– జాగృతి డెస్క్

‌ప్రతిపక్షాలు ప్రదర్శించే ప్రహసనానికి పార్లమెంట్‌ ‌వేదిక కావడం భారత ప్రజాస్వామ్యంలోనే పెద్ద విషాదం. మణిపూర్‌ ‌మీద ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పాలంటూ ప్రతిపక్షాలు అత్యున్నత చట్టసభలో చేసిన గందరగోళం చివరికి ఎలా ముగిసింది? ఓటింగ్‌కు కూడా భయపడి విపక్షాలు తోక ముడిచాయి. విపక్ష నేతలలో కనీసం వాగాడంబరం కూడా లేదు. అసలు విపక్షాల నాయకుల ఉపన్యాసాలన్నీ ముందస్తుగా నాలుగు విషయాలు నెమరు వేసుకోకుండా దర్జాగా సభకు వచ్చి మొక్కుబడి చెల్లించినట్టే ఉన్నాయి. ఈ ఉపన్యాసాలలో కెల్లా అత్యంత వికారమైనది రాహుల్‌ ‌గాంధీ ఉపన్యాసమేనని జాతి యావత్తు నిర్ధారించింది. ఇంతకీ అవిశ్వాస తీర్మానం ఫలశ్రుతి ఏమిటి? విపక్షాలకు మణిపూర్‌ ‌సమస్య ముఖ్యం కాదు. అది పరిష్కారం కావడం గురించి వాటికి ఆసక్తి కూడా లేదు. మణిపూర్‌ ‌మీద ప్రధాని సమాధానం కావాలంటూ అవిశ్వాసం పేరుతో ఆగస్ట్ 8, 9, 10 ‌తేదీలలో జరిగిన చర్చ మోదీని లక్ష్యంగా చేసుకుని సాగించిన ఒక తమాషా. కానీ మోదీ ఎదురుదాడితో విపక్షాలకు గుక్క తిప్పుకోలేని పరిస్థితి వచ్చింది. తన సుదీర్ఘ పాలనలో ఈశాన్య భారత్‌ను కాంగ్రెస్‌ ‌మరిచిపోతే, తాను తన హృదయంలో భాగం చేసుకున్నానని మోదీ చెప్పారు. మిజోరం ప్రజల మీద వైమానిక దాడి చేయించిన పార్టీ అక్కడి ప్రజల సంక్షేమం గురించి మాట్లాడడం ఎంత అజ్ఞానమో మోదీ తూర్పార పట్టారు. కానీ ఇవాళ ఉగ్రవాదులను విడిపించుకుపోవడానికి వచ్చిన మహిళలపై సైన్యం ఒక్క తూటా ప్రయోగించలేదు. మిజోరాం ప్రజానీకం మీద వైమానిక దాడి, పంజాబ్‌లో స్వర్ణాలయం మీద సైనిక దాడి జరిపిన ఘనత కాంగ్రెస్‌ది. ఇవన్నీ మోదీ ఏకరువు పెట్టే సరికి నోట మాట రాకనే విపక్షం చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా బయటపడింది. నిజానికి ఇదొక మహా పలాయనం.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ప్రతి పక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. దానికి ఏ గతి రాసి పెట్టి ఉన్నదో ముందే తేలిపోయింది. భారత్‌, ‌పాక్‌ ‌క్రికెట్‌ ‌మ్యాచ్‌ ‌చూసేందుకు ప్రజలు టీవీలకు అతుక్కు పోయినట్టుగా, ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు, ప్రధాని మోదీ సమాధానం వినేందుకు ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. ప్రతిపక్షాలు వేసిన నోబాల్స్‌కు సైతం మోదీ సిక్సర్లు కొడుతుండడంతో, ప్రతిపక్షాలు రిటైర్డ్ ‘‌హర్ట్’ అయ్యి, ఓటింగ్‌ ‌సైతం చెయ్యకుండా సభలో నుంచి వాకౌట్‌ ‌చేశాయి. 2023లో కూడా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతా యంటూ 2018లో వారు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి సమాధానమిస్తున్న సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాటలను ప్రతిపక్షాలు నిజం చేశాయి. ఈసారి కూడా ప్రధాని మోదీ 2028లో కూడా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతాయంటూ జోస్యం చెప్పారు. కనీసం అప్పుడైనా ప్రతిపక్షాలు కాస్త తయారై వచ్చి మాట్లాడాలంటూ ప్రధాని వారికి చురక తగిలించడం విశేషం.

మణిపూర్‌ ‌సంక్షోభంపై ప్రతిపక్ష కూటమి (ఐ.ఎన్‌.‌డి.ఐ.ఎ) తరఫున కాంగ్రెస్‌ ‌నాయకుడు గౌరవ్‌ ‌గోగోయ్‌ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వారు కోరుకున్నట్టుగానే మోదీ తీర్మానానికి సమాధానమిస్తూ, మణిపూర్‌ అం‌శానికి సమాధానం చెప్పే లోపలే ప్రతిపక్షాలు సభలో నుంచి వాకౌట్‌ ‌చేయడం వారి అహంకారమో లేక పిరికితనమో తేల్చుకోలేక ప్రజలు తికమక పడుతున్నారు. ప్రధాని మోదీ మాత్రం ఆ చర్యను అహంకారంగానే భావించారు. అందుకే ఐ.ఎన్‌.‌డి.ఐ.ఎ.లోని రెండు ‘ఐ’లు వారి అహంకా రానికి చిహ్నమంటూ మరో చురక అంటించారు.

పార్లమెంటు కార్యకలాపాలు సాగుతున్నంత కాలం నినాదాలు చేస్తూ, మణిపూర్‌ అం‌శంపై ప్రధాన మంత్రి సమాధానం చెప్పాలని పట్టుబట్టి సభను సాగనివ్వకుండా చేసిన ప్రతిపక్షాలు, ఆ క్షణం వచ్చి నపుడు సభ నుంచి ఉడాయించడం వారి అయోమయ వ్యూహానికీ, ఆలోచనలకీ అద్దం పట్టింది. అలా బయటకు వెళ్లడం తమను తాము అవమానించుకోవడమేనని, దానివల్ల ప్రజలలో తమ పట్ల మిగిలిన ఆ ఆవగింజంత విశ్వసనీయతను కోల్పోతామనే విషయాన్ని మోదీ పట్ల ఉన్న గుడ్డిద్వేషం ప్రతిపక్షాలను ఆలోచించనివ్వలేదు. ప్రతిపక్షాలు మణిపూర్‌ ‌సమస్యను సూత్రబద్ధంగా పట్టి చూపకుండా, తమకు అనుకూలమైన రాజకీయ అంశంగా మార్చుకునే ప్రయత్నం చేయడం వల్లనే విఫలమయ్యాయన్నది వాస్తవం.

ప్రధాని ప్రసంగానికి ముందురోజు మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా, తాను తొలి రోజు నుంచే మణిపూర్‌ ‌సమస్యపై చర్చకు సిద్ధంగా ఉన్నానని, కానీ ప్రతిపక్షాలకి చర్చ అవసరం లేదనీ, తాను మాట్లాడకుండా అడ్డుకోవడమే వారికి కావలసిందంటూ ఆరోపించారు. నిజానికి, వారు బాధ్యత గల ప్రతిపక్ష సభ్యులు అయి ఉంటే, వారు చర్చకు పూర్తిగా సిద్ధమై, కనీసం అమిత్‌షాను అయినా సూటి ప్రశ్నలు వేసి సమాధానాలు కోరి ఉండేవారు. కానీ ఆ పనీ చేయలేకపోయారు. అయినప్పటికీ, అమిత్‌ ‌షా మణిపూర్‌లో జరిగిన ఘటనా క్రమాన్ని, దానిని పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను గురించి తన సుదీర్ఘ ఉపన్యాసంలో సవివరంగా చెప్పారు. మే 3న హింస చోటు చేసుకున్న వెంటనే ప్రధాని మోదీతో చర్చించి, రాష్ట్ర డీజీపీ, ప్రధాన కార్యదర్శి, భద్రతా సలహాదారును మార్చడం గురించి, విచారణకు కమిషన్‌ను నియమించడం గురించి, 36వేల మంది పారా మిలటరీ సిబ్బందిని అక్కడ మోహరించిన అనంతరం మరణాలు తగ్గిన విషయం గురించి చెప్పారు. దీనితో పాటుగా గత తొమ్మిదేళ్ల పాలనా కాలంలో ప్రధాని మోదీ 50సార్లు ఈశాన్య ప్రాంతాన్ని సందర్శించిన విషయాన్ని పట్టి చూపుతూ, తమకు గల నిబద్ధతను చాటుకున్నారు. గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు తాను మూడు రోజులు అక్కడే గడిపానని, సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ‌వరుసగా 23 రోజులు అక్కడే ఉన్నారంటూ కాంగ్రెస్‌ ‌పాలనా కాలంలో అనేక హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నప్పటికీ ఏ మంత్రీ అక్కడకు వెళ్లని విషయాన్ని ఆయన ఎత్తి చూపారు. ఈశాన్య రాష్ట్రాల పట్ల ప్రతిపక్షాలకు నిబద్ధత లేదని, మణిపూర్‌ అనేది వారికొక రాజకీయ ముసుగు మాత్రమేననే విషయం స్పష్టం అయ్యేలాగా షా ప్రసంగం ఉంది.


ఈశాన్య భారతం నా గుండెలో భాగం

‘మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారు’ అంటూ దేశ అత్యున్నత చట్టసభలో తర్జని చూపుతూ వీరంగం వేసిన అల్పుడికీ, అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీకీ దీటుగానే ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. ఈశాన్యమంటే తనకు గుండెలో భాగమని మోదీ అన్నారు. మణిపూర్‌ ‌హింస నిజంగానే బాధాకరమని అంటూ, అక్కడ సాధారణ పరిస్థితులు, శాంతి నెలకొల్పడానికి కేంద్రం, రాష్ట్రం కలసి పనిచేస్తాయని మోదీ హామీ ఇచ్చారు. కానీ ఈశాన్యం మీద కాంగ్రెస్‌ ‌వారి ప్రేమ ఎలాంటిది? అది గుర్తు చేయడానికే మోదీ మిజోరాం రాజధాని ఐజ్వాల్‌ ‌మీద జరిగిన వైమానిక దాడుల గురించి దేశ ప్రజలకు తన ఉపన్యాసం ద్వారా గుర్తు చేశారు.

అయితే ఆయన ప్రస్తావించిన రెండు అంశాల గురించి ఓ వర్గం మీడియాలో చర్చ జరుగుతున్నది. ఆ రెండు అంశాలను మోదీ ప్రస్తావించడం గురించి ఆ మీడియాకు ఏదో అసౌకర్యం కలిగినట్టు మాట్లాడుతోంది. కానీ అది చరిత్ర. భారతమాతను హత్య చేయడం వంటి నీచ పదజాలం ఉపయోగించిన వారికి సరైన సమాధానం కూడా. మణిపూర్‌ ‌వివాదం మీద ప్రధాని చేత మాట్లా డించడం తప్ప మాకు మరొక ఉద్దేశం లేదని చర్చను ప్రారంభించిన గౌరవ్‌ ‌గోగోయ్‌ (‌కాంగ్రెస్‌) ఆదిలోనే అస్త్ర సన్యాసం చేశారు. మొత్తం చర్చకు జవాబు ఇస్తూ ప్రధాని, మొత్తం ఈశాన్య భారత పరిపాలనను కాంగ్రెస్‌ ‌గాలికి వదిలేసిందని అన్నారు. దీనితో పాటు మార్చి 5, 1966న మిజోరాం ప్రజల మీద కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వైమానిక దాడులు చేయించిన సంగతిని కూడా సభలో ప్రస్తావించారాయన. ఇంకా 1984 నాటి స్వర్ణాలయం మీద దాడిని కూడా గుర్తు చేశారు. అంటే అసలు కాంగ్రెస్‌ ‌మిజోరాంను ఈ దేశంలో భాగంగా గుర్తించనట్టా అన్నదే మోదీ ప్రశ్న. వైమానిక దళాలు దాడి చేయగలిగింది విదేశాల మీదనే.

సైనిక, వైమానిక దళాలను దేశ పౌరుల మీద ప్రయోగించరు. ప్రజాస్వామిక దేశంలో అయితే ఆ ఊహే ఉండదు. కానీ భారతదేశంలో తొలిసారి మిజోరాం రాజధాని ఐజ్వాల్‌ ‌మీద నాటి కేంద్రం, ఇందిర ప్రభుత్వం వైమానిక దాడులు చేయించింది. ఆ దుర్దినాన్ని అక్కడి ప్రజలు ఇప్పటికి ఏటా గుర్తు చేసుకుంటున్న సంగతిని కూడా ప్రధాని కాంగ్రెస్‌ ‌సభ్యులకు గుర్తు చేశారు. అదే ‘జోరామ్‌ ‌ని’ లేదా ‘జోరామ్‌ ‌దినం’.

వారం పాటు ఆగకుండా జరిగిన మిజో తిరుగుబాటును అణచడానికి ఇందిర ఈ తీవ్ర చర్య తీసుకున్నారు. ఇక ఖలిస్తాన్‌ ‌తీవ్రవాదులను అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం నుంచి బయటకు తీసుకురావడానికి ఇందిరాగాంధీ ఆపరేషన్‌ ‌బ్లూస్టార్‌ ‌నిర్వహించారు. ఇది భారత సైన్యం ఆధ్వర్యంలో జరిగింది. దేశ పౌరుల మీద రక్షక దళాలను ప్రయోగించిన పార్టీ వారసులు వారి రక్షణ గురించి గొంతు చించుకోవడం విషాదమే మరి.


ప్రతిపక్షాలు చేసిన ఘోర తప్పిదం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసాన్ని ఈ సమయంలో ప్రవేశపెట్టడమే అనే విషయాన్ని అవి గ్రహించలేదేమో కానీ ప్రజలు గ్రహించారు. దీనిని ప్రవేశపెట్టడం ద్వారా 2024 ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ శంఖం పూరించడానికి వారే అవకాశం ఇచ్చినట్టు అయింది. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ప్రతిపక్షాలు కేవలం మణిపూర్‌పై మాట్లాడేలా ఒత్తిడి చేయలేకపోయారు. ప్రధాని ఆర్ధిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, మణిపూర్‌లో మహిళలపై హింస గురించి మాట్లాడతారని ఆశించామని, కానీ ఆయన మాత్రం ఐ.ఎన్‌.‌డి.ఎ.ఐ.పై దృష్టి కేంద్రీకరించారంటూ వాకౌట్‌ ‌చేసిన తర్వాత ప్రతిపక్ష నాయకులు అనడం వారి మూర్ఖత్వానికే అద్దం పడుతుంది. వాస్తవానికి వారు మోదీ లాంటి వక్త ఏం మాట్లాడతారో ఊహించలేకపోవడం వారి తెలివి తక్కువతనమనాలో, అతి ఆత్మవిశ్వాసం అనాలో తెలియదు. సందర్భాన్ని ఉపయోగించుకున్న ప్రధాని ఎన్డీయే సాధించిన ప్రగతిని చెబుతూ, ప్రతిపక్ష కూటమిలో ఉన్న వైరుధ్యాలను బహిర్గతం చేశారు.

ప్రధాని మోదీ తన ప్రసంగంలో భారత్‌ ‌ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్ధిక వ్యవస్థగా రూపొందేందుకు ఎలా సిద్ధంగా ఉన్నది, ఈ దేశ యువత తమ కలలను నెరవేర్చుకునేందుకు తాను మార్గాన్ని ఎలా సుగమం చేస్తున్నదీ చెప్పడంతో పాటుగా, ప్రతిపక్షాల దార్శనికత, నాయకత్వంపై ప్రశ్నలను లేవనెత్తారు. తన ప్రసంగంలో భాగంగా మోదీ రాహుల్‌ ‌పేరు ప్రస్తావించకుండా, విఫలమైన ఉత్పత్తిని పదే పదే ప్రయోగిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలను సంధించారు. నిజానికి మోదీ ఆ పని చేయనవసరం లేదని, ప్రతిపక్ష కూటమికి తనను తాను నాయకుడిగా ప్రతిష్టించుకునే బంగారు అవకాశాన్ని వ్యర్ధం చేసుకోవడంలో రాహుల్‌ అద్భుతంగా రాణించాడని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎందుకంటే, రాహుల్‌ ‌గాంధీ తన ఉపన్యాసంలో భారత్‌ ‌జోడో యాత్రలో తనకు వచ్చిన మోకాలు నొప్పి, ఆధ్యాత్మిక అనుభవాల గురించి మాట్లాడ కుండా మణిపూర్‌పై తార్కికంగా, సమర్ధవంతంగా మోదీ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని నిర్వహిస్తున్న తీరుపై దాడి చేయకుండా, సందర్భ శుద్ధిలేని మాటలు మాట్లాడి డొల్లతనాన్ని బయిటపెట్టుకున్నారు. ప్రభుత్వంపై ఆగ్రహాన్ని ప్రకటిస్తూ రాహుల్‌ ‌చేసిన ఉపన్యాసం మణిపూర్‌లో సంక్షోభం తీవ్రతను ప్రజలకు తెలియచేయలేకపోయింది. కారణం, అతడికి విషయంపై అవగాహన లేకపోవడమే.

ఇందుకు భిన్నంగా ప్రధాని మోదీ ఉపన్యాసం స్పష్టతతో, సానుకూలతతో ఉండటాన్ని ప్రజలు గమనించారు. ప్రతిపక్షాలు తనకు వ్యతిరేక నినాదాలు చేస్తున్నప్పటికీ, వాటిని విస్మరించి, తొణకకుండా తాను అనుకున్న విధంగానే ఒక క్రమంలో తాను చెప్పదలచుకున్న విషయాలను చెప్పారు. కానీ, ఆయన మణిపూర్‌పై సమాధానం చెప్పేవరకూ కూర్చోవడం ప్రతిపక్షాలకు  కష్టమైంది. ప్రధాని తమ ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి, ఈ పార్లమెంటు సెషన్‌లో ఆమోదించిన బిల్లుల గురించి, భారత్‌ ‌పురోగతి గురించి వివరంగా మాట్లాడుతూనే, ప్రతిపక్షాల బాధ్యతరాహిత్యాన్ని కూడా పట్టి చూపారు.

ప్రతిపక్షాల భావ దారిద్య్రాన్ని, ఒక అంశంపై లోతైన అవగాహన లేకపోవడాన్ని, ప్రతిపక్ష నాయకులు ముందస్తుగా తయారు కాకుండానే సభకు వచ్చి ఆరోపణలు చేయడాన్ని ప్రధాని తప్పుబట్టారు. మణిపూర్‌లో త్వరలోనే శాంతి నెలకొంటుందని హామీ ఇస్తూ, ఈశాన్య ప్రాంతం త్వరలోనే భారత అభివృద్ధికి కీలకంగా మారుతుందని చెప్పారు. మయన్మార్‌, ‌థాయ్‌లాండ్‌లను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న హైవే నిర్మాణం పూర్తి అయిన వెంటనే మణిపూర్‌ ‌వాణిజ్యానికి, తూర్పు ఆసియాతో అనుసంధానతకు కేంద్రంగా మారుతుందంటూ ఆ రాష్ట్రానికి ఒక సానుకూల భవిష్యత్తు ఉన్న విషయాన్ని ఆయన పట్టి చూపారు.

ఇవన్నీ ఒక ఎత్తయితే, అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆగస్ట్ 10‌న నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రసంగిస్తుండగా కాంగ్రెస్‌ ‌నాయకులు ప్రవర్తించిన తీరు జుగుప్సాకరంగా ఉంది. సోనియా గాంధీ ఎంత దిగజారి ప్రవర్తించారో మీడియాలో కథనాలు వచ్చాయి. గోల చేయమని, ప్లకార్డులు చూపమని ఆమె తన పార్టీ సభ్యులనే కాదు, మిత్రపక్షాల ఎంపీలను కూడా బాగా ప్రోత్సహించారు. అంటే నరేంద్ర మోదీ ఉపన్యాసం సమయంలో గోలకు, గందరగోళానికి వెనుక ఉన్నది సోనియా గాంధీయే. ‘ఇండియా’ అని, ‘మణిపూర్‌’ అం‌టూ నినాదాలు చేయాలని ముందే కూడబలుక్కుని వచ్చారన్న సంగతి కూడా అర్ధమవుతుంది. ప్రధాని ఉపన్యాసానికి ముందే ప్రతిపక్ష నాయకుడు అధీర్‌ ‌రంజన్‌ ‌చౌధురి తన ప్రవర్తన కారణంగా సస్పెండయ్యారు. అధీర్‌ ‌రంజన్‌ ‌గందరగోళం రక్తి కట్టడం లేదన్న అనుమానం కాబోలు. ఒక దశలో సోనియాగాంధీ ఆయనకు సైగ చేశారు. ఇక చల్లబడి, మంచినీళ్లు తాగమని ఆ సైగల ఉద్దేశం. మొదట తన పార్టీ సభ్యుడు గౌరవ్‌ ‌గొగోయ్‌, ‌తరువాత డీఎంకే సభ్యుడు దయానిధి మారన్‌, ఆ ‌తరువాత టీఎంసీ ఎంపీ మొహువా మొయిత్ర సోనియాగాంధీ కనుసన్నలలో అరుపులు లంఘించు కున్నారు. అసలు మోదీ సాయంత్రం నాలుగు ప్రాంతంలో సభలోకి ప్రవేశిస్తున్నప్పుడే ‘ఇండియా’ అంటూ విపక్షాలు నినాదాలు అందు కున్నాయి. అయితే ఈ గోల సమయంలో రాహుల్‌ ‌సభకు గైర్హాజరయ్యారు. మోదీ కుటుంబ పాలన అంటూ విమర్శలకు దిగినప్పుడు బీజేపీలో కూడా అలాంటి సంస్కృతి ఉందని చెప్పే ఒక చార్ట్‌ను సోనియా ఆజ్ఞ మేరకు దయానిధి మారన్‌ ‌ప్రదర్శించారు.


ఆమె మరణం గురించి ఆలోచనేమిటి?

ఎన్డీయే ప్రభుత్వం మీద వచ్చిన అవిశ్వాస తీర్మానానికి సమాధానం ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్‌ అం‌శం మీద తన మనోగతాన్ని సభ ముందు ఉంచారు. ఇంత రచ్చ చేసి, ఇంతకాలం సమావేశాలను సాగనీయకుండా చేసిన కాంగ్రెస్‌, ‌విపక్షాలు ఆ సమయానికి బయటకు ఉడాయించాయి. అవిశ్వాసంలో కీలకమైన మణిపూర్‌ ‌సమస్య మీద ప్రధాని మనోగతం:

మణిపూర్‌ ‌రాష్ట్రంలో సమీప భవిష్యత్తులోనే శాంతిభద్రతలు నెలకొంటాయని భారతజాతికి నేను హామీ ఇస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ శాంతిని నెలకొల్పేందుకు కలసి పనిచేస్తాయి. ఇందుకు మా ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి. అక్కడ జరిగిన నేరాలకు, మహిళలపై జరిగిన వాటితో సహా బాధ్యులైన వారికి కఠిన శిక్షలు పడేటట్టు చేస్తాం. భారతదేశం, పార్లమెంట్‌ ‌మీకు అండగా ఉన్నాయి. భారతమాతను మణిపూర్‌లో హత్య చేశారంటూ రాహుల్‌ ‌గాంధీ సభలో చేసిన వ్యాఖ్యను ప్రధాని ఆయన విజ్ఞతకే వదిలిపెట్టారని అనిపిస్తుంది. భారతమాత మరణం గురించి కొందరు ఆ విధంగా ఎందుకు ఊహిస్తున్నారో నాకు అంతుపట్టడం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. నిజమే, ఇంతకు మించి భారతమాత హత్య గురించి మాట్లాడితే మోదీకీ, రాహుల్‌కీ తేడా ఉండేది కాదు. మణిపూర్‌ అం‌శం మీద ప్రతిపక్షాలు అనుసరించిన వైఖరిని మోదీ దుయ్యబట్టారు. వారిని మేం చర్చలకు ఆహ్వానించాం. అందుకు సంబంధించి హోంమంత్రి లేఖ కూడా పంపించారు. అయితే విపక్షాలకు ఆ అంశాన్ని చర్చించే ధైర్యం లేదని మోదీ తేల్చి చెప్పారు.

‘ఇండియా’ అని యూపీఏ కూటమికి పేరు మార్చడం గురించి కూడా మోదీ ఘాటుగా స్పందించారు. కేవలం పేరు మార్చి అధికారం కైవసం చేసుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ప్రధాని విమర్శించారు. దీనినే ఆయన ఘంమ్డియా అని పిలుస్తున్నారు. అంటే దగాకోరుల కూటమి. దీనికి ప్రధాని ఇచ్చిన ముగింపుతో విపక్షాలకు దిమ్మ తిరిగింది. ఇండియా కూటమిని తెచ్చి, యూపీఏకు స్వస్తి పలికిన వారందరికీ నా కృతజ్ఞతలు అని మోదీ ముక్తాయించారు.


ఇక సోనియా సుపుత్రుడు, గాంధీ కుటుంబ వారసుడు, కాంగ్రెస్‌ అ‌గ్ర నాయకుడు రాహుల్‌ ‌నిర్వాకం చూడాలి! తాజా అవిశ్వాస తీర్మానం మీద ఆయన ఉపన్యాసం తీరుతెన్నులు, సభలో ప్రద ర్శించిన మర్యాదలు గమనించిన తరువాత దేశంలో ఎక్కువ మీడియా సంస్థలు ముక్కు మీద వేలేసు కున్నాయి. ఫ్లయింగ్‌ ‌కిస్‌లు వదిలి ఆయన తనదైన శైలిలో పార్టీ పరువును దిగజార్చారు. అది తప్పేమీ కాదు, అది సర్వులనూ ప్రేమించే విశాల హృదయం, ఇదంతా ‘ప్రేమ దుకాణం’ వ్యవహారం అన్నట్టు ఆయన పార్టీ సమర్థించుకునే ప్రయత్నం చేసి రాహుల్‌ ‌కంటే దారుణంగా పార్టీని అపఖ్యాతి పాల్జేసింది. ఆయన భారత రాజకీయ రంగం మీదకి వచ్చి రెండు దశాబ్దాలు గడిచాయి. నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడు. అయినా పరిణతిని కాస్త కూడా ప్రదర్శించ లేకపోతున్నారు. ఇందుకు అవిశ్వాసం మీద ఉపన్యాసమే పెద్ద ఉదాహరణ అన్నది న్యూస్‌ 18 ‌చానల్‌. ఆ ఉపన్యాసాన్ని ‘వికృతం’, ‘వికారం’ అని చెప్పడానికి ఆ చానల్‌ ‌సందేహించలేదు. దేశమంతా వీక్షించే అత్యున్నత సభలో తాను ఏం మాట్లాడాలో కనీసం అవగాహన లేకుండా, ముందస్తుగా దాని గురించి ఆలోచించకుండా వచ్చి మాట్లాడారని రాహుల్‌ను దుమ్మెత్తి పోస్తున్నది మీడియా. పార్లమెంట్‌లో ప్రవర్తన మాత్రమేనా! గాఢనిద్రలో ఉన్న పార్టీని మేల్కొల్పే నైపుణ్యాన్నీ సాధించలేదు అని కూడా వ్యాఖ్యానించింది. ఆఖరికి తల్లి సోనియా గాంధీ బీజేపీయేతర పార్టీలను కూడగట్టి మోదీకి వ్యతిరేకంగా నిలబెట్టే సత్తా కూడా కనిపించడం లేదని చెప్పేసింది. కాంగ్రెస్‌ ‌పరిస్థితి మునగానాం తేలానాం అన్నట్టు ఉంటే, రాహుల్‌లో ఆ వైఫల్యాల నుంచి నేర్చుకోవాలన్న తపన కాస్త కూడా కానరాదు. కుటుంబం ఎన్ని కడగండ్లు పడుతున్నా అందులోని చంటి పిల్లలకి పట్టదు కదా! రాహుల్‌ ‌వ్యవహార సరళి సరిగ్గా అదే అనిపిస్తుంది.

కాంగ్రెస్‌ ‌నేతలలో ఆది నుంచి ఒక ప్రత్యేక లక్షణం కనిపిస్తూ ఉంటుందని పెద్దలు చెబుతారు. ఆ లక్షణాన్నే రాహుల్‌ ‌గాంధీ పుణికిపుచ్చుకున్నారు. ప్రదర్శనలు, యాత్రల విషయంలో ఆ పార్టీ నాయకులు చిన్నా పెద్దా, ఆడా, మగా, బీదా బిక్కీ అనే తేడా లేకుండా వాళ్లు చెబుతున్నది పరమ శ్రద్ధగా వింటున్నట్టు కనిపిస్తారు. చెవి అవతలివారి నోటికి అందిస్తారు కూడా. రాహుల్‌ ‌గాంధీ అయితే పొదివి పట్టుకుని మరీ తన వెంట నడిపించుకువెళ్లారు, భారత్‌ ‌జోడో యాత్రలో. అయితే ఇలాంటి నిభాయింపు పార్లమెంటులో, అందులోనూ కాంగ్రెసే తర పక్షాలు అధికారంలో ఉంటే కనిపించదు. గాంధీ కుటుంబీకుల వ్యవహార సరళి అధ్వానంగా మారిపోతుంది. ఆనంద్‌ ‌రంగనాథన్‌ ‌వంటి వారు విసిరే చెణుకులకు లోటే ఉండడం లేదు. మోదీ ఇంటి పేరుతో చెడ వాగి రెండేళ్లు శిక్ష పడిన రాహుల్‌, ‌సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకుని మళ్లీ సభలోకి వచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ ‌శ్రేణులు బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఆనంద్‌ ‌రంగనాథన్‌ అభిప్రాయం ప్రకారం ఆ పండుగ చేసుకోవలసింది కాంగ్రెస్‌ ‌కాదు, బీజేపీయే. ఎందుకంటే, తమ ప్రధాన నిందాస్తుతి కారుడు మళ్లీ సభకు వచ్చినందుకు! నిజానికి అందుకు సుప్రీంకోర్టుకు కూడా బీజేపీ కృతజ్ఞత చూపాలి. ఇప్పటిదాకా 250 స్థానాలు వస్తాయనుకుంటున్న బీజేపీకి రాహుల్‌ ‌మళ్లీ రంగం మీదకు వచ్చారు కాబట్టి కచ్చితంగా 350 సీట్లు వస్తాయని రంగనాథన్‌ ‌జోస్యం పలికారు.

భారత్‌ ‌జోడో యాత్రతో దేశంలో బీజేపీయేతర శిబిరంలో ఒక జాతీయ నేత అవతరించాడని కొందరు తొందరపడి నిర్ణయానికి వచ్చారు. ఈ మాట ఎవరో అనక్కరలేదు. అవిశ్వాసం మీద రాహుల్‌ ఉపన్యాసంతోనే విపక్షాల అనుభవానికి వచ్చింది. ఆయన భారత్‌ ‌జోడో యాత్ర చేసినా ప్రయోజనం శూన్యమన్న అభిప్రాయానికి వచ్చేశారు. ఎంత బుద్ధిమాలిన వాడైతే ‘‘భారతమాతను మణిపూర్‌లో హత్య చేశారు’’ వంటి వ్యాఖ్యాలు నిండు సభలో చేస్తాడు! రాహుల్‌ ‌గాంధీ బలహీనతలు, తిక్కలు, భయానక నట విన్యాసాలు ఇవన్నీ దాచేందుకు ఏర్పడిన ‘ఇండియా’ ప్రయత్నాలన్నీ వమ్ము అయిపోయాయని వారు అప్పుడే తీవ్ర నిర్వేదంలో పడిపోయారనిపిస్తుంది. గతంలో థమ్స్ అప్‌ ‌గుర్తులా బొటన వేలు చూపించడం, తరువాత కన్నుకొట్టడం వంటి వాటిని ‘ఇండియా’ వంటి గంభీరమైన పేరు వెనుక దాచేద్దామని అనుకుంటే, ఈసారి ఏకంగా ఫ్లయింగ్‌ ‌కిస్‌ ఇచ్చి విపక్షాలను అక్షరాలా నీరు గార్చేశాడు యువరాజు. సమయం సందర్భం లేకుండా కెమేరాల సంగతి పట్టించుకోకుండా ఇలా కన్ను కొట్టేవాడితోనూ, ఫ్లయింగ్‌ ‌కిస్‌లు విసిరేవాడితోనూ 2024 ఎన్నికల సమరంలోకి దూకగలమా అన్న పెద్ద సందేహం ఇప్పుడే వాళ్లలో మొదలయింది. ఆ మేరకైనా ఆ శిబిరానికి మేలు జరిగినట్టే. అవిశ్వాస తీర్మానం మీద చర్చకు తేదీలు రావడం, రాహుల్‌ ‌గాంధీకి పడిన శిక్ష మీద సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం ఒకేసారి జరిగాయి. మా నేతను వెంటనే పార్లమెంటుకు పిలవాలంటూ లోక్‌సభలో కాంగ్రెస్‌ ‌నేత అధీర్‌ ‌రంజన్‌ ‌చౌధురి విజ్ఞప్తి పని చేసిందా, లేక రాహుల్‌ ‌పార్లమెంట్‌లో కనిపించి నాలుగు మాటలు మాట్లాడినా పార్టీకి లాభమే జరుగుతుందని బీజేపీ తెలివిగా ఊహించిందో తెలియదు కానీ, ఆగమేఘాల మీద రాహుల్‌ను లోక్‌సభలో ప్రతిష్టించారు. మొదట ప్రధాన వక్తలలో పేరు కూడా చేర్చారు. చివరి క్షణాలలో స్వల్పకాలిక ఉపన్యాసానికి పరిమితం చేశారు. స్వల్పకాలిక ఉపన్యాసంతోనే ఇంత వైరాగ్యాన్ని సృష్టించినవాడికి ప్రధాన వక్తగా అవకాశం ఇచ్చి, సుదీర్ఘంగా ప్రసంగించే అవకాశం ఇచ్చి ఉంటే ఇంకెంత ఉత్పాతం జరిగి ఉండేదో! కానీ మోదీని దుమ్మెత్తి పోసే పాత విద్యే తమకు బాగా నప్పిందని రాహుల్‌ ‌మాతృమూర్తి, ఇతర కాంగ్రెస్‌ ‌నాయకులు గట్టిగా అభిప్రాయపడిన మీదటే, లోక్‌సభలో పునఃప్రవేశం చేసిన తరువాత కూడా రాహుల్‌ ‌పాత పంథాలోనే నడుస్తున్నారని ఒక వర్గం మీడియా చెబుతోంది.

పైగా 2.13 గంటలు రసవత్తరంగా సాగిన ప్రధాని మోదీ ఉపన్యాసం ముందు రాహుల్‌ ‌మాట చిన్న కొవ్వొత్తిలా కూడా కనిపించలేదు. మోదీ ఎప్పటిలాగే తన ఉపన్యాస కళకు అదనంగా చక్కని హోమ్‌వర్క్ ‌చేసి వచ్చారు. అందుకే వచ్చేసారి (మరో ఆరు నెలల వరకు ఎలాగూ అవిశ్వాసం పెట్టలేరు. కాబట్టి 2024లో మళ్లీ తామే నెగ్గిన తరువాత అన్నది మోదీ ఆంతర్యం) అయినా కాస్త అస్త్రాలకి, శస్త్రాలకీ పదును పెట్టుకుని వస్తారని ఆశిస్తున్నాను అని కర్రు కాల్చి వాత పెట్టారు. అయితే మోదీ వాగ్ధాటి రాహుల్‌ ‌వంటి రసహీనుడికీ, రాజకీయ అజ్ఞానికీ జోకులు, అసందర్భ ప్రలాపంగా కనిపించడం వింతేమీ కాదు. మీడియా ఒక గణనీయమైన అంశాన్ని ఇప్పుడు దేశం ముందుకు తెస్తున్నది.

అవిశ్వాసం వంటి శుష్క యత్నం చేయడంలోనే కాంగ్రెస్‌, ‌విపక్షాల- మొత్తంగా ఇండియా వైఫల్యం కనిపిస్తుంది. ఏమీ సాధించలేమని తెలిసి పరిమిత ప్రయోజనం కోసం అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిన విపక్షాలు నిజానికి చేయ వలసింది అది కాదు. అంతర్యుద్ధం స్థాయికి వెళ్లిపోతున్న మణిపూర్‌ ‌ఘర్షణలకి, హిందూ ముస్లిం ఘర్షణలకి సంబంధించి, ఇంకా చెప్పాలంటే ముస్లిం ఉన్మాదానికి తీక్షణంగా హరియాణాలో ఎదురైన ప్రతిఘటన ఫలితంగా తలెత్తుతున్న సరికొత్త పరిణామాల గురించి పార్లమెంటులో చర్చించడానికి సిద్ధపడేవారు. కానీ ఆ ధైర్యం ఈ పార్టీలు చేయలేవు. మత కల్లోలాల మీద, సంఘర్షణల మీద చర్చ లేవదీస్తే వాటి బండారమే బయటపడుతుంది. బుజ్జగింపు ధోరణితో ఈ దేశం ఎంత నష్టపోయిందో దేశ ప్రజలకు తెలుస్తుంది. ముస్లిం మతోన్మాదం కూడా ఆ పార్టీ పెంచి పోషించినదే కదా! మణిపూర్‌ ‌కల్లోలం కాంగ్రెస్‌ ‌హయాంలో ఈశాన్య భారతం మీద పుట్టిన వ్రణం. అలాంటి రాష్ట్రానికి సాంత్వన చేకూర్చడం కాంగ్రెస్‌ ఉద్దేశం కాదని ఈ చర్చ తేల్చేసింది.

వీలైతే కాస్త ఆజ్యం పోయడమే పరమోద్దేశంగా కూడా కనిపిస్తుంది. అవిశ్వాసం ప్రతిపాదిస్తున్న వారికైనా తమ చర్య పట్ల కొంచెం నమ్మకం ఉండాలి. ఈసారి అవిశ్వాస తీర్మానంలో విపక్ష శిబిరంలో లోపించింది సరిగ్గా అదే.

About Author

By editor

Twitter
YOUTUBE