం‌దామె.

‘‘చూడండమ్మా! మిమ్మల్ని వారించడమో, మీ వాళ్లను వద్దని  చెప్పడమో కాదు నా ఉద్దేశ్యం.  వేరు వేరు కారణాలకు కూడా ఈ సెక్షన్ని కొందరు దుర్విని యోగం చేస్తున్నారు.

హింసించే అత్తా మామ, ఆడపడుచులు లేరనను  కానీ, సంఘటనలకు దూరంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వాటిలోకి లాగుతున్నారు కొందరు. ఏమంటే, కేసుకి  బలం కోసం అంటున్నారు…’’

ఆగి ఆమె వైపు చూశాడు.

‘వింటున్నాను’ అన్నట్లు తలూపింది.

‘‘…మీ అత్తామామ గార్లు వృద్ధులు అంటున్నారు, పైగా కొడుకు చేష్టలు వాళ్లకు కష్టంగా ఉన్నాయని, వారు  చెప్పినా  వినటంలేదనీ  మీరే అంటు న్నారు. మరి…వారినెందుకు దీనిలో కలపడం? ‘‘

‘‘అలాగైతేనే కేసు బలంగా…’’

‘‘కేసుబలం కోసం వృద్ధుల్ని బాధపెడతారా? ఈవయసులో వాళ్లను అకారణంగా స్టేషన్లని, రిమాండ్‌ ‌కని, కోర్టులకు తిప్పటం న్యాయమా?

మీ ఆయన మీపట్ల ప్రవర్తించే దానికి, మీరు చేయాలనుకునే దానికి తేడా ఉందా? మీరు చదువుకున్నవారు, తార్కికంగా ఆలోచించండి’’

‘‘…………..’’

‘‘ఇలా మేమేదైనా చెప్పామనుకోండి. పోలీసోళ్లు  అవతలివాళ్ల  దగ్గర డబ్బులు తినేశారు. అందుకే అటు మాట్లాడుతున్నారనే అపవాదులు వేసి   ప్రచారం చేస్తారు కొంతమంది.

మీరెలాచెప్తే అలాగే రాస్తాను. మీరు చూసి సంతకం చేద్దురుగాని’’ నిర్ణయం మీదే అన్నట్లు చూశాడు. కొన్నిక్షణాలు తర్వాత అందామె,

‘‘వృద్ధ్దాప్యందేముంది సర్‌! ‌వద్దన్నా వచ్చి మీద పడుతుంది.

ఆనందంగా జీవితాన్ని అనుభవించాల్సిన వయస్సులో నేనిలా కృంగి పోవటం మాత్రం భావ్యమా? నాకు  మాత్రం ఎందుకీ వ్యథ? పెంపకం అలా ఉన్నందుకు వాళ్లకీ ఆ మాత్రం శిక్ష ఉండాలి లెండి.’’ ఆమె గొంతులో కాస్త కరుకుదనం

ధ్వనించటం గమనించాడు రైటర్‌.

‌హంసలేఖ ఆలోచనలో పడింది. ‘ఇద్దరు పిల్లల్లో పెద్దాడు నెమ్మదే గానీ, చిన్నాడు కాస్త గోలగాడే. వాడున్నూ తండ్రిలాగే తినే రుచుల్లో ఒకలాంటివే ఇష్ట పడతాడు.

ఖర్మగాలి రేపుపెద్దయ్యాక వాడికీ  తండ్రి బుద్దే వస్తే?  మైగాడ్‌ ! అప్పుడు నేనెలా స్పందించాలి…??

కొన్ని నిమిషాల తరువాత చటుక్కున లేచి నిలబడింది ఆమె.

ప్రశ్న్తార్ధకంగా చూశాడు రైటర్‌.

‘‘‌మీరు నాకో ప్రశ్నను సంధించి, నాలో అలజడి రేపారు. రేపు మా అత్తా మామగార్లను కూడా ఇక్కడకు పిల్చుకొస్తానండి. పరిస్థితి అంతా వారికీ తెల్సు కనుక, వారినే కంప్లైయింట్‌ ఇమ్మంటాను. వారు మాపై చూపించేది కేవలం సానుభూతో, సమన్యాయమో మీకు, నాకుకూడా విషయం పూర్తిగా అర్థ్ధమైపో తుంది కదా? వాళ్లతో  పాటు వస్తానండీ, నమస్తే!’’ చేతులు జోడించి చెప్పింది.

బైటకువెళ్లిన హంసలేఖ అక్కడనిల్పి ఉంచిన తన స్కూటీని స్టాండ్‌ ‌తీసి, ముందుకు దూసుకు పోవటం కిటికీలో నుండి రైటర్‌కి కనిపిస్తూనే ఉంది.

About Author

By editor

Twitter
YOUTUBE