– పి. చంద్రశేఖర ఆజాద్‌, 9246573575

ఎం‌డివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన


‘‘నీకు చూడాలని ఉందా?’’

‘‘పిలిస్తే వెళ్లాలి కదా’’.

‘‘రసజ్ఞ ఇప్పుడు ఆక్స్‌ఫో••ర్డ్ ‌యూనివర్సిటీలో చదువుతోంది. భువనకి అదో గర్వం. దాని చదువు ఎప్పుడు పూర్తి అవుతుందో, అసలు భువనకి ఆ అదృష్టం ఇస్తుందో లేదో తెలియదు’’.

‘‘అంటే….’’

‘‘రస ఏ బ్రిటన్‌ ‌కుర్రాడ్నో, ఆస్ట్రేలియన్నో చేసు కోదని గ్యారంటీ ఉందా అమ్మా…? అసలు ఇండియా లోనే పెళ్లి చేసుకోదు. లండన్‌లో ఓ రిసెప్షన్‌ ఇస్తారు. అప్పుడు పిలిస్తే నిన్ను పంపిస్తాను’’.

తులసి అప్పుడు వసుంధర ముఖంలోకి చూసింది. ఏదో అనబోతుంటే… అప్పుడే సుడిగాలిలా సరయూ వచ్చింది.

తులసి చెంపలకి తన చెంపను తాకించింది.

‘‘గ్రాండ్‌ ‌మా… నేనూ రాహుల్‌ ఇం‌డియా వెళ్తున్నాం’’.

‘‘ఇప్పుడే అమ్మ చెప్పింది’’

‘‘మేం అమరావతి వెళ్తున్నాం. ఇప్పుడు నీకు చిన్ననాటి మెమరీస్‌ ‌గుర్తు వస్తున్నాయా?’’

‘‘వస్తుంటాయి. కనక దుర్గమ్మ గుడి-పక్కన కృష్ణ-గుర్తుకు రాకుండా ఎలా ఉంటాయి?’’

‘‘ తిరిగి వచ్చేటప్పుడు అక్కడ నుంచి నీకు ఏం తీసుకుని రమ్మంటావు?’’

‘‘నువ్వు తిరుమల వెళ్తావు కదా’’.

‘‘ఆ….’’

‘‘ప్రసాదం తీసుకురా సరయూ’’ అంది

*******

డోర్‌ ‌బెల్‌ ‌మోగింది.

హారిక వచ్చి తలుపు తెరిచి ఆశ్చర్యంగా చూసింది.

ఎదురుగా రిత్విక్‌ ‌నిలబడి వున్నాడు.

‘‘ఇదేంటి… ఎలాంటి కబురూ లేకుండా వచ్చారు!’’

చిన్నగా తలూపాడు.

‘‘సాంతం వచ్చేసారా?’’

‘‘లోపలకు రానిస్తావా?’’

అన్నాడు.

‘‘మిమ్మల్ని చూసిన సంతోషంలో ఏదేదో మాట్లా డేస్తున్నాను’’ అంటూ అడ్డం తప్పుకుంది. ఓ పక్కన ఏం జరిగి వుంటుంది? అన్న ఆలోచన పరుగులు తీస్తూనే వుంది.

‘‘కాఫీ ఇస్తావా?’’

‘‘అంతకంటేనా?’’ అంది ఆనందంగా. అప్పటి కప్పుడు తయారుచేసి తీసుకొచ్చింది.‘‘ఎన్ని రోజు లయింది నీ చేతి కాఫీ తాగి’’ అన్నాడు.  తననే చూస్తుంటే….

‘‘రాజన్‌ అనే ఆయన ఉన్నారు. ఆయన టీ ఇస్తు న్నప్పుడల్లా నువ్వు గుర్తొస్తావు. ఈ టీ హారిక కూడా రుచి చూస్తే బాగుంటుంది కదా అని’’ అన్నాడు.

హారికకి తన ఎదురుగా ఉన్నది రిత్విక్‌ అని నమ్మాలనిపించటం లేదు. కొన్ని దశాబ్దాల తర్వాత ఇంటికి వచ్చిన స్నేహితుడిలా వున్నాడు. తన గదికి వెళ్లాడు.

‘‘ఉత్తరాలు వచ్చాయా…’’ అంటూ మూడు ఉత్తరాలు అందుకున్నాడు.

కళ్లల్లో వెలుగు కనిపిస్తోంది.

రిత్విక్‌ ‌మాట్లాడితే బాగుండుననిపిస్తోంది.

‘‘ఇల్లు కొత్తగా ఉంది హారికా!’’

‘‘పది రోజులు బయటకి వెళ్లి వచ్చినప్పుడు అలానే ఉంటుంది. ఇల్లు పాతదే… హారికా పాతదే…’’

‘‘నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు. ఇప్పుడు పిల్లల్ని చూడాలనిపిస్తోంది. మనవళ్లను చూడాలనుంది’’.

‘‘బ్యాగ్‌ ‌సర్దుకుంటాను. పదండి. ఏది దొరికితే దానిలో వెళ్దాం’’ అంది హారిక…

‘‘గోవింద్‌గారు నన్ను ఇంటికి వెళ్లమన్నారు’’.

‘‘మంచిదే కదా… అయినా ఎందుకు రమ్మ న్నారు? ఇప్పుడు ఎందుకు వెళ్లమన్నారు?’’ అంది.

‘‘నిన్ను చూసి రమ్మని’’.

‘‘బాగానే ఉంది’’.

‘‘నిజం హారికా… ఇంతకు ముందు బయటకు వెళ్లటం అంటే నాకు ఇష్టం. ఇప్పుడు అలా అని పించటం లేదు. నిన్ను చూసి చాలా రోజులు అయి పోయినట్లు అనిపించింది. గోవింద్‌గారు అది గమనించినట్లున్నారు. దిగులు పడుతున్నావా అన్నారు. అదేం లేదు అన్నాను. అలాకాదు ఓ సారి ఇంటికి వెళ్లి రెండు రోజులు ఉండిరా. ఈ లోగా నువ్వు చేయవలసిన పనులుంటే పూర్తి చేసుకో. తర్వాత మళ్లీ కుదరకపోవచ్చు అన్నారు’’.

‘‘రెండు రోజులు ఉంటున్నారన్నమాట’’.

‘‘అవును. మిత్రుల్ని కూడా కలవాలి. ఆయన వచ్చేటప్పుడు నాకు లక్ష రూపాయలు ఇచ్చారు’’.

‘‘నిజంగానా!’’ అంది.

‘‘ఇందులో అబద్ధం చెప్పటానికి ఏముంది? బ్యాంక్‌ ఎకౌంట్‌ ‌డిటైల్స్ అడిగారు. నేను చెప్పలేదు. వచ్చే ముందు కవర్‌ ‌చేతిలో పెట్టారు’’.

‘‘ఇంతకూ మిమ్మల్ని ఎందుకు పిలిచినట్లు?’’

‘‘నాకింకా పూర్తిగా క్లారిటీ రాలేదు హారికా… కొంత అర్థం అయింది. ఇంకా అర్థం కావలసి ఉంది. ముందు నేను విశ్వం గారిని కలవాలి’’ అని….

‘‘ఆయన సినిమా రచయిత’’.

‘‘గుర్తొచ్చింది’’.

‘‘మనం రాత్రికి మాట్లాడుకుందాం. అందులో నువ్వు ఏభై వేలు తీసుకో… నువ్వు పిల్లల దగ్గరకు వెళ్తానన్నావు కదా. అది ప్లాన్‌ ‌చేసుకో…. ఈసారి ఖాళీ దొరికితే నేను నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాను’’ అన్నాడు.

తలూపింది. అతను స్నానం చేసి బయటకు వెళ్లిపోయాడు.

*******

విశ్వం ఓ గెస్ట్ ‌హౌస్‌లో కథా చర్చలో వున్నాడు.

అప్పుడు ఆయన అసిస్టెంట్‌ ‌వచ్చి, ‘‘మీ కోసం రిత్విక్‌ అని ఒకాయన వచ్చారు. పంపించమంటారా’’ అన్నాడు.

‘‘నేనే వస్తున్నా’’ అన్నాడు.

అక్కడున్న వారితో ‘‘మీరు ఆ సీన్‌ని ఎలా ఆరంభించాలి…. మిడిల్‌ ఏమిటి… ముగింపు ఏంటి అనేది మాట్లాడుతుండండి’’ అనగానే వాళ్లు అదోలా చూసారు.

‘‘కథకే కాదు. ప్రతి దృశ్యానికి ఈ మూడు లక్షణాలు ఉండాలి. ప్రారంభిం చటం కష్టం. మిడిల్‌ ఇం‌కా కష్టం. ముగింపు తర్వాత దృశ్యానికి కొన సాగింపుగా వుండాలి. చిన్న సీన్‌ అని అనుకోవద్దు. ఒక్కోసారి అవే సినిమాని, మనందరి ఫేట్‌ని మలుపు తిప్పుతాయి’’ అని వచ్చాడు.

హాల్లో రిత్విక్‌ ‌కూర్చునున్నాడు.

ఆయన్ని చూడగానే లేచాడు…

‘‘నిన్ను ఇంతకు ముందు చూసినట్లుంది. నన్ను కలిసావా?’’

‘‘దూరం నుండి చూసాను. మీతో ఓసారి మాట్లాడాలనుకున్నా కుదరలేదు. ఇదే మొదటిసారి కలవటం’’

‘‘కూర్చో’’ అన్నాడు విశ్వం.

‘‘ఇప్పుడు గుర్తొచ్చింది. గోవింద్‌ ‌నీ నవలకు బహుమతి ఇచ్చాడు. ఆ నవల నేను చదివాను. అదే కాదు నీ పేరూ నాకు గుర్తుంది. ఇతర పత్రికల్లో నీ రచనలు చదివాను. ముందు ఈ రిత్విక్‌ ఎవరు-బెంగాలీ పేరు పెట్టుకున్నాడు అనుకున్నాను. సినిమాలకు వర్క్ ‌చేసావా?’’

‘‘అవంత చెప్పుకోదగినవి కాదండి. టీ.వీ.కి చేసాను’’.

‘‘బాగుంది. ఇప్పుడు అది కూడా తక్కువ కాదు. నీ గురించి గోవింద్‌ ‌చెప్పాడు. ఇప్పుడు నేను నా కథ రాసుకున్నా… అందులో సినిమా ప్రభావం  ఉంటుంది రిత్విక్‌… ‌నాకు మట్టివాసన కావాలి. నేను రైతు కుటుంబం నుండి వచ్చాను’’.

‘‘అంతేకాదు. చాలా మైన్యూట్‌ ‌డిటైయిల్స్ ఉన్నాయి. అవన్నీ బయటకు రావాలంటే నీలాంటి రచయిత నాకు కావాలి. అసలు ఈ జీవితం అంటే ఏమిటి అనే ఆలోచన అందరికీ రావాలి. కనీసం కొంత మందికి. ఇక్కడ నో డ్రామా… అదంతా మా జీవితాల్లో ఉంది. దానికి ఎలాంటి రంగులూ అద్దకుండా ఓ తండ్రి కథ చెబుదాం. ఓ దురదృష్ట వంతుడయిన తండ్రి కథ’’ అంటున్నప్పుడు ఆయన కళ్లల్లో నీటిపొర కదిలింది.

‘‘నాకు డెత్‌ ‌గురించి బాగా తెలుసు సర్‌. ‌చిన్నప్పుడు నా తండ్రిని పోగొట్టుకున్నాను. ఆ పెయిన్‌, ఆ ఎడబాటు నాకు తెలుసు’’.

‘‘విషాదం నుండే మహాకవులు పుడతారు రిత్విక్‌. ‌రామాయణం అలానే పుట్టిందంటారు. ఇప్పుడు మనం ఏడవటం మరిచిపోయాం. నవ్వూ, ఏడుపు కూడా వ్యాపారంలో భాగం అయిపోయాయి. ఇక్కడ నేను చాలా తప్పులు చేసాను. ప్రేక్షకులకి ఏది అందించాలో అది ఇవ్వలేదు. ఈ రోజు సమాజంలో ఇన్ని రకాల దుష్ట పరిణామాలకు మేం కూడా ఓ చెయ్యి వేసాం. అందుకే పాపపరిహారంగా నా పుస్తకం ఉండాలనుకున్నాను. నీ ఎవైలబిలిటీ ఏంటి?’’

‘‘నేను మీకు ఎప్పుడయినా అందుబాటులో ఉంటాను’’.

‘‘ఇక్కడ సమయం దొరకదు. ఎవరో ఒకరు డిస్ట్రబ్‌ ‌చేస్తుంటారు. అందుకని మనం అజ్ఞాతవాసం వెళ్లాలి’’.

‘‘గోవింద్‌గారు చెప్పారు’’.

‘‘నేను ముందుగా చెబుతాను. ప్రాథమికంగా మనం మాట్లాడుకున్నాక అప్పుడప్పుడు మనం కలవ్వొచ్చు… మనం లంచ్‌ ‌కలిసి చేద్దాం’’.

‘‘లేదు విశ్వంగారూ..! మిమ్మల్ని కలిసి ఓసారి మాట్లాడమన్నారు. మళ్లీ నేను వెళ్లిపోవాలి. ఇంటి దగ్గర పనులున్నాయి’’.

‘‘ప్రస్తుతం ఏ వర్క్ ‌చేస్తున్నావు?’’

‘‘అన్నీ మానుకున్నాను. ఇప్పుడు గోవింద్‌ ‌గారు ఏది చెబితే అది చెయ్యటం. వారితో కలిసి జర్నీ చేస్తున్నాను’’.

‘‘బాగుంది’’ అని షేక్‌ ‌హాండ్‌ ‌యిచ్చాడు.

*******

‘‘అమ్మా… నేను జైపూర్‌ ‌వెళ్తున్నాను’’ అంది ఆద్య.

‘‘ఈ విషయం నాకు ఎందుకు చెబుతున్నావు?’’

‘‘నీకు ఇంకా నా మీద కోపం పోలేదన్నమాట’’.

‘‘నేను ఎవర్ని నీమీద కోపం తెచ్చుకోవటానికి!’’

‘‘అంత వేదాంతం అవసరం లేదు. ఇంతకు ముందు నాన్నకి చెప్పాను. ఇప్పుడు నీకు చెబు తున్నాను. నీలో నాకు నచ్చని లక్షణం ఇదేనమ్మా… అన్నీ నీ దృష్టి నుండి చూస్తావు. బంధాలు తెంచుకోవటం గొప్ప విషయం కాదు’’.

‘‘ఆద్యా…’’ అంది కోపంగా.

‘‘అసలు ఇప్పుడున్న సమాజాన్ని చూస్తున్నప్పుడు ధింకర్స్‌కి జుగుప్స కలుగు తోందమ్మా.. ఈ మనుషులు ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తున్నారు అని. అన్ని బంధాలు తెంచుకుందాం అనే నిర్ణయానికి వస్తున్నారు. అయినా నీకు అంత భయానకమైన అనుభవం ఏముందో చెప్పు…. అర్థం చేసుకుం టాను’’.

‘‘అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు’’.

‘‘మంచిది. అందుకే నాన్నకి చెప్పాను… ఇప్పుడు అడుగుతున్నాను. జైపూర్‌ ‌నుండి నన్ను ఇంటికి రమ్మంటావా? వద్దా?’’

అప్పుడు అఖిల షాక్‌ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేసింది.

‘‘ప్రతి విజయం వెనకా, ప్రతి అనుభూతి వెనకా ఓ లెసన్‌ ఉం‌టుంది. నీ శత్రువుగా ఈ ఇంట్లో నేను ఉండలేను. నేను వచ్చేలోగా మన మధ్య ఎలాంటి బంధం ఉందో నువ్వు ఆలోచించుకో… తెగేదాకా లాగటం నీకు ఎందుకు అలవాటయిందో పరిశీ లించుకో… నావంతు కూడా అయితే, ఇంక నాన్న మాత్రం మిగులుతాడు. అప్పుడు నువ్వు ఏకాంతంగా బతకాలనుకుంటావో, తోడు కావాలో తేల్చుకో’’ అని వెళ్లిపోయింది.

*******

రిత్విక్‌ ‌మళ్లీ విజయవాడ బయలుదేరుతున్నాడు.

అప్పటికి హారిక కార్యక్రమం కూడా నిర్ణయం అయిపోయింది. ముందు తను బెంగళూరు వెళ్తోంది. రేపు ప్రయాణం.

‘‘ఇంక మీకు ఉత్తరాల గురించి చెప్పేవారు ఉండరు’’ అంది హారిక.

‘‘అది నా తాపత్రయం. ఇప్పుడన్నీ ఫోన్ల మీద జరుగుతున్నాయి. ఉత్తరాలు రాస్తున్నవారు తక్కువ. అయినా ఇలాంటివి కూడా నేను తగ్గించుకోవాలి. ఇప్పుడు నా ముందు అనుభవాల్తో నిండిపోయిన గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఇప్పటి దాకా నా పరి చయాలు, స్నేహితులు, అనుభవాలు మధ్య తరగతికి చెందినవి. ఇప్పుడు నేను ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఇలాంటి అనుభవం నాలాంటి రచయితలకు అరుదుగా దొరుకుతుంది హారికా…’’

‘‘అవునవును. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే నా చిన్నతనం గుర్తు వస్తోంది. దేశం సంగతి నాకు తెలియదు. ఇలాంటి పెద్ద కుటుంబాలు అప్పట్లో జిల్లాకి ఒకటో రెండో ఉండేవి. వారి గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. వారి కోటల్లోపల ఏం జరిగేదో మాత్రం తెలిసేది కాదు’’.

‘‘కోటలంటావా?’’

‘‘ఇందులో మాజీ జమీందార్లు కూడా ఉన్నారు. రోజులు, రాజ్యాలు, యుద్ధాల గురించి మనం వినటం, చదువుకోవటం తప్ప చూడలేదు. ఇప్పుడు మిగిలింది కూడా ఆనాటి కోటలే కదా!’’

ఇద్దరూ నవ్వుకున్నారు.

‘‘ఇప్పుడు చాలామంది కొత్త రాజులు వచ్చారు. కొత్త వైభవాలు వచ్చాయి’’ అన్నాడు రిత్విక్‌.

అప్పుడు హారిక రిత్విక్‌ని చూసింది. ఇంతకు ముందు బట్టల గురించి ఏ మాత్రం పట్టించుకునే వాడు కాదు. పిల్లలు అప్పుడప్పుడు తీసుకు వచ్చేవారు. నిన్న నాలుగు డ్రెస్‌లు తనే తెచ్చుకున్నాడు.

వాటి ధర చూసేసరికి ఆశ్చర్యం కలిగింది. ముఫై వేలరూపాయలు! మిగిలిన డబ్బులు హారికకి యిచ్చాడు. ఏభై వేలు ఉన్నాయి కదా అంది. వీటితో రెండు చీరలు తీసుకో అన్నాడు. ‘‘మీరు కొత్తగా మాట్లాడుతున్నారు’’ అంది.

‘‘మనకి కూడా చిన్నవో, పెద్దవో కోరికలుం టాయి. అవన్నీ రానున్న తరాల కోసం అణుచుకో వలసిన అవసరం లేదు! ఇప్పటి దాకా మనం కుటుంబం కోసం బతికాం. కొంతకాలం మనకోసం మనం బతుకుదాం’’.

‘‘ఇదంతా కొత్త ప్రయాణం నేర్పిందా?’’

‘‘ఇప్పుడేగా తొలి అడుగులు మొదలయింది. నిజంగానే ఈ ప్రయాణం నాకు మాత్రమే కాదు. మన కుటుంబానికి కూడా గొప్ప పాఠాలను నేర్పిస్తుంది’’ అన్నాడు రిత్విక్‌.

‘‘ఏం‌టి ఆలోచిస్తున్నావు’’ హారికని కదిలించాడు.

‘‘కొత్తగా ఏమీ లేదు’’

‘‘వస్తాను’’ అని బయలుదేరాడు.

(సశేషం)

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram