వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలన్న లక్ష్యంతో దేశంలోని 17 విపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా బిహార్‌ ‌రాజధాని పట్నాలో సమావేశమై ఇదే విషయాన్ని చర్చించాయి. బెంగళూరు ఈ నెల 12, 13 తేదీల్లో మరొక సమావేశం నిర్వహించాలని భావించాయి. అయితే మహారాష్ట్ర తాజా పరిణామాలు విపక్షాలను కోలుకోలేని దెబ్బకొట్టాయి. విపక్షాలకు పెద్దన్నగా భావిస్తున్న ఎన్సీపీ అధినేత శరద్‌ ‌పవార్‌పై తన సోదరుడి కుమారుడు అజిత్‌ ‌పవార్‌ ‌తిరుగుబాటు చేశారు. అంతేకాదు, ఆయన బీజేపీ, ఏక్‌నాథ్‌ ‌షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరి ఏకంగా డిప్యూటీ సీఎంగా ప్రమాణం కూడా చేశారు. ఈ పరిణామాలతో విపక్షాలకు ఏం చేయాలో తోచడం లేదు. అందుకే బెంగళూరు సమావేశం వాయిదా పడింది.

లక్నోలో గతంలో సమావేశమైన ఇవే పార్టీలు తమ తర్వాతి సమావేశాన్ని సిమ్లాలో నిర్వహించాలను కున్నప్పటికీ, బెంగళూరుకు మార్చాలని నిర్ణయిం చడం వెనుక అక్కడ ఇటీవలి ఎన్నికల్లో బీజేపీని ఓడించి, కాంగ్రెస్‌ ‌గద్దెనెక్కడంతో అక్కడి నుంచే శంఖారావం చేయాలన్న ఉద్దేశమని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బెంగళూరు సమావేశం ఎప్పుడు జరుగుతుందో ప్రస్తుతం స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో విపక్షాలు ఉన్నాయని చెప్పాలి. ఆ విషయం కాసేపు పక్కనపెడితే.. బెంగళూరులో సీఎం సిద్ధరామయ్య పదవీ స్వీకారానికి రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మహబూబా ముఫ్తీ, నితీష్‌ ‌కుమార్‌ ‌తప్ప మిగిలిన విపక్ష నేతలు హాజరుకాలేదన్న సత్యాన్ని గుర్తించాలి. విచిత్రమేమంటే నేషనలిస్ట్ ‌పార్టీ అధినేత శరద్‌పవార్‌ ‌పట్నా సమావేశం తర్వాత మాట్లాడుతూ ఉమ్మడి పౌరసత్వ బిల్లుపై ఇంకా తమ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతూనే, ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును అమలు చేయాలని డిమాండ్‌ ‌చేయడం కొసమెరుపు. సమావేశం తర్వాత ఆమ్‌ ఆద్మీ పార్టీ విపక్షాలు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పాల్గొనలేదు. ప్రస్తుతం ఈ పార్టీ పంజాబ్‌, ‌ఢిల్లీల్లో అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌- ఆమ్‌ ఆద్మీ పార్టీలు బద్ధశత్రువులు. ఢిల్లీ ప్రభుత్వం విషయంలో కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్‌పై ఆప్‌, ‌కాంగ్రెస్‌ల మధ్య ఏకాభిప్రాయం లేదు. కాంగ్రెస్‌ ఈ ఆర్డినెన్స్ ‌విషయంలో మౌనం పాటిస్తోంది. అతి ముఖ్యమైన ఈ సమస్యపై కాంగ్రెస్‌ ‌తమతో కలిసి రావడంలేదని సమావేశం తర్వాత ఆప్‌ ‌ముఖ్య మంత్రులు కేజ్రీవాల్‌, ‌భగవంత్‌సింగ్‌మాన్‌లు ఘాటుగా విమర్శించడంతో పాటు, ఇట్లా అయితే కూటమి కోసం భవిష్యత్తు సమావేశాల్లో పాల్గొన బోమని హెచ్చ రించడం గమనార్హం. దీనికితోడు వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు మరో కూటమి కోసం ప్రయత్నిస్తుండటం విశేషం.

బలమైన నాయకుడు ఏడీ?

శక్తిమంతమైన నరేంద్రమోదీని ఎదుర్కొనే సామర్థ్యం తమలో ఎవరికీ లేదన్న సంగతి విపక్ష నేతలకు బాగా తెలుసు. అట్లాగని చేతులు ముడుచు కొని కూర్చోలేరు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏమీ చేయ లేరు. ఇదీ వారి దుస్థితి. అవి గుర్తించని లేదా గుర్తించినా ఏమీ చేయలేని దుస్థితికి ప్రధాన కారణం ఉమ్మడిగా బలమైన సైద్ధాంతిక నేపథ్యం లేకపోవడం. సీట్లు, ఓట్ల లెక్కలు తాత్కాలికంగానే పని చేస్తాయి. వీటివల్ల వచ్చే విజయం లేదా పరాజయం సుస్థిరంగా ఉండవు. బలమైన సైద్ధాంతిక పునాది ఉన్న బీజీపీ ప్రజల్లోకి తన ఉద్దేశాలను గట్టిగా తీసుకెళ్లగలిగింది. ఇందుకోసం సుదీర్ఘకాలంగా వేచిచూస్తూనే సాధించిన ప్రతి విజయాన్ని సుస్థిరం చేసుకోగలిగింది. అదే విపక్షాలు ఎన్నికల సమయంలో తాత్కాలిక సర్దుబాట్లకే పరిమిత మయ్యాయి తప్ప, బీజేపీకి బలమైన సైద్ధాంతిక పోటీని ఇవ్వలేకపోతున్నాయి. కారణం వారసత్వ రాజకీయాలు, స్వార్థం, పీకల్లోతు అవినీతిలో కూరుకుపోతుండటం. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పశ్చిమ బెంగాల్‌లో తీవ్రస్థాయి హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్నా, అక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 77 స్థానాలు సాధించడం సామాన్య విషయం కాదు. సైద్ధాంతిక నిబద్ధత కలిగిన వామపక్షాలు తమ సిద్ధాంతాలను మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మార్చు కోకపోవడం వాటి బలహీనత. ఇదే వాటిని ప్రస్తుతం తమ ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితికి దిగజార్చింది. గత మార్చిలో పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీని కోర్టు దోషిగా పేర్కొనడం, ఆయన పార్లమెంట్‌ ‌సభ్యత్వం కోల్పోయిన నేపథ్యంలో తమ మధ్య జాతీయ స్థాయిలో ఉన్న విభేదాలను పక్కనబెట్టి ఉమ్మడిగా బీజేపీపై పోరాటం చేయాలని ఈ పార్టీలు నిర్ణయించుకున్నాయి. దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన కర్ణాటకలో బీజేపీని ఓడించి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, వీటి మధ్య ఐక్యతారాగానికి మరింత ఊపిరిపోసింది. ఇప్పటికీ మోదీ పాపులారిటీ ఎంత మాత్రం చెక్కుచెదరకపోవడం, మూడోసారి కూడా ఆయన నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న అంచనాలు బలంగా ఉన్న నేపథ్యంలో, తాము ఉమ్మడిగా, నేరుగా బీజేపీని ఢీకొంటే విజయం తథ్యమని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కలిసి పోటీ చేయడానికి జూన్‌ 23‌న పట్నాలో జరిగిన సమా వేశంలో ఒక అంగీకారానికి వచ్చామని, బీజేపీపై సైద్ధాంతిక విభేదాలే తమను ఒక్కటి చేశాయని రాహుల్‌గాంధీ చెప్పినా ఇదెంతవరకు సాధ్యమనేది ఇప్పుడే చెప్పడం కష్టం. ‘మా మధ్య విభేదాలున్నా యన్నది సత్యమే. అయినప్పటికీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం’ అని ఆయన చెప్పడం లోనే ఐక్యత ఎలా ఉండబోతున్నదీ తెలుస్తోంది. నిజం చెప్పాలంటే దేశంలో ఇప్పుడు కూటముల కాలం ముగిసిపోయింది. దేశానికి బలమైన నాయకత్వం ఉన్నప్పుడు, కూటములవల్ల ఒరిగేదేమీ ఉండబోదన్నది వర్తమాన రాజకీయాలు చెబుతున్న సత్యం. గతంలో కాంగ్రెస్‌, ‌బీజేపీలు రెండూ కూటమి ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా అవి పెద్దగా విజయవంతమైన దాఖలాలు లేవు. ప్రభుత్వాన్ని సజావుగా నడపడంలో ఈ కూటముల సాఫల్యత చాలా తక్కువ అని చరిత్ర చెబుతున్న సత్యం.

కుప్పకూలిన కాంగ్రెస్‌ ‌వైభవం

స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి ఎక్కువకాలం అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌ ‌పార్టీ క్రమంగా దేశవ్యాప్తంగా బలహీనపడుతూ వచ్చింది. ఫలితంగా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ ‌సంకీర్ణ ప్రభుత్వాన్ని లొసుగులు, కీచులాటలు, బుజ్జగింపు లతో ఎట్లాగో నెట్టుకొచ్చింది. అదే 2014 ఎన్నికలకు వచ్చేసరికి అప్పటి వరకు కాంగ్రెస్‌తో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా కూటమి నుంచి తప్పుకోవడం మొదలుపెట్టాయి. నిజానికి 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను (జీఎస్టీ వగైరా) విపక్షాలు వ్యతిరేకించడమే కాదు కొన్ని కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్లడానికి కూడా నిర్ణయించుకున్నప్పటికీ విజయం కాలేదు.

అసలు అప్పట్లో కాంగ్రెస్‌ ‌నాయకత్వ వైఫల్యానికి ప్రధానంగా కొన్ని కారణాలను పేర్కొనవచ్చు. కాంగ్రెస్‌ ‌తమపై పెత్తనం చెలాయిస్తున్నదని సి.పి.ఎం సహా చిన్న పార్టీలు భావించడం. కాంగ్రెస్‌ అధికారం కేవలం ఏడు రాష్ట్రాలకే పరిమితం కావడంతో, దానికి నేతృత్వం వహించే సామర్థ్యం లోపించిందన్న అభిప్రాయానికి మిగిలిన పక్షాలు రావడం, అప్పట్లో పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ‌గోవా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో తమ గుర్తింపును కాపాడుకోవడం కోసం కొన్ని పార్టీలు కాంగ్రెస్‌ను దూరంగా పెట్టడం, నోట్ల రద్దుపై విపక్షాల్లో ఏకాభిప్రాయం వ్యక్తంకాకపోవడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి, దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం మరింత పెరిగినా, దేశంలో కాంగ్రెస్‌ ‌పట్ల సెంటిమెంట్‌ ఇం‌కా కొనసాగుతున్న నేపథ్యంలో అవి కాంగ్రెస్‌ ‌నాయకత్వం వైపునకే మొగ్గుచూపక తప్పలేదు. పొసగని సిద్ధాంతాల (అవసరాల) నేపథ్యంలో ‘మోదీ హటావో’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లినా, మోదీ ప్రచారం చేసిన ‘కాంగ్రెస్‌ ‌ముక్త్ ‌భారత్‌’ ‌నినాదం బలంగా పనిచేసి, విపక్షాలను చిత్తుచేసింది. బలమైన సైద్ధాంతిక నేపథ్యంతో కూడిన నినాదం సానుకూల ఫలితాలిస్తుందనడానికి ఈ ఎన్నికలు మరో ఉదాహరణ.

పొత్తులు సాధ్యమా?

ఇప్పుడు బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనాల్సి వస్తే, రాహుల్‌ ‌గాంధీ (లేదా మల్లికార్జున ఖర్గే), మమతా బెనర్జీ, శరద్‌పవార్‌, ఉద్ధవ్‌ ‌థాక్రే, అరవింద్‌ ‌కేజ్రీవాల్‌, ఎం.‌కె. స్టాలిన్‌, ‌కె. చంద్రశేఖర్‌రావు, పినరయి విజయన్‌, అఖిలేష్‌ ‌యాదవ్‌, ‌మాయావతి, నితీష్‌ ‌కుమార్‌, ‌హేమంత్‌ ‌సొరేన్‌, ‌తేజస్వీయాదవ్‌, ‌నవీన్‌ ‌పట్నాయక్‌, ‌వై.ఎస్‌.‌జగన్మోహన్‌రెడ్డి.. వీరందరూ ఒక్కతాటి పైకి రావాలి. ఇది జరిగేదేనా? ఒకవేళ జరిగినా కలగూరగంప లెక్కలు తప్ప పటిష్టమైన సైద్ధాంతిక పోటీని ఇవ్వలేవు. అదీకాకుండా వీరిలో తమ ప్రాంతీయ అవసరాలు తప్ప, జాతీయ స్థాయిలో బలమైన నాయకత్వం ఇవ్వగలమన్న విశ్వాసం కలిగించే నాయకుడెవరూ లేరు. ఈ నేపథ్యంలో వీరందరూ కలిసికట్టుగా పోటీచేసే పరిస్థితే ఉత్పన్నం కాదు. వీటిల్లో కొన్ని, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు.. జాతీయ స్థాయిలో ఏకమైనా, స్థానికంగా కాంగ్రెస్‌తో వీటికి ఉప్పు-నిప్పు సంబంధం! ఉదాహరణకు నవీన్‌ ‌పట్నాయక్‌, ‌వై.ఎస్‌. ‌జగన్మోహన్‌ ‌రెడ్డిలకు బీజేపీతో వైరం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అఖిలేష్‌ ‌యాదవ్‌, ‌మాయావతి ఒకే ఒరలో ఇమడని రెండు కత్తులు. కాంగ్రెస్‌కు, ఆమ్‌ ఆద్మీ పార్టీకి అసలు పడటం లేదు. కేసీఆర్‌కు కూడా కాంగ్రెస్‌ ‌బద్ధశత్రువే. ఇక కాంగ్రెస్‌-‌వామపక్షాల విషయానికి వస్తే 1969 నుంచి మరే ఇతర రెండు పార్టీల మధ్య లేనంత సైద్ధాంతిక సాన్నిహిత్యం వీటి మధ్య కొనసాగింది. 1969లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం సి.పి.ఐ. ఓట్లతో గట్టెక్కింది. ముఖ్యంగా రష్యాలో ఆమెకు అనుకూల నేతలు ఉండటంతో అప్పట్లో ఇది సాధ్యమైంది. తర్వాత ఈ రెండు పార్టీలు త్రిపుర, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి.

రాహుల్‌గాంధీ ప్రవచిస్తున్న రాజకీయ ఆర్థిక సిద్ధాంతం, ఉపయోగిస్తున్న భాష లెఫ్ట్ ‌భావజాలానికి దగ్గరగా ఉండటం గమనార్హం. ఇంత సాన్నిహిత్యం ఉన్నా, కేరళ విషయానికి వస్తే కాంగ్రెస్‌-‌లెఫ్ట్‌లు రెండూ పరస్పరం కత్తులు నూరుకుంటాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ఓడించడానికి కేరళలో రెండు పార్టీలు కలిసి పోటీచేసే అవకాశమే లేదు. ఒకవేళ ఉన్నదనుకున్నా, కాంగ్రెస్‌కు ఓట్లేయమని ఓటర్లను కమ్యూనిస్టులు అడిగే పరిస్థితే తలెత్తదు. అందువల్ల ప్రతిపక్షాలన్నీ ఒక బలమైన నినాదంతో ప్రజల్లోకి వెళ్లడం మరో పద్ధతి. అయితే సైద్ధాంతిక నిబద్ధతలేని నినాదాలు గతంలో సానుకూల ఫలితాలివ్వలేదు. ఉదాహరణకు 1971లో విపక్షాలు ‘ఇంది రా హటావో’ అంటూ ఎన్నికల బరిలో దిగితే, ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ అంటూ విపక్షాలను చిత్తుచేశారు. అందువల్ల కష్టపడి ఉమ్మడి నినాదంతో ముందుకెళ్లినా అదెంత వరకు ప్రజల్లోకి వెళుతుందన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే గడచిన ఐదు దశాబ్దాల కాలంలో ఓటర్ల ఆలోచనా సరళిలో విశ్లేషణాత్మక మార్పులు వచ్చాయన్న సంగతి గుర్తుంచుకోవాలి. నరేంద్రమోదీ నేతృత్వంలో భారత ప్రతిష్ట బాగా పెరగడం, అగ్రరాజ్యాలను కూడా తన దారికి తెచ్చుకునే రీతిలో భారత విదేశాంగ విధానం కొనసాగుతుండటం, ప్రపంచం సంక్షోభం అంచున ఉన్నా, జీడీపీ పరంగా దేశం సాధిస్తున్న ప్రగతి ఓటర్ల మనోఫలకంపై స్పష్టమైన ముద్రవేస్తున్నాయి. ఐదు దశాబ్దాల క్రితం ఓటర్ల కంటే నేటి ఓటర్లలో చైతన్యం, అవగాహన ఎక్కువన్న సత్యాన్ని విపక్షాలు గుర్తించాలి.

గతంలోనూ వైఫల్య చరిత్రే

నిజం చెప్పాలంటే మనదేశంలో 1967లో మొట్టమొదటిసారి విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నం జరిగింది. అప్పట్లో దేశాన్ని తీవ్రమైన ఆర్థిక, సామాజిక వెనుకబాటు కుంగదీస్తోంది. 1962 చైనా యుద్ధం, 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం దేశాన్ని కుదిపేశాయి. వీటికితోడు దేశం ఎదుర్కొంటున్న క్షామ పరిస్థితులు, అనుభవంలేని ప్రధాని ఇందిరాగాంధీ వంటి నాయకురాలు.. నాడు దేశం ఎదుర్కొన్న ప్రతికూలతలు. ఇందిరాగాంధీకి స్వల్ప మెజారిటీ వచ్చినప్పటికీ, చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు విజయం సాధించడంతో అవి కాంగ్రెస్‌ను పక్కన పెట్టేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో ‘సంయుక్త విధాయక్‌ ‌దళ్‌’ (ఎస్‌.‌వి.డి- యునైటెడ్‌ ‌లెజిస్లేటివ్‌ ‌పార్టీ)గా ఏర్పడ్డాయి. ఆవిధంగా అవి వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా అవి ఎక్కువకాలం మనుగడ సాగించలేదు. ఎవరో ఒకరిని పదవిలోకి రాకుండా అడ్డుకోవాలన్న ఏకైక ‘సంకుచిత’ ఉద్దేశంతో ఏర్పడే కూటములు నిలవబోవని చెప్పడానికి మనదేశంలో జరిగిన తొలి విఫల ప్రయోగం ఇది! తర్వాత 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ప్రభంజనానికి ఇవన్నీ తుడిచి పెట్టుకుపోవడం తర్వాతి సంగతి. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జనతా పార్టీ ప్రయోగం ఏవిధంగా విఫలమైందీ తెలిసిందే.

ఇందిరాగాంధీ జైల్లో ఉండగా, అసలు 1967 ప్రయోగం ఎందుకు విఫలమయిందో, లెక్కలు ఎందుకు తప్పాయో విపక్ష నేతలు బాగా చర్చించుకొని, ఉమ్మడి సిద్ధాంతం లేకపోవడంగా తేల్చి, అన్ని పార్టీలు కలిసి జనతాపార్టీ పేరుతో ఏర్పడి ఒకే సిద్ధాంతాన్ని రూపకల్పన చేసి ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత షరామామూలే అయ్యింది. ఎవరి స్వార్థం వారిది.. ఎవరి లెక్కలు వారివి.. కొట్లాటలు ముదిరి రెండేళ్లకే ప్రభుత్వం కుప్పకూలింది. ఇక 1989-2014 వరకు భారత్‌ ‌సంకీర్ణ శకాన్ని చూసింది. 1991-96 మధ్యకాలంలో పీవీ నరసింహారావు నేతృత్వంలోని మైనారిటీ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి కొద్ది సీట్లు మాత్రమే తక్కువ. బయటి పార్టీల మద్దతుతో ఐదేళ్లు పాలన సాగించారు. మిగిలినవన్నీ బహుళ పార్టీల కూటములే. వీటిల్లో వీపీ సింగ్‌, ‌చంద్రశేఖర్‌ ‌ప్రభుత్వాలు రెండేళ్ల కంటే తక్కువకాలం అధికారంలో ఉన్నాయి. తర్వాత ఏర్పడిన రెండు పెద్ద కూటములు చెప్పాలంటే ఎన్‌.‌డి.ఎ., యు.పి.ఎ. వీటిలో యు.పి.ఎ. కూటమి 16 సంవత్సరాలు పాలించింది.

మరి ఇప్పటి రాజకీయాలను పరిశీలిస్తే ఇవి 1996-2014 మాదిరివి కావు. ఒకవేళ విపక్షాలన్నీ కలిసి ఉమ్మడిగా ‘మోదీ హటావో’ అని పిలుపునిస్తే ‘భారత్‌ను విశ్వగురువును చేద్దాం’ అంటూ మోదీ ప్రజల్లోకి వెళతారు మరి! సృజనాత్మక రాజకీయాలు నెరపడంలో ఆయన సిద్ధహస్తుడు! అందువల్ల మోదీని ఎదుర్కొనాలంటే విపక్షాలకు ముందుగా కావలసింది, సమర్థవంతమైన నాయకుడు, ఒకే భావన, ఒకే సిద్ధాంతం. ఇది సాధ్యం కాకపోతే రాష్ట్రాల స్థాయిలో ప్రాంతీయ అవసరాలను బట్టి కూటములుగా ఏర్పడితే బీజేపీ సంఖ్యాబలాన్ని కొంతమేర పరిమితం చేయవచ్చునేమో కానీ అంతకు మించి ఏమీ చేయలేవు. ‘మహా ఘట్‌బంధన్‌’ ‌చెప్పుకోవడానికి గంభీరంగా ఉండి విజయ సాధనకు ఉపయోగపడని బలహీన అస్త్రం మాత్రమే. ఇటువంటి ప్రయోగాలు తిరిగి మోదీకే అనుకూలంగా మారడం తథ్యం.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE