దక్షిణాది రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో పార్టీ శాఖలను బలోపేతం చేసి, కొత్త ఊపిరులూ దేందుకు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం రెండు తెలుగు రాష్ట్రాలకూ నూతన అధ్యక్షులను ప్రకటించింది. వచ్చే ఏడాదిలో జరుగనున్న కేంద్ర, రాష్ట్ర ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు ఆ రాష్ట్రాల రాజకీయ, సామాజిక, ఆర్ధిక సమీకరణాల గురించి అవగాహన ఉన్న నాయకులనే బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపిక చేయడం వల్ల క్యాడర్‌లో ఊపువచ్చింది.

ఈ క్రమంలోనే భారతీయ జనతాపార్టీ ఆంధ్ర ప్రదేశ్‌ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితురాలు కావడంతో బీజేపీ క్యాడర్‌లో ఉత్సాహం నెలకొంది. రెండు పర్యాయాలు ఎంపీగా, కేంద్రమంత్రిగా, పార్టీ మహిళా మోర్చా ఇన్‌ఛార్జిగా, జాతీయ ప్రధానకార్యదర్శిగా పనిచేసిన అనుభవంతో ఆమె అన్ని వర్గాలకు దగ్గరయ్యారు.

తన తొలి మీడియా సమావేశంలోనే పురందేశ్వరి రానున్న ఎన్నికలలో పార్టీ పోరాట లక్ష్యాన్ని ప్రజలకు తెలియచేశారు. జగన్‌ ‌ప్రభుత్వంపై సంచలన ఆరోపణలను చేశారు. నాలుగేళ్ల వైసీపీ పాలన అన్ని రంగాల్లోనూ తీవ్ర వైఫల్యం చెందిందని, సమస్యలు పరిష్కరించక, అభివృద్ధి చేయక, ఉపాధి అవకాశాలు కల్పించక  పేదరికాన్ని మరింత పెంచిందని ఆరోపిం చారు. ఇచ్చిన హామీలన్నిటిని బుట్టదాఖలు చేశారని విమర్శించారు. సమాజంలో శాంతిభద్రతలు క్షీణించా యని, ఏ ఒక్కరూ శాంతితో లేరని మండిపడ్డారు.

అంతేకాదు, రాష్ట్రంలో భారీ లిక్కర్‌ ‌స్కాం జరుగు తోందని, నాణ్యతలేని మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని.. పాతిక శాతం మద్యం అమ్మకాలకు బిల్లులు ఉండటంలేదని.. ఇదంతా తాడేపల్లి ప్యాలెస్‌కే వెళ్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి నిర్మాణ, నిర్వహణ సామర్ధ్యం లేకుంటే పోలవరం ప్రాజెక్టు బాధ్యతను కేంద్రానికి అప్పగించాలని సలహా ఇచ్చారు. అస్తవ్యస్త విధానాలవల్ల విలువైన ప్రజాధనంతో పాటు, సమయం వృథా అవుతూ పోలవరం పథకం లక్ష్యం నెరవేరడం లేదన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేస్తామన్నారు. వైసీపీ వైఫల్యా లను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని ఆమె స్పష్టం చేశారు. తన సామర్ధ్యాన్ని నమ్మి పార్టీ అధ్యక్షు రాలిగా నియమించిన బీజేపీ జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలను కలుపుకుని పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పురందేశ్వరి అన్నారు. ఇప్పటివరకు పార్టీకి సేవలు చేసిన మాజీ అధ్యక్షుల సలహాలు, మార్గ దర్శకత్వంతో ముందుకెళ్తానని కూడా ఆమె సభాముఖంగా చెప్పడం విశేషం.

ఏపీలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి సహకరించడం లేదని, నిధులు ఇవ్వడంలేదని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని, పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతోందంటూ  పలు అసత్య ప్రచారాలను రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. కాగా, ప్రజల్లో ఏర్పడిన ఈ అపోహాలను తొలగించేందుకు ప్రయత్నిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఓట్లతో నిమిత్తం లేకుండా రాష్ట్రానికి అవసరమైన సహ కారాన్ని బీజేపీ అందిస్తోందని పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులు, ప్రాజెక్టుల వివరాలు, వాటిని అందిపుచ్చుకోలేని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల వివరాలను సైతం బయటపెట్టారు. ఇళ్ల నిర్మాణం, పంచాయతీ నిధులు దారి మళ్లింపు, నాసిరకం మద్యం తయారీ, అధిక ధరలతో విక్రయం, ఇసుక మాఫియా, భూ కబ్జాలు, మైనింగ్‌ ‌మాఫియా తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

కేంద్ర ప్రభుత్వం పేదల కోసం పీఎం ఆవాస్‌ ‌యోజన ద్వారా ఇళ్లను నిర్మిస్తే వాటిని లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదని, నిర్మాణంలో ఉన్న ఇళ్లను ఎందుకు పూర్తిచేయడం లేదని ముఖ్యమంత్రి జగన్‌ను పురందేశ్వరి ప్రశ్నించారు. ఈ అంశంపై వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షల ఆర్ధిక సహాయం చొప్పున ఆంధప్రదేశ్‌కు 22 లక్షల ఇళ్లను కేంద్రం కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. వీటి విలువ రూ.32,500 కోట్లుగా ఉందని, 9 ఏళ్లుగా రూ.20 వేల కోట్లు ఇళ్ల కోసం కేంద్రం ఇచ్చిందని, ఇప్పటి వరకు 65 శాతం నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా 35 శాతం కూడా నిర్మాణం కాకపోవడాన్ని ఆమె పట్టి చూపారు. అలాగే రోడ్ల నిర్మాణం చేపట్టక పోవడాన్ని ఆక్షేపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి నప్పటి నుంచి ఒక్క రోడ్డును నిర్మించలేదు సరికదా ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేయలేదు. మున్సిపాలిటీలు, మున్సిపల్‌ ‌కార్పొరేషన్ల పరిధిలో కాంట్రాక్టర్లకు పాతబకాయిలు చెల్లించకపోవడంతో రోడ్ల నిర్మాణానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆమె ఆరోపించారు.

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన జాతీయ రహదారులు తప్ప మరే ఇతర రహదారుల నిర్మాణం జరగలేదని, 2014 నుంచి ఇప్పటి వరకు రూ.1.15 లక్షల కోట్లతో 4,500 నూతన జాతీయ రహదారులు నిర్మించినట్లు చెప్పారు. అలాగే విభజన చట్టంలో పొందుపరచిన జాతీయ విద్యాసంస్థలను కూడా రెండేళ్ల వ్యవధిలోనే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రూ.1610 కోట్లతో ఎయిమ్స్, ‌రూ.700 కోట్లతో ఐఐటీ, రూ.680 కోట్లతో ఐఐఎం, రూ.130 కోట్లతో త్రిపుల్‌ ఐటీ, రూ.300 కోట్లతో ఎన్‌ఐటీ, రూ.600 కోట్లతో నార్కోటిక్స్, ఓషన్‌ ‌టెక్నాలజీకి రూ.250 కోట్లు, సెంట్రల్‌ ‌వర్శిటీ, గిరిజన వర్శిటీ, ఆగ్రి వర్శిటీ, పెట్రోలియం వర్శిటీ స్థాపించామన్నారు. తిరుపతి, విశాఖ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్ధాయికి పెంపు, విజయవాడ విమానాశ్రయం విస్తరణ, రాజమండ్రి, కర్నూలు, కడప విమానాశ్రయాల ఏర్పాటు విషయాన్ని ప్రస్తావించారు.

సాధ్యంకాకుంటే ‘పోలవరం’ వదిలేయండి!

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం సహకరించడం లేదనడం అవాస్తవమని పురందేశ్వరి చెప్పారు. గతంలో సకాలంలో యూసీలు, లెక్కలు ఇవ్వకపోవడం వలన నిధుల మంజూరులో జాప్యం జరిగిందన్నారు. ఇటీవల రూ. 12 వేల కోట్లను కేంద్రం మంజూరు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ ‌షెకావత్‌ ‌పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. కేంద్రం సహక రించడం లేదనిపిస్తే జాతీయ ప్రాజెక్టు కాబట్టి తిరిగి కేంద్రానికి అప్పజెప్పాలని ఆమె డిమాండ్‌ ‌చేశారు. జగన్‌ ‌రివర్స్ ‌టెండరింగ్‌లో చిన్న కాంట్రాక్టర్లు బలయ్యారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రూ.50వేల కోట్ల వరకు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బకాయి ఉందన్నారు.

భూ కబ్జాలు – అవినీతి ఆరోపణలు

వైసీపీ నేతలు ప్రైవేటు భూములను కూడా కొట్టేస్తున్నారని, ఆ పార్టీ నేతలకు, అధికారులకు ముడుపులు ముట్టచెబితేనే వెనక్కి ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. ‘విశాఖలో ఒకరి స్థలాన్ని కడప రౌడీలు కబ్జా చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఏకంగా జీఓ జారీచేసింది. అయితే ఆ వ్యక్తి సుప్రీం కోర్టు వరకూ వెళ్లారు. ఇలా చేయడం ఎంతమందికి సాధ్యమవుతుంది. దసపల్లా భూముల యజమాను లపై ఒత్తిడి తెచ్చి, డెవలప్‌మెంట్‌ ‌కింద 16 నుంచి 17శాతం ఇచ్చారు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా?’ అని ప్రశ్నించారు.

మైనింగ్‌ ‌వ్యాపారుల్ని బెదిరించి వాటిని లాక్కుని తమ అనుయాయులకు అప్పగించి దోచుకోవడం జగన్‌ ‌పాలనలో నిత్యకృత్యమైందన్నారు.  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, ఎన్నో సంస్థలు రాష్ట్రం నుంచి తరలివెళ్లి ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని ఆక్షేపిం చారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నా రాష్ట్రం అంది పుచ్చుకోవడంలో వైఫల్యం చెందిందన్నారు.

అవకాశాలు అంది పుచ్చుకోవడంలోనూ అలసత్వం

ఏషియన్‌ ‌డెవెలెప్‌మెంట్‌ ‌బ్యాంకు ఆర్థిక సహ కారంతో 4,211 కోట్లతో విశాఖ – చెన్నై పారి శ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు, విశాఖ, మదనపల్లి, దొనకొండ, శ్రీకాకుళం, కొప్పర్తిల్లో పారిశ్రామిక నోడ్‌ల ఏర్పాటుకు, కనిగిరి – చిత్తూరుల్లో నేషనల్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌మాన్యుఫాక్చరింగ్‌ ‌జోన్‌ (‌నిమ్జ్) ఏర్పాటుకు కేంద్రం అనుమతులు ఇస్తే రాష్ట్రం భూసేకరణ విషయంలో చేస్తున్న తీవ్ర జాప్యం కారణంగా ఈ ప్రాజెక్టులు అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఇదే నిమ్జ్‌ను రాజస్తాన్‌లో ఏర్పాటు చేస్తే రూ.25 వేల కోట్ల పెట్టుబడులతో ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం కారణంగా లక్షలాది యువత ఉపాధి అవకాశాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నడికుడి – శ్రీకాళహస్తి  రైల్వేలైను, కోటిపల్లి – నరసా పురం లైన్ల నిర్మాణానికి రాష్ట్రం సహకరించడం లేదని విమర్శించారు.

క్షీణించిన శాంతి భద్రతలు

రాష్ట్రంలో అన్నింటా దోపిడీ చేస్తూ ‘తొడ గిల్లి-బుగ్గ నిమిరిన’ చందంగా తాయిలాలతో మభ్యపెడు తున్నారంటూ పురందేశ్వరి మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పిన విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. బాపట్లలో పదో తరగతి విద్యార్థిని పెట్రోల్‌ ‌పోసి తగులబెట్టడం, సొంత బాబాయ్‌ ‌హత్యలో దోషులను తేల్చలేక సీబీఐకి ఇవ్వడం, దిశ యాప్‌తో మహిళలకు రక్షణ అంటూ చెప్పి మాటలకే పరిమితం కావడం, నెల్లూరులో పట్టపగలు ఒక ఇంట్లోకి ఆగంతకులు చొరబడి రెండు కిలోల బంగారం, నగదు తీసుకెళ్లడం ఇక్కడి శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతుందన్నారు.

విశాఖపట్నంలో సాక్షాత్తు పార్లమెంటు సభ్యుడి కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ ‌చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎంపీ కుటుంబానికే రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఇక ప్రజలను ఏం రక్షిస్తుందని ఆమె ప్రశ్నించారు.

రాష్ట్రానికి కేంద్రం ఆర్థిక సహాయం

రాష్ట్రానికి ఆర్థిక సహాయం ఇచ్చే విషయంలో కేంద్రం ఎప్పుడూ ఆలసత్వం చూపించలేదని పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి గతంలో యూపీఏ ప్రభుత్వం హయాంలో 32 శాతం మాత్రమే ఇస్తే నేడు ఆ వాటాను బీజేపీ ప్రభుత్వం 42 శాతం పెంచింది. ఏపీకి 2023-24కు సంబంధించి రూ.41,300 కోట్లు అందనుంది. ఇందులో గ్రాంట్ల రూపంలో రూ. 46,835 కోట్లు లభిస్తుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 2021-26 వరకు రాష్ట్రానికి రూ. 23,037 కోట్లు అందనున్నాయన్నారు.

జీఎస్‌టీ 2023-24కు 3,500 కోట్లు లభిస్తుందని చెప్పారు. గ్రామీణా భివృద్ధికి కేంద్రం నిధులను నేరుగా జమ చేస్తే, ఆ నిధులను రాజ్యాంగ విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించు కుంటోందని, ఉద్యమాలు చేస్తున్న సర్పంచ్‌ల డిమాండ్‌లకు తలొగ్గి ఆ నిధులను వెంటనే పంచా యతీలకు బదిలీ చేయాలని ఆమె డిమాండ్‌ ‌చేశారు. వైసీపీ వైఫల్యాలను విమర్శిస్తూనే రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాల గురించి పురందేశ్వరి వివరించడం గమనార్హ.

– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ, ఛైర్మన్‌,‌సెంట్రల్‌ ‌లేబర్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు,

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram