దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి పౌరస్మృతి విషయమై చర్చ జరుగుతూనే ఉంది. అంటే 75 సంవత్సరాల పైగా ఆ చర్చ రావణకాష్టంలా మండుతూనే ఉంది. నిజానికి అంతకు ముందు కూడా ఇది చర్చనీయాంశమే. పౌరులంతా సమానమేనన్న రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించడానికి  భారతదేశంలో  ఇలాంటి చట్టం అవసరం కాదా అన్న మీమాంస నడుస్తూనే ఉన్నది. విభిన్న పద్ధతులు, సంస్కృతులు, మతాలు గల ఈ దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని తేగలమా! ఒకవేళ తీసుకువచ్చినా అందుకు సంబంధించిన చట్టాలను అమలు పరచగలమా? వంటి సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.

ఉమ్మడి పౌరస్మృతి అంటే దేశ ప్రజలందరికీ ఒకే చట్టం అమలు చేయడం. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం దీని ముఖ్య ఉద్దేశం. కుల, మత, భేదాలకు అతీతంగా ఈ చట్ట రూపకల్పన జరుగుతుంది.

ఈ రోజు ఈ దేశంలో మెజార్టీగా ఉన్న హిందువులకు; సిక్కు, బౌద్ధ, జైనులకు కలిపి1955-1956లో హిందూకోడ్‌ను రూపొందించారు. అంతకుమునుపు హిందువులలో బహుభార్యత్వం ఉండేది. హిందువులకు విడాకులనేవి తెలియదు. స్త్రీలకు వారసత్వ హక్కులేదు. కానీ కాలక్రమంగా తలెత్తిన సమస్యలు, మార్పులతో ఇలాంటి వివాదా లన్నింటికి కలిపి హిందూ వారసత్వ చట్టం, హిందూ వివాహం, విడాకుల విషయమై హిందూ దత్తత, పోషణ చట్టాలు తెచ్చారు. ఈ దేశంలో 80 శాతం ఉన్న హిందువులకు వాటిని వర్తింప చేశారు. ఆనాడు  హిందువులలో కొందరు ఈ చట్టాలను వ్యతిరేకించినారు.

హిందూ స్త్రీలకు వర్తించవలసిన సమాన హక్కుల విషయమై అనేక మార్పులు జరిగాయి. ఈనాటికి స్త్రీలకు సమాన హక్కులు వచ్చి, గౌరవం ఏర్పడిందంటే అందుకు కారణం ఆ చట్టాలే.

ఈ దేశంలో కొన్ని వివాదాల పరిష్కారానికి చట్టాలు చేశారు. అవి ఉమ్మడి చట్టాలే. అవే, భారత శిక్షాస్మృతి (ipc),సాక్ష్యాధారాల చట్టం (Evidence Act) లావాదేవీలు (Contract) మొదలుగునవి. ఇలాంటి చట్టాలు రూపొందిస్తున్న సమయంలో ఏ మతం వారు వాటికి వ్యతిరేకత తెలియచేసినట్టు  దాఖలాలు లేవు. అయితే  75 సంవత్సరాలకు పైగా కొన్ని మతాలవారు  ఉమ్మడి పౌరస్మృతి పేరు చెబితేనే గగ్గోలు పెడుతున్నారు. ప్రధానంగా ముస్లింలలోని కొన్ని వర్గాలు ఇందుకు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి.

ఇస్లామ్‌లో బహుభార్యత్వం ఉంది. హిజాబ్‌ ‌పద్ధతిని అమలు చేయాలని అంటారు. ఒకసారి విడాకులు ఇచ్చినవారిని పునర్వివివాహం చేసుకోవడానికి అంగీకరించరు. 1946లో రాజ్యాంగ రచన ప్రారంభమైంది. అప్పుడు ఉమ్మడి పౌరస్మృతి గురించి వాడీ వేడీ చర్చ జరిగింది. కె.ఎమ్‌.‌మున్షి లాంటివారు ఉమ్మడి పౌరస్మృతి చట్టాలు తేవాలని పట్టుపట్టినారు. అయితే ఆనాటి ముస్లిం ప్రతినిధులు అంతే తీవ్రంగా ఆ వాదనకు అభ్యంతరం తెలిపారు. అందుకే ఉమ్మడి పౌరస్మృతి రూపకల్పన గురించి 44వ అధికరణగా, నాలుగో భాగంలో చేర్చి సమాధానపరిచారు. అయినా ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని  44వ అధికరణం కాదనలేదు. ఈ అధికరణాన్ని నాలుగో భాగంలో (Directive Principles of State Policy) చేర్చడంవల్ల ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి తేవడానికి వీలు లేదు.

కానీ బీజేపీ మొదటి నుండి తన సిద్ధాంతంలో, ఎన్నికల ప్రణాళికలలో ఉమ్మడి పౌరస్మృతి మీద కచ్చితమైన అభిప్రాయం  వెలిబుచ్చుతున్నది. అధికారంలోకి వచ్చాక కూడా తమ హామీకి కట్టుబడి ఉన్నామనే చెప్పింది. రామజన్మభూమి సమస్య పరిష్కారం- అంటే ఆలయ నిర్మాణం, ఆర్టికల్‌ 370 ‌రద్దు, ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపేందుకు ట్రిపుల్‌ ‌తలాక్‌ను నిషేధించడం తదితర విషయాలపై బీజేపీకి కచ్చితమైన విధానం ఉన్నది. సమయం తీసుకున్నప్పటికీ వాటిని అమలు చేస్తున్నారు.

భారత ఉన్నత న్యాయస్థానం కూడా షాబానో కేసులో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాలని 1985లోనే పార్లమెంట్‌కు సూచించింది. షాబానో అనే ముస్లిం మహిళకు 60 ఏళ్ల వయసులో, వివాహం జరిగిన 40 సంవత్సరాల తరువాత భర్త తలాక్‌ – ‌తలాక్‌- ‌తలాక్‌ ‌చెప్పి విడిపోయాడు. అంటే విడాకులు ఇచ్చేశాడు.  ఆమె భర్త నుంచి సెక్షన్‌ 125 ‌Cr.P.C సూత్రం మేరకు భరణం కోరింది.  ఉన్నత న్యాయస్థానం  షాబానో వాదనను సమర్ధిస్తూ భరణం ఇవ్వవలసినదిగా తీర్పు ఇచ్చింది. అయితే నాటి కాంగ్రెస్‌/ ‌రాజీవ్‌ ‌ప్రభుత్వం ఆ తీర్పును రద్దుపరిచేలా 1985లో చట్టం చేసింది. షాబానో కేసు ఈ రోజుకీ ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయానికి సజీవ నిదర్శనంగా ఉంది. పాకిస్తాన్‌ ‌సహా చాలా దేశాలలో లేని తలాక్‌ ‌విధానాన్ని భారతదేశంలో కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసింది.

సరళా ముద్గల్‌ ‌వర్సెస్‌ ‌కేంద్ర ప్రభుత్వం కేసులో కూడా 1995లో సుప్రీంకోర్టు మతమార్పిడి విషయమై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇందులో హిందువు మొదటి వివాహం చేసుకొన్న తరువాత, ఆ వివాహం రద్దయి, మరొక పెళ్లి కోసం ఇస్లాం తీసుకోవడం తగదని తీర్పు ఇచ్చింది.

John Vallamattom vs Union of India కేసు లోను  సుప్రీంకోర్టు  ఆర్టికల్‌ 44‌విషయమై  2003లో పార్లమెంట్‌కు  గుర్తు చేసింది. అంతేకాక 2014న Juvenile Justice Act విషయంలో తీర్పు వెలువరిస్తూ భారత ప్రభుతాన్ని Uniform Civil Code విషయం ఏం చేశారంటు ప్రశ్నించింది. ఇలా అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికి నాలుగు పర్యాయాలు ఈ విషయమై పార్లమెంట్‌ను హెచ్చరించింది.

2016లో నాటి లా కమిషన్‌ ఉమ్మడి పౌరస్మృతి విషయమై చర్చ జరిపింది. మళ్లీ ఇప్పుడు తాజాగా చర్చ జరుగుతున్నది. ఉమ్మడి పౌరస్మృతి అన్నది ఎలాంటి మతపరమైన కార్యక్రమాలకు వ్యతిరేకం కాదు. మతపరమైన విషయాలలో ఉమ్మడి పౌరస్మృతి చట్టం జోక్యం చేసుకోదు. ఒక పౌరునికి ఒకే వివాహాన్ని ఈ చట్టం సూచిస్తుంది. ఆ వివాహం రద్దయితే వేరే వివాహం చేసుకొనే హక్కు కల్పిస్తుంది. కానీ ఆ వివాహం ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది  తదితర విషయాలన్నీ వారి వారి మత సంప్రదాయల ప్రకారం  జరుపుకొనే స్వేచ్ఛనే ఇస్తుంది. ఉమ్మడి పౌరస్మృతి అంటే భారతజాతిని కుల,మత భేదాలకు అతీతంగా ఐక్యం చేసేందుకు ఉద్దేశించినది మాత్రమే.

  • ఎం. సుందరరామిరెడ్డి

            అడ్వకెట్‌

About Author

By editor

Twitter
YOUTUBE